ఈసారి స్పిన్ వలలో భారత్ విలవిల
తొలి ఇన్నింగ్స్‌లో 156కే ఆలౌట్
7 వికెట్లతో తిప్పేసిన సాంట్నర్
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 198/5
301 పరుగుల ఆధిక్యంలో కివీస్
తొలి టెస్టులో న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ధాటికి దాసోహం అన్న భారత జట్టు... రెండో టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఏడేళ్ల క్రితం ఇక్కడే జరిగిన టెస్టు మ్యాచ్‌లో పూర్తి స్పిన్ పిచ్‌ను సిద్ధం చేసి ఆ్రస్టేలియా చేతిలో భంగపాటుకు గురైన టీమిండియా... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ అలాంటి పరిస్థితే ఎదుర్కుంటోంది.
స్పిన్‌ను ఆడటంలో సిద్ధహస్తులు అనుకున్న మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుస కట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ బృందం కుప్పకూలగా ... భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డచోట కివీస్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఫలితంగా రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా గడ్డు స్థితిలో ఉంది.
భారత గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవని న్యూజిలాండ్ ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తుండగా... పుష్కర కాలం నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓటమి ఎరుగని టీమిండియా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది! ఇక ఈ మ్యాచ్ నుంచి రోహిత్ బృందం గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే!
పుణే: దశాబ్ద కాలంగా సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి అంచున నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి బెంబేలెత్తి పరాజయం పాలైన టీమిండియా... ఇప్పుడు పుణేలో ప్రత్యర్థి స్పిన్ దెబ్బకు వెనుకంజ వేసింది.
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (133 బంతుల్లో 86; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్లన్‌డెల్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 103 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
బ్లన్‌డెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 16/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 45.3 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... యశస్వి జైస్వాల్ (30), శుబ్‌మన్ గిల్ (30) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ సాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా... గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.
లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్
భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చోట... బ్యాటింగ్ ఎలా చేయాలో లాథమ్ ఆచరణలో చూపాడు. అప్పటికే 100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన లాథమ్... ఒక్కో పరుగు జోడిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు.
కాన్వే (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), మిచెల్ (18) ఎక్కువసేపు నిలవకపోయినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు నిరి్మస్తూ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే స్పిన్నర్లను నమ్ముకోగా.. సుందర్ మినహా అశ్విన్, జడేజా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయారు.
మరి కాసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. లాథమ్‌ను సుందర్ వికెట్ల ముందు దొరక బుచ్చుకోగా... ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్... టీమిండియా ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం.
ఒకరి వెంట ఒకరు..
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు... స్పిన్‌కు స్వర్గధామంలా కనిపిస్తున్న పుణే పిచ్‌పైనైనా చెలరేగుతుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. రెండో వికెట్‌కు గిల్, జైస్వాల్ జోడించిన 49 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కాగా.. జట్టు స్కోరు 50 వద్ద గిల్ ఔటయ్యాడు.
ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. సాంట్నర్ వేసిన ఊరించే బంతికి విరాట్ కోహ్లి (1) క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్, పంత్ (18)ను ఫిలిప్స్ బుట్టలో వేసుకున్నాడు. గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి తన విలువ చాటుకున్న కోహ్లి చెత్త బంతికి పెవిలియన్ చేరాడు.
సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. బెంగళూరులో భారీ సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపిన సర్ఫరాజ్ ఈసారి అదే ప్రయత్నం చేయలేకపోయాడు. జడేజా ధాటిగా ఆడగా... సుందర్ (18 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు.
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 30; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 30; కోహ్లి (బి) సాంట్నర్ 1; పంత్ (బి) ఫిలిప్స్ 18; సర్ఫరాజ్ (సి) రూర్కే (బి) సాంట్నర్ 11; జడేజా (ఎల్బీ) సాంట్నర్ 38; అశ్విన్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 4; సుందర్ (నాటౌట్) 18; ఆకాశ్‌దీప్ (బి) సాంట్నర్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) సాంట్నర్ 0; ఎక్స్‌ట్రాలు: 0; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–56, 4–70, 5–83, 6–95, 7–103, 8–136, 9–142, 10–156. బౌలింగ్: సౌతీ 6–1–18–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 11–1–54–0, సాంట్నర్ 19.3–1–53–7, ఫిలిప్స్ 6–0–26–2.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 18; మిషెల్ (సి) జైస్వాల్ (బి)
సుందర్ 18; బ్లన్‌డెల్ (బ్యాటింగ్) 30; ఫిలిప్స్ (బ్యాటింగ్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (53 ఓవర్లలో 5 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183. బౌలింగ్: అశ్విన్ 17–1–64–1; సుందర్ 19–0–56–4; జడేజా 11–1–50–0; బుమ్రా 6–1–25–0.
Comments
Please login to add a commentAdd a comment