అహ్మదాబాద్: వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఉరకలెత్తే ఉత్సాహంతో ముందంజ వేసిన భారత జట్టు ఫైనల్ పరాభవంతో షాక్‌కు గురైంది. నిశ్శబ్దం ఆవహించి... నిరాశలో కూరుకుపోయిన రోహిత్ శర్మ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఓదార్చారు. ఆదివారం రాత్రి బహుమతి ప్రదానోత్సవం ముగిశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి మోదీ భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ప్రతీ ఒక్క ఆటగాడిని సముదాయించారు.
ఈ నిరాశ నుంచి కోలుకునేందుకు ఓదార్పు మాటలు చెప్పారు. ‘ప్రియమైన టీమిండియా... మీ ప్రతిభ, ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అంకితభావంతో ప్రపంచకప్ గెలిచేందుకు టోర్నీ ఆసాంతం గొప్పగా ఆడారు. మీ కృషి వెలకట్టలేనిది. ప్రపంచకప్‌లో మీరు కనబరిచిన క్రీడాస్ఫూర్తిని చూసి జాతి గర్విస్తోంది. యావత్ దేశం మీ వెన్నంటే ఉంది. ఇకపై కూడా ఉంటుంది’ అని ఎక్స్‌లో ప్రధాని ట్వీట్ చేశారు.
దీన్ని పలువురు క్రికెట్ అభిమానులు షమీని ప్రధాని ఓదారుస్తున్న ఫోటోను జతచేసి రీ ట్వీట్లతో అనుసరించారు. ‘టోర్నీలో గొప్పగా ఆడాం. ఆఖరి పోరులోనే ఓడిపోయాం. ఈ చేదు ఫలితం అందరి గుండెల్ని బద్దలు చేసింది. ఇలాంటి సమయంలో ప్రధాని మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి కొండంత బలాన్నిచ్చేలా ఓదార్పు పలికారు. మోదీకి కృతజ్ఞతలు’ అని ఆల్‌రౌండర్ జడేజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment