కుర్రాళ్ల ఆశలు ఆవిరి
* తొలిసారి చాంపియన్‌గా విండీస్
* ఫైనల్లో ఓడిన భారత్
* అండర్-19 ప్రపంచకప్
మిర్‌పూర్: నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన యువ భారత్‌కు నిరాశే ఎదురైంది. టోర్నీ అంతటా అత్యంత నిలకడను ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తూ వచ్చిన జట్టుకు ఫైనల్లో వెస్టిండీస్ షాక్‌నిచ్చింది.
ఆదివారం షేరే బంగ్లా జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కాపాకుడునేందుకు కుర్రాళ్లు చివరి ఓవర్ వరకూ ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. అటు తీవ్ర ఒత్తిడిని జయిస్తూ కీసి కార్టీ (125 బంతుల్లో 52 నాటౌట్; 2 ఫోర్లు), కీమో పాల్ (68 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) అద్భుత ప్రదర్శనతో.... ఐదు వికెట్ల తేడాతో నెగ్గిన వెస్టిండీస్ ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా చాంపియన్‌గా నిలించింది.
పేసర్ల ధాటికి విలవిల
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేసింది. సర్ఫరాజ్ (51; 5 ఫోర్లు; 1 సిక్స్) తన అద్భుత ఫామ్‌ను మరోసారి చూపగా మిగతా అంతా విఫలమయ్యారు. పిచ్ పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న పేసర్లు జోసెఫ్ (3/39), రియాన్ జాన్ (3/38) చక్కటి బౌన్స్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. దీంతో 50 పరుగులకే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
చివర్లో బాథమ్ (21; 3 ఫోర్లు), లొమ్రోర్ (19; 2 ఫోర్లు) పోరాడడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ 49.3 ఓవర్లలో 146 పరుగులు చేసి నెగ్గింది. అయితే భారత బౌలర్లు పట్టుదల ప్రదర్శించడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ కార్టీ, పాల్ జోడి మరో వికెట్ పడకుండా సమయోచిత ఆటతీరుతో మరో మూడు బంతులు మిగిలి ఉండగా జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. పాల్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రిషబ్ (స్టంప్డ్) ఇమ్లాచ్ (బి) జోసెఫ్ 1; ఇషాన్ ఎల్బీడబ్ల్యు (బి) జోసెఫ్ 4; అన్‌మోల్ (సి) ఇమ్లాచ్ (బి) జోసెఫ్ 3; సుందర్ (సి) జోసెఫ్ (బి) జాన్ 7; సర్ఫరాజ్ ఎల్బీడబ్ల్యు (బి) జాన్ 51; అర్మాన్ (సి) పాల్ (బి) స్ప్రింజర్ 5; లొమ్రోర్ (సి) ఇమ్లాచ్ (బి) హోల్డర్ 19; దాగర్ (సి) కార్టీ (బి) జాన్ 8; బాథమ్ (సి) ఇమ్లాచ్ (బి) పాల్ 21; అవేశ్ (సి) జా న్ (బి) పాల్ 1; అహ్మద్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (45.1 ఓవర్లలో ఆలౌట్) 145.
వికెట్ల పతనం: 1-3, 2-8, 3-27, 4-41, 5-50, 6-87, 7-116, 8-120, 9-123, 10-145.
బౌలింగ్: జోసెఫ్ 10-0-39-3; హోల్డర్ 10-2-20-1; జాన్ 10-0-38-3; స్ప్రింజర్ 9-1-24-1; పాల్ 6.1-0-17-2.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: పోప్ (సి) అహ్మద్ (బి) అవేశ్ 3; ఇమ్లాచ్ (సి) లొమ్రోర్ (బి) అహ్మద్ 15; హెట్‌మైర్ (సి) అర్మాన్ (బి) దాగర్ 23; కార్టీ నాటౌట్ 52; స్ప్రింజర్ (సి) అర్మాన్ (బి) దాగర్ 3; గూలీ (సి అండ్ బి) దాగర్ 3; పాల్ నాటౌట్ 40; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఐదు వికెట్లకు) 146.
వికెట్ల పతనం:1-5, 2-28, 3-67, 4-71, 5-77.
బౌలింగ్: అవేశ్ 10-1-29-1; అహ్మద్ 9.3-2-32-1; సుందర్ 9-1-18-0; బాథమ్ 3-0-12-0; లొమ్రోర్ 8-0-29-0; దాగర్ 10-1-25-3.