రాంచీ: జార్ఖండ్‌లోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు నిర్వహించింది ఆదాయ పన్ను శాఖ. లెక్కల్లో చూపని సుమారు రూ.100 కోట్ల లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించి సీజ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు, ఇనుప గనుల వ్యాపారాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు వారి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను గత వారం రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ.
ఈ మేరకు దాడులకు సంబంధించి మంగళవారం ఓ ప్రకటన చేసింది సీబీడీటీ. ‘నవంబర్ 4న ప్రారంభించి ఇప్పటి వరకు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. అందులో రాంచీ, గొడ్డా, బెర్మో, దుమ్కా, జంషెడ్‌పూర్, ఛాయ్‌బాసా, బిహార్‌లోని పాట్నా, హరియాణాలోని గురుగ్రామ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా ప్రాంతాలు ఉన్నాయి. దాడులు నిర్వహించిన ఎమ్మెల్యేలు కుమార్ జైమంగళ్ అలియాస్ అనుప్ సింగ్, ప్రదీప్ యాదవ్.’ అని సీబీడీటీ తన ప్రకటనలో తెలిపింది. బొగ్గు క్రయవిక్రయాల్లో ఉన్న పలు వ్యాపార సంస్థలపై ఈసోదాలు నిర్వహించామని వెల్లడించింది. రు.2కోట్ల నగదు, రూ.100 కోట్లకుపైగా లెక్కల్లో చూపని లావాదేవీలు, పెట్టుబడులను గుర్తించినట్లు తెలిపింది సీబీడీటీ.
బెర్మో నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే జైమంగళ్ ఈవిషయంపై రాంచీలో విలేకరులతో మాట్లాడారు. ఐటీ దాడులు జరిగినట్లు వెల్లడించారు. ఐటీ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు.. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎంతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఇటీవలే బొగ్గు కుంభకోణానికి సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయగా.. ఇప్పుడు అధికార కూటమి నేతలపై ఐటీ దాడులు జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: ఒక్కసారిగా రంగు మారిన సియాంగ్ నది.. చైనానే కారణం?
Comments
Please login to add a commentAdd a comment