
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ అండర్–19 ప్రపంచకప్‌లో కీలక పోరుకు సన్నద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఫామ్, బలా బలాలపరంగా చూస్తే ఈ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది. కంగారూలపై భారత కుర్రాళ్ల గత రికార్డు కూడా అద్భుతంగా ఉంది. 2013 నుంచి అండర్–19 ప్రపంచ కప్‌లో ఆసీస్‌తో భారత్ ఐదు సార్లు తలపడగా నాలుగు సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఇప్పటి వరకు భారత బ్యాట్స్‌మెన్‌లో యశస్వి జైస్వాల్ రెండు అర్ధ సెంచరీలు సాధించగా, దివ్యాంశ్ సక్సేనా, కెప్టెన్ ప్రియమ్ గార్గ్ కూడా ఆకట్టుకున్నారు. హైదరాబాదీ ఠాకూర్ తిలక్ వర్మ కూడా చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. బౌలింగ్ విభాగంలో పేసర్ కార్తీక్ త్యాగి నిలకడైన ప్రదర్శన కనబర్చగా, లెఫ్టార్మ్ సీమర్ ఆకాశ్ సింగ్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అథర్వ కూడా టోర్నీలో ప్రభావం చూపించారు. ఆస్ట్రేలియా బృందంలో కెప్టెన్ మెకెంజీ హార్వీ ప్రధాన బ్యాట్స్‌మన్ కాగా ఆల్‌రౌండర్ కానర్ సలీ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే రెండు జట్లలో ప్రధాన పోలికను చూస్తే లెగ్‌స్పిన్నర్లు కీలకంగా మారారు. భారత్ తరఫున సత్తా చాటుతున్న రవి బిష్ణోయ్ 3 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. మరో వైపు ఆసీస్ ఆటగాడు తన్వీర్ సంఘా కూడా 10 వికెట్లు తీశాడు. వీరిద్దరిలో ఎవరు రాణిస్తారనేది ఆయా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment