'ధోనీ, ద్రావిడ్, కోహ్లీలను ఫాలోఅవుతా'
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, ప్రస్తుత సారథులు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ లక్షణాలు తనకు ఆదర్శమని జింబాబ్వే పర్యటనలో భారత్కు నాయకత్వం వహించనున్న యువ ఆటగాడు అజింక్యా రహానె అన్నాడు. ధోనీలోని ప్రశాంతత, కోహ్లీలోని దూకుడును నియంత్రించుకునే తత్వం, ద్రావిడ్ నిరాండబరత వంటి లక్షణాలు తనకు ఇష్టమని, వాటిని అలవరచుకుంటానని రహానె చెప్పాడు.
జింబాబ్వే పర్యటనకు రహానె సారథ్యంలో భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్తో పాటు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువకులకు అవకాశం కల్పించారు. మైదానంలో ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అతడి నాయకత్వ లక్షణాలు తనకెంతో ఇష్టమని రహానె ప్రశంసించాడు. ఇక దూకుడును ఎలా నియంత్రించుకోవాలో కోహ్లీని చూసి నేర్చుకోవాలని చెప్పాడు. ఇక రాహుల్ ఎంతో సింపుల్గా ఉంటారని కితాబిచ్చాడు. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకుని జట్టును నడిపిస్తానని రహానె చెప్పాడు.