ఐపీఎల్ 2024 సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగించాడు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో అభిషేక్ 26 బంతుల్లో శతక్కొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు.
స్థానికంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అభిషేక్ పంటర్స్ అనే క్లబ్‌కు ప్రాతనిథ్యం వహిస్తూ.. ప్రత్యర్థి మారియో క్రికెట్ క్లబ్‌ను షేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 26 బంతులు ఎదుర్కొని 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు.
అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో అతని జట్టు పంటర్స్.. ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో జరిగిన ఫ్రెండ్‌షిప్ సిరీస్‌లో నిన్న పంటర్స్-మారియో జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో మారియో టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కృనాల్ సింగ్ (21 బంతుల్లో 60), నదీమ్ ఖాన్ (32 బంతుల్లో 74) చెలరేగడంతో మారియో టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 249 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓ ఓవర్ బౌల్ చేసిన అభిషేక్ 13 పరుగులు సమర్పించుకున్నాడు.
అనంతరం 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అభిషేక్ టీమ్ (పంటర్స్) 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బరిలోకి దిగిన అభిషేక్.. మారియో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎడాపెడా సిక్సర్లు బాది మారియో టీమ్ బౌలర్ల భరతం పట్టాడు.
ఫలితంగా పంటర్స్ టీమ్ మరో 11 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంటర్స్ తరఫున అభిషేక్‌తో పాటు పునీత్ (21 బంతుల్లో 52), లక్షయ్ (29 బంతుల్లో 44 నాటౌట్) రాణించారు.
కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన అభిషేక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యూవీ మెంటార్షిప్‌లో అభిషేక్ గత ఐపీఎల్ సీజన్‌లో అద్భుతాలు చేశాడు. గత సీజన్‌లో అభిషేక్ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో 400 పరుగులు చేసి సన్‌రైజర్స్‌ను ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment