ఫైనల్లో ఆశలు రేకెత్తించిన డాగర్
మీర్పూర్: అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ సమరం ఆసక్తికరంగా మారింది. భారత్ తక్కువ స్కోరుకే ఆలౌటయినా బౌలర్ మయాంక్ డాగర్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. భారత్ నిర్దేశించిన 146 పరుగుల కష్టసాధ్యంకాని లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ 30 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. విండీస్ విజయానికి మరో 66 పరుగులు చేయాలి.
లక్ష్యసాధనను విండీస్ జోరుగా కొనసాగించింది. ఓ దశలో విండీస్ స్కోరు 67/2. దీంతో భారత్ విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ సమయంలో భారత బౌలర్ మయాంక్ డాగర్ చెలరేగాడు. డాగర్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 45.1 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (51)కు తోడు మహిపాల్ లోమ్రోర్ 19, రాహుల్ బాథమ్ 21 పరుగులు చేయడం మినహా ఇతర భారత బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ దాటలేకపోయారు. వెస్టిండీస్ బౌలర్లు జోసెఫ్, రియాన్ జాన్ చెరో మూడు వికెట్లు, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టారు.