పక్కా ప్రణాళికతో రెండో టెస్టు బరిలోకి న్యూజిలాండ్ జట్టు
ఆల్‌రౌండర్ మిచెల్ వెల్లడి
పుణే: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ అన్నాడు. పుణేలో స్పిన్ పిచ్ ఎదురయ్యే అవకాశముందని... అయితే దాని కోసం కివీస్ ప్లేయర్ల వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్... 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం మిచెల్ మాట్లాడుతూ.. ‘పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అది ఆటగాళ్ల పని కాదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్లు ముందుకు సాగడం ముఖ్యం. ఇందులో మా ప్లేయర్లు సిద్ధహస్తులు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి స్కోర్లు చేయడం గురించే మేం ఆలోచిస్తున్నాం.
బెంగళూరు విజయం జట్టులో మరింత సానుకూల దృక్పథం నింపింది. అయితే దాన్ని పక్కన పెట్టి పుణేలో మళ్లీ తాజాగా ప్రారంభించాల్సిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా గాలెలో పూర్తిగా స్పిన్ పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడాం. ఒక్కో పిచ్ ప్రత్యేకత ఒకలా ఉంటుంది. వికెట్‌ను బట్టి ఆటతీరును మార్చుకుంటూ ముందుకు సాగాలి.
తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ప్రపంచ స్థాయి ప్లేయర్ అతడి ఆటతీరు నాకు చాలా ఇష్టం’ అని మిచెల్ అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని మిచెల్ పేర్కొన్నాడు.
రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరం
పుణే: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్‌తో రెండో టెస్టులో కూడా బరిలోకి దిగబోడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టుకు దూరమైన విలియమ్సన్... ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని బోర్డు మంగళవారం స్పష్టం చేసింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గెలిచిన న్యూజిలాండ్... గురువారం నుంచి రెండో టెస్టులో టీమిండియాతో తలపడుతుంది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ విలియమ్సన్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ‘కేన్ కోలుకుంటున్నాడు. అయితే వంద శాతం ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే అతడు రెండో టెస్టులో ఆడబోవడం లేదు. ప్రస్తుతం విలియమ్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.
మూడో టెస్టు వరకు అతడు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తాడని భావిస్తున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విలియమ్సన్ గైర్హాజరీలోనూ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు... 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ముందంజ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment