భారత సీనియర్ స్టార్స్ ఘోరవైఫల్యం
ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 100 పరుగుల చొప్పున చేయలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి
బౌలర్లు రాణించినా కొంపముంచిన బ్యాటర్లు
ఫలితమే న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం
తీరు మారకపోతే ఆస్ట్రేలియా గడ్డపైనా బోల్తా పడటం ఖాయం
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లను ఎదుర్కోలేక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మ్యాచ్ మాత్రం చేజారింది! దీంతో 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. ‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే’ అని కెప్టెన్ అంటే... అభిమానులు కూడా అతడికి అండగా నిలిచారు.
సిరీస్‌లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్టు కోసం పుణేలో స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసింది. అది ముందే పసిగట్టిన న్యూజిలాండ్ పేసర్లను పక్కన పెట్టి స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితం రాబట్టింది. మామూలు స్పిన్నర్లను సైతం ఎదుర్కోలేకపోయిన టీమిండియా... ఈసారి తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు ఆలౌట్ కాగా... మరో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది.
కనీసం మూడో టెస్టులోనైనా భారత జట్టు విజయం సాధించక పోతుందా అని ఆశపడ్డ అభిమానులకు వాంఖడే స్టేడియంలోనూ గుండెకోత తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 121 పరుగులకే పరిమితమై సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. ఒకవైపు మ్యాచ్ మ్యాచ్‌కూ పరిణతి చెందుతూ ముందుకు సాగిన న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఒకటి చొప్పున ఘనతలు ఖాతాలో వేసుకుంటే... టీమిండియా మాత్రం చెత్త రికార్డు లిఖించుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అంతకుమించిన పొరబాటు మరొకటి ఉండదు!
సాక్షి క్రీడా విభాగం
విదేశాల్లో ప్రదర్శనల సంగతి పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. పుష్కరకాలంగా దీనికి మరింత బలం చేకూర్చుతూ భారత జట్టు... ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరుస సిరీస్‌లు గెలుస్తూ వస్తోంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇలా ప్రత్యర్థులు మారుతున్నారు తప్ప ఫలితం మాత్రం మారలేదు. ఈ జోరుతోనే వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన భారత్... ముచ్చటగా మూడోసారీ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయమే అనిపించింది.
12 ఏళ్లుగా స్వదేశంలో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా... ఈ క్రమంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే జోష్‌లో ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుందనుకుంటున్న దశలో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శనతో చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్‌ను భారత్‌లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్‌తోనే టీమిండియాను ఎలా దెబ్బకొట్టవచ్చో న్యూజిలాండ్ అచరణలో చూపింది.
శ్రీలంకలో క్లీన్‌స్వీప్‌నకు గురై... కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనే స్థితిలో భారత్‌లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే... అదే సమయంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ టీమిండియా 91 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్... అత్యుద్భుత ప్రదర్శనతో టీమిండియాపై సిరీస్ క్లీన్‌స్వీప్ చేసింది. తమ ప్రధాన ఆటగాడు కేన్ విలియమ్సన్ లేకుండానే భారత్‌పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చితే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా మాత్రం నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది.
ఆ ఏకాగ్రత ఏది?
సుదీర్ఘ ఫార్మాట్‌లో సంయమనం ముఖ్యం అనేది మరిచిన భారత ప్లేయర్లు... క్రీజులోకి అడుగు పెట్టడంతోనే భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకోవడం చూస్తుంటే మనవాళ్లు టి20ల మాయలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇదే నిజం అనుకుందాం అంటే ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యఛేదనలో తలా రెండు భారీ షాట్లు ఆడిన టీమిండియా గెలవాల్సింది కానీ అదీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్‌లో అసలు నిలిచే ప్రయత్నం కూడా చేయలేకపోగా... రెండు ఫోర్లు బాదిన రోహిత్ అదే జోష్‌లో మరో చెత్త షాట్ ఆడి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో గొప్ప పోరాట పటిమ చూపిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా టర్న్ అయిన బంతికి బౌల్డ్ కాగా... యశస్వి వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్‌లో ఆకట్టుకుంటాడనుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. పంత్ ఒక్కడే సిరీస్ మొత్తం నిలకడ కనబర్చాడు. పక్కా గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని పంత్ నిరూపించాడు. ఇక మన స్పిన్నర్లు విజృంభిస్తారు అనుకొని సిద్ధం చేసిన పిచ్‌లపై ప్రత్యర్థి అనామక స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే... అనుభవజ్ఞులైన మనవాళ్లు మాత్రం కింద వరుస బ్యాటర్లను సైతం అడ్డుకోలేక ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
ఎలాంటి పిచ్‌పైనైనా మొండిగా నిలబడి పోరాడగల చతేశ్వర్ పుజారా, రహానే వంటి ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్‌తో స్పష్టం కాగా... ఆ్రస్టేలియా పర్యటనకు ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా పాఠాలు నేరి్పంది. ఈ జట్టుతోనే ఆసీస్ టూర్‌కు వెళ్లనున్న టీమిండియా... లోపాలను అధిగమించకపోతే ‘బోర్డర్–గవాస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Comments
Please login to add a commentAdd a comment