
ఉమ్రేదరాజ్ మాంగ్‌కర్ లాయాథా చార్‌దిన్
దో ఆర్జూమే కట్‌గయే, దో ఇంతెజార్‌మే
‘జీవిత పర్యంతం అల్లాహ్‌ని వేడుకొని నాలుగు రోజుల ఆయుష్షు అదనంగా సంపాదించుకున్నాను. కోర్కెలు కోరడంలో రెండు రోజులు గడిచిపోయాయి. ఆ కోర్కెలు తీరడం కోసం ఎదురుచూడటంలో మిగిలిన రెండు రోజులూ జరిగిపోయాయి,’అంటూ వాపోయాడు జఫర్. మొఘల్ సామ్రాజ్యం ఆఖరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ రంగూన్ జైలులో బందీగా ఉన్న సమయంలో ‘లగ్తానహీ దిల్‌మేరా, ఉజ్దే దయార్‌మే’(నరసంచారంలేని ఈ శూన్య ప్రదేశంలో నా మనస్సు నిలవడం లేదు) అని నిర్వేదం వెలిబుచ్చుతూ రాసుకున్న కవితలోనివి పైన పేర్కొన్న రెండు పంక్తులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితికి అవి అద్దం పడతాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగేళ్ళలో సాధిం చింది చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడానికి కారణం ఏమిటి? ఎంత అసమర్థ ప్రభువైనా ఎన్నో కొన్ని మంచిపనులు చేస్తాడు. ‘అసాధారణ నేత’గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఇంత విలువైన కాలం ఎందుకు వృథా చేశారు? బీజేపీతో నాలుగేళ్ళ చెలిమి రవ్వంత మేలు చేయలేదు. ఎందుకని? తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన చంద్రబాబు కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులు సమకూర్చగలుగుతారనే విశ్వాసంతో 2014లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌లో, మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే పరస్పరం సహకరించుకుంటాయనీ, అభివృద్ధి పనులు నల్లేరు మీద బండిలాగా చరచరా జరిగిపోతాయని కూడా ఆశించారు. నిజానికి, చంద్రబాబు నేలమీద నడిస్తే, ఆచరణ సాధ్యమైన ప్రతిపాదనలు చేస్తే, సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే, అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అందరినీ సంప్రదించి అడుగులు వేసి ఉంటే రాజధాని సహా కొత్త రాష్ట్రానికి అవసరమైన హంగులలో అత్యధికం ఈ పాటికి సమకూరి ఉండేవి. లోగడ ముఖ్యమంత్రులు ప్రతిపక్షాలను సంప్రతించేవారు. మీడియా అనుభవజ్ఞులతో మాట్లాడేవారు. కానీ, తాను ‘అసాధారణ’ ప్రజ్ఞాశాలిననీ, అద్భుతమైన మేధావిననీ, శూన్యంలో నుంచి రాజప్రాసాదాలను సృష్టించే తెలివితేటలు తన సొంతమనీ భావించారు. చర్వితచర్వణమే అయినప్పటికీ చెప్పక తప్పదు. రాజ ధానికి అనువైన ప్రాంతం ఏదో సూచించేందుకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో కానీ మంత్రివర్గ సమావేశంలో కానీ అఖిలపక్ష సభలో కానీ చర్చించకుండానే బుట్టదాఖలు చేశారు. తన బుర్రలో ఉన్న ఆలోచనలనే నివేదిక రూపంలో సమర్పించేందుకు అసమదీయులతో తన సొంత కమిటీ ఒకటి నియమించారు. కృష్ణ, గుంటూరు జిల్లాల పరిధిలో (శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ వద్దన్నదో అక్కడే) రాజధాని నిర్మాణం జరగాలని నిర్ణయించారు.
సలహాలు పెడచెవిన
ఐటీ రంగ ప్రముఖుడు త్రిపురనేని హనుమాన్ చౌదరి ఈ సందర్భంగా ఒక సూచన చేశారు. రాజధాని నిర్మాణం అంటే ఏమిటి? శాసనసభ, మండలి నిర్వహణకు తగిన భవనాలూ, సచివాలయానికీ, హైకోర్టుకూ కావలసిన భవన సముదాయం, ముఖ్యమంత్రికీ, మంత్రులకూ, శాసనసభ్యులకూ, ఉన్నతాధికారులకూ నివాస భవనాలూ ఉంటే సరిపోతుంది. తక్కిన నగరంలో రోడ్లు, విద్యుత్తు, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తే నగరం తనంతట తానే అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో మహానగరాలన్నీ విస్తరించింది ఆ విధంగానే. రాజధాని పేరుమీద 5,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక పెద్ద నిర్మాణ సంస్థకు అప్పగిస్తే, రాజధానికి అవసరమైన భవనాలను 2,500 ఎకరాల విస్తీర్ణంలో ఒకటి లేదా రెండు సంవత్సరాల వ్యవధిలో నిర్మించి ఇస్తుందనీ, తక్కిన 2,500 ఎకరాలతో ఆ సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుందనీ, ప్రభుత్వం నుంచి నయాపైసా ఆశించదనీ హనుమాన్ చౌదరి ప్రతిపాదన. సాధారణ ముఖ్యమంత్రి అయితే ఈ సలహాను పాటించేవారు. ఈ సరికి రాజధానికి కావలసిన భవనాలన్నీ (పక్కాభవనాలు. తాత్కాలికభవనాలు కాదు) సిద్ధమయ్యేవి.
చంద్రబాబు సాధారణ ముఖ్యమంత్రి కాదు. కనుక ఆయనకు సాధారణ రాజధాని పనికిరాదు. ఢిల్లీని మించిన ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని సంకల్పించారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చి వారి భూములను పూలింగ్ పేరిట 30 వేల ఎకరాలకు పైగా సేకరించారు. తాజ్‌మహల్, చార్‌మీనార్, కుతుబ్ మీనార్ వంటి అద్భుతమైన కట్టడాలు నిర్మించిన వాస్తుశిల్పుల వారసులు మన దేశంలో ఉన్నారు. భాక్రానంగల్, నాగార్జునసాగర్, నర్మదా డ్యాం వంటి మెగా ప్రాజెక్టులను నిర్మించిన ఇంజనీర్లకు కొదవ లేదు. అయినా సరే. సింగపూర్ సహకారంతో రాజధాని నిర్మించాలని చంద్రబాబు తాపత్రయం. అందుకోసం కొత్త కంపెనీలు పెట్టించీ, సరికొత్త నిబంధనలు సృష్టించీ, అడ్డగోలు ఒప్పం దాలు కుదుర్చుకొనీ పడరాని పాట్లు పడుతూ, ప్రైవేటు విమానంలో ప్రపంచం అంతటా చక్కర్లు కొడుతూ రాష్ట్రం కోసం చెమటోడ్చుతున్నానంటూ, తెగ కష్టపడుతున్నానంటూ బాధపడిపోతున్నారు. ఆయనకు హితవు చెప్పే సాహసం కలిగినవారు ఆంధ్రప్రదేశ్‌లో ఎవ్వరూ లేరు. ‘ఆయన సింగపూర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇంతవరకూ డిజైన్లు సైతం ఖరారు చేయకుండా మమ్మల్ని నిందిస్తే మేము ఏమి చేస్తాం? అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. అందుకు మాదా బాధ్యత?’ అంటూ జైట్లీ మొన్న పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్రం అవతరించి నాలుగేళ్ళు పూర్తవుతున్నప్పటికీ రాజధాని స్వప్నంగానే మిగిలిపోయింది.
నెరవేరని పోల‘వరం’
ఇక రెండో ముఖ్యమైన అంశం పోలవరం. కాలువల నిర్మాణం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దాదాపు పూర్తయింది. సాధారణ ముఖ్యమంత్రి అయితే పోలవరం బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత విభజన చట్టం ప్రకారం కేంద్రానిది కాబట్టి సాధ్యమైనంత త్వరలో తక్కిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయవలసిందిగా ప్రధానమంత్రిపైన ఒత్తిడి తెచ్చేవాడు. కానీ ‘అసాధారణ ముఖ్యమంత్రి’ కనుక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను స్వయంగా తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. అన్నీ తానే చేయాలనీ, అంతా తనకే కావాలనే మనస్తత్వం ఇందుకు కారణం. నిర్మాణ వ్యయం అంచనాలను 2010–11 లెక్కల ప్రకారం రూ. 16 వేల కోట్ల నుంచి తాజాగా రూ. 58 వేల కోట్లకు పెంచివేశారు. మొదట 31 మీటర్ల ఎత్తు నిర్మించాలనుకున్న కాఫర్‌డ్యామ్ ఎత్తును 42 మీటర్లకు పెంచి 2018 జూన్ నాటికే ఖరీఫ్ పంటకు గురుత్వాకర్షణశక్తితో పోలవరం నీరు అందించాలనే వ్యూహం రచించారు. అదే సమయంలో తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థను పోలవరం పనుల నుంచి తప్పించాలని అనుకున్నారు. రాయపాటి ఘనాపాటి కనుక చంద్రబాబు ఎదుట సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి గడ్కరీని కలుసుకున్నారు. క్షేత్రంలో ఏమి జరుగుతోందో, జరగడం లేదో వివరించారు. కాఫర్‌డ్యామ్‌కు గడ్కరీ బ్రేక్ వేశారు. కథ అడ్డం తిరిగింది. పనులు ఆగిపోయాయి. తిరిగి ప్రారంభం కావడానికి సమయం పడుతుంది.
ఇక అన్నిటికంటే ప్రధానమైన హామీ ప్రత్యేక హోదా. విభజన బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ పట్టుబట్టిన వ్యక్తి వెంకయ్యనాయుడు. నాటి ప్రధాని అయిదేళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడానికి పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. అనంతరం మంత్రిమండలి సమావేశంలో దాన్ని ఆమోదించారు. ప్రత్యేక హోదా అమలు చేయమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు. యూపీఏ ప్రభుత్వం కొన్ని మంచిపనులు చేసింది. మరికొన్ని పాడుపనులు చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టపోయినప్పటికీ తెలంగాణలో లబ్ధి పొందుతామని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావించింది. ఉద్యమ నాయకుడు కల్వ కుంట్ల చంద్రశేఖరరావుతో నిర్లక్ష్యంగా వ్యవహరించేసరికి ఆయన అడ్డం తిరిగారు. తెలంగాణలోనూ తిరుక్షవరం తప్పలేదు. కోస్తాంధ్రలో భారీ మూల్యం చెల్లిం చింది. ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా చావుదెబ్బ తిన్నది. తెలంగాణకు అభ్యంతరం లేదంటూ ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీకీ, విభజన బిల్లు ఆమోదంలో క్రియాశీలకంగా వ్యవహరించిన బీజేపీకీ ఆంధ్రులు అధికారం అప్పగించారు. హైదరాబాద్ తెలంగాణలో ఉండటం వల్ల కోస్తాంధ్రకు నష్టం కలుగుతుంది కనుక నష్టాన్ని పూడ్చేందుకు బిల్లులో కొన్ని అంశాలను యూపీఏ ప్రభుత్వం చేర్చించింది. వాటిని నాలుగేళ్ళపాటు అమలు జరపకుండా విభజన పాపం కాంగ్రెస్‌దేనంటూ బీజేపీ, తెలుగుదేశంలు ధ్వజమెత్తడం ప్రహసన రాజకీయాలకు నిదర్శనం. ‘ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు’ అంటూ చంద్రబాబు కొత్తపాట అందుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడిన మొదటి పిడుగు. ప్రత్యేక హోదా అక్కర లేదని ఒప్పుకునే అధికారం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకహోదా ఇవ్వవద్దని సిఫార్సు చేసిందంటూ తాజాగా అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రకటించారు. ఇది సత్యదూరం. ఆ మాట తాము ఎక్కడా అనలేదని 14వ ఆర్థికసంఘం అధ్యక్షుడు వైవి రెడ్డి హైదరాబాద్‌లో మంథన్ నిర్వహించిన సభలో స్పష్టం చేశారు. ఆర్థికసంఘాన్ని అడ్డంపెట్టుకొని ప్రత్యేకహోదాను ఎగగొట్టడం వంచన. ప్రత్యేకహోదా లేక, ప్రత్యేక ప్యాకేజీ రాక రెండింటా చెడిన రేవడి చందంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి.
కాంగ్రెస్‌పై ప్రధాని ధ్వజం
విభజన చట్టంలో ఇచ్చిన హామీలలో రైల్వే జోన్ కూడా ముఖ్యమైనదే. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీని ఇంతవరకూ 29 విడతల సందర్శించారు. ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ ప్రతిసారీ శూన్యహస్తాలతోనే తిరిగి వచ్చారు. విభజన చట్టం హామీల అమలు కోసం తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేసిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహావేశాలతో నెహ్రూనూ, ఇందిరాగాంధీనీ, రాజీవ్‌గాంధీనీ, సోనియాగాంధీనీ రాహుల్‌గాంధీని ఉభయసభలలో కడిగిపారేశారు. ఆ హామీల గురించి ఒక్కమాట కూడా ప్రధాని నోట వెలువడలేదు. ఎన్నికల ప్రచారంలో తాను స్వయంగా చంద్రబాబు, వెంకయ్యనాయుడితో కలసి చేసిన హామీలను ప్రస్తావించడానికి సైతం ప్రధాని సిద్ధంగా లేరు. ఇది సైతం అసాధారణమే. జైట్లీ డొంక తిరుగుడు సరేసరి. అర్థంపర్థం లేని పాటను రాజ్యసభలో రెండుసార్లూ, లోక్‌సభలో ఒకసారీ పాడి వినిపించారు. ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో తెలుగుదేశం నాయకత్వానికి ఎన్‌టి రామారావునాటి ఆత్మగౌరవ నినాదం లీలగానైనా గుర్తు ఉంటే ఏమి చేయాలి? అశోక్ గజపతి రాజునూ, సుజనాచౌదరినీ ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి విరమించుకోవాలి. శ్రీనివాస్‌కూ, మాణిక్యాలరావుకూ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఉద్వాసన చెప్పాలి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించాలి. ముఖ్యమంత్రిని వేధిస్తున్న భయసందేహాలు ఏమిటో తెలియదు కానీ అటువంటి ధైర్యమైన నిర్ణయం తీసుకోలేదు. ఏమి చేశారు? ప్రచ్ఛన్నయుద్ధం చేశారు. మీడియా సహకారంతో లీకుల రాజకీయం రసవత్తరంగా నడిపించారు. ఢిల్లీతో తెగించి పోరాడుతున్నారనే భ్రాంతికి తెలుగు పాఠకులనూ, ప్రేక్షకులనూ లోను చేశారు. ఈ లోగా సరదాగా దుబాయ్ వెళ్ళి వచ్చారు. కానీ జైట్లీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించి పది రోజులైనా చంద్రబాబు ప్రత్యక్షంగా నిరసన వెలి బుచ్చలేదు. కేంద్ర ప్రభుత్వానికి కానీ, బడ్జెట్‌కు కానీ వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇది విచిత్రమైన పరిస్థితి. మామూలు ముఖ్యమంత్రి అయితే మీడియా సమావేశంలో మాట్లాడేవారు. ఆవేదన, ఆగ్రహం వెలిబుచ్చేవారు. అన్యాయం జరిగిందని చెప్పేవారు. తాను ఏం చేయదల్చుకున్నదీ ప్రకటించేవారు. అటువంటి పనులు ఏవీ చేయకపోయినా చంద్రబాబునే పోరాటయోధుడుగా రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చిత్రించడం అసాధారణ రాజ కీయం. విభజన చట్టంలోని హామీలు నెరవేరతాయని నాలుగేళ్ళుగా ఎదురు చూస్తున్న ప్రజలు మరో సంవత్సరం మాత్రమే గడువు ఇస్తారు.
- కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment