నవ్యాంధ్రలో ‘నవ’శకం | K Ramachandra Murthy Article On AP 2019 Budget | Sakshi
Sakshi News home page

నవ్యాంధ్రలో ‘నవ’శకం

Published Sun, Jul 14 2019 12:31 AM | Last Updated on Sun, Jul 14 2019 12:31 AM

K Ramachandra Murthy Article On AP 2019 Budget - Sakshi

రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ విశ్వసనీయతే ప్రాణం. అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకులను ప్రజలు ఆరాధిస్తారు. మాటలకూ, చేత లకూ పొంతనలేని నాయకులను తిరస్కరిస్తారు. ఇది అత్యంత  సరళమైన విషయం. ప్రజల కళ్ళు కప్పవచ్చుననీ, వారిని మభ్యపెట్టవచ్చుననీ, ప్రచార బలంతో నమ్మించవచ్చుననీ నాయకులు అనుకుంటే భంగపాటు తప్పదు. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో సమర్పించిన 2019–20 బడ్జెట్‌ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను నిజాయతీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఈ బడ్జెట్‌ వెల్లడిస్తుంది. ప్రభుత్వ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. జగన్‌ మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని ఆధిక్యంతో ఎన్నికలలో విజయం సాధించడానికి ఒకానొక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు పదేళ్ళపాటు కఠోర పరిశ్రమ, ప్రజలే కేంద్రంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాలూ, బీసీ డిక్లరేషన్‌ వగైరా కార్యక్రమాలన్నీ వైఎస్‌ఆర్‌సీపీకి పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానం కల్పించాయి.  

రాజన్న రాజ్యం రూపంలో సంక్షేమ రాజ్యం నెలకొల్పుతానంటూ జగన్‌ మోహన్‌రెడ్డి బహిరంగసభలలో వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలనీ, వారిని అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలనీ సంకల్పం చెప్పుకున్నారు. పాదయాత్రలో కోటిమందికిపైగా సాధా రణ ప్రజలను కలుసుకొని వారి బాధలగాథలు ఆలకించి, ఆకళింపు చేసు కున్నట్టు బడ్జెట్‌ కేటాయింపులు చెబుతున్నాయి. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా చేసేది చెప్పడం, చెప్పిందే చేయడం అనే ధర్మాన్ని ప్రభుత్వాలు పాటిస్తే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. ఆ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయా ణిస్తున్నట్టు బడ్జెట్‌ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్‌ కేటాయిం పులు వేరు, వాస్తవంగా ఖర్చు చేయడం వేరు. ఊహించిన ఆదాయం అందక పోయినా, ప్రభుత్వాల ప్రాథమ్యక్రమం మారిపోయినా కేటాయింపులు ఘనంగా ఉంటాయి కానీ నిధులు విడుదల కావు. బాధ్యతాయుతమైన రాజ కీయ నేతలూ, పార్టీలూ ఎన్నికల ప్రచారంలో వినియోగించిన ప్రణాళికకు కట్టు బడి పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తారు. వైఎస్‌ఆర్‌సీపీ సర్వసభ్య సమా వేశం (ప్లీనరీ)లో ప్రకటించిన నవరత్నాలనూ, బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశా లనూ సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదల ప్రభుత్వానికి దండిగా ఉన్నట్టు బుగ్గన బడ్జెట్‌ స్పష్టం చేస్తున్నది. 

సామాజికస్పృహ
బుగ్గన బడ్జెట్‌ ప్రతిపాదనలలో సామాజిక సమతౌల్యం సాధించే ప్రయత్నం కనిపిస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనక» డిన వర్గాలకు చేయూతనిచ్చి ఆ వర్గాలను వేగంగా ముందుకు నడిపించాలనే తాపత్రయం ఉన్నది. వివిధ వర్గాల సంక్షేమానికి ఏమేమి చేయాలని సంకల్పించారో పాదయాత్ర సందర్భంగా బహి రంగ సభలలో జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రకటించిన అంశాలన్నింటినీ క్రమంగా, వేగంగా అమలు చేస్తూ వస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజ లను కలుసుకోవడం వల్ల, మాట్లాడటం వల్ల సమాజంలో ఎంతటి వైవిధ్యం ఉన్నదో, సమస్యల స్వభావం ఏమిటో, వందకుపైగా ఉన్న వెనుకబడిన కులా లవారికి మేలు చేయడం ఎలాగో ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మనసులో ఒక సామాజికన్యాయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం రూపు దిద్దుకొని ఉంటుంది. దాని ప్రభావం టిక్కెట్ల పంపిణీపైన ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ నిర్మాణంలోనూ ఉంది.  ఆ వ్యూహం ప్రాతిపదికగానే ప్రాథమ్యాలు నిర్ణయించుకొని ఉంటారు. అదే పద్ధతిలో బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తున్నది.

సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా సాగించాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఉపప్రణాళికలకు కేటాయింపులు నిరుటి కంటే పెరి గాయి. రూ. 2,27,974 కోట్ల బడ్జెట్‌వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలకోసం కేటాయించిన మొత్తం రూ. 75 వేల కోట్లు. దళితులలో మాలలకూ, మాదిగ లకూ, రెల్లి కులస్తులకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. ఎస్సీ ఉపప్రణాళికకు కేటాయించిన మొత్తం నిరుటి కేటాయింపు కంటే 33.60 శాతం అధికం. బీసీ ఉపప్రణాళికకు 15,000 కోట్లు కేటాయించడం కూడా విశేషం. నిరుటి కేటాయింపు కంటే ఇది 17.03 అధికం. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్నది.  టిక్కెట్ల కేటాయింపులోనూ, నిధుల మంజూరులోనూ బీసీలకు పెద్దపీట వేసి బీసీ డిక్లరేషన్‌లో చేసిన బాసలను నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఉపప్రణాళికకు నిధులు కేటా యించారు. అదే విధంగా నామినేషన్‌పైన ఇచ్చే చిన్న కాంట్రాక్టు పనులలో సగం బీసీలకు ఇస్తామంటూ జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేశారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్ళలో పదివేల కోట్లు కేటాయిస్తామంటూ చేసిన వాగ్దానానికి అను గుణంగానే ఈ వార్షిక బడ్జెట్‌లో ఆ సామాజికవర్గానికి రెండు వేల కోట్లు ప్రత్యే కించారు. ఆయన సాధించిన అద్భుతమైన విజయంలో అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల పాత్రా ఉన్నది. పైగా కులాలకూ, ప్రాంతాలకూ, మతా లకూ, రాజకీయాలకూ, పార్టీలకూ అతీతంగా సర్వజన సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలన్నది వైఎస్‌ఆర్‌సీపీ అధినేత అభీష్టం. అందుకే అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం. మొత్తం 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. 

మేనిఫెస్టోనే మంత్రం
ఇవన్నీ  ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలే. ఇచ్చిన వాగ్దానాలను మసిపూసి మారేడుకాయ చేయకుండా, షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుటిల యత్నాలకు ఒడిగట్టకుండా చెప్పినవి చెప్పినట్టు చేసే సంకల్పాన్ని బడ్జెట్‌ ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. నేలవిడిచి సాము చేయకుండా ఉన్న ఆర్థిక పరిమితులలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు అవసరమైన కేటాయిం పులు సముచితంగా జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మూడు ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రతిగ్రామానికీ తాగునీరు ఇవ్వాలని  ప్రయత్నం. పింఛన్లకు కేటాయింపు లను మూడు రెట్లు పెంచారు. ఆటో డ్రైవర్లకూ, నాయీ బ్రాహ్మణులకూ, రజ కులకూ, మత్స్యకారులకూ, దర్జీలకూ, చేనేత కార్మికులకూ, బ్రాహ్మణులకూ, యువన్యాయవాదులకూ చేసిన వాగ్దానాలను విస్మరించలేదు. ప్రతి చేనేత కుటుంబానికీ సంవత్సరానికి రూ. 24వేలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. దీని వల్ల 98 వేల చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. ఆరోగ్యశ్రీ, 108 వంటి ఆరోగ్య పథకాలను పునరుద్ధరించి వైఎస్‌ హయాంలో ఎంత సమర్థంగా వినియోగించారో అంతే సమర్థంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించాలన్న తపన బుగ్గన బడ్జెట్‌లో కనిపిస్తున్నది.

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు కల్పించేందుకు అవసరమైన కేటాయింపులు కూడా చేశారు. అదే విధంగా ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా కార్యక్రమంలో విద్యుత్‌ వినియోగం పరిమితిని 200 యూనిట్ల వరకూ పెంచడం వల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎంత కేటాయించారన్నది కాదు ప్రశ్న. ఎంత ఖర్చు చేశారన్నది ముఖ్యం. నిగూఢ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయా, నిధులు దారిమళ్లాయా అనేవి బడ్జెట్‌ ప్రతిపాదనలలో నిశితంగా గమనించ వలసిన అంశాలు. ఈ బడ్జెట్‌లో అటువంటి  నిగూఢమైన కోణాలు ఏవీ ఉన్నట్టు లేదు. బుగ్గన చెప్పినట్టు సింగపూర్‌ అంతర్జాతీయ విమా నాలకు లోటుభర్తీ (వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌) సమకూర్చాలా లేక వేలాది తల్లులకూ, పిల్లలకూ పోషకాహారం అందించాలా అనే ప్రశ్నే ఉదయించకూడదు. సింగపూర్‌ వ్యామోహంతో టీడీపీ సర్కార్‌ చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపైన ఉన్నది. విభజన కారణంగా నష్టబోయిన రాష్ట్రం, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న రాష్ట్రం. రుణభారం అధికంగా ఉన్న రాష్ట్రం. ఈ పరిమితులకు లోబడి పొదుపు చర్యలు తీసుకుంటూనే బడుగు వర్గాలకు పెద్ద పీట వేసే ప్రయత్నం బుగ్గన చేశారు.

రైతన్నకు వెన్నుదన్ను
మంత్రి బొత్స సత్యనారాయణ సమర్పించిన వ్యవసాయ బడ్జెట్‌ సైతం అన్నదాతలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తగినట్టుగానే ఉంది. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో 12.66 శాతం వ్యవసాయరంగానికి కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కేటాయించిన రూ. 28,866 కోట్లు నిరుటి కంటే రూ. 9,796 కోట్లు అధికం. పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి వైఎస్‌ఆర్‌ రైతుభరోసా పథకం కింద రూ. 12,500ల వంతున రూ. 8,796 కోట్లు అవసరం. కౌలురైతులకు సైతం ఇది వర్తిస్తుంది.  రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంపైనా శాసనసభలో ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సున్నా వడ్డీ రుణం తన హయాంలో ఇప్పించా మంటూ చంద్రబాబునాయుడు ప్రకటిస్తే, సత్యదూరమంటూ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు మైనస్‌ 4.12 శాతం ఉన్న దంటూ ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకటిస్తే వ్యవసాయంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌ వన్‌ అంటూ మాజీ ముఖ్యమంత్రి బిగ్గరగా చెప్పు కున్నారు.

రెండు పక్షాలు భిన్నమైన ప్రకటనలు చేసినప్పుడు నిజం నిగ్గు తేల్చడానికి స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇందుకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త చెల్లిం పులు ఏప్రిల్, మే మాసాలలో జరుగుతాయి కనుక ఆ భారం వచ్చే బడ్జెట్‌పైన ఉంటుందనీ, ఇప్పుడు రుణాలు తిరిగి చెల్లించేవారు ఎక్కువమంది ఉండరు కనుక కేటాయించిన చిన్న మొత్తం సరిపోతుందనీ ప్రభుత్వ వర్గాల వివరణ. వడ్డీలేని రుణం, పంట ధరల స్థిరీకరణ, కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వా లన్న ప్రతిపాదనలు వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభాన్ని చాలా వరకూ పరిష్కరిస్తాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచక ఆత్మహత్యను ఆశ్ర యించిన రైతుల కుటుంబాలకు ఏడు లక్షల వంతున పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం కూడా స్వాగతించదగినదే. కడచిన అయిదు సంవత్సరాలలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పరిహారం అందని కుటుంబాలకు తన ప్రభుత్వం కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వంతున చెల్లిస్తుందంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. రైతును కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా, ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. సమాజంలో వివిధ వర్గాలకూ, దాదాపు అన్ని వర్గాలకూ ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు పాళ్ళూ అమలు చేయడానికి అవసరమైన భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నవారు  ఉన్నారు.

‘వేర్‌ దేర్‌ ఈజ్‌ ఎ విల్, దేర్‌ ఈజ్‌ ఎ వే’, సంకల్పం ఉంటే మార్గం ఉంటుం దనే సామెత ఉంది. ఇంతకు మునుపు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి కానీ విశ్వసనీయత కలిగిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ చారిత్రక విజయం వెనుక విశ్వసనీయత ప్రధానమైన హేతువు. జగన్‌మోహన్‌రెడ్డి యూఎస్‌పీ (యునీక్‌ సెల్లింగ్‌ పాయింట్‌–ఆయనకే ప్రత్యేకమైన ఆకర్షణీయమైన లక్షణం) అదే. వాగ్దానాలు చేసే ముందే వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు గెలిపించిందీ, మున్ముందు గెలిపించేదీ ఆ విశ్వసనీయతే కనుక యూఎస్‌పీ దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికీ, ఆచరణశీలతకూ, వాస్తవిక దృష్టికీ అద్దం పట్టే విధంగా బుగ్గన బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగం లాగానే బడ్జెట్‌ కూడా సదుద్దేశాలతో నిర్మించుకున్నది. దాని అమలులోనే సాఫల్య వైఫల్యాలు ఉంటాయి. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రమ శిక్షణతో బడ్జెట్‌లో ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల లక్ష్యాలను సాధించగలిగితే నవ్యాంధ్రలో నవశకానికి నవరత్నాలతో శ్రీకారం చుట్టినట్టే.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement