దూకుడు తగ్గించాల్సిన అవసరం లేదు!
►ఆటగాళ్లకు తమ గురించి బాగా తెలుసు
►భారత కోచ్ కుంబ్లే వ్యాఖ్య
రాంచీ: మైదానంలో సహజసిద్ధమైన దూకుడు ప్రదర్శించే భారత ఆటగాళ్లను తాను నిరోధించే ప్రయత్నం చేయనని జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. అలాంటి అవసరం కూడా లేదని ఆయన అన్నారు. ‘ఆటగాళ్ల నుంచి మేం ఏం ఆశిస్తున్నామో వారు అలాంటి ప్రదర్శన ఇస్తున్నంత కాలం వారిలోని సహజమైన దూకుడును తగ్గించాలని నేను కోరుకోను. ప్రతీ ఆటగాడికి తనకంటూ కొన్ని అలవాట్లు, శైలి ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఎక్కువగా ఆలోచించడం కూడా అనవసరం. అయినా ఇప్పుడు సిరీస్ 1–1తో సమంగా ఉంది. ఇరు జట్లు తమదైన శైలిలో పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. కాబట్టి కాస్త దూకుడు ప్రదర్శించడంలో తప్పు లేదు’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
డ్రెస్సింగ్‌రూమ్ రివ్యూ వివాదం విషయంలో భారత్ తమ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయంగా కుంబ్లే అభివర్ణించారు. ‘బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పరిణతితో కూడుకుంది. ఆటకు సంరక్షకులుగా ఇరు జట్ల బోర్డులు కూడా క్రికెట్‌పైనే దృష్టి పెట్టడం ముఖ్యమని భావించాయి. ఆటగాళ్లకు కూడా తమ బాధ్యతలు ఏమిటో బాగా తెలుసు’ అని ‘జంబో’ చెప్పారు. డీఆర్‌ఎస్ వివాదం తమ ఆటపై ఎలాంటి ప్రభావం చూపించదన్న కుంబ్లే... మూడో టెస్టుకు ముందు కోహ్లి, స్మిత్ కూర్చొని పలు అంశాలు చర్చిస్తారనే విషయాన్ని నిర్ధారించారు. మరోవైపు తనకు డైరెక్టర్ పదవి, ద్రవిడ్‌ను కోచ్‌గా ఎంపిక చేస్తారంటూ వచ్చిన వార్తలను తాను కూడా మీడియాలోనే చూశానని, తన వద్దకు అసలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కుంబ్లే వివరణ ఇచ్చారు.