IPL 9 matches
-
నాయర్ నిలబెట్టాడు
► డేర్‌డెవిల్స్‌ను గెలిపించిన కరుణ్ నాయర్ ► 6 వికెట్లతో హైదరాబాద్ ఓటమి ► ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవం ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మళ్లీ ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. ఆశలు నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు సమష్టిగా రాణించింది. ముందుగా బ్రాత్‌వైట్ బౌలింగ్, ఆ తర్వాత కరుణ్ నాయర్ మెరుపు బ్యాటింగ్‌తో డెవిల్స్‌కు కీలక విజయం దక్కింది. లీగ్‌లో ‘టాప్’లో ఉన్న సన్‌రైజర్స్... ఈసారి బ్యాటింగ్‌లో తడబడి ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆఖర్లో కాస్త ఉత్కంఠ ఎదురైనా... చివరి బంతికి ఢిల్లీ లక్ష్యం చేరడంలో సఫలం అయింది. రాయ్‌పూర్: ఢిల్లీ విజయం కోసం చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... భువనేశ్వర్ వేసిన తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులే వచ్చాయి. ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో కరుణ్ నాయర్ ఒత్తిడిని అధిగమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఢిల్లీ ఆశలు సజీవంగా నిలబెట్టాడు. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (59 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి నడిపించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 32; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. తాజా ఫలితంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు నిలిచాయి. ఆ జట్టు తమ చివరి మ్యాచ్‌లలో బెంగళూరుతో, సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడతాయి. వార్నర్ జోరు: సీజన్ ఆరంభంనుంచి రైజర్స్ బ్యాటింగ్ భారం మోస్తున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో సారి ఆపద్బాంధవుడయ్యాడు. లీగ్‌లో ఏడో అర్ధ సెంచరీతో అతను జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని నెమ్మదైన పిచ్‌పై ఒక వైపు వార్నర్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించినా...మరో ఎండ్‌లో ఐదు బంతుల వ్యవధిలో ధావన్ (10), హుడా (1) రనౌట్ కావడం సన్‌కు అడ్డుకట్ట వేసింది. తమ బౌలింగ్‌లోనే చక్కటి ఫీల్డింగ్‌తో బ్రాత్‌వైట్, మిశ్రా ఈ రెండు వికెట్లు తీశారు. కొద్ది సేపటికే యువరాజ్ (10) బ్రాత్‌వైట్ బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో రైజర్స్ మరింత ఇబ్బందుల్లో పడింది. 40 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని కూడా బ్రాత్‌వైట్ వెనక్కి పంపి దెబ్బ తీయగా, హెన్రిక్స్ (18), మోర్గాన్ (14), ఓజా (16 నాటౌట్) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా చివరి ఐదు ఓవర్లలో సన్ 43 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక భాగస్వామ్యం: ఛేదనలో ఢిల్లీకి కూడా సరైన ఆరంభం లభించలేదు. బరీందర్ తన తొలి ఓవర్లోనే డి కాక్ (2)ను అవుట్ చేయడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే బరీందర్ తర్వాతి ఓవర్లో నాయర్ మూడు బౌండరీలు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అనంతరం రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, పంత్, నాయర్ కూడా భారీ షాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో తర్వాతి ఏడు ఓవర్లలో కేవలం 2 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే వచ్చాయి. రెండో వికెట్‌కు 59 బంతుల్లో 73 పరుగులు జోడించిన అనంతరం భువనేశ్వర్ డెరైక్ట్ త్రోకు పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో నాయర్, డుమిని (17) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 15వ ఓవర్లో నాయర్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను వార్నర్ వదిలేయడం ఆ జట్టుకు కలిసొచ్చింది. డుమినితో పాటు బ్రాత్‌వైట్ (10) అవుటైనా, నాయర్ చివరి వరకు నిలబడి విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిశ్రా (బి) బ్రాత్‌వైట్ 73; ధావన్ (రనౌట్) 10; హుడా (రనౌట్) 1; యువరాజ్ (బి) బ్రాత్‌వైట్ 10; హెన్రిక్స్ (సి) నేగి (బి) డుమిని 18; మోర్గాన్ (సి) బ్రాత్‌వైట్ (బి) కూల్టర్‌నీల్ 14; ఓజా (నాటౌట్) 16; భువనేశ్వర్ (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-46; 2-48; 3-66; 4-105; 5-117; 6-132; 7-158. బౌలింగ్: జహీర్ ఖాన్ 4-0-26-0; జయంత్ యాదవ్ 4-0-37-0; కూల్టర్‌నీల్ 4-0-36-1; బ్రాత్‌వైట్ 4-0-27-2; మిశ్రా 3-0-21-0; డుమిని 1-0-9-1. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) బరీందర్ 2; పంత్ (రనౌట్) 32; నాయర్ (నాటౌట్) 83; డుమిని (సి) వార్నర్ (బి) బరీందర్ 17; బ్రాత్‌వైట్ (సి) బరీందర్ (బి) ముస్తఫిజుర్ 10; శామ్సన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-9; 2-82; 3-117; 4-143. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-0; బరీందర్ 4-0-34-2; ముస్తఫిజుర్ 4-0-24-1; హెన్రిక్స్ 2-0-18-0; హుడా 2-0-16-0; కరణ్ శర్మ 3-0-25-0; యువరాజ్ 1-0-7-0. -
రైజర్స్ బల్లే బల్లే...
► పంజాబ్‌పై 7 వికెట్లతో హైదరాబాద్ గెలుపు ► రాణించిన వార్నర్, యువరాజ్ ► కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అవుట్3 ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్’ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకుంది. వార్నర్ మరో అర్ధ సెంచరీ, దీపక్ హుడా ధాటికి తోడు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో మెరుపులు ప్రదర్శించడంతో ఆ జట్టు ఖాతాలో ఎనిమిదో విజయం చేరింది. అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా, ఈ గెలుపుతో నాకౌట్‌కు సన్‌రైజర్స్ టీమ్ మరింత చేరువైంది. మరో వైపు హషీం ఆమ్లా దూకుడైన ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేసినా చివర్లో చేతులెత్తేసింది. ఫలితంగా పుణే తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్ర్కమించిన రెండో జట్టుగా నిలిచింది. మొహాలీ: పంజాబ్ గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ‘భాంగ్రా’ చిందులేశారు. భారీ స్కోరును అలవోకగా ఛేదించి కీలక విజయాన్ని అందుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (56 బంతుల్లో 96; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) సీజన్లో ఆరో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. చాలా కాలం తర్వాత యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, దీపక్ హుడా (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. ఆమ్లా జోరు... వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా పంజాబ్ ఆమ్లాపై నమ్మకముంచింది. దానిని నిలబెట్టుకుంటూ అతను చెలరేగాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను, నెహ్రా వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు బాదగా, మరోవైపు విజయ్ (6) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం ఆమ్లాకు సాహా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు), గుర్కీరత్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. 30 బంతుల్లోనే ఆమ్లా తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు సాహాతో 41 బంతుల్లో 54 పరుగులు జోడించిన ఆమ్లా, మూడో వికెట్‌కు గుర్‌కీరత్‌తో 37 బంతుల్లోనే 65 పరుగులు జత చేశాడు. హెన్రిక్స్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన ఆమ్లా... ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టి శతకానికి చేరువయ్యాడు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో అది సాధ్యం కాలేదు. సన్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయంతో మ్యాచ్ మధ్యలోనే నిష్ర్కమించాడు. సమష్టి ప్రదర్శన... ఐపీఎల్లో విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచిన వార్నర్, ధావన్ (22 బంతుల్లో 25; 4 ఫోర్లు) మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. స్టొయినిస్ ఓవర్లో వార్నర్ ఫోర్, సిక్స్ కొట్టగా, మ్యాక్స్‌వెల్ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. తొలి వికెట్‌కు చకచకా 48 బంతుల్లో 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో పరుగుకు ప్రయత్నించి మోహిత్ అద్భుత ఫీల్డింగ్‌కు ధావన్ అవుట్ కాగా, 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో యువరాజ్, హుడా తర్వాత హిట్‌వికెట్‌గా అవుటైన మూడో సన్ బ్యాట్స్‌మన్ వార్నర్. అయితే హుడా, యువరాజ్ చెరో వైపు నుంచి చెలరేగడంతో రైజర్స్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. యువరాజ్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. హుడా అవుటైనా... యువీ, బెన్ కటింగ్ (11 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) 22 బంతుల్లోనే 41 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 96; విజయ్ (సి) వార్నర్ (బి) ముస్తఫిజుర్ 6; సాహా (సి) హుడా (బి) హెన్రిక్స్ 27; గుర్కీరత్ (బి) భువనేశ్వర్ 27; మిల్లర్ (నాటౌట్) 20; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1-33; 2-87; 3-152; 4-173. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-2; నెహ్రా 2.5-0-35-0; ముస్తఫిజుర్ 4-0-32-1; కటింగ్ 1.1-0-11-0; కరణ్ శర్మ 4-0-26-0; హెన్రిక్స్ 3-0-29-1; యువరాజ్ 1-0-11-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (హిట్‌వికెట్) (బి) అక్షర్ పటేల్ 52; ధావన్ (రనౌట్) 25; హుడా (సి) మిల్లర్ (బి) సందీప్ 34; యువరాజ్ (నాటౌట్) 42; కటింగ్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-68; 2-97; 3-139. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-35-1; విజయ్ 1-0-8-0; మోహిత్ శర్మ 3.4-0-40-0; అనురీత్ సింగ్ 3-0-28-0; స్టొయినిస్ 3-0-28-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0; అక్షర్ పటేల్ 4-0-26-1. -
అవును... ఢిల్లీయే!
► ఐపీఎల్లో డేర్‌డెవిల్స్ సంచలన విజయాలు ► జట్టు రాత మార్చేసిన కోచ్ ద్రవిడ్ ► అండర్‌డాగ్‌గా వచ్చి అదరగొడుతున్న జహీర్ సేన ఢిల్లీ డేర్‌డెవిల్స్... ఐపీఎల్లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్టు. ముఖ్యంగా గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడిన జట్టు. అందుకే ఈసారి కూడా ఐపీఎల్ ఆరంభంలో ఈ జట్టుపై ఎలాంటి అంచనాలూ లేవు. కానీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికే ఢిల్లీ జట్టు ప్రకంపనలు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రతి ఏటా జట్టు నిండా స్టార్ క్రికెటర్లు... స్టార్ ఆటగాడని భావిస్తే చాలు కోట్లాది రూపాయలు కుమ్మరించిన యాజమాన్యం... అయినా ఫలితం లేక ప్రతి ఏటా జట్టులో మార్పులు... ఇలాంటి స్థితిలో ఈసారి మాత్రం వ్యూహం మార్చారు. కోచ్‌గా ద్రవిడ్‌ను తీసుకున్నాక... రాజస్తాన్ రాయల్స్ తరహాలో లో ప్రొఫైల్ క్రికెటర్లను తీసుకున్నారు. ఇప్పుడు వారితోనే మ్యాజిక్ చేస్తున్నాడు ‘మిస్టర్ డిపెండబుల్’ ద్రవిడ్. సాక్షి క్రీడావిభాగం ఈసారి ఐపీఎల్లో కాస్త అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లతో నిండిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ భారీ స్కోర్లు చేస్తున్నా మ్యాచ్‌లు కాపాడుకోలేకపోతోంది. కెప్టెన్ కూల్ ధోనికి సరైన జట్టు లేక పుణే వెనుకబడి పోయింది. స్టార్ క్రికెటర్లతో నిండిన ముంబై, హైదరాబాద్ పడుతూ లేస్తూ ప్రస్థానం సాగిస్తున్నాయి. కానీ ఈ జట్లన్నింటికీ భిన్నంగా లో ప్రొఫైల్ క్రికెటర్లతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ దూసుకుపోతోంది. ద్రవిడ్ మార్క్ ఈ ఏడాది ఐపీఎల్ వేలం సమయానికి ఢిల్లీ జట్టు ద్రవిడ్ తమ కోచ్ అంటూ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అప్పటికే ద్రవిడ్‌తో చర్చలు పూర్తయ్యాయి. తనతో పాటు రాజస్తాన్ రాయల్స్ జట్టుకు పని చేసిన ప్యాడీ ఆప్టన్‌ను కూడా తీసుకుని ద్రవిడ్ ‘పని’ ప్రారంభించాడు. అండర్-19 జట్టు కోచ్‌గా పని చేసిన సమయంలో యువ క్రికెటర్లను మరింత దగ్గరగా గమనించిన ద్రవిడ్... రాజస్తాన్‌లోని పాత ఆటగాళ్లలో నుంచి యువ క్రికెటర్లను తీసుకోవాలని సూచించాడు. సంజు శామ్సన్ కోసం రూ.4.2 కోట్లు ఖర్చు చేసిన ఢిల్లీ యాజమాన్యం... రిషబ్ పంత్ కోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది. పంత్‌కు అంత డబ్బెందుకనే మాట వినిపించినా... ద్రవిడ్ అడగడం వల్ల కొనేశారు. తాజాగా గుజరాత్‌పై పంత్ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ద్రవిడ్ గొప్పతనం మరోసారి తెలిసొచ్చింది. అలాగే బ్రాత్‌వైట్, మోరిస్ ఇద్దరి కోసం కలిపి ఏకంగా రూ.11.2 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఇద్దరూ విలువైన ఆటగాళ్లని నిరూపించుకున్నారు. జట్టు ఎంపికలో తన మార్క్ చూపించిన ద్రవిడ్... కుర్రాళ్లలో స్ఫూర్తి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. అందరికీ అవకాశాలు ఢిల్లీ తమ కెప్టెన్‌గా జహీర్ ఖాన్ పేరు ప్రకటించగానే చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ కెప్టెన్‌కు అనుభవం ఉండాలని భావించిన ద్రవిడ్ సూచన మేరకే ఈ నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న జహీర్... తన అనుభవాన్నంతా మైదానంలో చూపిస్తున్నాడు. ఇక తుది జట్టు విషయంలోనూ ద్రవిడ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. గతేడాది స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ నుంచి డుమిని వరకు ఎవరినైనా కూర్చోబెడుతున్నాడు. ఆటగాళ్లను రొటేషన్ పద్ధతిలో తుది జట్టులోకి తేవడం ద్వారా ప్రతి మ్యాచ్‌కూ అందరూ సన్నద్ధంగా ఉండేలా చూస్తున్నాడు. ఎవరికి అవకాశం వచ్చినా సత్తా చాటాలనే కసి ఆటగాళ్లలో పెంచాడు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకాన్ని కూడా బాగా పాటిస్తున్నారు. నిజానికి కోచ్ కొత్తగా ఆటగాళ్లకు క్రికెట్ నేర్పాల్సిన అవసరం లేదనేది ద్రవిడ్ ఆలోచన. వాళ్లలోని చిన్న చిన్న లోపాలను సరిదిద్దుతూ వారిలో స్ఫూర్తి నింపడమే కోచ్ పని అనేది ద్రవిడ్ అభిప్రాయం. ‘అండర్-19 జట్టుతో ఆడిన సమయం నుంచి ద్రవిడ్ సర్ చెప్పిన మాటలను ఆచరిస్తున్నాను. ఆటతీరును బాగా మార్చుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎదురుగా ఏ స్థాయి బౌలర్ ఉన్నా ఆడగలననే ఆత్మవిశ్వాసాన్ని ఆయన పెంచారు’ అని రిషబ్ పంత్ చెప్పిన మాటలే ద్రవిడ్ ప్రభావానికి ఉదాహరణ. పని చేసిన క్యాంప్‌లు సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ జట్టు మూడు క్యాంప్‌లు నిర్వహించింది. జట్టులోని 24 మంది ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది అందరూ వీటిలో పాల్గొన్నారు. వీటిలో మ్యాచ్‌ల గురించి, వ్యూహాల గురించి ఏ మాత్రం చర్చించలేదు. కేవలం ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కోచ్‌లు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే నెట్ ప్రాక్టీస్ సమయంలో ద్రవిడ్ పెద్దగా మాట్లాడడు. ఒకేసారి ఐదు నెట్స్‌ను గమనిస్తూ ఆప్టన్‌కు కొన్ని సూచనలు చెబుతాడు. ‘రాహుల్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తిగా, క్రికెటర్‌గా ఎదగడానికి కావలసిన వాతావరణాన్ని కల్పిస్తారు. ఏదైనా ఒక మార్పు చేసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని మనకే ఇస్తారు’ అని మోరిస్ చెప్పాడు. ఆటగాళ్లలో ఉత్సాహం సీజన్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి తర్వాత ఈ సీజన్లోనూ ఢిల్లీ రాత మారదనే మాట వినిపించింది. కానీ ఆ మ్యాచ్ తర్వాత జహీర్ ఓ మాటన్నాడు. ‘మేం ఏం చేయాలో, ఎలా ఆడాలో మాకు స్పష్టత ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓటమి మాపై ప్రభావం చూపదు. రాబోయే రోజుల్లో మీరు మా నుంచి మంచి విజయాలు చూస్తారు’ అన్నాడు. రెండో మ్యాచ్‌లో పంజాబ్‌పై ఢిల్లీ గెలుపును కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అటు పంజాబ్ కూడా అంత బలమైన జట్టేమీ కాదు కాబట్టి తేలిగ్గా తీసుకున్నారు. కానీ మూడో మ్యాచ్‌లో బెంగళూరుపై ఏకంగా 192 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఏడు వికెట్ల విజయం సాధించగానే క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటికీ వన్ మ్యాచ్ వండర్ అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ తర్వాతి మ్యాచ్‌లో ముంబైపై 164 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారు. గుజరాత్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా అమోఘంగా ఆడి విజయం అంచుల్లోకి వచ్చారు. కేవలం ఒక్క పరుగుతో ఓడిపోయారు. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కోల్‌కతా, గుజరాత్‌లపై సులభమైన విజయాలతో లీగ్‌లో నాకౌట్ బెర్త్‌కు చేరువయ్యారు. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు బాధ్యతగా ఆడటం పెద్ద సానుకూలాంశం. ప్రస్తుతం ఢిల్లీ ఆడుతున్న తీరు... మిగిలిన మ్యాచ్‌లను పరిశీలిస్తే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడం ఖాయమే. ఇక ఈ సీజన్ చివరికి ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.