ద్రవిడ్ శిక్షణలో రాటుదేలుతా: బిల్లింగ్స్
పుణే: భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ శిక్షణలో తన బ్యాటింగ్ మరింత మెరుగవుతుందని ఇంగ్లండ్ కీపర్, బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు. గత సీజన్ నుంచి బిల్లింగ్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత ఐపీఎల్‌లో ఆడటం వల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకున్నానన్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం, ఒత్తిడిలో ఆడటం మెరుగైనట్లు బిల్లింగ్స్ పేర్కొన్నాడు. ఢిల్లీ మెంటర్ రాహుల్ ద్రవిడ్, కోచ్ ప్యాడి ఆప్టన్ నేతృత్వంలో ఆడటం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు బిల్లింగ్స్ తెలిపాడు. వారిచ్చే సూచనలు తన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నాడు. వారి అనుభవాలు పంచుకోవడం, సలహాలు ఇవ్వడంతో బ్యాటింగ్‌లో రాటుదేలుతానని బిల్లింగ్స్ అభిప్రాయపడ్డాడు.
ఢిల్లీ మంచి నైపుణ్య ఆటగాళ్లు ఉన్న జట్టు అని , కానీ తొలి మ్యాచ్ బెంగళూరుపై ఓడిపోవడం నిరాశకు గురిచేసిందన్నాడు. ఇది మాకు నిజంగా ఊహించలేని ఫలితమని, జరగబోయే మ్యాచ్‌లపై దృష్టిసారించమని బిల్లింగ్స్ తెలిపాడు. ఐపీఎల్‌లో ప్రతి జట్టు బలమైనదే అని, ప్రతి జట్టులో హిట్టర్లు, స్పిన్నర్లున్నారని చెప్పాడు. కాకపోతే వారి బలాలను ప్రదర్శించినపుడే ఫలితం ఉంటందన్నాడు. ఢిల్లీలో కేవలం పేస్ బౌలింగ్ కాకుండా మంచి స్పిన్నర్లు జయంత్ యాదవ్, నదీమ్‌లు ఉన్నారని బిల్లింగ్స్ వ్యాఖ్యానించాడు.