దాదాపు ఇరవై ఏళ్ల క్రితం రెండో అండర్–19 క్రికెట్ ప్రపంచకప్... ప్రత్యక్ష ప్రసారం మాట దేవుడెరుగు... భారత ఆటగాళ్ళు కైఫ్, సెహ్వాగ్, హర్భజన్ ప్రతీ మ్యాచ్ ముగిసిన తర్వాత సాయంత్రం తమ డార్మిటరీకి దగ్గరిలోని టెలిఫోన్ బూత్‌నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కోర్లు చెప్పేవారు. దక్షిణాఫ్రికాలోని యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో టోర్నీ జరిగితే, ఆటగాళ్లకు అక్కడి క్యాంపస్‌లోనే వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. మరో రెండేళ్లకు భారత్ టైటిల్ సాధించినా... పరిస్థితి పెద్దగా మారలేదు. మన జట్టు విజయాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అంతకు పదేళ్ల క్రితం జరిగిన తొలి టోర్నీలోనైతే ఆస్ట్రేలియాలో మ్యాచ్‌కు కొన్ని నిమిషాల ముందు భారత జట్టు అక్కడే కిట్ కొనుక్కొని బరిలోకి దిగాల్సి వచ్చింది.
ఇప్పుడు... భారత యువ ఆటగాళ్ళకు సీనియర్ పురుషుల జట్టుతో సమానంగా సౌకర్యాలు, బిజినెస్ క్లాస్ ప్రయాణం, భారీ మొత్తంలో దినవారీ భత్యం...ప్రాక్టీస్ సెషన్లు, వార్మప్ మ్యాచ్‌లే కాదు, ఈ టోర్నీకి సంబంధించి అన్ని జట్ల ఆటగాళ్ల ప్రత్యేక ప్రమోషనల్ షూట్‌లు, జ్ఞాపికలపై సంతకాలు చేయడం...ఇదంతా ఐసీసీ మార్కెటింగ్ ప్రచారం. పాల్గొంటున్న పదహారు జట్ల ఆటగాళ్ల హాజరీతో భారీగా ఆరంభోత్సవ కార్యక్రమం. ఇక మ్యాచ్‌లు 200లకు పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. టి20 లీగ్‌లు వచ్చాక ప్రపంచమంతా కూడా యువ ఆటగాళ్లపై, వారి ప్రదర్శనపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో రెండేళ్లకు ఒకసారి ఆసక్తి రేపుతున్న అండర్–19 వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. న్యూజిలాండ్‌లో జరిగే ఈ సంబరానికి రేపటి నుంచి తెర లేస్తోంది.
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): అంతర్జాతీయ స్థాయిలో కుర్రాళ్లు సత్తా చాటేందుకు సరైన వేదికలాంటి అండర్–19 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఇక్కడి బే ఓవల్ మైదానంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో ఆతిథ్య జట్టు న్యూజిలాండ్ తలపడుతుంది. ఫైనల్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ప్రస్తుతం జరగబోతోంది 12వ వరల్డ్ కప్ కాగా... గత టోర్నీల్లో పాల్గొని ఆ తర్వాత సీనియర్ స్థాయికి ఎదిగిన ఆటగాళ్లు వివిధ జట్లలో అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రతిభను నిరూపించుకొని ప్రమోట్ అయ్యేందుకు యువ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు. భారత్, ఆస్ట్రేలియా గతంలో మూడు సార్లు అండర్–19 ప్రపంచ కప్ గెలుచుకోగా...పాకిస్తాన్ రెండు సార్లు, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి.
వీరంతా అక్కడినుంచే...
అండర్–19 ప్రపంచకప్‌లో తమ ఆటతో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత సీనియర్ క్రికెట్‌లో కూడా తమదైన ముద్ర చూపించిన ఆటగాళ్లు అన్ని జట్లలోనూ ఉన్నారు. ఇందులో అగ్రస్థానం మాత్రం మన కెప్టెన్ విరాట్ కోహ్లికే దక్కుతుంది. 2008లో తన నాయకత్వంలోనే భారత్‌ను విజేతగా నిలిపిన కోహ్లికి ఆ తర్వాత ఎదురు లేకుండా పోయింది. అదే ఏడాది సీనియర్ జట్టులో తనకు లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న అతను... ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా, నాయకుడిగా ఎదిగాడు. ఈ జాబితాలో యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, మనీశ్ పాండే, విలియమ్సన్, ఆమ్లా, డి కాక్, రబడ, అంబటి రాయుడు, వేణుగోపాలరావు తదితరులున్నారు.
జట్ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: న్యూజిలాండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, కెన్యా
గ్రూప్ ‘బి’: భారత్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, పపువా న్యూగినియా
గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, బంగ్లాదేశ్, నమీబియా, కెనడా
గ్రూప్ ‘డి’: పాకిస్తాన్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్ఘానిస్తాన్
భారత్ లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్
జనవరి 14న ఆస్ట్రేలియాతో (ఉ.గం. 5.30నుంచి)
జనవరి 16న పపువా న్యూ గినియాతో (ఉ.గం. 6.30)
జనవరి 19న జింబాబ్వేతో (ఉ.గం. 6.30నుంచి)
2012
1988లో యూత్ వరల్డ్ కప్ పేరుతో తొలి టోర్నీ జరిగింది. ఆ తర్వాత అండర్–19 ప్రపంచకప్‌ను మళ్లీ నిర్వహించేందుకు పదేళ్లు పట్టింది. 1998నుంచి దీనిని ఐసీసీ అండర్–19 వరల్డ్‌కప్‌గా వ్యవహరిస్తున్నారు.
మన సైన్యమిదే...
దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటికే సంచలన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా నేతృత్వంలో భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. కోచ్‌గా భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని కుర్రాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఇటీవల ఇదే జట్టు ఆసియా కప్‌లాంటి టోర్నీలలో వరుస విజయాలు సాధించి ఊపు మీదుంది.
జట్టు వివరాలు: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఆర్యన్ జూయల్, అభిషేక్ శర్మ, అర్‡్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జోత్ కల్రా, కమలేశ్ నాగర్‌కోటి, పంకజ్ యాదవ్, రియాన్ పరాగ్, ఇషాన్ పొరెల్, హిమాన్షు రాణా, అనుకూల్ రాయ్, శివమ్ మావి, శివసింగ్
Comments
Please login to add a commentAdd a comment