ఫైనల్లో భారత్ తక్కువ స్కోరు
మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన భారత బ్యాట్స్మెన్ అసలైన ఫైనల్ సమరంలో బోల్తాపడ్డారు. టాపార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (51) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయడం మినహా ఇతర ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. వెస్టిండీస్తో ఆదివారం జరుగుతున్న ఫైనల్ పోరులో భారత్ 146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్కు తోడు మహిపాల్ లోమ్రోర్ 19, రాహుల్ బాథమ్ 21 పరుగులు చేయడం మినహా ఇతర బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లు జోసెఫ్, రియాన్ జాన్ చెరో మూడు వికెట్లు, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రిషబ్ పంత్ (1) తొలి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆ వెంటనే అన్మోల్ప్రీత్ సింగ్ (3) పెవిలియన్ చేరడంతో భారత్ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ ఇషాన్ కిషన్ (4)తో పాటు వాషింగ్టన్ సుందర్ (7), ఆర్మన్ జాఫర్ (5) తక్కువ పరుగులకే అవుటవడంతో భారత్ కోలుకోలేకపోయింది. 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ 100 పరుగుల లోపే పోరాటం ముగుస్తుందనిపించింది. అయితే సర్ఫరాజ్ ఒంటరి పోరాటం చేసి జట్టును ఆదుకున్నాడు. అతనికి లోమ్రోర్ కాసేపు అండగా నిలిచాడు. కాగా హాఫ్ సెంచరీ చేసిన వెంటనే సర్ఫరాజ్ అవుటయ్యాక, భారత ఇన్నింగ్స్ ఎక్కువసేపు సాగలేదు. చివర్లో రాహుల్ కాసేపు పోరాడాడు.