యువ భారత్కు షాక్:విండీస్దే కప్
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో యువ భారత్కు షాక్ తగిలింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తుదిపోరులో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలై రన్నరప్గా సరిపెట్టుకుంది. భారత్ విసిరిన 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన విండీస్ ఇంకా మూడు బంతులుండగా విజయం సాధించి తొలిసారి కప్ను దక్కించుకుంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు గిడ్రాన్ పోప్(3), ఇమ్లాక్(15) పెవిలియన్కు చేరారు. అనంతరం హేట్మైర్(23),స్పింగర్(3), గూలీ(3) కూడా అవుట్ కావడంతో విండీస్ 77 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ పై భారత్ పట్టు సాధించినట్లు కనబడింది.
కాగా, ఆ తరుణంలో కార్టీ(52నాటౌట్), కీమో పాల్(40) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో విండీస్ 49.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుని వరల్డ్ కప్ను అందుకుంది. దీంతో నాల్గో సారి కప్ను దక్కించుకుందామనుకున్న భారత్కు నిరాశే ఎదురైంది. 2000, 08, 12 సంవత్సరాల్లో వరల్డ్ కప్ ను గెలుచుకుని రికార్డు టైటిల్ పై కన్నేసిన యువ భారత్ పేలవ ప్రదర్శన కారణంగా పరాజయం పాలైంది. ఈ టోర్నీలో భారత్ కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. కాగా, అండర్ 19 వరల్డ్ కప్ లో రెండోసారి ఫైనల్ కు చేరిన విండీస్ అందరీ అంచాలను తల్లక్రిందులు చేసి తమలోని ప్రతిభకు కొదవలేదని నిరూపించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటయ్యింది. భారత ఆటగాళ్లలో సర్పరాజ్ ఖాన్(51), బాథమ్(21), లామ్రోర్(19) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోరును దాటలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో భారత స్వల్ప స్కోరుకే పరిమితమైంది. విండీస్ బౌలర్లలో జోసఫ్, జాన్లకు తలో మూడు వికెట్లు సాధించగా, కీమో పాల్కు రెండు వికెట్లు లభించాయి.