న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మైదానంలోనే కాదు... బీసీసీఐ వార్షిక అవార్డుల్లోనూ దుమ్మురేపాడు. గత రెండు సీజన్లకు అతనే ‘బెస్ట్ క్రికెటర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. 2016–17, 2017–18 సీజన్లకు సంబంధించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మహిళల కేటగిరీలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా హర్మన్‌ప్రీత్ కౌర్ (2016–17), స్మృతి మంధాన (2017–18) లాలా అమర్‌నాథ్ అవార్డులకు ఎంపికయ్యారు. అఫ్గానిస్తాన్‌తో చారిత్రక టెస్టుకు రెండు రోజుల ముందు ఈ నెల 12న బెంగళూరులో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. 2016–17 సీజన్‌లో కోహ్లి 13 టెస్టులాడి 74 సగటుతో 1332 పరుగులు చేశాడు.
27 వన్డేల్లో 84.22 సగటుతో 1516 పరుగులు సాధించాడు. తదుపరి సీజన్‌లో ఆరు టెస్టుల్లోనే 896 పరుగులతో 89.6 సగటు నమోదు చేశాడు. వన్డేల్లో 75.50 సగటుతో రెచ్చిపోయాడు. ఈ అవార్డు కింద అతనికి రూ. 15 లక్షల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.30 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కనుంది. హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్‌వర్మ బీసీసీఐ అవార్డుల జాబితాలో నిలిచాడు. 2016–17లో జరిగిన విజయ్ మర్చంట్ అండర్–16 టోర్నీలో అత్యధిక పరుగులు (8 మ్యాచ్‌లలో 96 సగటుతో 5 సెంచరీలు సహా 960 పరుగులు) చేసిన తిలక్... జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ (అండర్–16 కేటగిరీ)కి ఎంపికయ్యాడు. సీఓఏ కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ 2016–17 సీజన్‌లో జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికవగా... ప్రస్తుతమున్న హోదా వల్ల ఆమె ఆ అవార్డును తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment