నేటి నుంచి న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు
జోరు మీదున్న టీమిండియా
మ్యాచ్‌కు వర్షం ముప్పు
ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం
కొన్నేళ్లుగా స్వదేశంలో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న భారత క్రికెట్ జట్టు మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమైంది. సొంతగడ్డపై ఇటీవల బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మరో సిరీస్ విజయం లక్ష్యంగా నేటి నుంచి న్యూజిలాండ్‌తో తలపడనుంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా సాగుతున్న రోహిత్ శర్మ బృందం ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడం లాంఛనమే! ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా భారత జట్టు వ్యూహాలకు పదును పెడుతోంది.
బెంగళూరు: వచ్చే నెలలో ఆ్రస్టేలియాతో జరిగే మెగా టెస్టు సిరీస్‌కు ముందు స్వదేశంలో భారత జట్టు సత్తాకు పరీక్ష ఎదురుకానుంది. బంగ్లాదేశ్ గట్టి జట్టు కాకపోవడంతో టీమిండియాకు ఇటీవల ఆ జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. కానీ పోరాటపటిమకు మారుపేరైన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయలేము. ఐపీఎల్ రూపంలో భారత గడ్డపై ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న ఆటగాళ్లు న్యూజిలాండ్‌లో ఉన్నారు. ఫలితంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ పోటాపోటీగా సాగే అవకాశముంది.
అయితే ఈ సిరీస్‌కు శుభారంభం లభించాలంటే వరుణుడు కూడా కరుణించాలి. నేటి నుంచి మూడు రోజులపాటు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. చివరి రెండు రోజులు ఎండ కాయనుంది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో వరుణుడు కాస్త తెరిపినిచి్చనా మ్యాచ్ సాగడం ఖాయమే. భారత యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ చక్కటి అవకాశం కానుంది.
ముఖ్యంగా శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌పై అందరి దృష్టి నిలవనుంది. ఇప్పటికే జట్టులో కుదురుకున్న ఈ ఇద్దరూ భవిష్యత్తుపై భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు గాయాలతో సతమతమవుతోంది. మాజీ కెపె్టన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోగా... తాజాగా పేస్ బౌలర్ బెన్ సియర్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌కే దూరమయ్యాడు.
సమతూకంగా...
బ్యాటింగ్‌లో టీమిండియాకు పెద్దగా సమస్యలు లేవు. గిల్, జైస్వాల్, పంత్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్, కోహ్లి స్థాయి ప్లేయర్లు లయ అందుకునేందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. మరో 53 పరుగులు చేస్తే కోహ్లి భారత్ నుంచి 9 వేల టెస్టు పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా ఘనత వహిస్తాడు.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అటు బ్యాట్‌తో ఇటు బంతితో అదరగొట్టిన అశ్విన్, రవీంద్ర జడేజాలతో భారత బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా మారింది. అస్వస్థతతో గిల్ మ్యాచ్‌కు దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి వస్తాడు. బోర్డర్–గవాస్కర్ సిరీస్‌కు ముందు స్వదేశంలోనూ పేస్ పిచ్‌లపైనే ఆడాలని భావించిన టీమిండియా... అందుకు తగ్గట్లే పిచ్‌లను సిద్ధం చేసుకుంది.
బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగి ఫలితం సాధించింది. ఇక్కడ కూడా అదే కొనసాగించవచ్చు. అదనపు స్పిన్నర్‌ను ఆడించాలనుకుంటే ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్నాడు.
కివీస్‌కు గాయాల బెడద
ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోతోంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0–2తో కోల్పోయిన న్యూజిలాండ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. భారత్‌తో పర్యటనకు ముందే టిమ్ సౌతీ టెస్టు కెప్టెన్సి నుంచి తప్పుకోగా... విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు.
మరోవైపు యువ పేసర్ బెన్ సియర్స్ కూడా మోకాలి గాయంతో ఈ పర్యటనకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో టామ్ లాథమ్ కివీస్ పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనుండగా... అతడితో పాటు కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్‌తో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ మెరుగ్గానే ఉంది. అయితే భారత స్పిన్నర్లను వీరు ఎలా ఎదుర్కొంటారనేది కీలకం.
ఇక ఎజాజ్ పటేల్, సాన్‌ట్నర్, రచిన్‌ల రూపంలో ఆ జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. గత భారత పర్యటనలో ఎజాజ్ ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు తీసి... టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక సీనియర్ సౌతీ, విల్ రూర్కె, ఫిలిప్స్ పేస్ భారం మోయనున్నారు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), జైస్వాల్, గిల్/సర్ఫరాజ్, కోహ్లి, పంత్, రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్‌దీప్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, మిషెల్, బ్లండెల్, ఫిలిప్స్, సాన్‌ట్నర్/బ్రేస్‌వెల్, సౌతీ, ఎజాజ్ పటేల్, విల్ ఓ రూర్కె.
62 ఇప్పటి వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టులు. ఇందులో 22 మ్యాచ్‌ల్లో భారత్... 13 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందాయి. 27 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
36 స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్ ఆడిన టెస్టులు. ఇందులో 17 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 2 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ (1969లో, 1988లో) గెలిచింది. మిగతా 17 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.
పిచ్, వాతావరణం
బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. వర్షాల కారణంగా పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఆటకు వరుణుడు ఆటంకం కలిగించవచ్చు. ముఖ్యంగా తొలి మూడు రోజులు బెంగళూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం అభిమానులకు ఊరటనిచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment