రైజర్స్ బల్లే బల్లే... | Warner, Yuvraj power Hyderabad to victory | Sakshi
Sakshi News home page

రైజర్స్ బల్లే బల్లే...

Published Sun, May 15 2016 11:52 PM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

రైజర్స్ బల్లే బల్లే... - Sakshi

రైజర్స్ బల్లే బల్లే...

పంజాబ్‌పై 7 వికెట్లతో హైదరాబాద్ గెలుపు  
రాణించిన వార్నర్, యువరాజ్  
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అవుట్3

 
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘ప్లే ఆఫ్’ అవకాశాలను దాదాపు ఖాయం చేసుకుంది. వార్నర్ మరో అర్ధ సెంచరీ, దీపక్ హుడా ధాటికి తోడు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో మెరుపులు ప్రదర్శించడంతో ఆ జట్టు ఖాతాలో ఎనిమిదో విజయం చేరింది. అధికారికంగా ఇంకా ఖరారు కాకపోయినా, ఈ గెలుపుతో నాకౌట్‌కు సన్‌రైజర్స్ టీమ్ మరింత చేరువైంది. మరో వైపు హషీం ఆమ్లా దూకుడైన ప్రదర్శనతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేసినా చివర్లో చేతులెత్తేసింది. ఫలితంగా పుణే తర్వాత ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా నిష్ర్కమించిన రెండో జట్టుగా నిలిచింది.

 
 
మొహాలీ: పంజాబ్ గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ‘భాంగ్రా’ చిందులేశారు. భారీ స్కోరును అలవోకగా ఛేదించి కీలక విజయాన్ని అందుకున్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. హషీం ఆమ్లా (56 బంతుల్లో 96; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అనంతరం సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) సీజన్లో ఆరో అర్ధ సెంచరీ సాధించడం విశేషం. చాలా కాలం తర్వాత యువరాజ్ సింగ్ (24 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, దీపక్ హుడా (22 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. ఆమ్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది.


ఆమ్లా జోరు...
వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా పంజాబ్ ఆమ్లాపై నమ్మకముంచింది. దానిని నిలబెట్టుకుంటూ అతను చెలరేగాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను, నెహ్రా వేసిన రెండో ఓవర్లో మూడు ఫోర్లు బాదగా, మరోవైపు విజయ్ (6) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం ఆమ్లాకు సాహా (23 బంతుల్లో 27; 3 ఫోర్లు), గుర్‌కీరత్ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు) అండగా నిలిచారు. 30 బంతుల్లోనే ఆమ్లా తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్‌కు సాహాతో 41 బంతుల్లో 54 పరుగులు జోడించిన ఆమ్లా, మూడో వికెట్‌కు గుర్‌కీరత్‌తో 37 బంతుల్లోనే 65 పరుగులు జత చేశాడు. హెన్రిక్స్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన ఆమ్లా... ముస్తఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో మూడు బౌండరీలు కొట్టి శతకానికి చేరువయ్యాడు. అయితే చివరి ఓవర్ నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి లాంగాఫ్‌లో క్యాచ్ ఇవ్వడంతో అది సాధ్యం కాలేదు. సన్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయంతో మ్యాచ్ మధ్యలోనే నిష్ర్కమించాడు.


 సమష్టి ప్రదర్శన...
ఐపీఎల్‌లో విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచిన వార్నర్, ధావన్ (22 బంతుల్లో 25; 4 ఫోర్లు) మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. స్టొయినిస్ ఓవర్లో వార్నర్ ఫోర్, సిక్స్ కొట్టగా, మ్యాక్స్‌వెల్ వేసిన తర్వాతి ఓవర్లో ధావన్ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. తొలి వికెట్‌కు చకచకా 48 బంతుల్లో 68 పరుగులు జత చేసిన తర్వాత రెండో పరుగుకు ప్రయత్నించి మోహిత్ అద్భుత ఫీల్డింగ్‌కు ధావన్ అవుట్ కాగా, 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ హిట్‌వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో యువరాజ్, హుడా తర్వాత హిట్‌వికెట్‌గా అవుటైన మూడో సన్ బ్యాట్స్‌మన్ వార్నర్. అయితే హుడా, యువరాజ్ చెరో వైపు నుంచి చెలరేగడంతో రైజర్స్‌కు ఇబ్బంది ఎదురు కాలేదు. యువరాజ్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. హుడా అవుటైనా... యువీ, బెన్ కటింగ్ (11 బంతుల్లో 18 నాటౌట్; 2 సిక్సర్లు) 22 బంతుల్లోనే 41 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు.


స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) వార్నర్ (బి) భువనేశ్వర్ 96; విజయ్ (సి) వార్నర్ (బి) ముస్తఫిజుర్ 6; సాహా (సి) హుడా (బి) హెన్రిక్స్ 27; గుర్‌కీరత్ (బి) భువనేశ్వర్ 27; మిల్లర్ (నాటౌట్) 20; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 179.

వికెట్ల పతనం: 1-33; 2-87; 3-152; 4-173.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-2; నెహ్రా 2.5-0-35-0; ముస్తఫిజుర్ 4-0-32-1; కటింగ్ 1.1-0-11-0; కరణ్ శర్మ 4-0-26-0; హెన్రిక్స్ 3-0-29-1; యువరాజ్ 1-0-11-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (హిట్‌వికెట్) (బి) అక్షర్ పటేల్ 52; ధావన్ (రనౌట్) 25; హుడా (సి) మిల్లర్ (బి) సందీప్ 34; యువరాజ్ (నాటౌట్) 42; కటింగ్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 180.

వికెట్ల పతనం: 1-68; 2-97; 3-139.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-35-1; విజయ్ 1-0-8-0; మోహిత్ శర్మ 3.4-0-40-0; అనురీత్ సింగ్ 3-0-28-0; స్టొయినిస్ 3-0-28-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0; అక్షర్ పటేల్ 4-0-26-1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement