![Memorable Moments On Team India vs New Zealand 1968 Test Series - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/7/alu.jpg.webp?itok=o7NAQhEt)
ప్రసన్న, బిషన్ సింగ్, ఫరూఖ్ ఇంజినీర్, అజిత్ వాడేకర్
భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో విదేశాల్లో విజయం సాధించడమనేది మొదటి నుంచీ పెద్ద సవాల్‌గానే నిలిచింది. ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్లు ఉన్న సమయంలో కూడా విదేశాల్లో సిరీస్ విజయాలు మనకు అంత సులభంగా దక్కలేదు. ఈ రకంగా విదేశాల్లో భారత ప్రదర్శనను బట్టి చూస్తే తొలి సిరీస్ విజయం ఎప్పుడైనా అపురూపమే. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మధురక్షణమే. 1968లో న్యూజిలాండ్ గడ్డపై భారత్ విదేశాల్లో తమ తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది.
1932లో భారత జట్టు ఇంగ్లండ్‌లో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. దాంతో కలిపి వరుసగా జరిపిన 11 విదేశీ పర్యటనల్లోనూ 10 సార్లు జట్టుకు సిరీస్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతుల్లో ఈ పరాజయాలు ఎదురుకాగా, స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్‌తో ఆడిన ఒక్క సిరీస్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. గెలుపు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. ఇలాంటి నేపథ్యంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్‌కు అద్భుత విజయం దక్కింది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత్ 4 టెస్టుల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకోవడం విశేషం. మన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సయ్యద్ ఆబిద్ అలీ, ఎంఎల్ జైసింహ ఈ సిరీస్ విజయంలో భాగంగా ఉన్నారు. ఈ నాలుగు టెస్టుల ఫలితాలను చూస్తే...
తొలి టెస్టు (డ్యునెడిన్) భారత్ ఐదు వికెట్లతో విజయం
డౌలింగ్ (143) సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 350 పరుగులు చేసింది. ఆబిద్ అలీకి 4 వికెట్లు దక్కాయి. అజిత్ వాడేకర్ (80), ఫరూఖ్ ఇంజినీర్ (63) బ్యాటింగ్‌తో భారత్ 359 పరుగులు చేసింది. ఎరాపల్లి ప్రసన్న 6 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకే ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం రుచి చూసింది.
రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్): న్యూజిలాండ్ ఆరు వికెట్లతో విజయం
డౌలింగ్ (239) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ ముందుగా 502 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీకి 6 వికెట్లు దక్కాయి. భారత్ 288 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 301 పరుగులు చేయగలిగింది. 88 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి కివీస్ ఛేదించింది.
మూడో టెస్టు (వెల్లింగ్టన్): భారత్ ఎనిమిది వికెట్లతో విజయం
ఎరాపల్లి ప్రసన్న 5 వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే కుప్పకూలింది. భారత్ 327 పరుగులు చేసి భారీ ఆధిక్యం అందుకుంది. అజిత్ వాడేకర్ (143) శతకం సాధించడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ మళ్లీ బ్యాటింగ్‌లో విఫలమై 199 పరుగులకే ఆలౌటైంది. బాపు నాదకర్ణి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. 59 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి సిరీస్‌లో ముందంజ వేసింది.
నాలుగో టెస్టు (ఆక్లాండ్): భారత్ 272 పరుగులతో విజయం
విదేశాల్లో భారత్ సిరీస్ విజయపు కలను నెరవేర్చిన మ్యాచ్ ఇది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు మాత్రమే చేసినా... న్యూజిలాండ్‌ను 140 పరుగులకే పడగొట్టింది. మరోసారి ప్రసన్న 4 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 261 వద్ద డిక్లేర్ చేసింది. రూసీ సుర్తీ 99 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 374 పరుగుల అసాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ సొంతగడ్డపై చేతులెత్తేసింది. 101 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రసన్న 4, బేడీ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు.
భారత్ చరిత్రాత్మక సిరీస్ విజయంలో అజిత్ వాడేకర్ 328 పరుగులతో మన తరఫున టాప్ స్కోరర్‌గా నిలవగా...సుర్తీ, ఫరూఖ్ ఇంజినీర్ చెరో 321 పరుగులు సాధించారు. ఏకైక సెంచరీని వాడేకర్ నమోదు చేశాడు. బౌలింగ్‌లో 24 వికెట్లతో ఎరాపల్లి ప్రసన్న ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా... బిషన్ సింగ్ బేడీ 16, బాపు నాదకర్ణి 14 వికెట్లతో అండగా నిలిచారు.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment