1, 2, 3, 4, 5... ఐదు మ్యాచ్‌లు మనవే! మైదానంలోకి దిగిన ప్రతీసారి విజయం మన జట్టునే వరించింది... ఆ్రస్టేలియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల తర్వాత ఇప్పుడు న్యూజిలాండ్ లెక్క కూడా తేల్చేశాం... ఐదుసార్లూ ప్రత్యర్థి లక్ష్యాన్ని నిర్దేశిస్తే అన్నింటినీ ఛేదించేశాం... ఫలితంగా వరల్డ్ కప్‌లో టీమిండియా తిరుగులేని ప్రదర్శనతో మళ్లీ పైచేయి సాధించింది... టోర్నీలో ఇప్పటి వరకు అజేయంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సమరంలో రోహిత్ బృందానికే గెలుపు దక్కింది.
ప్రపంచకప్‌లో 20 మ్యాచ్‌లు జరిగినా హోరాహోరీ సమరం కనిపించలేదనేవారికి ఈ మ్యాచ్ సమాధానం ఇచ్చింది. పలు మలుపులతో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 12 బంతుల ముందు భారత్ గట్టెక్కింది. 19/2 నుంచి 243/4కు చేరిన కివీస్‌ను 273కే పరిమితం చేసి భారత్ పైచేయి సాధించింది. గత మ్యాచ్‌లకు భిన్నంగా కొంత తడబడి ఆరు వికెట్లు చేజార్చుకున్నా... చివరకు ఫలితం దక్కింది. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో షమీ 5 వికెట్లతో చెలరేగగా... కోహ్లి తనదైన శైలిలో నిలబడి పరుగులను వేటాడినా త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.
ధర్మశాల: వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ గెలుపు బావుటా ఎగరేసిన టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డరైల్ మిచెల్ (127 బంతుల్లో 130; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, రచిన్ రవీంద్ర (87 బంతుల్లో 75; 6 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ షమీ (5/54) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని నిలువరించాడు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (104 బంతుల్లో 95; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగగా, రోహిత్ శర్మ (40 బంతుల్లో 46; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (44 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈనెల 29న లక్నోలో ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
భారీ భాగస్వామ్యం...
ఆరంభంలోనే న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాన్వే (0)ను సిరాజ్ అవుట్ చేయగా, ఈ ప్రపంచకప్‌లో తాను వేసిన తొలి బంతికే యంగ్ (17)ను షమీ అవుట్ చేశాడు. అయితే రచిన్, మిచెల్ మూడో వికెట్ భాగస్వామ్యం కివీస్‌ను కోలుకునేలా చేసింది. మరో 25 ఓవర్లపాటు వీరిద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లందరినీ కట్టడి చేసిన కుల్దీప్ బౌలింగ్‌లో వీరు వేగంగా పరుగులు రాబట్టారు.
12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రచిన్ ఇచ్చిన (షమీ బౌలింగ్‌లో) సునాయాస క్యాచ్‌ను జడేజా వదిలేశాడు! దీనిని రచిన్ సమర్థంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో 56 బంతుల్లోనే అతని అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాత 60 బంతుల్లో మిచెల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాతా వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో భాగస్వామ్యం 150 పరుగులు దాటింది. 69 పరుగుల వద్ద మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను బుమ్రా నేలపాలు చేశాడు.
ఎట్టకేలకు రచిన్‌ను వెనక్కి పంపి షమీ ఈ జోడీని విడదీశాడు. లాథమ్ (5) విఫలం కాగా 100 బంతుల్లో మిచెల్ శతకాన్ని అందుకొని ప్రపంచకప్‌లో భారత్‌పై సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ తర్వాత కివీస్ పతనం వేగంగా సాగింది. 243/4తో మెరుగైన స్థితిలో కనిపించిన జట్టు భారత బౌలర్ల ధాటికి చివరి 6 ఓవర్లలో 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.
జడేజా అండగా...
భారత్‌కు ఛేదనలో రోహిత్ మరోసారి అద్భుత ఆరంభాన్ని అందించాడు. బౌల్ట్, హెన్రీల బౌలింగ్‌లో చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో దూసుకుపోయాడు. అతనికి శుబ్‌మన్ గిల్ (31 బంతుల్లో 26; 5 ఫోర్లు) అండగా నిలిచాడు. అయితే ఫెర్గూసన్ 7 బంతుల వ్యవధిలో వీరిద్దరిని వెనక్కి పంపాడు. ఈ దశలో కోహ్లి పట్టుదలగా నిలబడిన తీరు భారత్‌కు గెలుపు అవకాశాలు సృష్టించింది.
శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 33; 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (35 బంతుల్లో 27; 3 ఫోర్లు)లతో పాటు చివర్లో జడేజాతో కోహ్లి మూడు అర్ధసెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ఆరంభంలో నెమ్మదిగా ఆడి ఒకదశలో 47 బంతుల్లో 28 పరుగులే చేసిన కోహ్లి ఆ తర్వాత దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది.
సమన్వయలోపంతో సూర్యకుమార్ (2) రనౌటైన తర్వాత కోహ్లి, టోర్నీలో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన జడేజా జత కలిశారు. ఆ సమయంలో 16.1 ఓవర్లలో మరో 83 పరుగులు చేయాల్సి ఉంది. ఈ స్థితిలో వీరిద్దరు ప్రశాంతంగా ఆడుతూ జట్టును లక్ష్యంవైపు నడిపించారు. కివీస్ బౌలర్లు అప్పుడప్పుడు కొన్ని మంచి బంతులతో ఒత్తిడి పెంచగలిగినా... భారత్ గెలుపును ఆపలేకపోయారు. పాండ్యా, శార్దుల్ స్థానాల్లో షమీ, సూర్యకుమార్ ఈ మ్యాచ్‌లో జట్టులోకి వచ్చారు.
ఈసారి సెంచరీ దక్కలేదు!
మ్యాచ్‌లో ఒకవైపు భారత్ గెలుపు అవకాశాలు మెరుగవుతూ రాగా, మరోవైపు కోహ్లి సెంచరీ చేసి సచిన్‌ను సమం చేస్తాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో రాహుల్‌లాగే ఈసారి జడేజా కూడా సహకరించడంతో ఆఖర్లో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కోహ్లి ఒక్కడే చేసి శతకానికి చేరువయ్యాడు. జట్టుకు 35, కోహ్లికి 25 పరుగులు అవసరమైనప్పుడు ఉత్కంఠ పెరిగింది. ఆపై ఈ సమీకరణం 19 పరుగులు, 18 పరుగులకు మారింది.
అయితే బౌల్ట్ వేసిన 47వ ఓవర్లో కోహ్లి 6, 4 సహా 11 పరుగులు రాబట్టి 93కు చేరుకున్నాడు. ఇప్పుడు 7 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతికి కోహ్లి 2 పరుగులు తీశాడు. అయితే మూడో బంతిని భారీ సిక్సర్‌గా మలచి ముగించే ప్రయత్నంలో బౌండరీ లైన్‌కు చాలా ముందే క్యాచ్ ఇచ్చాడు. దాంతో అతను ప్రస్తుతానికి 48 సెంచరీల వద్దే నిలిచాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; యంగ్ (బి) షమీ 17; రచిన్ (సి) గిల్ (బి) షమీ 75; మిచెల్ (సి) కోహ్లి (బి) షమీ 130; లాథమ్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 5; ఫిలిప్స్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 23; చాప్‌మన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 6; సాన్‌ట్నర్ (బి) షమీ 1; హెన్రీ (బి) షమీ 0; ఫెర్గూసన్ (రనౌట్) 1; బౌల్ట్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 273. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–178, 4–205, 5–243, 6–257, 7–260, 8–260, 9–273, 10–273. బౌలింగ్: బుమ్రా 10–1–45–1, సిరాజ్ 10–1– 45–1, షమీ 10–0–54–5, జడేజా 10–0– 48–0, కుల్దీప్ 10–0–73–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) ఫెర్గూసన్ 46; గిల్ (సి) మిచెల్ (బి) ఫెర్గూసన్ 26; కోహ్లి (సి) ఫిలిప్స్ (బి) హెన్రీ 95; అయ్యర్ (సి) కాన్వే (బి) బౌల్ట్ 33; రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సాన్‌ట్నర్ 27; సూర్యకుమార్ (రనౌట్) 2; జడేజా (నాటౌట్) 39; షమీ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (48 ఓవర్లలో 6 వికెట్లకు) 274. వికెట్ల పతనం: 1–71, 2–76, 3–128, 4–182, 5–191, 6–269. బౌలింగ్: బౌల్ట్ 10–0–60–1, హెన్రీ 9–0–55–1, సాన్‌ట్నర్ 10–0–37–1, ఫెర్గూసన్ 8–0–63–2, రచిన్ 9–0–46–0, ఫిలిప్స్ 2–0–12–0.
ప్రపంచకప్‌లో నేడు
పాకిస్తాన్ Xఅఫ్గానిస్తాన్
వేదిక: చెన్నై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment