![MultiCrore Fake Billing Racket Busted, Tax Officials Seize Stacks Of Cash - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/27/fake%20billing%20scam.jpg.webp?itok=OAl_wCnx)
సాక్షి, న్యూఢిల్లీ : కోట్ల రూపాయల విలువైన నకిలీ బిల్లింగ్ రాకెట్‌ను ఆదాయపు పన్ను శాఖ ఛేదించింది. ఈ మేరకు ఆదాయ పన్నుశాఖ సోమవారం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, గోవా, హర్యానా, పంజాబ్ తదితర 42 ప్రాంతాల్లో ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నగదు, విలువైన ఆభరణాలను సీజ్ చేశారు. నకిలీ కంపెనీల ద్వారా ఈ నగదును దారి మళ్లిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు.
నకిలీ బిల్లింగ్ రాకెట్‌లో 500 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని ప్రత్యక్ష పన్నుల బోర్డు ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్) ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎంట్రీలతోపాటు, ఇతర ఆధారాలున్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అక్రమాలకు పాల్పడుతున్న ఎంట్రీ ఆపరేటర్లు, మధ్యవర్తులు, నగదు నిర్వహణదారులు, లబ్ధిదారులతో కూడిన నెట్‌వర్క్‌ను గుర్తించినట్టు సీబీడీటీ అధికారులు తెలిపారు. తాజా దాడుల్లో రూ .2.37 కోట్ల నగదు, 2.89 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. దీంతోపాటు 17 బ్యాంక్ లాకర్లను కూగా గుర్తించినట్టు చెప్పారు. బీరువాల్లోదాచి పెట్టిన కట్టల కొద్దీ నగదును అధికారులు స్వాధీనం చేసుకోగా ఇందులో ఒక కట్టలో 180 బండిల్స్, 9 కోట్లు అని రాసి ఉండటం గమనార్హం.
కాగా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై, షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ఇందులో తమ వ్యక్తిగత సిబ్బందినే భాగస్వాములుగా, డమ్మీ డైరెక్టర్లుగా నియమించుకుని అక్రమాలకు తెరతీసారని తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment