శాసనసభలో మాట్లాడుతున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి అంశాన్ని వివాదం చేసి, అన్యాయం జరిగిందని చూపి, సానుభూతి పొందాలని చూడటం ధర్మమా? అని ప్రశ్నించారు. సభలో ఎక్కడ కూర్చోవాలనే విషయంలో కూడా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ‘నిబంధనల ప్రకారమే శాసనసభలో సభ్యులకు సీట్లు కేటాయించారు. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తయినా రూల్స్ పాటించాల్సిందే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒకసారి ఓడిపోయినా ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా’ అని సీఎం వైఎస్ జగన్ చురకలంటించారు.
శ్రీధర్‌రెడ్డి గుడ్ బాయ్
టీడీపీ సభ్యులు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనకు కేటాయించిన సీటులో కాకుండా మరో స్థానంలో కూర్చున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. దాంతో.. ‘మీ సీట్లోకి మీరు వెళ్లాలి’ అని స్పీకర్ సూచించడంతో శ్రీధర్ రెడ్డి తన స్థానంలోకి వెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కన ఉన్న సీటును బుచ్చయ్య చౌదరికి కేటాయించారని.. కానీ ఆ స్థానంలో అచ్చెన్నాయుడు కూర్చున్నారని.. తనకో న్యాయం, అచ్చెన్నాయుడుకో న్యాయమా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. దాంతో అచ్చెన్నాయుడును ఆయనకు కేటాయించిన సీట్లో కూర్చోవాలని స్పీకర్ సూచించారు. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్ష నేతగా డిప్యూటీ లీడర్ల సీట్లు కేటాయింపు హక్కు తనకు ఉంటుందని, మిగతా సభ్యుల సీట్లను నిబంధనల ప్రకారం కేటాయించవచ్చునని, అచ్చెన్నాయుడుకు తన సీటు పక్కనే కేటాయించామని చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పక్కన సీటును తనకు కేటాయించారని, ఆ స్థానంలో జ్యోతుల నెహ్రూ కూర్చుంటే.. ఆ స్థానంలో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారని, ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని అప్పట్లో రూలింగ్ ఇచ్చిన అంశాన్ని ఎత్తిచూపారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరిలకు సూచించారు. బుచ్చయ్య చౌదరి హాఫ్ హ్యాండ్ చొక్కాలో స్మార్ట్‌గా కనిపిస్తున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ శ్రీధర్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ సీట్లోనే కూర్చునేవారని.. ఇటీవల కూడా అక్కడే కూర్చుంటున్నారని.. ఆ సీటుపై వ్యామోహం కొద్దీ అక్కడే కూర్చుంటున్నారన్నారు. కానీ స్పీకర్ సూచించిన వెంటనే గుడ్ బాయ్‌లా శ్రీధర్ రెడ్డి తన స్థానంలో కూర్చున్నారని అనడంతో సభ నవ్వులతో నిండింది.
నిబంధనలు మారవు కదా!
సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపు ప్రశ్నకు అనుబంధ ప్రశ్న అడిగేందుకు సమయం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నలు అడిగిన వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని.. ఇతరులకు ఇచ్చేది లేదని.. అనుమతి కోరితే అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ తేల్చిచెప్పారు. దీంతో చంద్రబాబు ఇదెక్కడి ప్రజాస్వామ్యమంటూ బెదిరించే రీతిలో మాట్లాడటంతో స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాక.. అనుబంధ ప్రశ్నలు అడిగే హక్కు ఆ ప్రశ్న వేసిన వారికే ఉంటుందని చెప్పారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఈ మాత్రం నిబంధనలు తెలియవా అంటూ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకుంటూ.. పది ప్రశ్నలకుగానూ ఇప్పటివరకూ రెండు ప్రశ్నలకే సమాధానం చెప్పారని.. ఇలాగైతే మిగతా ప్రశ్నలకు 10.30 లోగా సమాధానాలు పూర్తి చేయలేరని, బడ్జెట్‌పై చర్చను చేపట్టాలని స్పీకర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment