‘నాపై ఇక కత్తులు దూయండి’... బెంగళూరు టెస్టులో 46కు ఆలౌట్ అయిన తర్వాత మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది!
‘12 ఏళ్ల తర్వాత ఒక సిరీస్ ఓడిపోయాం...ఈమాత్రం మినహాయింపు ఇవ్వడంలో తప్పు లేదు’...రెండో టెస్టులో ఓటమి అనంతరం అదే కెప్టెన్ చెప్పిన మాట ఇది.
ఇన్నేళ్లుగా తమ ఆటతో విజయాలనే తాము అలవాటు చేశామని, కాబట్టి పరాజయం అందరికీ కొత్తగా అనిపిస్తోందని కూడా రోహిత్ అన్నాడు. అంటే 46 ఆలౌట్‌ను ఒకానొక అరుదైన రోజుగా అంగీకరించిన కెప్టెన్ కు ఇప్పుడు ఓటమి అలవాటైపోయినట్లుగా అనిపించింది! అయితే ఈ పుష్కర కాలంలో అప్పుడప్పుడు వచ్చిన మ్యాచ్ పరాజయాలకు, తాజాగా సిరీస్ కోల్పోవడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇన్నేళ్లలో ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలాంటి టీమ్‌లు భారత్‌ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి.
మ్యాచ్‌లు గెలిచినా అవి సిరీస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. వీటితో పోలిస్తే న్యూజిలాండ్ టెస్టుల్లో అనామక జట్టు కిందే లెక్క. దీనికి ముందు 12 సిరీస్‌లలో కలిపి ఆ టీమ్ ఇక్కడ రెండే మ్యాచ్‌లు గెలవగలిగింది. పైగా ఇటీవలే శ్రీలంక చేతిలో 0–2తో చిత్తుగా ఓడి ఇక్కడకు వచ్చింది. సౌతీ, లాథమ్‌లకు మినహా మిగతావారెవరికీ ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. కేన్ విలియమ్సన్‌లాంటి స్టార్ ప్లేయర్ కూడా అందుబాటులో లేడు. అయినా సరే కివీస్ టీమ్ భారత్‌పై పైచేయి సాధించగలిగింది.
రెండు పూర్తిగా భిన్నమైన పిచ్‌లపై ఆ జట్టు పైచేయి సాధించిన తీరు టీమిండియా లోపాలను చూపించింది. ముందుగా బెంగళూరు టెస్టులో పేస్ బౌలింగ్ ముందు భారత్ మోకరిల్లి చెత్త రికార్డులను నమోదు చేసింది. దాంతో హడావిడిగా మన బలం స్పిన్ అంటూ పూర్తిగా స్పిన్ పిచ్‌తో సిద్ధమైంది. కానీ ముందు మన బ్యాటర్లు అలాంటి పిచ్‌పై, స్పిన్‌ను సమర్థంగా ఆడగలరా లేదా అనే ఆలోచన రానట్లుంది! అందుకే సాంట్నర్ స్పిన్‌ను కూడా ఎదుర్కోలేకపోయింది.
2017లో ఇదే పుణేలో, ఇదే తరహా పిచ్‌పై ఇలాంటి లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒ కీఫ్‌కు 12 వికెట్లు అప్పగించి ఆసీస్ చేతిలో భారత్ 333 పరుగులతో చిత్తయింది. ఇప్పుడు కూడా పదునైన స్పిన్‌ను ఆడటం తమ వల్ల కాదని మన బ్యాటర్లు నిరూపించారు. పిచ్‌పై గిర్రున తిరుగుతున్న బంతులకు వారి వద్ద జవాబు లేకపోయింది. బంగ్లాలాంటి బలహీన జట్టుపై దూకుడైన ఆటతో సిరీస్ గెలిచిన వైనంతో మన ప్లేయర్లలో అతి విశ్వాసం పెరిగినట్లు కనిపించింది.
పైగా న్యూజిలాండ్ టెస్టుల్లో ప్రభావం చూపలేదనే తేలికపాటి భావం కూడా కావచ్చు! సిరీస్‌లో రోహిత్ విఫలం కాగా, కోహ్లి తన ఆటతో తీవ్రంగా నిరాశపర్చాడు. జైస్వాల్ ఒక్కడే ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్‌లో పంత్ రనౌట్ అతని నిరక్ష్యాన్ని చూపించింది. సాంట్నర్ చెలరేగిన చోట అదే శైలి బౌలర్ అయిన జడేజాకు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదే టీమ్ ఆ్రస్టేలియాకు వెళ్లి గెలుస్తుందనుకోవడం అత్యాశే. మరో వైపు కోచ్ గౌతమ్ గంభీర్‌కు కూడా ఈ ఓటమిలో పాత్ర ఉంది.
బంగ్లాపై సిరీస్ విజయాన్ని గొప్పగా చెప్పుకుంటూ...‘ఒక్క రోజులో 400 పరుగులు చేయగల, అవసరమైతే రెండు రోజులు నిలబడి డ్రా చేసుకోగల జట్టుగా మేం మారాలి. నా దృష్టిలో ఆటలో ఎదగడం అంటే అదే’ అంటూ వ్యాఖ్య చేశాడు. 400 సంగతేమో కానీ మన బ్యాటింగ్ బలహీనత ఏమిటో ఇది చూపించింది.
శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి, 46 ఆలౌట్, 36 ఏళ్ల తర్వాత కివీస్ చేతిలో టెస్టు పరాజయం, ఇప్పుడు తొలిసారి సిరీస్, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో పరాభవం...ఇవన్నీ కూడా కోచ్ గంభీర్ ఖాతాలో చేరాల్సినవే! ఇకపై మాటలను కట్టిపెట్టి కోచ్‌గా తన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చాల్సిన సమయమిది.
4 రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఓడిన టెస్టుల సంఖ్య. గతంలో అజహర్, కపిల్ కెప్టెన్సీలో 4 మ్యాచ్‌లు ఓడగా... పటౌడీ నాయకత్వంలో భారత్ 9 మ్యాచ్‌లు ఓడింది.
–సాక్షి క్రీడావిభాగం
Comments
Please login to add a commentAdd a comment