మిస్ యు లీడర్ | miss u leader | Sakshi
Sakshi News home page

మిస్ యు లీడర్

Published Tue, Oct 8 2013 12:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

మిస్ యు లీడర్

మిస్ యు లీడర్

 ‘పిల్లల స్కూల్‌కు వెళ్లి వాళ్ల చదువు గురించి టీచర్స్‌తో మాట్లాడటం... సూపర్ మార్కెట్‌కు వెళ్లి సరుకులు కొనడం... ఇవన్నీ కొత్తగా, కాస్త కష్టంగా కూడా ఉన్నాయి’... ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత ద్రవిడ్ వ్యాఖ్యలు ఇవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్టే లోకంగా బతికిన వ్యక్తి రిటైర్ అయిన తర్వాత జీవితానికి అలవాటు పడటానికి సమయం పడుతుంది. భారత దిగ్గజాలకు మాత్రం ఐపీఎల్ వల్ల రిటైర్‌మెంట్ తర్వాత కూడా కొంతకాలం క్రికెట్ ఆడే అవకాశం లభించింది. ద్రవిడ్ లాంటి దిగ్గజం ఆటను మరో ఏడాదిన్నర పాటు చూసే అవకాశం అభిమానులకు లభించింది. చాంపియన్స్ లీగ్‌తో ద్రవిడ్ పూర్తిస్థాయిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
 
 అయితే ఆటతో అతడి అనుబంధం మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికే టీవీ కామెంటేటర్‌గా మంచిపేరు తెచ్చుకున్నాడు. ద్రవిడ్ లాంటి క్రికెట్ మేధావి సేవలను ఉపయోగించుకోవడానికి బ్రాడ్‌కాస్టర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక రూపంలో ద్రవిడ్ సేవలను ఉపయోగించుకుంటామని రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ప్రకటించింది. అతడిని మెంటర్‌గా నియమించుకునేందుకు దాదాపు అన్ని ఐపీఎల్ జట్లూ ఆసక్తి చూపుతాయి. కాబట్టి మరికొంత కాలం ద్రవిడ్ అభిమానులకు కనిపిస్తూనే ఉంటాడు.
 
 క్రికెట్‌లో ఎంతో మంది ఆటగాళ్లూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రలో ఎప్పటికీ మిగిలే ఆటగాళ్లు కొందరే ఉంటారు. ఏ ఫార్మాట్‌లో అయినా ద్రవిడ్ ‘జట్టు’ కోసం ఆడాడు. గత రెండు దశాబ్దాల్లో మిస్టర్ డిపెండబుల్ తరహాలో ఓపికగా టెస్టులు ఆడిన క్రికెటర్ మరొకరు లేరు. సహచరులంతా బ్యాటింగ్ చేయడానికి బెంబేలెత్తే పిచ్‌పై ‘వాల్’ గంటల కొద్దీ ఆడతాడు. 2003లో ఆస్ట్రేలియాపై రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 835 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌పై ఒకే టెస్టులో 12 గంటలకు పైగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటి క్రికెటర్లలో ఇంత సహనం, ఓపిక ఉండేవారు అరుదు. ఈ రెండు లక్షణాలతో పాటు టెక్నిక్ కూడా ద్రవిడ్ సొంతం. కేవలం టెక్నిక్ కారణంగానే ఉపఖండం ఆవల కూడా ద్రవిడ్ భారత బ్యాటింగ్ లైనప్‌కు వెన్నెముకలా నిలబడ్డాడు. ఇలా ద్రవిడ్ ఆట గురించి మూడు రోజుల పాటైనా చెప్పొచ్చు.
 రిటైర్‌మెంట్ ముందు ద్రవిడ్ తనలోని నాయకుడిని ప్రపంచానికి చూపించి వెళ్లాడు. గతంలో భారత కెప్టెన్‌గా ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ సహా పలు విజయాలు అందించినా... ద్రవిడ్ సారథ్యం గురించి ఎక్కడా పెద్దగా వినిపించలేదు. అయితే ఈ సీజన్ ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ ద్వారా నిజమైన నాయకుడు ఎలా ఉంటాడో చూపించాడు.
 
 స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సహచర క్రికెటర్లు, బెట్టింగ్ వివాదంలో జట్టు యజమాని... అందుబాటులో లేని క్రికెటర్లు... ఇలా రాయల్స్‌కు వచ్చినన్ని సమస్యలు ఏ జట్టుకూ రాలేదు. ఇలాంటి క్లిష్ట స్థితిలో ద్రవిడ్‌లోని అసలైన లీడర్ బయటకు వచ్చాడు. ఐపీఎల్‌లో మూడో స్థానంతో జట్టును చాంపియన్స్ లీగ్‌కు చేర్చాడు. ఈ మెగా టి20 టోర్నీలోనూ ైఫైనల్‌కు చేర్చాడు. జట్టు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చెప్పడానికి చాంపియన్స్ లీగ్ ఫైనల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ రావడమే నిదర్శనం. రాజస్థాన్ జట్టులోని ఏ ఆటగాడిని కదిలించినా... తమ విజయరహస్యానికి ద్రవిడ్ నాయకత్వమే కారణమని చెబుతాడు. మొత్తానికి ఇక రాహుల్ ద్రవిడ్ ఆటను చూడలేకపోవడం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరికీ పెద్ద లోటే.
 - సాక్షి క్రీడా విభాగం
 
 ‘టెస్టు క్రికెట్ నుంచి రిటైరైనప్పుడు ఇప్పటికంటే ఎక్కువ భావోద్వేగానికి లోనయ్యా. ఇకపై రోజూ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు. ప్రస్తుతానికైతే నాకు సెలవు కావాలి. నా సెకండ్ ఇన్నింగ్స్ ఏమిటనేది ఇంకా ప్లాన్ చేయలేదు’
 - ద్రవిడ్
 
 క్రికెట్ పేదదయింది: గంభీర్
 న్యూఢిల్లీ: రాహుల్ ద్రవిడ్ లేకపోతే భారత్‌లో క్రికెట్ పేదదవుతుందని ఓపెనర్ గంభీర్ ట్వీట్ చేశాడు. ‘రాహుల్ భాయ్‌కు అభినందనలు. భారత క్రికెట్‌కు నీవందించిన సేవలకు కృతజ్ఞతలు. నీవు లేకపోతే ఈ దేశ క్రికెట్ పేదదవుతుంది’ అని గౌతం గంభీర్‌తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘నా జీవితంలో ఇంత తెలివైన క్రికెటర్‌ని చూడలేదు’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. మరోవైపు సచిన్‌పై కూడా ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘టి20లో కొట్టిన చివరి స్కోరింగ్ షాట్.. సచిన్ నుంచి నేను చూసిన అత్యుత్తమాల్లో ఒకటి’ అని విండీస్ గ్రేట్ బ్రియాన్ లారా ట్వీట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement