Trikaalam
-
నవ్యాంధ్రలో ‘నవ’శకం
రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ విశ్వసనీయతే ప్రాణం. అన్న మాటకు కట్టుబడి ఉండే నాయకులను ప్రజలు ఆరాధిస్తారు. మాటలకూ, చేత లకూ పొంతనలేని నాయకులను తిరస్కరిస్తారు. ఇది అత్యంత సరళమైన విషయం. ప్రజల కళ్ళు కప్పవచ్చుననీ, వారిని మభ్యపెట్టవచ్చుననీ, ప్రచార బలంతో నమ్మించవచ్చుననీ నాయకులు అనుకుంటే భంగపాటు తప్పదు. శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో సమర్పించిన 2019–20 బడ్జెట్ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికను నిజాయతీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నదని సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాథమ్యాలను ఈ బడ్జెట్ వెల్లడిస్తుంది. ప్రభుత్వ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుంది. జగన్ మోహన్‌రెడ్డి కనీవినీ ఎరుగని ఆధిక్యంతో ఎన్నికలలో విజయం సాధించడానికి ఒకానొక చారిత్రక నేపథ్యం ఉన్నది. దాదాపు పదేళ్ళపాటు కఠోర పరిశ్రమ, ప్రజలే కేంద్రంగా సాగిన ప్రజాసంకల్పయాత్ర, నవరత్నాలూ, బీసీ డిక్లరేషన్ వగైరా కార్యక్రమాలన్నీ వైఎస్ఆర్సీపీకి పేదల గుండెల్లో సుస్థిరమైన స్థానం కల్పించాయి. రాజన్న రాజ్యం రూపంలో సంక్షేమ రాజ్యం నెలకొల్పుతానంటూ జగన్ మోహన్‌రెడ్డి బహిరంగసభలలో వాగ్దానం చేశారు. బడుగు బలహీన వర్గాలకు ఇతోధికంగా నిధులు కేటాయించాలనీ, వారిని అభివృద్ధిలో భాగస్వా ములను చేయాలనీ సంకల్పం చెప్పుకున్నారు. పాదయాత్రలో కోటిమందికిపైగా సాధా రణ ప్రజలను కలుసుకొని వారి బాధలగాథలు ఆలకించి, ఆకళింపు చేసు కున్నట్టు బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయి. కల్లబొల్లి కబుర్లు చెప్పకుండా చేసేది చెప్పడం, చెప్పిందే చేయడం అనే ధర్మాన్ని ప్రభుత్వాలు పాటిస్తే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాయి. ఆ బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయా ణిస్తున్నట్టు బడ్జెట్ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయిం పులు వేరు, వాస్తవంగా ఖర్చు చేయడం వేరు. ఊహించిన ఆదాయం అందక పోయినా, ప్రభుత్వాల ప్రాథమ్యక్రమం మారిపోయినా కేటాయింపులు ఘనంగా ఉంటాయి కానీ నిధులు విడుదల కావు. బాధ్యతాయుతమైన రాజ కీయ నేతలూ, పార్టీలూ ఎన్నికల ప్రచారంలో వినియోగించిన ప్రణాళికకు కట్టు బడి పరిపాలన సాగించాలని ప్రయత్నిస్తారు. వైఎస్ఆర్సీపీ సర్వసభ్య సమా వేశం (ప్లీనరీ)లో ప్రకటించిన నవరత్నాలనూ, బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన అంశా లనూ సంపూర్ణంగా అమలు చేయాలనే పట్టుదల ప్రభుత్వానికి దండిగా ఉన్నట్టు బుగ్గన బడ్జెట్ స్పష్టం చేస్తున్నది. సామాజికస్పృహ బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలలో సామాజిక సమతౌల్యం సాధించే ప్రయత్నం కనిపిస్తున్నది. ఆర్థికంగా, సామాజికంగా వెనక» డిన వర్గాలకు చేయూతనిచ్చి ఆ వర్గాలను వేగంగా ముందుకు నడిపించాలనే తాపత్రయం ఉన్నది. వివిధ వర్గాల సంక్షేమానికి ఏమేమి చేయాలని సంకల్పించారో పాదయాత్ర సందర్భంగా బహి రంగ సభలలో జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రకటించిన అంశాలన్నింటినీ క్రమంగా, వేగంగా అమలు చేస్తూ వస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజ లను కలుసుకోవడం వల్ల, మాట్లాడటం వల్ల సమాజంలో ఎంతటి వైవిధ్యం ఉన్నదో, సమస్యల స్వభావం ఏమిటో, వందకుపైగా ఉన్న వెనుకబడిన కులా లవారికి మేలు చేయడం ఎలాగో ఒక స్పష్టమైన అవగాహన కలిగింది. మనసులో ఒక సామాజికన్యాయం సాధించేందుకు అనుసరించవలసిన వ్యూహం రూపు దిద్దుకొని ఉంటుంది. దాని ప్రభావం టిక్కెట్ల పంపిణీపైన ఉంది. ఆ తర్వాత మంత్రివర్గ నిర్మాణంలోనూ ఉంది. ఆ వ్యూహం ప్రాతిపదికగానే ప్రాథమ్యాలు నిర్ణయించుకొని ఉంటారు. అదే పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన జరిగినట్టు కనిపిస్తున్నది. సంక్షేమాన్నీ, అభివృద్ధినీ సమాంతరంగా సాగించాలన్నది ప్రాథమిక లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపప్రణాళికలకు కేటాయింపులు నిరుటి కంటే పెరి గాయి. రూ. 2,27,974 కోట్ల బడ్జెట్వ్యయంలో సంక్షేమ కార్యక్రమాలకోసం కేటాయించిన మొత్తం రూ. 75 వేల కోట్లు. దళితులలో మాలలకూ, మాదిగ లకూ, రెల్లి కులస్తులకూ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చారు. ఎస్సీ ఉపప్రణాళికకు కేటాయించిన మొత్తం నిరుటి కేటాయింపు కంటే 33.60 శాతం అధికం. బీసీ ఉపప్రణాళికకు 15,000 కోట్లు కేటాయించడం కూడా విశేషం. నిరుటి కేటాయింపు కంటే ఇది 17.03 అధికం. బీసీలను ఓటు బ్యాంకుగా కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా గుర్తించి వారి అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్న స్పృహ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. టిక్కెట్ల కేటాయింపులోనూ, నిధుల మంజూరులోనూ బీసీలకు పెద్దపీట వేసి బీసీ డిక్లరేషన్‌లో చేసిన బాసలను నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. డిక్లరేషన్‌లో చెప్పినట్టే ఉపప్రణాళికకు నిధులు కేటా యించారు. అదే విధంగా నామినేషన్‌పైన ఇచ్చే చిన్న కాంట్రాక్టు పనులలో సగం బీసీలకు ఇస్తామంటూ జగన్మోహన్రెడ్డి వాగ్దానం చేశారు. కాపుల సంక్షేమం కోసం ఐదేళ్ళలో పదివేల కోట్లు కేటాయిస్తామంటూ చేసిన వాగ్దానానికి అను గుణంగానే ఈ వార్షిక బడ్జెట్లో ఆ సామాజికవర్గానికి రెండు వేల కోట్లు ప్రత్యే కించారు. ఆయన సాధించిన అద్భుతమైన విజయంలో అన్ని కులాల, అన్ని ప్రాంతాల, అన్ని మతాల పాత్రా ఉన్నది. పైగా కులాలకూ, ప్రాంతాలకూ, మతా లకూ, రాజకీయాలకూ, పార్టీలకూ అతీతంగా సర్వజన సంక్షేమం ధ్యేయంగా పనిచేయాలన్నది వైఎస్ఆర్సీపీ అధినేత అభీష్టం. అందుకే అందరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నం. మొత్తం 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. మేనిఫెస్టోనే మంత్రం ఇవన్నీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలే. ఇచ్చిన వాగ్దానాలను మసిపూసి మారేడుకాయ చేయకుండా, షరతులు విధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుటిల యత్నాలకు ఒడిగట్టకుండా చెప్పినవి చెప్పినట్టు చేసే సంకల్పాన్ని బడ్జెట్ ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. నేలవిడిచి సాము చేయకుండా ఉన్న ఆర్థిక పరిమితులలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు అవసరమైన కేటాయిం పులు సముచితంగా జరిగాయి. సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో మూడు ప్రాంతాల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకు న్నారు. ప్రతిగ్రామానికీ తాగునీరు ఇవ్వాలని ప్రయత్నం. పింఛన్లకు కేటాయింపు లను మూడు రెట్లు పెంచారు. ఆటో డ్రైవర్లకూ, నాయీ బ్రాహ్మణులకూ, రజ కులకూ, మత్స్యకారులకూ, దర్జీలకూ, చేనేత కార్మికులకూ, బ్రాహ్మణులకూ, యువన్యాయవాదులకూ చేసిన వాగ్దానాలను విస్మరించలేదు. ప్రతి చేనేత కుటుంబానికీ సంవత్సరానికి రూ. 24వేలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. దీని వల్ల 98 వేల చేనేత కుటుంబాలు లబ్ధిపొందుతాయని అంచనా. ఆరోగ్యశ్రీ, 108 వంటి ఆరోగ్య పథకాలను పునరుద్ధరించి వైఎస్ హయాంలో ఎంత సమర్థంగా వినియోగించారో అంతే సమర్థంగా ప్రజలకు ఆరోగ్యసేవలు అందించాలన్న తపన బుగ్గన బడ్జెట్లో కనిపిస్తున్నది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు కల్పించేందుకు అవసరమైన కేటాయింపులు కూడా చేశారు. అదే విధంగా ఉచిత విద్యుచ్ఛక్తి సరఫరా కార్యక్రమంలో విద్యుత్ వినియోగం పరిమితిని 200 యూనిట్ల వరకూ పెంచడం వల్ల అదనంగా 3.42 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఎంత కేటాయించారన్నది కాదు ప్రశ్న. ఎంత ఖర్చు చేశారన్నది ముఖ్యం. నిగూఢ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే దురుద్దేశాలు ఉన్నాయా, నిధులు దారిమళ్లాయా అనేవి బడ్జెట్ ప్రతిపాదనలలో నిశితంగా గమనించ వలసిన అంశాలు. ఈ బడ్జెట్లో అటువంటి నిగూఢమైన కోణాలు ఏవీ ఉన్నట్టు లేదు. బుగ్గన చెప్పినట్టు సింగపూర్ అంతర్జాతీయ విమా నాలకు లోటుభర్తీ (వయబిలిటీ గ్యాప్ ఫండ్) సమకూర్చాలా లేక వేలాది తల్లులకూ, పిల్లలకూ పోషకాహారం అందించాలా అనే ప్రశ్నే ఉదయించకూడదు. సింగపూర్ వ్యామోహంతో టీడీపీ సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపైన ఉన్నది. విభజన కారణంగా నష్టబోయిన రాష్ట్రం, ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్న రాష్ట్రం. రుణభారం అధికంగా ఉన్న రాష్ట్రం. ఈ పరిమితులకు లోబడి పొదుపు చర్యలు తీసుకుంటూనే బడుగు వర్గాలకు పెద్ద పీట వేసే ప్రయత్నం బుగ్గన చేశారు. రైతన్నకు వెన్నుదన్ను మంత్రి బొత్స సత్యనారాయణ సమర్పించిన వ్యవసాయ బడ్జెట్ సైతం అన్నదాతలకు పాదయాత్రలో ఇచ్చిన హామీలకు తగినట్టుగానే ఉంది. మొత్తం బడ్జెట్ వ్యయంలో 12.66 శాతం వ్యవసాయరంగానికి కేటాయించడం విశేషం. ఈ బడ్జెట్లో వ్యవసాయరంగానికి కేటాయించిన రూ. 28,866 కోట్లు నిరుటి కంటే రూ. 9,796 కోట్లు అధికం. పెట్టుబడి సాయం రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతుభరోసా పథకం కింద రూ. 12,500ల వంతున రూ. 8,796 కోట్లు అవసరం. కౌలురైతులకు సైతం ఇది వర్తిస్తుంది. రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంపైనా శాసనసభలో ముఖ్యమంత్రికీ, ప్రతిపక్ష నాయకుడికీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. సున్నా వడ్డీ రుణం తన హయాంలో ఇప్పించా మంటూ చంద్రబాబునాయుడు ప్రకటిస్తే, సత్యదూరమంటూ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగం వృద్ధిరేటు మైనస్ 4.12 శాతం ఉన్న దంటూ ఆర్థికశాఖ విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకటిస్తే వ్యవసాయంలో దేశం లోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ అంటూ మాజీ ముఖ్యమంత్రి బిగ్గరగా చెప్పు కున్నారు. రెండు పక్షాలు భిన్నమైన ప్రకటనలు చేసినప్పుడు నిజం నిగ్గు తేల్చడానికి స్వతంత్ర వేదిక ఉంటే బాగుంటుంది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించారనీ, ఇందుకు కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుందనీ చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొత్త చెల్లిం పులు ఏప్రిల్, మే మాసాలలో జరుగుతాయి కనుక ఆ భారం వచ్చే బడ్జెట్‌పైన ఉంటుందనీ, ఇప్పుడు రుణాలు తిరిగి చెల్లించేవారు ఎక్కువమంది ఉండరు కనుక కేటాయించిన చిన్న మొత్తం సరిపోతుందనీ ప్రభుత్వ వర్గాల వివరణ. వడ్డీలేని రుణం, పంట ధరల స్థిరీకరణ, కౌలు రైతులకు పంటరుణాలు ఇవ్వా లన్న ప్రతిపాదనలు వ్యవసాయరంగంలో నెలకొన్న సంక్షోభాన్ని చాలా వరకూ పరిష్కరిస్తాయి. అప్పుల ఊబిలో చిక్కుకొని దిక్కుతోచక ఆత్మహత్యను ఆశ్ర యించిన రైతుల కుటుంబాలకు ఏడు లక్షల వంతున పరిహారం ఇవ్వాలన్న నిర్ణయం కూడా స్వాగతించదగినదే. కడచిన అయిదు సంవత్సరాలలో ఆత్మ హత్య చేసుకున్న రైతుల కుటుంబాలలో పరిహారం అందని కుటుంబాలకు తన ప్రభుత్వం కుటుంబానికి ఏడు లక్షల రూపాయల వంతున చెల్లిస్తుందంటూ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. రైతును కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసినా, ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు. సమాజంలో వివిధ వర్గాలకూ, దాదాపు అన్ని వర్గాలకూ ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలు నూటికి నూరు పాళ్ళూ అమలు చేయడానికి అవసరమైన భారీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. ‘వేర్ దేర్ ఈజ్ ఎ విల్, దేర్ ఈజ్ ఎ వే’, సంకల్పం ఉంటే మార్గం ఉంటుం దనే సామెత ఉంది. ఇంతకు మునుపు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పుడు జగన్ మోహన్‌రెడ్డి కానీ విశ్వసనీయత కలిగిన నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం వెనుక విశ్వసనీయత ప్రధానమైన హేతువు. జగన్మోహన్రెడ్డి యూఎస్పీ (యునీక్ సెల్లింగ్ పాయింట్–ఆయనకే ప్రత్యేకమైన ఆకర్షణీయమైన లక్షణం) అదే. వాగ్దానాలు చేసే ముందే వాటి అమలు సాధ్యాసాధ్యాల గురించి లోతుగా ఆలోచించి ఉంటారు. ఇప్పుడు గెలిపించిందీ, మున్ముందు గెలిపించేదీ ఆ విశ్వసనీయతే కనుక యూఎస్పీ దెబ్బతినకుండా కాపాడుకోవాలన్న సంగతి ముఖ్యమంత్రికి తెలుసు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వానికీ, ఆచరణశీలతకూ, వాస్తవిక దృష్టికీ అద్దం పట్టే విధంగా బుగ్గన బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. రాజ్యాంగం లాగానే బడ్జెట్ కూడా సదుద్దేశాలతో నిర్మించుకున్నది. దాని అమలులోనే సాఫల్య వైఫల్యాలు ఉంటాయి. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం క్రమ శిక్షణతో బడ్జెట్లో ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల లక్ష్యాలను సాధించగలిగితే నవ్యాంధ్రలో నవశకానికి నవరత్నాలతో శ్రీకారం చుట్టినట్టే. కె. రామచంద్రమూర్తి -
ఎందుకీ విన్యాసాలు?!
ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఏడవ దశ పోలింగ్ పూర్తియిన తర్వాత టీవీ న్యూస్ చానళ్ళు ఎగ్జిట్‌పోల్ వివరాలు వెల్లడిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు జనాభిప్రాయ సేకరణ పేరుతో సర్వేలు జరిపి ప్రకటించే ఫలితాల కంటే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు మే 23 న వెల్లడి కాబోయే అసలు ఫలితాల ఉప్పు అందిస్తాయి. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను నమ్మవద్దంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందుగానే హెచ్చరించారు. సర్వే జరిపిన పెద్ద సంస్థలలో ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో ఐదారుకు మించి టీడీపీకి వస్తాయని చెప్పలేదు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 23 స్థానాలు రావచ్చునంటూ వివిధ సంస్థలు చాటాయి. ఇండియా టుడే, టైమ్స్ నౌ వంటి పెద్ద సంస్థలు, విశ్వసనీయత కలిగిన సర్వేసంస్థలతో కలిసి జరిపించిన సర్వేల ఫలితాలు ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతున్నదని ఘంటాపథంగా చెప్పాయి. ఆ సంస్థలే నిర్వ హించిన ఎగ్జిట్ సర్వే ఫలితాలు అంతకంటే భిన్నంగా ఉండే అవకాశాలు లేవని చంద్రబాబునాయుడికి తెలియని విషయం కాదు. కానీ 23వ తేదీ మధ్యాహ్నం వరకూ గాంభీర్యం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ మంత్రులూ, ఇతర నాయకులూ నేత చూపిన బాటలో నడుస్తున్నారు. పార్టీలో లేకపోయినా పార్లమెంటు మాజీ సభ్యుడు, పెప్పర్‌స్ప్రే ప్రవీణుడు లగడపాటి రాజగోపాల్ తన సహకారం అదిస్తున్నారు. కొంతకాలం కిందటి వరకూ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పడంలో లగడపాటి ఘనాపాటి అని చెప్పుకున్నారు. లగడపాటికి ఎవరు సాటి అంటూ ప్రశ్నించిన రోజులు ఉన్నాయి. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోస్యం చెప్పే సమయానికి ఇతరేతర కారణాలు కమ్ముకొని రావడంతో దృష్టి మందగించింది. తప్పులో కాలేశారు. దీనితో లగడపాటి రాజగోపాల్ ఏపాటి అంటూ ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు. శనివారంనాడు కూడా తెలంగాణ తోవలోనే నడిచిన లగడపాటి మాటలు ఏ మాత్రం విలువలేని పిచ్చాపాటిగా పరిగణించవలసి వస్తుంది. తన అధికారం, ప్రాభవం కొనసాగే అవకాశాలు మృగ్యమని చంద్రబాబు నాయుడుకు పోలింగ్ జరిగిన ఏప్రిల్ 11వ తేదీ ఉదయం పది గంటలకే స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడే ఈవీఎంలపైన వీరంగం ప్రారంభించారు. పోలింగైన తర్వాత రెండు రోజుల వరకూ డీలాపడినట్టు కనిపించారు. అంతలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ దక్కడం ఖాయమని చెప్పడం ప్రారంభించారు. 95 సీట్లు అని ఒకసారీ, 105 అని మరోసారీ, 120 అని ఇంకోసారీ, 130 వరకూ రావడం తథ్యమని చివరిసారీ సంఖ్య పెంచుతూ పోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలింగ్ జరిగిన తర్వాత ఒకే ఒకసారి విలేకరులతో మాట్లాడిన సందర్భంలో ఘన విజయం సాధిస్తామని (ల్యాండ్ స్లైడ్) చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలపైన వ్యాఖ్యానించలేదు. తన పార్టీ విజయం ఖాయమని ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్టు ఆయన దేహభాష స్పష్టం చేస్తున్నది. 2014లో కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు సైతం ప్రజల తీర్పును గౌరవిస్తాననీ, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామనీ వైఎస్ జగన్ అన్నారు. అంతేతప్ప చంద్రబాబులాగా ఈవీఎంలను నిందించలేదు. ఎన్ని కల కమిషన్‌పైన ఆరోపణలు చేయలేదు. ఇందుకు పూర్తిగా విరుద్ధం చంద్రబాబు నాయుడి వైఖరి. వార్తలలో ఉండటమే లక్ష్యమా? జాతీయ స్థాయిలో ముఖ్యమైన పాత్ర పోషించాలనే సంకల్పంతోనే చంద్రబాబు ఈవీఎంలపైన యాగీ చేస్తున్నారనీ, ఎన్నికల కమిషన్‌పైన నిందారోపణలు శ్రుతి మించి చేస్తున్నారనీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎన్నికల కమిషన్‌పైన దాడిలో భాగంగానే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పునేఠాను తొలగించి ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమించడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశం పెట్టుకోవాలంటూ గోల చేశారు. ఎన్నికల సంఘం అనుమతితో జరిగిన సమావేశంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. ఆ విధంగా పంతం నెగ్గించుకున్నారు. అంతవరకే. ఈ నెల 19 న అయిదు చోట్ల రీపోలింగ్ జరపాలని నిర్ణయించినందుకు ఎన్నికల సంఘం పైన విమర్శనాస్త్రాలు సంధించారు. శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్ని కలుసుకొని తీవ్రమైన అభ్యంతరం చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాలలో టీడీపీ నాయకులు దళితులను ఓటు వేయనీయకుండా అడ్డుకొని రిగ్గింగ్‌కు పాల్పడినట్టు స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు అందిన ఫిర్యా దును ప్రధాన కార్యదర్శి ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి పంపిం చారు. ఈ విషయంపై నివేదిక పంపించవలసిందిగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను ద్వివేదీ ఆదేశించారు. కలెక్టర్ సదరు ఫిర్యాదుపైన తన నివేదిక పంపుతూ దానితో పాటు సీసీ ఫుటేజీని కూడా పంపించారు. నివేదికనూ, సీసీ ఫుటేజీనీ కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేదీ పంపించారు. టీడీపీ నాయకుల నిర్వాకం కళ్ళారా చూసిన ఎన్నికల సంఘం మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది, ఇందులో తప్పు ఏమున్నది? నిజం గానే ఆ కేంద్రాలలో ఏప్రిల్ 11న ఓటర్లు టీడీపీకి ఓటు వేసి ఉంటే రీపోలింగ్‌లో కూడా టీడీపీకే ఓటు వేస్తారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోలేక పోయినవారు ఈసారి వినియోగించుకుంటారు. ఆ గ్రామాలలో 30 ఏళ్ళుగా దళితులను ఓటింగ్‌కు దూరంగా ఉంచు తున్నారు. ఎన్నికల సంఘం సభ్యులు చూపించిన సీసీ ఫుటేజీలు చూసిన చంద్రబాబునాయుడు అవాక్కైనట్టు సమా చారం. ఆయన కూడా పోటీగా కొన్ని కేంద్రాలలో రీపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు కేంద్రాల విషయంలో ఆయన మాట మన్నించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. జాతీయ స్థాయిలో మోదీతో పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష యోధుడిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం చంద్ర బాబు నాయుyì చేత నేలవిడిచి సాము చేయిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాదు. ఒకటి, రెండు సందర్భాలలో మినహా నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబునాయుడు ప్రస్తావన చేయలేదు. ఆయనను ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించలేదు. టీడీపీ అధినేత ఎంత ఘాటైన ఆరోపణలు చేసినా, ఎంత కవ్వించినా నరేంద్ర మోదీ, అమిత్ షాలు రెచ్చిపోయి తమ దాడిని మమతా బెనర్జీ (దీదీ) నుంచి చంద్రబాబునాయుడివైపు ఏమాత్రం మర ల్చలేదు. దీదీపై మోదీ, షా దాడి పశ్చిమబెంగాల్లో పరిస్థితులు వేరు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీకొడు తున్న పార్టీ బీజేపీ. రెండు పార్టీలూ సర్వం ఒడ్డి పోరాడుతున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు పోరాటంలో లేవు. అమిత్‌షా రోడ్డు షో నిర్వహించిన సందర్భంలో సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రతిమను పగుల కొట్టిన దుండగులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీ నాయకులు వాదులాడుకున్నారు. కొన్ని రోజులుగా మోదీ, షాల బాణాలన్నీ మమతాదీపైనే ఎక్కుపెట్టారు. మమత కూడా ఇద్దరికి దీటుగా సమాధానాలు చెబుతూ వచ్చారు. ‘జైశ్రీరామ్’ అని మోదీ నినదిస్తే ‘కాళీమాతా కీ జై’ అంటూ మమతాదీ ఎలుగెత్తి చాటారు. బీజేపీ అగ్ర నాయకులు పశ్చిమబెంగాల్పైన ఎందుకంతగా దృష్టి కేంద్రీకరించారు? 2014 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్ (యూపీ)లో మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 71 సీట్లను బీజేపీ, రెండు సీట్లను బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్’ గెలుచుకున్నాయి. హిందీ రాష్ట్రాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీకి మొత్తం 282 స్థానాలు లభించాయి. ఈ సారి యూపీలో బీజేపీ అంతటి సానుకూల వాతావరణం లేదు. అప్నాదళ్ చీలిపోయింది. 2014లో విడివిడిగా పోటీ చేసిన సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఈ సారి ఒక్కటైనాయి. మరో ప్రతిపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్‌ని ఈ కూటమిలో కలుపుకున్నారు. కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తేనే బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉన్నదని బీఎస్పీ అధినేత మాయా వతీ, ఎస్పీ నేత అఖిలేష్‌యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ భావిం చిన కారణంగానే కూటమిలో కాంగ్రెస్ లేదని కొందరి అభిప్రాయం. దళితులలో జాతవ్ (చమర్) కులానికి చెందిన నేత మాయావతి. బీసీలలో యాదవ్ కుల దీపుడు అఖిలేష్. జాతవేతర దళితులనూ, యాదవేతర వెనుక బడిన వర్గాలనూ సుముఖం చేసుకొని సంఘటిత పరిచిన కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల లోనూ, 2017 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీ ఘనవిజయం సాధించగలిగింది. ఆ వర్గాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను బీజేపీ కొనసాగించింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత, 2017లో ఎస్పీ అయిదేళ్ళ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బీజేపీకి లాభం చేకూర్చాయి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అయిదేళ్ళు పూర్తి చేసింది. రెండేళ్ళుగా యోగీ ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్నారు. మోదీ పట్ల వ్యతిరేకత లేదు. యోగీ పట్ల ప్రతికూలత ఉన్నది. ఈ నేపథ్యంలో యూపీలో ఎస్పీ– బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి 30–35 స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అయిదు స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యం లేదు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కూడా ఇదివరకు వచ్చినన్ని సీట్లు బీజేపీకి రావడం అసాధ్యం. హిందీ రాష్ట్రాలలో మొత్తం 70 సీట్ల వరకూ తగ్గే అవకాశం ఉంది. అందుకే పశ్చిమబెంగాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని శక్తివంచన లేకుండా ప్రయత్నం. బెంగాల్లో, ఒడిశాలో, అస్సాంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించగలిగితే బీజేపీకి స్వయంగా 200 సీట్లకు పైగా రావచ్చుననీ, పాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోపాటు కొత్త భాగస్వాములను చేర్చుకొని అధికారంలో బీజేపీ కొనసాగే అవకాశాలు ఉన్నాయనీ అంచనా. శుక్రవారం మీడియా సమావేశంలో నరేంద్ర మోదీ మాటలు జాగ్రత్తగా గమనించినవారికి ఈ విషయం బోధపడి ఉంటుంది. బీజేపీకి స్వయంగా 300 సీట్లు వస్తాయనీ, అయినా సరే మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంలో అంతరార్థం అదే. చంద్రబాబు చక్రవిన్యాసం 1996–97లో పరిస్థితులు వేరు. అప్పుడు సీపీఎం నాయకుడు హరికిషన్‌సింగ్ సూర్జిత్, డిఎంకె అధినేత ఎం కరుణానిధి ఉండేవారు. వారే ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునేవారు. చంద్రబాబు నాయుడు యువ ముఖ్యమంత్రిగా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా, అనుసంధానకర్తగా పని చేసేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరి ప్రేరణ లేకుండానే వివిధ పార్టీల నాయకులు ఎన్నికలలో తాము గెలిచిన సీట్ల సంఖ్య ఆధారంగా, తమ ప్రయోజనాల పరిరక్షణే పరమావధిగా నిర్ణయాలు తీసుకుంటారు. నాడు చంద్రబాబు నాయుడి చొరవతో ఏర్పడిన దేవగౌడ, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలు చెరి సంవ త్సరం కూడా నిలబడలేదు. అటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్య మైతే దేశానికి అంతకంటే అపకారం మరొ కటి ఉండదు. సుస్థిర ప్రభుత్వమే దేశానికి క్షేమదాయకం. ఎన్నికల సంఘం సభ్యులను కలుసుకున్న అనంతరం చంద్రబాబు ఎన్సీపీ నాయకుడు శరద్‌పవా ర్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌నీ, శనివారంనాడు రాహుల్‌గాంధీనీ, మాయావతినీ, అఖిలేష్ యాద వ్నీ కలుసుకున్నారు. మమతా బెనర్జీతో సైతం సంప్రదింపుల్లో ఉన్నారు. వారం దరితో ఏమి మాట్లాడి ఉంటారు? వారంతా చంద్రబాబు నాయుడుకు ఏమి చెప్పి ఉంటారు? ఏమీ చెప్పరు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 23వ తేదీ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ ఏర్పాటు చేసిన సమా వేశానికి హాజరు కావాలా లేదా అని ఆలోచిస్తున్న మాయావతి, అఖిలేష్ చంద్రబాబు నాయుడుతో ఏమి చెబుతారు? ఆయన ఏదైనా చెబితే ఆలకించి ఉంటారు. ఎవరు ఎవరిని గుర్తిస్తారో, గౌరవిస్తారో. ఎవరు ఎవరితో కలసి నడు స్తారో ఈ సాయంత్రం వెలువడే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు నిర్ణయిస్తాయి. ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతాయనే ఒకే ఒక అంశంపైన వారికి ఢిల్లీలో లభించే మన్నన ఆధారపడి ఉంటుంది. ఈ లోగా ఎవరి విన్యాసాలు వారు ప్రదర్శించవచ్చు. కె. రామచంద్రమూర్తి -
లాలూచీ రాజకీయం లాభిస్తుందా?
‘నేను విన్నాను. నేను ఉన్నాను.’ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచార సభలలో ప్రస్ఫుటంగా చెబుతున్న మాటలు ప్రజల హృదయాలను నేరుగా తాకుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరాంగ ణంలో ముగ్గురు యోధులు యుద్ధవిన్యాసాలు చేస్తున్నారు. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్ర బాబునాయుడికీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డికీ మధ్య సాగుతున్నదే నిర్ణాయక పోరాటం. మూడో యోధుడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్. ఈ ముగ్గు రిలో ఏ నాయకుడు ఏమని అన్నారో సగటు పౌరులు చెవులారా విన్నారు. కళ్ళారా చూశారు. ఎవరు మాట మార్చుతున్నారో, ఎవరు మాటకు కట్టుబడి ఉన్నారో, ఎవరు సృజనాత్మకంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు బండగా మాట్లా డుతున్నారో, ఎవరు యూటర్న్లు తీసుకుంటున్నారో, ఎవరు రహదారిలో నడుస్తున్నారో తెలుసుకోవడానికి అవసరమైన తెలివితేటలూ, వివేకం పౌరులకు దండిగా ఉన్నాయి. వారికి జ్ఞాపకశక్తి, తెలివి లేవనుకోవడం పొరబాటు. ఏ పార్టీకి ఓటు వేయాలో, ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో ఓటర్లలో అత్యధికులు ఇప్పటికే నిర్ణయించుకొని ఉంటారు. ముగ్గురు నాయకులూ గడచిన 58 మాసాలలో ఏమేమి అన్నారో, ఏమేమి చేశారో గమనిస్తే ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపు తారో ఊహించడం కష్టం కాదు. గెలుపే గమ్యం, మార్గం అధర్మం ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహారం చూద్దాం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ళు పని చేసిన అనుభవం కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఉపయోగిస్తుందనే ఆశతో చంద్రబాబునాయుడిని ప్రజలు గెలిపిం చారు. ప్రమాణ స్వీకారం చేయక ముందే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరువం దల పైచిలుకు వాగ్దానాలనూ పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేయాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నారు. 1995లో ఎన్‌టి రామారావును గద్దె దించిన తర్వాత ప్రపంచబ్యాంకును మెప్పించాలనే రంధిలో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారు. 1999లో సైతం ఎన్నికల ప్రణాళికను అటకపైన పెట్టి విద్యుత్ సంస్కరణల వంటి అప్రకటిత కార్యక్రమాలు అమలు చేశారు. ఈ సారీ అంతే. ఎన్నికల సభలలో చెప్పిన పనులు చేయకుండా చెప్పని పనులు చేయడం మొదలు పెట్టారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం అయిదేళ్ళలో అంగుళ మైనా ముందుకు కదలలేదు. శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చ లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు ఒడిగట్టి అస్మదీయుల చేత భూములు కొనిపించి వారికి లబ్ది చేకూర్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని విభజన చట్టం నిర్దేశించింది. ఆ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ బాధ్యతను అడిగి నెత్తికెత్తుకున్నది అస్మదీయులకు ప్రయోజనం కలిగించడం కోసమే. అయిదేళ్ళ పదవీకాలం పూర్తవుతున్నా పోలవరం సశేషంగా మిగిలింది. చివరికి దుర్గ గుడి కింద ఫ్లయ్‌వోవర్ కూడా పూర్తి చేయలేకపోయారు. విజయవాడ నగరంలోకి ప్రవేశించేవారికి అది వెక్కిరిస్తున్నట్టు కనిపించి అసౌకర్యం కలిగి స్తున్నది. రుణాల మాఫీ పూర్తి కాలేదు. పసుపు కుంకుమ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికలకు ముందు ప్రారంభించారు. చాటుకోడానికి విజయం ఒక్కటీ లేదు. వైఫల్యాలు అనేకం. విద్యార్థుల ఫీజు రీయెంబర్స్‌మెంట్ కోసం మోహన్‌బాబు వంటి మాజీ మిత్రుడు ధర్నాకు దిగవలసి వచ్చింది. అంతులేని వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షంపైన దాడులు చేయడం. ప్రతిపక్ష నాయ కుడిపై బురద చల్లడం, వందిమాగధుల చేత అవాకులూచెవాకులూ మాట్లాడించ డమే ఎన్నికల ప్రచారంగా చెల్లుబాటు అవుతోంది. జగన్మోహన్రెడ్డిని ముఖ్య మంత్రి చేస్తే మిన్ను విరిగి మీద పడుతుందంటూ అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ నవ్వుల పాలు అవుతున్నారు. శ్రేయోభిలాషులకు సైతం ఎబ్బెట్టుగా కని పిస్తున్నాయి ఆయన చర్యలు. 2014లో నరేంద్రమోదీ హవా, పవన్‌కల్యాణ్ ‘పుల్’, టీడీపీ బలం కలిస్తేనే ప్రతిపక్షం కంటే కేవలం ఐదు లక్షల ఓట్ల ఆధిక్యం లభించింది. అప్పటికి చంద్రబాబు పట్ల వ్యతిరేకత లేదు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి జనాదరణ విశేషంగా పెరిగింది. ఒకప్పుడు మోదీ మహా నాయకుడు అంటూ ఆకాశానికి ఎత్తిన చంద్రబాబు మోదీ హవా తగ్గిపోయిందని అంచనా వేసి ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. మోదీ వ్యతిరేకతను రాష్ట్రంలో సృష్టించి ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికలలో గెలుపొందాలని ఆశిం చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగువా రిని దిగ్భ్రాంతికి గురిచేశారు. ఇంతలో పుల్వామాలో సైనిక శకటాలపైన ఉగ్రదాడి జరగడం, 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోవడం, కొద్ది రోజుల తర్వాత భారత వైమానికి దళానికి చెందిన యుద్ధవిమానాలు పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించడం జరిగింది. ఈ పరి ణామాలను తన దేశభక్తికీ, తన ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనమంటూ మోదీ ప్రచారం చేసుకోవడం, ప్రధానిగా కొనసాగడం తథ్యం అంటూ జనాభిప్రాయం బలపడటం చంద్రబాబును పునరాలోచనలో పడవేసింది. వెంటనే మోదీపైన దాడి తీవ్రతను పూర్తిగా తగ్గించారు. చంద్రబాబు తెలంగాణలో రాహుల్ గాంధీతో కలసి చెట్టపట్టాలేసుకొని ఎన్నికల ప్రచారం చేసినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ‘నేను కావాలా, చంద్ర బాబు కావాలా?’ అంటూ ప్రశ్నించి ప్రజల సంపూర్ణ మద్దతు పొందారు. అదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోగించాలనీ, కేసీఆర్‌ని విలన్‌గా చిత్రించా లనీ, ఆయనకు జగన్ బంటుగా వ్యవహరిస్తున్నారని జనాన్ని నమ్మించాలనీ ప్రయత్నం ముమ్మరం చేశారు. అందుకే చంద్రబాబు ప్రతి సభలో జగన్ నామ స్మరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి రహస్య ఒప్పందం ఉంది. కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి వంటి ఎంతోకొంత ప్రజా దరణ కలిగిన నాయకులు టీటీపీ తీర్థం పుచ్చుకున్నారు. చేగువేరా–చంద్రబాబు రెండో వీరుడు పవన్‌కల్యాణ్. ఆయన అగ్రజుడు మెగాస్టార్ చిరంజీవి సౌమ్యుడు. ఆయన పట్ల నాకు గౌరవం ఉంది. పవన్ రాజకీయాలలో ప్రవేశిం చినప్పుడు చేగువేరా అభిమాని. ఇప్పుడు చంద్రబాబు అనుయాయి. వామపక్ష భావజాలాన్ని అభిమానించే వ్యక్తిగా, గద్దర్ వంటి విప్లవ నాయకుల మిత్రుడుగా పరిగణన పొందిన పవన్ రాజకీయాలలో అడుగు పెడుతూనే బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని సంకల్పించడమే విడ్డూరం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక సందర్భాలలో ఆయన పిల్లిమొగ్గలు వేశారు. లోకేష్‌పైన అవినీతి ఆరోప ణలు చేసి ఆ తర్వాత మౌనం పాటించారు. మంగళగిరిలో లోకేశ్ పైన పోటీకి జనసైనికుడిని పెట్టకుండా సీపీఎం అడిగిన టిక్కెట్టును సీపీఐకి ఇచ్చారు. లోకేశ్‌కి ఇబ్బంది లేకుండా చూసేందుకే చంద్రబాబు అభీష్టం మేరకు జనసేన, సీపీఎం అభ్యర్థులను రంగంలో దింపలేదన్నది సామాన్య పౌరులకు సైతం తెలిసిపో తోంది. చింతమనేని ప్రభాకర్ విషయంలోనూ అంతే. అతనిపైన ఉద్యమం నిర్వహించి నిప్పులు కక్కిన పవన్ వైఎస్ఆర్సీపీ ఓట్లు చీల్చి చింతమనేని విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో సత్యవతి అనే బీసీ మహిళను జనసేన అభ్యర్థిగా నిలబెట్టారు. విశాఖ, అమలాపురం, నరసాపురం లోక్‌సభ స్థానాలు జనసేనకు దక్కేటట్టు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ నియోజకవర్గాలలో బలహీనమైన టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారు. విశాఖలో (జేడీ) లక్ష్మీనారాయ ణను గెలిపించాలన్నది చంద్రబాబు అభిమతం. బాలకృష్ణ ఒత్తిడి భరించలేక ఆయన రెండో అల్లుడూ, లోకేశ్ తోడల్లుడూ, దివంగత ఎంవీఎస్ మూర్తి మనుమడూ అయిన భరత్‌కు టిక్కెట్టు ఇచ్చినప్పటికీ టీడీపీ శ్రేణులు జనసేన అభ్యర్థి విజయానికే కృషి చేస్తాయని అంటున్నారు. అమలాపురంలో హర్షకుమా ర్కి టీడీపీ టిక్కెట్టు ఇస్తే జనసేన అభ్యర్థి శేఖర్ (ఓఎన్జీసీ మాజీ డైరెక్టర్)కు గట్టిపోటీ ఇస్తారని భావించి బాలయోగి కుమారుడికి టీడీపీ టిక్కెట్టు ఖరారు చేశారు. నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడిని టీడీపీ అభ్యర్థిగా నిర్ణయిం చారు. ఆ తర్వాత సుబ్బారాయుడి స్థానంలో సంపన్నుడైన చైతన్యరాజును బరిలోకి దింపారు. కొంతకాలం ఎన్నికల ప్రచారం చేసిన తర్వాత ఆయననీ పక్కనపెట్టి ఉండి శాసనసభ్యుడు శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ఫిక్సింగ్‌ల ఫలితంగా జనసేన అభ్యర్థులు ఖాయంగా గెలుస్తారని కాదు. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉన్నదని ఇటువంటి ఉదంతాలు నిరూపిస్తున్నాయి. గాజువాక సీటును సీపీఎం అడిగింది. అక్కడ ఉద్యమాల నాయకుడు నరసింగరావును నిలబెట్టాలన్నది సీపీఎం ఉద్దేశం. పవన్ స్వయంగా ఆ సీటును వరించినప్పుడు వామపక్షాలు ఏమి చేయగలవు? మాయావతికి మూడు లోక్‌సభ స్థానాలూ, 21 శాసనసభ స్థానాలూ కేటాయించడం చంద్ర జాలంలో భాగమే. వామపక్షాలకు చెరి రెండు లోక్‌సభ స్థానాలూ, ఏడేసి అసెంబ్లీ స్థానాలూ కేటాయించారు. ఇది స్థానికంగా కొద్దోగొప్పో ఉనికి కలిగిన వామ పక్షాలను అవమానించడమే. సీపీఐకి కేటాయించిన విజయవాడ లోక్‌సభ నియోజక వర్గంలోనూ, నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలోనూ జనసేన అభ్యర్థులను ప్రకటించినట్లు తాజా సమాచారం. లాలూచీ రాజకీయానికి ఇది పరాకాష్ట. వైఎస్ఆర్సీపీకి పడే కాపు, దళిత ఓట్లను చీల్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడ. కానీ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో, బీ–ఫారాలు ఎవరు ఇస్తారో ఇంతవరకూ స్పష్టత లేదు. ఉత్తరాది, దక్షిణాది వైరుధ్యం గురించి గంభీర ప్రసంగాలు చేసిన పవన్ పనిగట్టుకొని లక్నో వెళ్ళి మాయావతిని కలుసుకోవడం, పొత్తు పెట్టుకో మని అడగడం, ఆమె ప్రధాని కావాలని తాను అభిలషిస్తున్నట్టు చెప్పడం కపట రాజకీయానికి నిదర్శనం. స్వయంగా సినిమా నటుడు కనుక స్క్రిప్టు చదవడం సుఖంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నారు. కానీ తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారనే వ్యాఖ్య చేసినందుకు పవన్‌కల్యాణ్‌ను తెలుగు జాతి క్షమించదు. పవన్ లోగడ తన సినిమా రిలీజైనప్పుడు కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఆయన నాయకత్వం లక్షణాలను పొగిడారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తాను టీఆర్ఎస్కే ఓటు వేశానంటూ నాగబాబు ప్రకటించారు. రాజకీయ లబ్ధికోసం రెండు రాష్ట్రాల మధ్య ద్వేషం రగిలించే వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ వంటి వ్యక్తి చేస్తారని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రవాహానికి ఎదురీదిన నేత మూడో యోధుడు జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికలకు ముందు సోనియా గాంధీని ధిక్కరించడం, సొంత పార్టీ పెట్టుకోవడం, ధిక్కారమును సైతునా అంటూ ఆగ్రహించిన సోనియా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం, నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడితో కలిసి పథకం ప్రకారం జగన్‌పైన బూటకపు కేసులు పెట్టించడం, దర్యాప్తు పేరుతో 16 మాసాల పాటు జైలులో నిర్బంధించడం చరిత్ర. 2014 ఎన్నికలలో శక్తివంచన లేకుండా పోరాడినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయినప్పుడు అధైర్య పడలేదు. నిరాశ చెందలేదు. కుంగిపోలేదు. 2019 ఎన్నికలకు అప్పటి నుంచే సన్నాహాలు ఆరంభించారు. పార్టీని పటిష్టంగా నిర్మించారు. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. కోట్ల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు ఆలకించారు. తనపైన హత్యాప్రయత్నం జరిగినప్పుడు హుందాగా ప్రవర్తించారు. అధికారపక్షం ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఎజెండాను నెలకొల్పారు. దానికి స్పందించక తప్పని స్థితిలో చంద్రబాబును పడవేశారు. ప్రత్యేక హోదా ఉద్యమం జగన్ ఆరంభించి కడదాకా కొనసాగిస్తే ముందు హోదా దండగనీ, ప్యాకేజీ మెండుదనీ వాదించి, చివరికి హోదా నినాదంతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ నిష్క్రమించింది. మోదీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా జగన్ ఎజెండాను చంద్రబాబు అనుసరించక తప్పలేదు. వైఎస్ఆర్సీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి నప్పుడూ చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. వృద్ధులకు పింఛన్లు పెంచడానికీ, పసుపు కుంకుమ కార్యక్రమానికీ జగన్ పాదయాత్రలో చేసిన వాగ్దానాలూ, అంతకు మందు పార్టీ ప్లీనరీలో పేర్కొన్న నవరత్నాలే ప్రేరణ. ఎజెండా నిర్ణయిం చిన నాయకుడే మార్గదర్శకుడు. అతడే విజేత. కె. రామచంద్రమూర్తి -
కప్పదాట్లు... కట్టుకథలు!
‘వాట్ ఈజ్ డెమాక్రసీ? సమ్‌బడీ విల్ గివ్ మనీ, సమబడీ ఎల్స్ విల్ స్పెండ్ దట్ మనీ డ్యూరింగ్ ఎలక్షన్స్. వాట్ వే ఐ యామ్ కన్సర్న్డ్? (ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఎవరో ఒకరు డబ్బులు ఇస్తారు. మరొకరు ఎన్నికలలో ఖర్చు చేస్తారు. దీనితో నాకేమిటి సంబంధం?).’ ప్రజాస్వామ్యాన్ని ఇంత సరళంగా, ధనప్రధానంగా నిర్వచించిన మేధావి ఎవరో కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ప్రజాస్వామ్యాన్ని ఆయన అర్థం చేసుకున్న తీరు అది. ప్రజాస్వామ్య వైతాళికులనూ, ప్రపంచ మేధా వులనూ ఉటంకించడం ఆయన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య సంప్రదాయాలను సమున్నతంగా నిలపాలని త్రికరణశుద్ధిగా ప్రయత్నించే నాయకుల బాపతు కాదు ఆయన. ఆచరణయోగ్యమైన, తనకు అర్థమైన రీతిలో రాజకీయం చేయడం తిరుపతి విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడుగా ఉన్న కాలం నుంచీ చంద్రబాబునాయుడికి బాగా అబ్బిన విద్య. రాజకీయాలంటే వివిధ కులాల మధ్య సమన్వయం సాధిస్తున్నట్టు కనిపిస్తూనే అస్మదీయులకు ప్రయో జనాలూ చేకూర్చుతూ పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడిపించడం అని ఆయన అవ గాహన. అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎటువంటి చాణక్యం చేసినా, ఏ నియమం ఉల్లంఘించినా తప్పు లేదనీ, అధికారంలో కొనసాగడానికి అధికార దుర్వినియోగం చేయడానికి సంకోచించనక్కరలేదనీ ఆయన భావిస్తారు. అధి కారం కైవసం చేసుకునే క్రమంలో ఎవరి సహకారం అవసరమైతే వారి సహ కారం తీసుకోవాలనీ, అందుకు ఏ వాగ్దానం అవసరమైతే ఆ వాగ్దానం నిరభ్యం తరంగా చేసేయాలనీ, అధికారం జేజిక్కిన తర్వాత తన మనుషులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏమి చేసినా సమర్థనీయమేననీ నమ్మకం. అధికారం హస్తగతం చేసుకునే క్రమంలో తనకు సహాయం చేసినవారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న పట్టింపు లేదు. మాటపైన నిలబడాలన్న నిబద్ధత లేదు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమని గట్టిగా విశ్వసించిన నాయకుడు ఆయన. ఫలితంగా, ఈ రోజు సామాన్యులు ఎవ్వరూ ఎన్నికలరంగం వైపు తేరి పార చూడలేని పరిస్థితి నెలకొన్నది. పదుల కోట్ల రూపాలయలు ఖర్చు చేసిన వారే ఎన్నికల రంగంలో దిగి తమ అదృష్టం పరీక్షించుకోగలరు. సేవానిరతి, నిస్వార్థచింతన, సమాజంపట్ల ప్రేమ, అంకితభావం ఉన్నంత మాత్రాన చాలదు. డబ్బు దండిగా ఉండాలి. ఎన్నికల వ్యవహారం ఇంతగా డబ్బుతో ముడిపడే విధంగా దిగజారడానికి కారణభూతులైన నాయకులలో చంద్రబాబు అగ్రగణ్యులు. అందుకే ప్రజాస్వామ్యాన్ని ధనభూయిష్టంగా అంత అలవోకగా నిర్వచించగలిగారు. మన సులోని మాట అప్రయత్నంగానే బయటికి వస్తుంది. రాజకీయ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో, తన పరిమితులను తెలుసుకొని వాటిని అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆయన దిట్ట. ఏ ఎన్నికలలో ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలో, ఎవరిని చేరదీయాలో, ఎవరిని దూరంగా పెట్టాలో తెలిసిన వ్యక్తి. ఆయనకు పరాజయం అంటే భయం. అభద్రతాభావం, వైఫల్యభీతి ఆయనను ఎల్లప్పుడూ వెన్నా డుతూ ఉంటాయి. ప్రతిక్షణం, ప్రతిరోజూ తానే గెలుపొందాలనీ, అందుకోసం ఏమైనా సరే చేసేయాలనీ ఆయన భావిస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే గెలిచినా, ఓడినా పెద్దగా ప్రభావం వేయని ఉప ఎన్నికలో గెలిచేందుకు ఆయన అధికార యంత్రాంగాన్ని రంగంలో దింపుతారు. పది మంది మంత్రులనూ, పాతికమంది ఎంఎల్‌ఏలనూ, డబ్బు సంచులనూ ఉపఎన్నిక జరు గుతున్న ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పరుగులు పెట్టించి ఘనవిజయం సాధిస్తారు. ఇందుకు నంద్యాల ఉపఎన్నిక తాజా ఉదాహరణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలలో కాంగ్రెస్ చావుదెబ్బ తినడంలో తన ప్రమేయం ఉన్నప్పటికీ అసలు తెలం గాణలో ఎన్నికలు జరగనట్టూ, తాను ప్రచారం చేయనట్టూ మాట్లాడతారు. నీతినియమాలకు తిలోదకాలు రాజకీయాలలో నాయకులుగా జయప్రదంగా కొనసాగుతున్నవారందరికీ గొప్ప తెలివితేటలూ, మేధాసంపత్తీ ఉండాలన్న నియమం లేదు. సమాచారం తెలి సినవారితో సంపర్కం పెట్టుకొని వారి ఆలోచనలను సొంతం చేసుకొని తమ ఆలోచనలుగా చెప్పుకుంటూ ప్రజలను నమ్మించే నేర్పు కొందరికి ఉంటుంది. నియమనిబంధనలనూ, నీతీనిజాయితీలనూ తప్పకుండా కష్టపడి రాజకీయా లలో పైకి వచ్చిన నాయకులు కొందరు ఉంటారు. నియమాలతో నిమిత్తం లేకుండా నీతిని పట్టుకొని వేళ్ళాడకుండా విజయం సాధించడానికి ఏది అవ సరమైతే అది చేసి అధికారం సంపాదించి పదవులలో చాలా సంవత్సరాలు ఉన్నవారూ లేకపోలేదు. వీరికి అసాధారణమైన పోటీ మనస్తత్వం ఉంటుంది. అభద్రతాభావాన్ని కప్పి పుచ్చడానికీ లేదా అధిగమించడానికీ బుకాయించడం, దబాయించడం, స్వోత్కర్షకు దిగడం ఆనవాయితీ. కళ్ళెగరవేస్తూ, చూపుడు వేలుతో ఛాతిని చూపిస్తూ తాను ఎవ్వరికీ భయపడననీ, ఎవ్వరికీ లొంగే ప్రసక్తి లేదనీ, సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలామందిని చూశాననీ ప్రకటనలు చేస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో తప్పు చేసి ఇతరులపైన తోసి అడ్డంగా దబాయిస్తూ ఉంటారు. అటువంటి ఘటనలలో డేటా చౌర్యం ఒకటి. మా సమాచారం దొంగిలించి మాపైనే దాడులు చేస్తారా?, ‘మా డేటాను దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు?,’అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో పట్టుబడి విజయవాడకు పలాయనం చిత్తగించిన సమయం లోనూ ఇదే వరుస. ‘మీకు పోలీసులు ఉన్నారు. మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది,’అంటూ రభస. డేటా చౌర్యం కేసులో కూడా తెలంగాణ ప్రభుత్వం తొమ్మదిమంది అధికారులతో ఒక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్) నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తొమ్మి దిమందితో ఒక సిట్ నియమించింది. తెలంగాణ సర్కార్ ఒక సిట్ నియమిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు సిట్లు నియమించింది. పైగా, తన రాజకీయ జీవితంలో నడవడిక (కేరెక్టర్)కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానంటూ చెప్పు కుంటారు. ఇంతవరకూ చంద్రబాబు పేరున కానీ లోకేశ్ పేరు మీద ఉన్న సంస్థ లపైన కానీ ఆదాయంపన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, సీబీఐ దాడులు నిర్వహించలేదు. నోటీసులు సైతం ఇవ్వలేదు. అక్రమాలు చేసినట్టు అను మానించిన సంస్థలపైన దాడులు జరుగుతున్నాయి. నిజంగా ఆ సంస్థలు అక్ర మాలు చేయకపోతే వాటికి నష్టం జరగదు. మరి తనను మానసికంగా వేధిస్తు న్నారంటూ చంద్రబాబు ఎందుకు మనస్తాపం చెందుతున్నారు? అక్ర మంగా ఓటర్ల వ్యక్తిగత వివరాలను అపహరించిన సంస్థపైన వచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని పోలీసులు స్పందిస్తే దానిని రెండు రాష్ట్రాల మధ్య యుద్ధ మంటూ అభివర్ణించడం దేనికి? ఆంధ్రప్రదేశ్‌లో 3.6 కోట్ల మంది ఓటర్ల కలర్ ఫొటోలతో సహా సకల వ్యక్తిగత వివరాలు రాష్ట్రప్రభుత్వం సేకరించి ఐటీగ్రిడ్స్ అనే సంస్థకు ఎందుకు అప్పగించిందో చంద్రబాబునాయుడు తెలిసినా చెప్పరు. ఎన్నికల కమిషన్ వద్ద మాస్టర్ కాపీలో మాత్రమే ఉండవలసిన ఓటర్ల కలర్ ఫొటోలు బ్లూఫ్రాగ్, ఐటీగ్రిడ్స్ వంటి సంస్థలకూ, సేవామిత్ర వంటి యాప్‌లకూ ఎట్లా లభించాయో వెల్లడించరు. ఐటీగ్రిడ్స్ సీఈవో అశోక్ అనే వ్యక్తి రెండు, మూడు రోజుల్లో అజ్ఞాతవాసానికి స్వస్తి చెప్పి బయటకు వస్తారని చెబుతారు. అంటే అశోక్‌ను ఎక్కడ దాచారో ముఖ్యమంత్రికి తెలుసని అనుకోవాలి. తెలంగాణ పోలీసులు వెతుకుతున్న నిందితుడికి ఒక ముఖ్యమంత్రి రక్షణ కల్పించడం చట్టవిహితమా? చంద్రబాబు రాజకీయం అవకాశవాదానికి పరాకాష్ఠ. ప్లేటు మార్చిన చంద్రబాబు నాలుగు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ పట్ల ప్రజలలో ఆదరణ తగ్గినట్టు కనిపించింది. బీజేపీని మోయడం కంటే ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో కరచాలనం లాభదాయకమని భావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కాంగ్రెస్‌తో ఒప్పందం క్షేమదాయకం కాదని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు ఉండదు కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పని చేస్తాయని ప్రకటించారు. మొన్నటి వరకూ చంద్రబాబు తీవ్రస్వరంతో మోదీని విమర్శించేవారు. సవాలు చేసేవారు. ఆయన కంటే తాను సీనియర్‌నంటూ పదేపదే చెప్పేవారు. తనకూ, మోదీకీ మధ్య పోరాటం జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసేవారు. ఢిల్లీ, కోల్‌కతా తదితర నగరాలకు వెళ్ళి ప్రతి పక్షాలకు సంఘీభావం ప్రకటించేవారు. జగన్మోహన్రెడ్డికి మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)ల రహస్య మద్దతు ఉన్నదంటూ పదేపదే ఆరోపించారు. అంతలోనే సీను మారింది. చంద్రబాబునా యుడు ప్లేటు కూడా మారినట్టుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్‌లో భారత వాయుసేన దాడి చేసిన తర్వాత జరుగుతున్న ప్రచారం ఫలితంగా మోదీ పైచేయి సాధించారనీ, ఆయన ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం ఉన్నదనే అభిప్రాయం దేశప్రజలలో బలపడింది. ఇది గ్రహించిన చంద్రబాబు ఎందుకైనా మంచిదని మోదీపైన దాడులు తగ్గించారు. కేసీ ఆర్పైనా, తెలంగాణ పోలీసులపైనా ధ్వజమెత్తడానికి తాజాగా వెల్లడైన డేటా కుంభకోణాన్ని వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉండవలసిన డేటాను తెలంగాణ పోలీసులు ఐటీగ్రిడ్స్ నుంచి తస్కరించి జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి ఇచ్చారంటూ సరికొత్త దాడికి తెరదీశారు. తాను కావాలో, కేసీఆర్ కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. ఇటువంటి వాక్యాలే ఎక్కడైనా వినినట్టు పాఠకులకు అనిపిస్తే అది వారి తప్పు కాదు. నాలుగు మాసాల కిందట తెలం గాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఇటువంటి ప్రశ్నే అడిగారు. తాను కావాలో చంద్రబాబు కావాలో కోరుకోమని ప్రజలకు పిలుపు నిచ్చారు. వారు నిర్ద్వంద్వంగా కేసీఆర్ కావాలనే సంకల్పం ప్రకటించారు. అత్యధిక మెజారిటీ కట్టబెట్టారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ ప్రచారం చేయబోరు. చంద్రబాబులాగా పొరుగు రాష్ట్రంలో చక్రం తిప్పాలనే దురాశ కేసీఆర్‌కు లేదు. అయినా సరే, ఏదో ఒక విధంగా ప్రజలలో భావావేశం రగిలించాలని చంద్రబాబు తాపత్రయం. ఇందుకోసం డేటా చౌర్యం ఉదంతాన్ని వినియోగించుకోవాలని ప్రయత్నం. వృధాప్రయాస శనివారం అంతటా చంద్రబాబునాయుడు అసాధారణమైన అంశాలు వెల్లడిం చబోతున్నట్టు అనుకూల మీడియాలో ఊదర కొట్టారు. చివరికి సుదీర్ఘ మీడియా సమావేశంలో చంద్రబాబు చెప్పిన విషయంలో కొత్త అంశం ఏమీ లేదు. ఎన్నికల కమిషన్‌కు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పట్టుకొని అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్టు పేజీ నంబర్లు చెబుతూ, కొన్ని వాక్యాలు చదువుతూ చాలా ముఖ్యమైన విషయం కనిపెట్టినట్టు హడావిడి చేశారు. అంతా హుళక్కి. విజయసాయిరెడ్డి ఫిర్యాదు రహస్యం కాదు. అది బహిరంగ పత్రం. ‘అంతా విజయసాయిరెడ్డి చెప్పినట్టే జరుగుతోంది,’అంటూ, ‘దొంగతనాలు జరగవచ్చు, దాడులు జరగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి,’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ చంద్రబాబు మీడియా సమావేశాన్ని అపహాస్యం చేశారు. అంతకు ముందు ఒక సారి ‘మీ ఇంట్లో ఆడపిల్లను ఎత్తుకొని పోవచ్చు,’ అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లా డవలసిన తీరేనా ఇది? ప్రజల వివేకాన్ని అంత తక్కువగా అంచనా వేయడం తప్పు. ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరు ఓటర్ల సమాచారం సేకరించారో. ఓటర్ల బ్యాంకు ఖాతాల, లావాదేవీల వివరాలు సమస్తం ఒక బినామీ ప్రైవేటు కంపెనీకి ఎట్లా కట్టబెట్టారో, ఆ వివరాలను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ కార్యకర్తలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో, ఓట్లు ఎట్లా తొలగిస్తున్నారో అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదు ప్రజలు. దొంగతనాలూ, దాడులు జరగకుండా నిరోధించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని కూడా ప్రజలకు తెలుసు. వైఫల్య భీతి చంద్రబాబు చేత అసంబద్ధమైన, నిరాధార మైన ఆరోపణలు చేయిస్తున్నది. ముఖ్యమంత్రి పథకం ప్రకారం ఆవేశపడుతున్నారు కానీ ప్రజలు సంయమనం పాటిస్తున్నారు. 2004, 2009లో లాగానే ఈసారి కూడా చంద్రబాబునాయుడు ఎత్తుగడలు ఫలించకపోవచ్చు. ప్రజలలో వ్యతిరేకత బలంగా ఉన్నట్టు సమా చారం. స్వయంకృతం. కె. రామచంద్రమూర్తి -
ఎన్నాళ్లీ నిరర్థక విన్యాసాలు?
వాస్తవాన్ని అవాస్తవంగానూ, అవాస్తవాన్ని వాస్తవంగానూ చిత్రించి నమ్మిం చడం రాజకీయాలలో ప్రధానక్రీడగా కొంతకాలంగా నడుస్తోంది. పౌరుల మన సులలోనే ఈ ఆట రాజకీయనేతలు ఆడతారు. వారు ఎంత లాఘవంగా, ఎంత సమర్థంగా ఆడతారనే దానిపైనే వారి రాజకీయ ఫలాలు ఆధారపడి ఉంటాయి. చాలా సంవత్సరాలుగా గమనించడం వల్ల ఒక రాజకీయనేత పట్ల ప్రజలలో ఒక స్థూలమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని మార్చడానికి రాజకీయనాయకుడు రకరకాల విన్యాసాలు చేస్తాడు. అవి ఎంత ప్రభావవంతంగా ఉంటే ఫలితాలు అంత సానుకూలంగా ఉంటాయి. వీటినే ‘మైండ్‌గేమ్స్’ అంటారు. ఈ క్రీడలో భాగంగా కొన్ని దృశ్యాలనూ, సన్నివేశాలనూ, వాతావరణాన్నీ పనికట్టుకొని సృష్టిస్తారు. ఒకే అభిప్రాయాన్ని అన్ని స్థాయిలలోనూ పదేపదే ప్రచారం చేస్తారు. దీన్నే ‘గ్లోబల్ ప్రచారం’ అంటున్నారు. నిజానికి ఇది ‘గోబెల్స్ ప్రచారం’. 1933 నుంచి 1945 వరకూ హిట్లర్ మంత్రిమండలిలో ప్రచార వ్యవహారాల మంత్రిగా పని చేసిన జోసెఫ్ గోబెల్స్ పేరు మీద వాడుకలోకి వచ్చిన మాట. ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్ర బాబునాయుడు అందెవేసిన చేయి. 1995లో ముఖ్యమంత్రి పదవి హస్తగతం చేసుకున్నప్పుడూ, మరుసటి సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించినప్పుడూ, 2014 ఎన్నికలలో గెలుపొందినప్పుడూ ‘మైండ్ గేమ్స్’ చంద్రబాబుకు విశేషంగా దోహదం చేశాయి. ఈ క్రీడలో మీడియా సహ కారం అత్యంత కీలకం. సహచరుల తోడ్పాటూ అవసరం. నేతలపైనా, పార్టీల పైనా ప్రజలలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ప్రాంతం, సామాజిక వర్గం, వృత్తి, ప్రవృత్తి, ఆర్థికస్థాయి, సామీప్యత, మరికొన్ని ఇతర కారణాల ఆధా రంగా అభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ అభిప్రాయాలు అశాశ్వతం. స్వీయా నుభవం ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 2014లో కొత్త రాష్ట్రానికి సారథ్యం వహించే నాయకుడికి అనుభవం ఉంటే బాగుంటుందని భావించి చంద్రబాబుకు ఓటు వేసినవారిలో చాలామంది కడచిన నాలుగున్నర సంత్సరాల అనుభవం కారణంగా తమ నిర్ణయం సరైనది కాదని గ్రహించి ఉంటారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘మైండ్ గేమ్స్’ దిశలో మార్పు చేసే నేర్పు టీడీపీ అధినేతకు దండిగా ఉంది. విస్తారమైన తన అనుభవంతో (ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ సహకారంతో అద్భుతాలు చేస్తానని నమ్మించారు. అవకాశం వచ్చినప్ప టికీ అన్ని రంగాలలోనూ విఫలమైనారు. అవినీతి మాత్రం విశృంఖలమై అన్ని రంగాలకూ విస్తరించింది. కథనంలో, దృశ్యంలో మార్పు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కథనం, దృశ్యం మార్చవలసిన అగత్యం ఏర్ప డింది. ప్రజలకోసం పోరాడతాననీ, అవసరమైతే ప్రధాని మోదీపైన తిరుగు బాటు చేస్తాననీ, ఆంధ్రుల ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగిస్తాననీ చంద్ర బాబు నమ్మబలుకుతున్నారు. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించేం దుకు ఉద్దేశించింది ఈ వ్యూహం. ఈ దిశగా పోరాటానికి అవసరమైన ప్రాతిపది కను నిర్మించడానికి వీలుగానే ఎన్డీఏ నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత మోదీ తన వెంట పడబోతున్నట్టూ, కేంద్ర సంస్థల చేత దాడులు చేయించబోతున్నట్టూ వరుసగా ప్రకటనలు చేశారు. అటువంటి పరిస్థితే వస్తే ప్రజలు తనకు రక్షణ వలయంగా నిలబడాలని అభ్యర్థించారు. దీనికి సమాంతరంగా ఒకానొక నటుడి చేత ‘ఆపరేషన్ గరుడ’ అనే టీవీ నాటకానికి తెరలేపారు. ఏది జరిగినా ఈ ఆప రేషన్‌లో భాగమేనని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న పదేళ్ళలో పార్టీని నడిపించడానికి ఆర్థిక సహాయం చేసిన వ్యాపార రాజకీయ నాయకులలో సుజనాచౌదరి, సీఎం రమేష్, నారా యణ ప్రముఖులు. వీరికి రాజకీయాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, వ్యాపారా వకాశాలూ కల్పించి వారి వ్యాపారాలలో చంద్రబాబు భాగస్వామ్యం స్వీకరించా రన్నది బహిరంగ రహస్యం. వీరే కాకుండా టీడీపీ అధినేత సంకేతాలకు అను గుణంగా నిధులు సమకూర్చేవారూ, ఖర్చు చేసేవారూ అనేకమంది ఉంటారు. వారికి టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏదోరకంగా లబ్ధి చేకూరుతూ ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోని దాదాపు అన్ని పార్టీలలోనూ అటుఇటుగా ఉంటుంది. టీడీపీలో ఇది దశాబ్దాలుగా వ్యవస్థీకృతమై బలంగా వేళ్ళూను కున్నది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే దర్యాప్తు సంస్థలు సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు నమ్మడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారి చెప్పుచేతలలోనే అవి నడుస్తాయని అత్యధికుల అభిప్రాయం. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్, ఆదాయంపన్ను(ఐటీ) శాఖ, కేంద్ర నిఘా సంస్థ, ఇతర కేంద్ర సంస్థలు ఏవైనా ఒకానొక సంస్థలోనో, వ్యక్తి నివా సంలోనో సోదాలు జరిపినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది అనుకోకుండా దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని దుయ్యపట్టడం రివాజు. రాజకీయ ప్రయోజనాలూ, అభిప్రాయాలూ, విధేయతలూ ఇటువంటి సంద ర్భాలలో అనుసరించే వైఖరిని శాసిస్తాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అస్తమయం తర్వాత ఓదార్పుయాత్రకు అడ్డుపడిన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి వైదొలిగి సొంతపార్టీ పెట్టుకున్న జగన్మోహన్రెడ్డిపైన సీబీఐ సుదీర్ఘంగా దాడులు చేసి కేసులు పెట్టినప్పుడు సంబరపడినవారు ఇప్పుడు రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇళ్ళలోనూ, కార్యాలయా లలోనూ సోదాలు చేస్తే ఆంధ్రులపైన దాడి చేస్తున్నారంటూ, రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గుండెలు బాదుకుంటున్నారు. అవినీతి ఏ మేరకు జరిగిందో స్పష్టంగా తెలుసు కనుక దాడులు జరుగుతాయని ముందే ఊహించి దానికి అవసరమైన నేపథ్యాన్ని సృష్టించారు. ఇటువంటి పరిణామాలు రాకుండా నివారించేందుకే సుజనాచౌదరిని కేంద్రంలో మంత్రిగా నియమించి, సీఎం రమేష్‌ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)సభ్యుడిని చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగడమే కాకుండా గుజరాత్‌లోనూ, కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్‌కు వందల కోట్ల నిధులు టీడీపీ అధినేత పంపించారని మోదీకి సమాచారం అందిందనీ, అంతలేసి నిధులు ఎట్లా సమకూరుతున్నాయో తెలుసుకోవాలని ఆయన కుతూహలంగా ఉన్నారనీ బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారసంస్థలలో ఐటీ అధికారులు సోదా చేయడం సర్వసామాన్య మనీ, ఇందుకు చంద్రబాబూ, లోకేశ్‌బాబూ భుజాలు తడుముకోవడం ఎందు కని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా ఆ సంస్థలు వ్యవహరిం చినట్లయితే ఇప్పుడు జరుగుతున్న సోదాలు ఎప్పుడో జరగవలసింది. ఎన్డీ ఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పుడే అమరావతిలో రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఇసుకమాఫియా స్వైరవిహారం చేసింది. పోలవరం, పట్టిసీమ, ఇతర సాగునీటి ప్రాజెక్టులలో అవినీతి సాగింది. ఎన్డీఏ నుంచి తప్పుకున్న కార ణంగా, ఉక్కు ఫ్యాక్టరీ కడపలో పెట్టాలని వారం రోజులు దీక్ష చేసిన కారణంగా ఐటీ శాఖను ప్రధాని ప్రయోగించారన్నట్టు ధ్వనించే విధంగా ఇప్పుడు మీడి యాలో రాస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీని ధిక్కరించిన కారణంగా సీబీ ఐని ప్రయోగించారని ఇదే మీడియా రాయలేదు. హాస్యాస్పదమైన వ్యాఖ్యలు కొన్ని హాస్యాస్పదమైన ప్రకటనలకు కూడా మీడియా ప్రచారం ఇస్తోంది. అభి వృద్ధిలో గుజరాత్‌ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ముందుకు పోతుందోనన్న భయంతో, ఈర్ష్యతో, చంద్రబాబుకి తనకంటే ఎక్కువ కీర్తి వస్తున్నదనే దుగ్ధతో మోదీ కుట్రపూరితంగా ఐటీ అధికారులతో చేయిస్తున్నారంటూ ఆరోపిస్తు న్నారు. అక్షరాస్యతలో, తలసరి ఆదాయంలో, ఇతర అభివృద్ధి సూచికలలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లతో పోటీ పడుతూనే అన్నింటిలోనూ నంబర్ ఒన్ అంటూ ప్రచారం చేసుకునే వైఖరికి ఇది కొనసాగింపు. కానీ ప్రజలు అంత గుడ్డిగా నమ్మరు. వారికీ తెలివితేటలు ఉంటాయనీ, ఇంగితజ్ఞానం, కనీస పరిజ్ఞానం ఉంటాయనీ, ధర్మాధర్మ విచక్షణ వారి అంతరాత్మకు ప్రబోధం చేస్తుందనీ గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగున్నరేళ్ళుగా ప్రాజెక్టుల పనులు కానీ ఏ విధంగా జరుగుతున్నాయో, అంచనాలు ఎంత విచ్చలవిడిగా సవరిస్తున్నారో, కాంట్రాక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌పైన ఎట్లా ఎవరికి కట్టబెడు తున్నారో ప్రజలకు రేఖామాత్రంగానైనా తెలియకపోదు. పాత కాంట్రాక్టర్లపైన 60 సి నిబంధనను ప్రయోగించి వేటు వేయడం, మిగిలిన పనుల వ్యయ అంచనాలు పెంచివేసి రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడం ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అన్ని కాంట్రాక్టులూ రమేష్‌కే దోచిపెడుతున్నారంటూ వరదరాజులురెడ్డి వంటి టీడీపీ నాయకులే బహిరంగంగా ఫిర్యాదు చేసే స్థాయికి ఈ వ్యవహారం వెళ్ళింది. మొత్తం రూ. 3,658 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు ఇచ్చినట్టు చెబుతున్నారు. హంద్రీనీవా, గాలేరునగరి ప్రాజెక్టులలోనే అంచనాలు విపరీతంగా పెంచి నామినేషన్ పద్ధతిపైన రూ. 1,156కోట్ల విలువైన పనులు రమేష్‌కు అప్పగించారు. చిత్తూరు జిల్లాలో 1980–90 మ«ధ్య కాలంలో సారా వ్యాపారం చేసిన రమేష్ చంద్రబాబుకి ఎట్లా దగ్గరైనారో, తిరుపతి దగ్గర 300 ఎకరాల గుడిమాన్యం తక్కువ ధరకు ఎట్లా ఇప్పించారో, ఆ భూమిని తాకట్టు పెట్టించి బ్యాంకు రుణంతో రిత్విక్ కంపెనీ ఎట్లా పెట్టించారో చాలామందికి తెలుసు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులకు రాయలసీమలో రమేష్, దక్షిణ కోస్తాంధ్రలో నారాయణ, తెలంగాణలో సుజనాచౌదరి ఏ విధంగా ఆర్థిక సహా యం చేశారో పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. కాంట్రాక్టు తీసుకోవడం, సబ్‌కాంట్రాక్టుకు ఇవ్వడం, సబ్‌కాంట్రాక్టర్ల ఖాతాలో డబ్బులు జమ చేయడం, వాటిని నగదు రూపంలో డ్రా చేయడం నిరవధికంగా జరిగినట్టు ఐటీ శాఖ అధికారులు అలహాబాద్ బ్యాంక్ లావాదేవీల ద్వారా గమనించినట్టు పత్రికలలో వార్తలు వచ్చాయి. బ్యాంకులో అప్పులు తీసుకొని, నిధులు దారి మళ్ళించి, అప్పులు ఎగగొట్టిన వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేశారు. ముఖ్యమంత్రి మెహర్బానీ కారణంగా నామి నేషన్ పద్ధతిపైన వేలకోట్ల రూపాయల విలువ కలిగిన పనులు సంపాదిం చుకున్న వ్యాపారి ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు చేశారు. వారు వ్యాపారరాజకీయులు. ప్రజలు నవ్వుకోరా? ఇటువంటి తనిఖీలు జరిగినప్పుడు వ్యాపారరాజకీయులను వెనకేసుకొస్తే ప్రజలు మెచ్చుతారా? ఐటీ సోదాలను ఆంధ్రులపైన దాడిగా అభివర్ణించడం ఆంధ్రులకు గౌరవప్రదమా? ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలూ, పెట్టుబడులూ రాకుండా చేసేందుకే ఈ దాడులు చేస్తున్నారంటూ మంత్రి పదవిలో ఉన్నవారు ఆరోపించడం శోభాయమానంగా ఉంటుందా? తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని ప్రజలు ఆలోచించరా? నిజానికి ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదా చేసి అన్నీ సక్రమంగానే ఉన్నాయని కితాబు ఇస్తే సదరు రాజకీయవ్యాపారి ప్రతిష్ఠ పెరగదా? సోదాలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించకముందే ‘కక్ష రాజకీయాలు’ అంటూ ధ్వజమెత్తడం సమంజసమేనా? రేవంత్‌రెడ్డి ఇంటి లోనూ, ఆయన బంధువుల ఇళ్ళలోనూ సోదాలు జరిగినప్పుడు చంద్రబాబు స్పందించడం ఎందుకు? ‘అఫెన్స్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణకోసం ముందే ఎదురుదాడి చేయడం ఉత్తమం)’ అంటారు. ఇదే పద్ధతి చంద్రబాబు అవలంబించారు. కానీ ఎవరికి కొమ్ముకాస్తున్నారో, వారి గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటో గమనించడం లేదు. రాజకీయ నాయకులను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆవలించకుండానే పేగులు లెక్కబెట్టే తెలివితేటలు పల్లెల్లో నివసించే రైతులకు కూడా ఉంటాయని మరచిపోకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా కొన్ని నిర్ణయాలు పారదర్శకంగా జరగాలని ప్రగతికాముకులూ, ప్రజాస్వామ్యప్రియులూ కోరుకుంటారు. సాగునీటి ప్రాజె క్టులకూ, రోడ్ల నిర్మాణానికీ, ఇతర ప్రభుత్వ పనులకూ కాంట్రాక్టులు ఇచ్చే పద్ధతి ధర్మంగా, న్యాయంగా ఉండాలి. ప్రాజెక్టుల వ్యయం అంచనాలను సవరించే విషయం సైతం అందరికీ సమంజసంగా కనిపించాలి. ఈ రెండు అంశాలలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏదైనా రాజ్యాంగబద్ధమైన సంస్థ పరిశీలించి ఆమోదించిన తర్వాతనే అమలు జరగాలి. వ్యాపారులే రాజకీయ నాయకులు కావడం, వ్యాపారరాజకీయ నాయకులో, కాంట్రాక్టర్లో ముఖ్యమంత్రులకు బినా మీలు కావడం, వారే ఎన్నికలలో ఖర్చులకు నిధులు సమకూర్చడం అనే విష వలయాన్ని ఛేదించకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. కె. రామచంద్రమూర్తి -
హింసాత్మక భాషావరణం!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల నగారా మోగనే మోగింది. పోలింగ్ డిసెంబర్ 7న జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాలని సెప్టెంబర్ మొదటివారంలో సిఫార్సు చేసినప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పోలింగ్ నవంబర్ రెండు లేదా మూడో వారంలో జరుగుతుందని అంచనా వేసుకున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల పేర్లు గల్లంతైనాయంటూ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ చివరకు హైకోర్టులో విచారణకు రావడం, అక్టోబర్ 8వ తేదీన సమా ధానం చెప్పాలనీ, సవరించిన జాబితా సమర్పించాలనీ హైకోర్టు ఎన్నికల సంఘానికీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఆదేశాలు ఇవ్వడంతో ఓటర్ల జాబితా ప్రకటన తేదీని అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12కు వాయిదా వేశారు. ఈ కారణంగానే పోలింగ్ తేదీ అధికార పార్టీ ఊహించిన దానికంటే మూడు వారాలు వెనక్కు పోయింది. ఆ మేరకు కేసీఆర్ లెక్క తప్పింది. కాంగ్రెస్‌కు ఊపిరిపీల్చుకునే వ్యవధి దొరికింది. ఏ లక్ష్యంతో ముందస్తు ఎన్నికల ఎత్తుగడ కేసీఆర్ వేశారో అది కొంతమేరకు దెబ్బతిన్నది. పరుష పదజాలం ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. నెల రోజుల కిందటే 105మంది టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఆ వెంటనే పెద్ద బహిరంగసభ నిర్వహించారు. కొద్ది విరామం అనంతరం నిజా మాబాద్ సభతో ప్రచారం పునరారంభించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మహాకూటమి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మినహా తక్కిన పార్టీలను ఒకే తాటిమీదికి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో బద్ధశత్రువుగా భావించవలసిన టీడీపీతో సైతం పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. ఇంతవరకూ జరిగిన ఎన్నికల ప్రచార సభలలో కేసీఆర్ మాట్లాడిన తీరు గమనించినవారికి తెలం గాణలో ఎన్నికల పోరాటం ఆయనకూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడికీ మధ్య జరుగుతున్నదనే అభిప్రాయం కలుగుతుంది. మొదటి రెండు సభలలో చేసిన ప్రసంగాలలో కొంత నిగ్రహం ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత జరిగిన సభలలో కేసీఆర్ నిప్పులు కురిపించారు. భావంలో స్పష్టత, భాషలో కాఠిన్యం కేసీఆర్ ప్రత్యేకత. అంత తీవ్రంగా మాట్లాడకుండానే చెప్పదలచింది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పగల నేర్పు కేసీఆర్‌కు ఉన్నది. ఓర్పు లేదు. ఉద్యమం పతాకస్థాయిలో ఉన్నప్పుడు ప్రయోగించిన పరుష పద జాలం తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న తొలి ఎన్నికలలో ముఖ్య మంత్రి నోట వినిన విజ్ఞులు విస్తుపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం అంతే పదునైన భాషలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు కేసీఆర్‌పైన ఆయన శైలిలోనే దాడి చేశారు. రేవంత్‌రెడ్డి సంగతి చెప్ప నక్కరలేదు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ కూడా తక్కువ తినలేదు. ఆమె కూడా ప్రత్యర్థులను దుర్భాషలాడారు. కేసీఆర్‌కి ఉన్న వాగ్ధాటి చంద్రబాబుకి లేదు. ఆ కొరతను ఎత్తుగడలతో, వ్యూహరచనతో, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేసే నైపుణ్యంతో భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న నాలుగున్నర సంవత్సరాలలో ఫలానా ప్రాజెక్టు కట్టానని కానీ ఫలానా పరిశ్రమ తెచ్చాన ని కానీ, ఫలానా వాగ్దానం నెరవేర్చాన ని కానీ చెప్పి ప్రజలను మెప్పించే అవకాశం చంద్రబాబునాయుడికి లేదు. అరచేతిలో స్వర్గం చూపించడంలోనే పుణ్యకాలం గడిచిపోయింది. బీజే పీతో నాలుగేళ్ళు సహజీవనం చేసి సాధించింది పూజ్యం. అనవసరమైన విదేశీ యానాలూ, అస్మదీయులకూ, బినామీలకూ అక్రమంగా దోచిపెట్టారనే ఆరోప ణలూ, అవధులు లేని దుబారా, హద్దు మీరిన ఆర్భాటం, అంతులేని స్వోత్కర్ష (నేను సీజన్డ్ పొలిటీషియన్ని, సీనియర్మోస్ట్ స్టేట్స్‌మన్‌ని, మోదీ కంటే సీనియర్ని) మినహా చెప్పడానికి చేసిన మంచిపని ఏమీ లేదు. సాధించిన ఘన కార్యాలు చూపించి ఓట్లు అడిగే అవకాశం లేదు కనుక బీజేపీనీ, నరేంద్రమోదీనీ ఆంధ్రులకు పరమశత్రువులుగా అభివర్ణించి, మోదీపైన యుద్ధం చేస్తున్న తిరు గుబాటు వీరుడిగా, ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా ప్రజలను నమ్మించాలని ఎన్డీఏ నుంచి వైదొలిగినప్పుడే నిర్ణయించుకున్నారు. అప్పుడు తన అసమర్థ తనూ, వైఫల్యాలనూ చర్చనీయాంశాలు కాకుండా చేయవచ్చునని ప్రణాళిక. నిజానికి చంద్రబాబుకి అంతకంటే మరో మార్గం లేదు. మోదీ సహకరించి ఉంటే టీడీపీ అధినేత వ్యూహం ఫలించేది. అమరావతి భూముల కుంభకోణంపైనో, పోలవరం అవినీతిపైనో, వేలకోట్ల రూపాయల విలువ చేసే కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిలో అస్మదీయులకు కట్టిపెట్టడంపైనో విచారణ జరిపించాలని మోదీ నిర్ణయిస్తే బాధితుడిగా అభినయించి ప్రజల సానుభూతి పొందే అవకాశం చంద్రబాబుకి ఉండేది. కోట్లకు పడగలెత్తిన నారాయణ, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి సన్నిహితులపైన కేసులు పెట్టినా రాజకీయ కక్ష సాధిస్తున్నారంటూ గగ్గోలు పెట్టేవారు. ఆ పనులేవీ మోదీ చేయడం లేదు. మోదీ, అమిత్‌షాలు తమ శక్తియుక్తులన్నీ వింధ్యపర్వతాలకు ఆవలే వినియోగిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తాము చేయగలిగింది ఏమీ లేదని వారికి స్పష్టంగా తెలుసు. కానీ మోదీని ఒక భయంకరమైన శత్రువుగా చిత్రించడం, అటువంటి బలమైన, క్రూరమైన శత్రువుతో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వీరుడిగా ప్రజలను మెప్పించడం చంద్రబాబుకి అత్యవసరం. అందుకే బాబ్లీ ప్రాజñ క్టు నిర్మాణంనాటి పాత కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంటు (ఎన్బీడబ్ల్యూ) పంపిస్తే దాన్ని మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కలసి కుట్ర చేసి పంపించినట్టు నానా యాగీ చేయడం. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధర్మాబాద్ కోర్టుకు వెళ్ళడమా, మానటమా అనే అంశంపైన చర్చ జరపడం నిరర్థక రాజకీయానికి నిదర్శనం. ఉత్తరతెలంగాణ మీదుగా ధర్మాబాద్‌కు కార్లలో భారీ ఊరేగింపుగా వెడితే ఎన్నికల ప్రచారం చేసినట్టు కూడా ఉంటుందని ఒక మంత్రి సలహా ఇచ్చారట. ఎవరైనా వ్యాపారి లేదా పారి శ్రామికవేత్త పన్ను చెల్లించని పక్షంలో ఆదాయంపన్ను శాఖ లేదా వాణిజ్యపన్ను శాఖ అధికారులు సోదా చేయడం సర్వసాధారణం. తెలంగాణలో టీఆర్ఎస్కు ఫిరాయించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలలోనూ, కార్యాలయాల లోనూ ఆదాయంపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఇవి మామూలుగా జరిగే సోదాలేననీ, వారికి అనుమానం వస్తే సోదా చేస్తారనీ, అనుమానాలు నివృత్తి చేస్తే సమస్య ఉండదనీ ఏ మాత్రం ఆవేశం లేకుండా ఆయన విలేఖ రులకు వివరించారు. కేసీఆర్ ఆ విషయంపైన స్పందించ లేదు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారపక్షంతో, ప్రతిపక్షంతో సంబంధాలు ఉన్న కొందరు వ్యక్తుల ఇళ్ళలోనూ, కార్యాలయాలలోనూ సోదాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖ అయిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అనేక సందర్భాలలో ప్రభుత్వాధికారుల ఇళ్ళపైన దాడులు చేశారు. రవాణాశాఖలో పని చేస్తున్న ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఇరవై కోట్ల విలువైన ఆస్తుల వివరాలు లభించినట్టు వార్తలు వచ్చాయి. గాలిమరపై యుద్ధం గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కట్టలేదనే కారణంగా ఆదాయంపన్ను శాఖ నిర్వహించిన సోదాలను ‘ఐటీ పంజా’ అంటూ పత్రికలు సంచలనా త్మకమైన శీర్షికలు ఇచ్చి ప్రచారం చేశాయి. ముఖ్యమంత్రి హడావిడిగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ‘రాష్ట్రంపైన ప్రధాని మోదీ పగబట్టారు. కేంద్రం కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. మూకుమ్మడి ఐటీ దాడులు ఇందులో భాగమే. కేంద్రం దుర్మార్గాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి. కేంద్ర వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలి’ అంటూ మంత్రులకు ముఖ్యమంత్రి ఉద్బో« దించారు. లేని కోటలో లేని శత్రువును ఊహించుకొని యుద్ధం చేయడం చూస్తుంటే చిన్నతనంలో చదివిన నవలలో కథానాయకుడి పాత్ర గుర్తు కొస్తున్నది. 17వ శతాబ్దం అరంభంలో స్పానిష్ రచయిత సర్వెంటెస్ (Cer-vantes) రచించిన డాన్ క్విక్జోట్ (Don Quixote) అనే నవలలో తనను తాను మహాయోధుడుగా ఊహించుకునే డాన్ క్విక్జోట్ రోజీనాంటీ (Rosinante) అనే గాడిదలాగా కనిపించే ముసలి గుర్రంపైన శాంకోపాంజా (Sancho Panza) అనే శిష్యుడితో కలసి స్వారీ చేస్తూ ఒక సత్రానికి వెడతాడు. దాన్ని కోటగా భ్రమిస్తాడు. అక్కడ ఉన్న వేశ్యలను రాచకుటుంబానికి చెందిన మహిళలుగా భావించి వారికి అర్థం కాని ఉదాత్తమైన భాషలో ప్రసంగిస్తాడు. యుద్ధం చేసి తన సత్తా నిరూపించుకోవాలి కనుక ఒక అట్టకత్తి ధరించి గాలిమరతో పోరాటం చేస్తాడు. అదే తరహాలో తనను శత్రువుగా గుర్తించడానికి నిరాకరించే మోదీతో మహాసమరం చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేందుకు మీడియా సహకారంతో టీడీపీ అధినేత ఎంత హంగామా చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఆదా యంపన్ను శాఖ అధికారులకు భద్రత ఉపసంహరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు కానీ లోకేశ్ కానీ హైదరాబాద్ సందర్శిస్తే తెలంగాణ ప్రభుత్వం రక్షణ ఇవ్వనంటే ఏమి చేస్తారు? రేపు ధర్మా బాద్ కోర్టుకు వెడితే అక్కడ చంద్రబాబునాయుడికి భద్రత కల్పించరాదని మహా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఏమి చేస్తారు? ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరం లేదని దేశీయాంగ శాఖ నిర్ణయిస్తే ఏమి చేస్తారు? సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగించే వైఖరి ఇది. చిన్న సంస్థలపైన ఆదాయంపన్ను శాఖ అధి కారులు సోదాలు నిర్వహిస్తే దానిని రాష్ట్రానికీ, కేంద్రానికీ మధ్య యుద్ధంగా, ముఖ్యమంత్రికీ, ప్రధానమంత్రికీ మధ్య పోరాటంగా ఏకపక్షంగా ప్రచారం చేసు కోవడం అసాధారణమైన విషయం. దేశంలో మరే నాయకుడూ ఇటువంటి హాస్యాస్పదమైన విన్యాసాలు చేయలేదు. తెలంగాణ ఫలితం కీలకం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా ఆరు మాసాల వ్యవధి ఉన్నది. దానికి డ్రెస్ రిహార్సల్‌గా తెలంగాణలో ఎన్నికలు ముందుగానే ఏర్పాటు చేశారు కేసీఆర్. చంద్రబాబునాయుడు సహాయసహకారాలతో తెలంగాణలో మహాకూటమి గెలిస్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధిస్తే 2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని నిలువరించవచ్చునని కాంగ్రెస్ అధిష్ఠానం ఆశ. అందుకు చంద్రబాబునాయుడు, మమతాబెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీల నాయకులు దోహదం చేస్తారని అంచనా. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించడంతో కేసీఆర్ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులను కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లు కలిసి గబ్బర్‌సింగ్ అనో, సన్నాసులనో, దద్దమ్మలనో విమర్శించవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌వారిని తెలంగాణ ద్రోహులంటూ టీఆర్ఎస్ నేతలు నిందించినా ప్రజలు విశ్వసించరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అనే సంగతి ప్రజలకు తెలుసు. కానీ చంద్రబాబుపైన ఎన్ని బాణాలు వేసినా, ఎంత బలంగా దాడి చేసినా ప్రజలు విశ్వసిస్తారు. ఎందుకు? చంద్రబాబునాయుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయనకు తెలంగాణలో ఏమి పని? సీలేరు ప్రాజెక్టుతో సహా ఏడు మండలాలు తెలంగాణ నుంచి ‘లాక్కున్న’ వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెబుతూ కేంద్రానికి అదే పనిగా లేఖలు రాసిన నేత, ‘వోటుకు కోట్ల’కేసులో ఫోన్లో మాట్లాడుతూ లడ్డూలాగా దొరికిపోయి హైదరాబాద్‌ని వదిలిపెట్టి అమరావతికి వెళ్ళిపోయిన నాయకుడిని తెలంగాణ ద్రోహిగా, అవినీతిపరుడుగా నిందించడం తేలిక. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒకవైపు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానవర్గానికీ, మరోవైపు అమరావతిలో చంద్రబాబుకీ గులాములంటూ వాక్బాణాలు సంధించడం, ప్రజలను నమ్మిం చడం సులువు. కాంగ్రెస్, టీడీపీల కలయిక అనైతికమంటూ కేసీఆర్ దుయ్య బడతారు. కేసీఆర్, నరేంద్రమోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనీ, వారు కుట్రపన్ని తననూ, తన పార్టీనీ వేధిస్తున్నారనీ చంద్రబాబు అంటారు. అదే ఆరోపణ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లు ఒకే తానులో ముక్కలంటూ టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ దాడి చేస్తారు. ఏది సత్యమో, ఏది అసత్యమో చెప్పడం కష్టం. స్పష్టాస్పష్ట దృశ్యం, దబాయింపు రాజకీయం, విశృంఖల ప్రచారం సత్యాన్ని మబ్బులాగా కమ్మేసినప్పుడు సత్య దర్శనం అసాధ్యం. రెండు మాసాల తర్వాత కానీ (డిసెంబర్ 11న) జన హృదయం బోధపడదు. కె. రామచంద్రమూర్తి -
వ్రతం చెడినా ఫలం దక్కేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది: 1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్‌తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్‌తో అసద్ అనుబంధం బలమైనది. ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్ కాబోతున్నారని అసద్ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం. టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్‌కి రానే వచ్చారు. టీఆర్ఎస్లోకీ, కాంగ్రెస్‌లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్‌లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి ‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్కుమార్ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్‌ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్ఎస్ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం. అస్థిరతకు బాటలు దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. కాంగ్రెస్‌వారిని కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్‌ఫ్రంట్ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి ‘జన్‌మోర్చా’ను నెలకొల్పారు. దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. నేషనల్‌ఫ్రంట్ అధ్యక్షుడుగా ఎన్టీఆర్ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్‌ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది. బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్‌లోని సమస్తిపూర్ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్‌ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్‌కు దక్కింది. విపి సింగ్ హయాంలో కశ్మీర్ లోయనుంచి 90 వేలమంది పండిట్లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్ఫ్రంట్కు కన్వీనర్‌గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు. రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్‌ఫ్రంట్ కన్వీ నర్గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్‌సింగ్ సూర్జీత్ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్‌ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది. హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు. పొత్తుల వీరుడు దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన లోక్‌సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ఫ్రంట్ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్‌సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు. 1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్ఎస్ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్‌ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు. ఓట్లు బదిలీ అయ్యేనా? మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్ఎస్ని ఓడించవచ్చుననే కాంగ్రెస్ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్‌ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్ ఒంటరిగా టీఆర్ఎస్తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
విశ్లేషణ : ‘ముందస్తు’ వెనుక ఏముంది?
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఉత్సాహంగా ఉన్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. రెండు రోజులు పార్టీ సహచరులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ, ఇతర మంత్రులనూ కలుసుకొని చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కే ంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అశోక్ లావాస్నూ, అటార్నీ జనరల్ కె కె వేణు గోపాల్నూ కలుసుకొని ముందస్తు సంగతులు మాట్లాడారు. ఏ రాష్ట్ర ప్రభు త్వమైనా గడువు కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని నిర్ణయించు కొని అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేయవచ్చు. గవర్నర్ ఆమోదించి అసెంబ్లీని రద్దు చేసిన రోజు నుంచి ఆరు మాసాల లోగా ఎన్నికలు విధిగా నిర్వహించాలి. అసెంబ్లీ రద్దు ప్రక్రియ ప్రధానమంత్రి కూడా ఆమోదిస్తే సులువుగా జరుగుతుంది. అందుకే రెండు మాసాలలో మూడోసారి మోదీని కేసీఆర్ కలుసుకున్నారు. ప్రజల మనసుల్లో ఏమున్నదో తెలియదు కానీ పైకి మాత్రం వాతావరణం టీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తున్నది. ప్రతిపక్షాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోతున్న దాఖలా ఏమీ లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొత్తు పెట్టుకున్నా ఓట్లు అటూఇటూ బదిలీ అవుతాయన్న నమ్మకం లేదు. నాలుగు న్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటు చేస్తూ వచ్చిన టీడీపీ ఓటర్లు నాయకులు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌కి అనుకూలంగా వేస్తారా? అదే విధంగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేయడం అలవాటైన కాంగ్రెస్ ఓటర్లు అకస్మాత్తుగా, అకారణంగా టీడీపీకి అనుకూలంగా మారిపోతారా? ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఒంటరిగా పోటీ చేస్తానంటున్నది. ఒక వేళ సీపీఐతో పాటు టీజేఎస్ కూడా కాంగ్రెస్–టీడీపీ కూటమిలో చేరి మహాకూటమి ఏర్పాటు చేసి పాలకపక్ష వ్యతిరేక ఓట్లు చీల కుండా నిరోధించగలిగితే టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అను కున్నంత సులభం కాకపోవచ్చు. అంతమాత్రాన టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు ఎవ్వరూ బల్లగుద్ది చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని కలు గడువు ప్రకారం జరిగితే టీఆర్ఎస్కు వచ్చే నష్టం ఏమిటో అర్థం కాదు. కేసీఆర్ ఎందుకు తొందర పడుతున్నారు? సంక్షేమరాజ్యం దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. 2019 జూన్ ఒకటో తేదీ వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం, హక్కు ఆయనకు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ ప్రణాళికాబద్ధంగా అన్ని తరగతులవారినీ, అన్ని కులాలవారినీ, అన్ని మతాలవారినీ సుముఖం చేసుకోవడానికి తనకు తోచిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ఉన్నారు. గొర్రెలూ, చేపలూ పంపిణీ చేయడం, అన్ని కులాలవారికీ ‘ఆత్మగౌరవ భవనాలు’ కట్టించడం, ఎకరానికి ఒక పంటకు నాలుగు వేల చొప్పున రబీ, ఖరీఫ్‌లు కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకంగా చెల్లించడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, పురోహితులకు సైతం ప్రభుత్వ వేతనాలు ఇవ్వడం వంటి అనేక ఉపకారాలు చేశారు. శుక్రవారంనాడు మరెన్నో వాగ్దానాలు చేశారు. ఈ వితరణ, వేగం, విన్యాసం చూస్తే ముందస్తు ఎన్నికల ఆకాంక్ష కేసీ ఆర్ని తరుముతున్నట్టు కనిపిస్తున్నది. కారణం ఏమిటో ఆయన వెల్లడించడం లేదు కనుక మనం ఊహించవలసిందే. అంతర్గత విభేదాలతో తీసుకుంటున్న ప్రతిపక్షం ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా లేదు కాబట్టి ముందుగానే ఎన్నికల భేరీ మోగిస్తే విజయలక్ష్మి టీఆర్ఎస్నే ఖాయంగా వరిస్తుందనే వాదన ఒకటి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు బస్సులో జనచైతన్య యాత్రలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ సందర్శనతో పార్టీ శ్రేణులలో కొంత ఉత్సాహం కనిపించింది. కానీ ప్రతిజిల్లాలో ముఠాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంమీద కనీసం ఆరుగురు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమని గట్టిగా నమ్ముతున్నారు. వారిలో అయిదుగురు ఉత్తమ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పద వికి సరిపోరని విశ్వసిస్తున్నారు. ఇంకా ఆరు మాసాల తర్వాతనైనా ఈ ముఠాల మధ్య వైరం సమసి, సఖ్యత ఏర్పడి, కాంగ్రెస్ నాయకులందరూ ఏకోన్ముఖులై ఎన్నికల సమరంలో ప్రత్యర్థులతో తలబడతారని అనుకోవడానికి వీలు లేదు. బీజేపీ అధిష్ఠానవర్గానికి ఎందుకో తెలంగాణపైన దృష్టి లేదు. అస్సాంలో చేసి నటువంటి ప్రయోగం తెలంగాణలో చేసే ఉద్దేశం లేదు. బీజేపీ టీఆర్ఎస్ని ప్రత్యర్థిగా పరిగణిస్తున్న దాఖలా లేదు. టీఆర్ఎస్ను ఎలాగైనా సరే ఓడించాలన్న కసి బీజేపీ అధినాయకత్వంలో కనిపించడం లేదు. టీఆర్ఎస్ గెలిచే లోక్‌సభ సీట్లు తమ ఖాతాలోనే పడతాయనే భరోసా కావచ్చు. కనుక ప్రతిపక్షం బల హీనంగా ఉన్నప్పుడే దాడి చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తొందరపడుతున్నా రన్నది ఒక వాదన కావచ్చు కానీ అదే ప్రధాన కారణం కాజాలదు. అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలు జరిపించి, గెలిచి, ముఖ్యమంత్రి పీఠం పైన వారసుడిని కూర్చోబెట్టి లోక్‌సభ ఎన్నికలలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న సంకల్పం కేసీఆర్‌కు ఉన్నదనే వాదన రెండవది. మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ పట్ల సామసర్య వైఖరే కొనసాగిస్తున్నారు. ఇటీవల టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు లోక్‌సభలో ఎన్డీఏ సర్కార్పైన అవిశ్వాసతీర్మానం పెట్టినప్పుడు ఓటింగ్‌లో టీఆర్ఎస్ పాల్గొనకుండా తటస్థంగా ఉంది. ప్రతిపక్ష ఫెడరల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించాలన్న కోరిక ఉన్న నాయకుడు అధికారపక్షం పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం విడ్డూరం. రాష్ట్రంలో టీఆర్ఎస్కి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. కేంద్రంలో కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు టీఆర్ఎస్కు బీజేపీ మిత్రపక్షం. రాష్ట్రంలో మజ్లీస్ (ఏఐఎంఐఎం)తో స్నేహం, విద్యా సంస్థ లలో, ఉద్యోగాలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ అసెంబ్లీ తీర్మానం చేయడం, ముస్లిం బాలబాలికలకోసం సంక్షేమ పాఠశాలలు నెలకొ ల్పడం, సందర్భం వచ్చినప్పుడల్లా నిజం నవాబును స్తుతించడం వల్ల ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నామనే అభిప్రాయంలో కేసీఆర్ ఉండవచ్చు. తెలం గాణ రాష్ట్రంలో దాదాపు 35 శాసనసభ నియోజక వర్గాలను ముస్లిం ఓటర్లు విశే షంగా ప్రభావితం చేస్తారు. రాష్ట్రస్థాయిలో బీజేపీతో బహిరంగంగా స్నేహం చేస్తే ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉంది. రెండు మార్గాలు అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగి, అనంతరం లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ట్లయితే బీజేపీకి జాతీయ స్థాయిలో బాసటగా నిలబడటం, ఢిల్లీలో మకాం పెట్టి మోదీ, అమిత్‌షాలతో కలసి సమాలోచనలు చేసి రణవ్యూహం రచించడం, దాన్ని అమలు చేయడం కేసీఆర్ ముందున్న ఒక మార్గం. మోదీ, షాలు మూడో వ్యక్తిని నమ్ముతారన్న నమ్మకం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ నిర్మాణం చేయాలని మొట్టమొదట అనుకున్న విధంగా ఢిల్లీలో ఉంటూ కొత్త ఫ్రంట్ భాగస్వాముల విజయానికి కృషి చేయడం మరో మార్గం. కాంగ్రెస్‌ని కలుపుకున్నా ఎన్డీఏను గద్దె దింపగలమా అనే సందేహం ప్రతిపక్షాలను పీడిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ రహిత ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ స్వప్నం సాకారం ఎట్లా అవుతుంది? రెండో వాదన కూడా సమంజసంగా లేదు.రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడే ఎన్ని కలకు వెళ్ళడం సరైన నిర్ణయం అన్నది మూడో వాదన. సకాలంలో వానలు దండిగా పడినాయి. ‘మిషన్ భగీరథ’ కింద తాగునీరు అందించే కార్యక్రమం దసరాకి ఆరంభం అవుతుంది. ‘రైతుబంధు’ పథకం సత్ఫలితాలు ఇస్తుందనే ఆశ ఉంది. ఈ పథకం కింద రూ. 12,000 కోట్లు ఖర్చు చేసి 56 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగించాలని ప్రయత్నం. ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండో విడత చెల్లింపు నవంబర్‌లో జరుగుతుంది. రాష్ట్రంలో 45 రకాల సంక్షేమ పథకాలు సాలీనా రూ. 40,000 కోట్ల ఖర్చుతో అమలు జరుగుతు న్నాయి. రైతులూ, మధ్య తరగతి ప్రజలూ ఫిబ్రవరి వరకూ సంతోషంగా ఉంటా రని అంచనా. ఆ తర్వాత పంట చేతికి వచ్చి, గిట్టుబాటు ధర లభించకపోతే రైతుల సంతోషం ఆవిరై పోతుంది. ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ పట్ల ఇప్పు డున్న సద్భావం ఫిబ్రవరి తర్వాత ఉండకపోవచ్చు. ఈ వాదనలో బలం ఉంది. వాస్తవికత ఉంది. నాలుగో కారణం ఎవరో బ్రాహ్మణోత్తముడు కేసీఆర్ జాతకం చూసి ఎన్నికలు డిసెంబర్‌లోపు జరిగితే విజయం తథ్యం అని చెప్పి ఉంటాడు. కేసీఆర్ జాతకాలను ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముహూర్తాలు పాటిస్తారు. యజ్ఞయా గాదులు చేయిస్తారు. ఆయనకు నమ్మకం కుదిరితే బ్రహ్మరుద్రాదులు కూడా ఆయన మార్గాన్ని మార్చలేరు. ముందస్తు ప్రయత్నాలకు ఇదే ప్రాథమిక కారణ మైనా ఆశ్చర్యం లేదు. డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగాలంటే సెప్టెంబర్ 10 లోగా ప్రస్తుత అసెంబ్లీ రద్దు కావాలి. ఇవన్నీ సాఫీగా జరగాలంటే ప్రధాన మంత్రి ఆశీస్సులు కావాలి. శనివారం మధ్యాహ్నం నరేంద్రమోదీతో జరిగిన భేటీలో కేసీఆర్ ఈ విషయం ప్రధానంగా చర్చించి ఉంటారు. జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు వగైరా పెండింగ్ అంశాలపైన ప్రధానితో, కేంద్ర మంత్రులతో చర్చించడానికి ఢిల్లీ వెడుతున్నట్టు మాటవరుసకు చెప్పారు. శనివారం ఉదయం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ నాయకులతో, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. ప్రధానితో చర్చలో పెండింగ్ సమస్యలే ప్రధానాం శమైతే ఇంత హడావిడి ఉండదు. ముందుస్తు ప్రమాదం గడువుకంటే ముందుగా ఎన్నికలకు పోవాలన్న నిర్ణయం కేసీఆర్‌దే అయినా పార్టీ నాయకులతో సమాలోచనలు సుదీర్ఘంగా జరిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు సైతం ఒంటరిగానో, ఆంతరంగిక బృందంతో చర్చించో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆనక అవి పార్టీ సహచరులతో సుదీర్ఘ సమాలో చనలో, వాదోపవాదాల అనంతరం తీసుకున్న నిర్ణయాలుగా ప్రపంచానికి చాటేందుకు గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తారు. సహచరుల మనో గతంతో నిమిత్తం లేకుండా తాను ఇదివరకే తీసుకున్న నిర్ణయాలనే సమష్టి నిర్ణయాలుగా ప్రకటిస్తారు. మారు చెప్పేవారు ఉండరు. దాదాపు అదే వైఖరి కేసీఆర్‌ది కూడా. కేసీఆర్ ఆలోచించినంత లోతుగా, పదునుగా ఆలోచించే వారూ, ఆయన కంటే ఎక్కువ సమయస్ఫూర్తి ఉన్నవారు పార్టీలో మరెవ్వరూ లేరు. కారణం ఏమైనా, గడువుకంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిపించేందుకు అవసరమైన సమస్త చర్యలూ సత్వరం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణ యాన్ని పార్టీ నాయకుల చేత చెప్పించేందుకు బుధవారంనాడు ప్రగతిభవన్‌లో గంటల తరబడి చర్చోపచర్చలకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా వారితో అన్ని గంటలూ కూర్చున్నారు. వాస్తవానికి పార్టీలో ఎవ్వరికీ ముందస్తు ఎన్నికలు ఇష్టం లేదు. మంత్రులు కొంచెం ధైర్యం చేసి ముందస్తు ముచ్చట మంచిగలేదని చెప్పారు. ఎంఎల్ఏలూ అంతే. ఆరు మాసాల అధికారం పోగొట్టుకోవడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు? అసెంబ్లీ రద్దు జరిగితే మంత్రులు మాటమాత్రంగా పదవులలో ఉన్నప్పటికీ అధికారులు ఎవ్వరూ ఖాతరు చేయరు. ఆత్మప్రబోధం విని నిర్ణయాలు తీసుకునే నాయకులలో కేసీఆర్ ఒకరు. 2014లో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ఒంట రిగా ఎన్నికల బరిలో దిగాలన్న సాహసోపేతమైన నిర్ణయం కేసీఆర్‌దే. ముందస్తు ఎన్నికల కారణంగా కోట్ల విజయభాస్కరరెడ్డి 1983లో, ఎన్‌టి రామారావు 1989లో, చంద్రబాబు నాయుడు 2004లో దెబ్బతిని ఉండవచ్చు. అంత మాత్రాన కేసీఆర్ ఆ జాబితాలో చేరాలని లేదు. ఇతరులు విఫలమైన చోట కేసీఆర్ విజయం సాధించవచ్చు. ఎవరి జాతకం వారిది. చివరికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కె. రామచంద్రమూర్తి -
ఆర్థికాంశాలకే అగ్రతాంబూలం
త్రికాలమ్ డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం దాకా విదేశాలకూ, ఆ దేశాలు సూచించే విదేశీ సంస్థలకూ అప్పగిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది? రైతుల నుంచి పంటభూములు సేకరించి విదేశీ సంస్థలకు అప్పగిస్తుందా? సింగపూర్‌ను కృష్ణా, గుంటూరు జిల్లాలకు దిగుమతి చేసుకొని మనం సేవారంగానికే (సర్వీసు సెక్టర్)కే పరిమితం అవుతామా? ఆర్థికాంశాల ప్రాధాన్యం గుర్తించిన రాజకీయవేత్తలదే భవిష్యత్తు. అరకొర సంక్షేమ కార్యక్రమాలూ, లేని ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లూ, కల్లబొల్లి కబుర్లకూ కాలం చెల్లింది. ఉచితాలను ప్రస్తావించకుండా, అభివృద్ధి, సుపరిపాలన హామీలతోనే ఎన్నికల ప్రచారం ప్రభంజన సదృశంగా నిర్వ హించిన నరేంద్రమోదీని ప్రజలు అందలం ఎక్కించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మతప్రాతి పదికన జరిగిన హింసాకాండకు సంబంధించి, సంఘ్ పరి వార్ గురించి ఎన్ని భయసందేహాలు ఉన్నప్పటికీ వాటన్ని టినీ పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు సమాజంలోని అన్ని తరగతుల వారూ, అన్ని కులాలవారూ ఓట్లు వేయడానికి ప్రధాన కారణం మోదీ పాలనలో అభివృద్ధి సాధించగలమనే ఆశ. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ అరవింద్ కేజ్రీవాల్ కంటే మొన్ననే భాజపాలో చేరిన కిరణ్‌బేదీ వైపు మొగ్గడానికీ, కేజ్రీవాల్‌కు పోటీగా బేదీని రంగంలోకి దించడం భాజపా ప్రయోగించిన బ్రహ్మాస్త్రం అని అభినందించడానికీ కార ణం కేజ్రీవాల్ హామీ ఇస్తున్న ఉచితాలతో ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తాడేమోనన్న భయమే. ప్రజాప్రయోజన వ్యాజ్యాలతో సీబీఐ డెరైక్టర్లనూ, కేంద్రమంత్రులనూ, కార్పొ రేట్ దిగ్గజాలనూ గజగజ లాడిస్తున్న ప్రశాంత్ భూషణ్ తండ్రి శాంతిభూషణ్. ఈ కుటుంబం కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ)కి కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవిని 49 రోజుల తర్వాత వదిలివేసినందుకూ, సార్వత్రిక ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు స్థానాలలో ఒక్కదానినీ గెలవలేకపోయినందుకూ సీనియర్ భూషణ్ ఆగ్రహించారు. ప్రశాంత్ భూషణ్ ఇప్పటికీ కేజ్రీవాల్‌ను నేరుగా విమర్శించడం లేదు. కానీ ఎన్నికలలో ఏఏపీ తరఫున ప్రచారం చేయడం లేదు. న్యాయంగా, ధర్మంగా డబ్బు సంపాదించాలని వాదించేవారూ, అక్రమార్కుల గుండెల్లో నిద్రించేవారూ, మానవ హక్కుల కోసం తెగించి పోరాడేవారూ ఈ సుప్రసిద్ధ న్యాయవాదులు. ప్రత్యామ్నాయ నమూనా ఏది? ఆత్మవిమర్శ వ్యక్తులకైనా, రాజకీయ పార్టీలకైనా ఆరోగ్యదాయకమే. రాష్ట్రంలోని పది వామపక్షాల అగ్రనాయకులూ శ్రేయోభిలాషులను ఆహ్వానించి తమ పార్టీలు చేసిన పొరపాట్లు ఏమిటో చెప్పమన్నారు. సీపీఎం మహాసభలు జరగబోతున్న కారణంగా సంపాదకులను పిలిపించుకొని సలహాలు చెప్పవలసిందిగా సీపీఎం నాయకులు అడి గారు. రెండు సందర్భాలలోనూ నేను ఒకే విషయం చెప్పాను. సంపద సృష్టించడానికి మన్మోహన్, మోదీలకు తెలిసిన విపణి నియంత్రిత నమూనాకు ప్రత్యామ్నాయ నమూ నా ఏదైనా సిద్ధం చేసుకోవాలి. పశ్చిమబెంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అధికా రంలో ఉన్న వామపక్ష సంఘటన ప్రభుత్వం సాఫల్యవైఫల్యాలను సమీక్షించుకొని వాటి నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోవాలి. సీపీఎం తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముక్తాయింపు చె ప్పారు. పశ్చిమబెంగాల్లో అధికార వికేంద్రీకరణ చేశామనీ, భూములు పంచామనీ, పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామనీ అన్నారు. కానీ ఆర్థికాభివృద్ధికి తాము ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయం ఏమిటో చెప్పలేదు. మార్కెట్ ఎకానమీకి, ప్రపంచ బ్యాంకు నమూనాకి ప్రత్యామ్నాయంగా సంపద సృష్టించడానికీ, ఆర్థికాభివృద్ధి సాధించడానికీ ఏదైనా నమూనాను సీపీఎం నాయకత్వం కానీ వామపక్ష సంఘటన కానీ రూపొందించిందో లేదో తెలియదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రాక సందర్భంగా నిరసన ప్రదర్శనలు చేసినంత మాత్రాన ప్రజల విశ్వాసం సంపాదించలేరు. ఆర్థికాభివృద్ధి సాధించడానికి వామపక్షాల దగ్గర కానీ కేజ్రీవాల్ దగ్గర కానీ ఎటువంటి వ్యూహం ఉన్నదో తెలిసినప్పుడే, ఆ వ్యూహంపైన చర్చ జరిగి నమ్మకం కుదిరినప్పుడే ప్రజలు వామపక్షాలకు, లేదా ఏఏపీకి మళ్ళీ సానుకూలత ప్రదర్శిస్తారు. మతత త్త్వం మంచిది కాదని ప్రజలకు తెలుసు. సాక్షిమహారాజ్ ఉద్బోధలు అనారోగ్యకరమైనవనే అవగాహనా ఉంది. మోదీతో పాటు సాధువుల, సాధ్వీమణుల విపరీత ధోరణులను భరించవలసి వస్తుందని కూడా ప్రజలకు తెలియక పోలేదు. అయినా సరే మోదీ నాయకత్వానికి ఆమోదం తెలిపింది ఆయన నాయకత్వంలో దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ, పేదరికం తొలుగు తుందనీ, ఉద్యోగాలు వస్తాయనే విశ్వాసంతోనే. చంద్రబాబు నాయుడు ఉబలాటం ఈ సూత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకూ తెలుసు. రాజకీయా లలో దృశ్య ప్రాధాన్యంపైన కూడా బాబుకు అంచనా ఉన్నది. మనం నిజంగా ఏమిటో అన్నదాని కంటే మనం ఏమిటని ప్రజలు అనుకుంటున్నారనేది రాజకీయాలలో ముఖ్య మని ఆయన ఎన్నడో గుర్తించారు. మోదీ హామీ ఇవ్వడానికి సంకోచించిన ఉచితాలను బాబు సార్వత్రిక ఎన్నికలలో ఉదారంగా వాగ్దానం చేశారు. అమలు సాధ్యం కాదని తెలిసి కూడా వంద శాతం అమలు చేస్తానని ఎన్నికల ముందూ తర్వాత కూడా దబాయి స్తున్నారు. సంక్షేమ పథకాల హామీపైన ఎన్నికలలో గెలిచినప్పటికీ తన నిజస్వభావానికి తగినట్టు ఆయన విపణి నియంత్రిత ఆర్థిక వ్యవస్థలో ముందు వరుసలో పరుగులు తీయాలని ఉబలాట పడుతున్నారు. లోగడ కూడా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఢిల్లీ వచ్చినప్పుడు విశ్వప్రయత్నం చేసి పది నిమిషాలు ఇంటర్వ్యూ సంపాదించి కలుసుకున్నారు. పదేళ్ళ తర్వాత మళ్లీ దావోస్‌లో తారసపడిన గేట్స్‌ని కలుసుకొని రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ పరిశోధన కేంద్రం నెలకొల్పవలసిందిగా కోరారు. పదేళ్ల తర్వాత కలుసుకున్న బాబును చూసి బిల్‌గేట్స్ ఉద్వేగం చెందినట్టు రాయడానికి మిత్రపత్రికలు ఉన్నాయి. అవి అతిశయోక్తులు రాయడానికి అవసరమైన దృశ్యాన్ని సృష్టించే తెలివి తేటలూ, యంత్రాంగం చంద్రబాబునాయుడికి ఉన్నాయి. ఆయన పనితీరులో ఇది భాగం. దావోస్‌లో ప్రతి సంవత్సరం జరిగే సంపన్న దేశాధినేతల శిఖరాగ్ర సభకు హాజ రుకావడమే ఆర్థికవేత్తగా గుర్తింపు తెచ్చే అంశంగా చంద్రబాబునాయుడు పరిగణిస్తారు. మోదీ వలెనే తానూ ఆర్థిక సంస్కరణలకు అనుకూలుడనీ, సంపద సృష్టించడానికి ఎంత దూరమైనా వెడతాననీ చెప్పడం ఉద్దేశం. ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు సంకేతాలు పంపడం కూడా అధికార రాజకీయాలలో భాగమే. అక్కడ కలుసుకున్నదీ భారత పారిశ్రామిక వేత్తలనే కావచ్చు. కానీ అందరినీ కలుసుకోవడానికి అది మంచి వేదిక. ఈ కారణంగానే ఒబామా గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవ్వబోయే విందులో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళబోతు న్నారని వార్త వచ్చింది. ఒబామాతో చంద్రబాబు నాయుడు కరచాలనం చేస్తున్న దృశ్యం కనుక సృష్టించగలిగితే, ఆ దృశ్యంలో ప్రధాని, రాష్ట్రపతి కూడా ఉండేట్టు చూసుకోగలిగితే దానికి చాలా విలువ ఉంటుంది. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందిం చేందుకు ఇటువంటి దృశ్యాలు దోహదం చేస్తాయి. అందుకే ఇతర ముఖ్యమంత్రులు ఊహించని విధంగా చంద్రబాబునాయుడు చొరవ తీసుకొని ముందుకు వెడతారు. ఆర్థిక విధానాలలో స్పష్టతే ప్రధానం ఈ ప్రయత్నం సార్థకం కావాలంటే, సంపద సృష్టి జరగాలంటే ఆర్థిక విధానాల విష యంలో స్పష్టత ఉండాలి. పరివారం కోసమో, ఆశ్రీత పెట్టుబడిదారుల కోసమో ఆర్థిక వ్యూహాలు రచించకూడదు. తాజమహల్, చార్మినార్, కుతుబ్మీనార్, భాక్రానంగల్, నాగార్జునసాగర్, సర్దార్ సరోవర్ వంటి బ్రహ్మాండమైన కట్టడాలనూ, ప్రాజెక్టులనూ నిర్మించిన ఇంజనీర్లూ, కాంట్రాక్టర్లూ ఈ దేశంవారే. వారి వారసులు ఇప్పుడూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి డిజైన్ సింగపూర్ ప్రభుత్వం ఇస్తుందనీ, నిర్మా ణంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా నిర్మాణ సంస్థలు పాల్గొంటాయనీ, జపాన్ ఇందుకు సాయం చేస్తుందనీ దావోస్‌లో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది విన్న ప్రపంచాధినేతలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ చంద్రబాబునాయుడి పట్ల, ఆయన ఏలుతున్న రాష్ట్రం పట్ల సద్భావం కలుగుతుందా? గౌరవం పెరుగుతుందా? ఇక్కడి వారు అనర్హులా? కులీ కుతుబ్ షా చార్మినార్ నిర్మించడానికి పర్షియా నుంచి కొందరు నిపుణులకు రప్పించుకున్నాడు కానీ నిర్మాణం చేసింది స్థానిక ఇంజనీర్లే. ఒమాబా సందర్శించలేక పోతున్న తాజమహల్ నిర్మాణంలో కూడా షాజహాన్ పర్షియా నుంచీ మధ్య ఆసియా నుంచీ వాస్తుశిల్ప ప్రవీణులకు పిలిపించుకొని రూపురేఖలు ఖరారు చేయించుకున్నారు కానీ పదహారేళ్ళు సాగిన నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసినవారూ, పర్యవేక్షించిన వారూ భారతీయులే. ఢిల్లీ నిర్మాణానికి డిజైన్ ఇచ్చినవారు బ్రిటిష్ పౌరులైన ఎడ్విన్ లూట్యేన్, హెర్జర్ట్ బేకర్ కావచ్చు కానీ భవనాలు నిర్మించింది ప్రఖ్యాత జర్నలిస్టు, రచ యిత కుష్వంత్ సింగ్ తండ్రి సోహన్ సింగ్. హైదరాబాద్‌లో, ఢిల్లీలో, ముంబైలో అధు నాతన విమానాశ్రయాలు నిర్మించిన కాంట్రాక్టర్లు తెలుగు తేజాలే. నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించిన సమర్థులైన ఇంజనీర్లు ఉన్నా రు. ఇతర దేశాలలో ఆకాశహర్మ్యాల నిర్మాణంలో పాల్గొన్న తెలుగువారూ, భారతీయు లూ చాలా మంది ఉన్నారు. వీరందరినీ కాదని రాజధానిలో సచివాలయం, రాజభవన్, హైకోర్టూ, ఇతర భవనాలూ, రోడ్లూ, ఈతకొలనులూ వంటి నిర్మాణాలకు విదేశాలకు చెందిన నిర్మాణ సంస్థల అవసరం ఉన్నదా? డిజైన్ దగ్గర నుంచి నిర్మాణం దాకా విదేశా లకూ, ఆ దేశాలు సూచించే విదేశీ సంస్థలకూ అప్పగిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుంది? రైతుల నుంచి పంటభూములు సేకరించి విదేశీ సంస్థలకు అప్పగిస్తుందా? సింగ పూర్‌ను కృష్ణా, గుంటూరు జిల్లాలకు దిగుమతి చేసుకొని మనం సేవారంగానికే (సర్వీసు సెక్టర్)కే పరిమితం అవుతామా? దిగువ, మధ్య తరగతి వారి ప్రమేయం ఎక్కడ! ఇటీవల విజయవాడలో ఒక ప్రముఖ వైద్యుడిని కలుసుకున్నప్పుడు ఆయన ఒక ఆశ్చ ర్యకరమైన విషయం చెప్పారు. తన కుటుంబ సభ్యులందరినీ కూర్చొబెట్టి ఇక మీదట ఐదేళ్ళ వరకూ నరేంద్రమోదీ ఏమి చేసినా, చంద్రబాబునాయుడు ఏమి చేసినా ప్రశ్నిం చవద్దని ఆయన ఆదేశించారట. సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కూడా ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమిటంటే మన ఇంజనీర్ల మీద, మన కాంట్రాక్టర్ల మీద, మన దేశం మీద బొత్తిగా నమ్మకం లేకపోవడం. సింగపూర్ మీద, జపాన్ మీద, అమెరికా మీద విపరీతంగా వ్యామోహం ఉండటం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి ఆత్మగౌరవ నినాదానికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను సమాజం తయారు చేసుకోనంత కాలం మోదీ, చంద్రబాబునాయుడు వంటి రాజకీయ నాయకులే పేదలకూ, దిగువ మధ్య తరగతికీ ప్రమేయం లేని విధానాలను నిర్దయగా అమలు చేస్తారు. ప్రత్యామ్నాయ నమూనా సిద్ధం కానంత వరకూ ప్రత్యామ్నాయ రాజకీయాలకీ జనాదరణ ఉండబోదు. murthykondubhatla@gmail.com -
కశ్మీర్ కిటికీ పూర్తిగా తెరుచుకుంటుందా?
త్రికాలమ్ మరికొన్ని రోజుల్లో కాలగర్భంలో కలిసిపోతున్న సంవత్సరం భారతదేశ చరిత్రను అనూహ్యమైన మలుపు తిప్పింది. అరవై ఏడేళ్ళ కిందట స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు మాసాల క్రితం సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ (భాజపా)కి అత్యధిక సంఖ్యా బలం సమకూర్చిన సందర్భం దేశ రాజకీయాలలో నిర్ణ యాత్మకమైనది. ఈ సువర్ణావకా శాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య సంస్థలను సమాదరించి, పరి పుష్ఠం చేసుకొని, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వెల్లివిరిసే భారతావనిని నిర్మించుకుంటామా లేక వ్యక్తి ఆరాధన ముమ్మరమై, నియంతృత్వ ధోరణులు పెచ్చరిల్లి తిరిగి ఎన్నికలు వచ్చే సమయానికి మొన్న తిరస్కరించిన పార్టీకే పట్టం కడతామా అన్నది కొద్ది రోజుల్లో రానున్న సంవత్సరంలో మోదీ నేతృత్వం లోని ఎన్డీఏ సర్కార్ పనితీరుపైనా, రాష్ట్రప్రభుత్వాలు ఆయనతో సహకరించి దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే రీతిపైనా ఆధారపడి ఉంటుంది. నరేంద్రమోదీ ప్రభంజనసదృశంగా ఎన్నికల ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీకి లోక్‌సభలో మొదటిసారి సగానికంటే ఎక్కువ స్థానాలు సంపాదించి పెట్టి చరిత్ర సృష్టించారు. అటువంటి ఘనవిజయంతో దాదాపుగా సమానమైనదీ, ఒక విధంగా అంతకంటే కీలకమైనదీ, చరిత్రాత్మకమైనదీ ఇటీవల జమ్మూ-కశ్మీర్లో భాజపా సాధించిన అపూర్వమైన ఆధిక్యం. జమ్మూ-కశ్మీర్ ప్రజలు ప్రసాదించిన ఈ అవకాశాన్ని సృజనాత్మకంగా, వివేకవంతంగా, దార్శనికతతో, సహనంతో, వ్యూహా త్మకంగా వినియోగించుకుంటే భారత ఉపఖండంలో శాంతి స్థాపించి చరిత్రలో చిర స్థాయిగా నిలిచే అదృష్టం సైతం మోదీభాయ్ని వరించవచ్చు. కశ్మీర్ కిటికీ తెరు చుకుంది. దాని ద్వారా శాంతి సమీరాలను స్వేచ్ఛగా అనుమతించి కశ్మీర్ ప్రజల జీవి తాలలో వెలుగు నింపడమా లేక పాత పద్ధతులే కొనసాగించి అణచివేత విధానాలనే అశ్రయించి కిటికీని మరోసారి మూసివేయడమా! తేల్చుకోవలసిన సంధి సమయం. జమ్మూ-కశ్మీర్ ఎన్నికల ఫలితాలలో రెండు పరిణామాలు ముఖ్యమైనవి. ఒకటి, ఆ రాష్ట్రం ప్రజలు మతం ప్రాతిపదికగా ఓటు చేశారనే అభిప్రాయానికి తావి చ్చారు. భాజపా గెలుచుకున్న స్థానాలన్నీ(25) హిందువులు ఎక్కువగా నివసించే జమ్మూలోవే. ముస్లింలు నివసించే కశ్మీర్ లోయలో కానీ, బౌద్ధుల స్థావరమైన లద్దాఖ్‌లో కానీ ఒక్క సీటు కూడా భాజపా గెలుచుకోలేదు. కశ్మీర్లో అయితే మొత్తం 34 స్థానాలకు పోటీ చేస్తే 33 స్థానాలలో ధరావతు గల్లంతైంది. ఓట్ల శాతం రెండు కంటే తక్కువ. అత్యధిక స్థానాలు (28) గెలుచుకున్న పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) సైతం ఎక్కువ స్థానాలను లోయలోనే సంపాదించింది. జమ్మూ డివిజన్లో ఈ పార్టీకి లభించిన దర్హాల్, రజౌరీ, పూంచ్ స్థానాలలో అత్యధిక ఓటర్లు ముస్లింలే. అందుకే అన్ని ప్రాంతాలలో గెలిచింది నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒక్కటే అంటూ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పుకో గలుగుతున్నారు. జమ్మూ-కశ్మీర్ ప్రజలు మతం ప్రాతిపదికగా ఓటు చేశారనే వాదన బలమైనది. ఇది ఉత్తరోత్తరా కశ్మీర్లో వేర్పాటు ఉద్యమం బలపడితే జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం విభజనకు కూడా ఆస్కారం ఉంది. రెండు, కాంగ్రెస్‌పార్టీ తక్కువ విజయా లతో నాలుగో స్థానానికే పరిమితమైనప్పటికీ, భాజపా విజృంభించి తన ఓటింగ్ శాతాన్ని 12.6 శాతం నుంచి 28.7 శాతానికి పెంచుకున్న కారణంగా జమ్మూ-కశ్మీర్ ఓటర్లలో సగంమంది జాతీయపార్టీలవైపు మొగ్గుచూపారు. ఇది శుభసూచిక. కాంతి శకం ఆరంభమౌతుందా? ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయంగా, స్వేచ్ఛగా జరిగాయని అన్ని పార్టీలూ నిర్ధారించాయి. ఆరేళ్ళ కిందట 2008లోనూ ఎన్నికలు స్వేచ్ఛగానే జరి గాయి. కశ్మీర్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరగడం ప్రారంభమైంది 2002 లో, ప్రధాని వాజపేయి హయాంలో. 2014లో మునుపెన్నడూ లేనంత ఓటింగ్ శాతం, ప్రచారం కూడా కోలాహలంగా జరిగింది. విజయోత్సవాలూ అంతే సందడిగా జరుపుకున్నారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారమైనట్టేనా? కొత్త ప్రభుత్వం ఏర్పడి జనరంజకంగా పరిపాలిస్తే కశ్మీర్లో కటికచీకటి అంతమై కాంతిశకం ఆరంభం అవుతుందని ఆశించవచ్చునా? పోయిన వారం పెషావర్‌లో ఘోరకలికి ప్రపంచం నిర్ఘాంతపోయింది. 130 మందికి పైగా బాలబాలికలను పాకిస్తాన్ తాలిబాన్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘాతుకానికి మనం తల్లడిల్లిపోయాం. ప్రధాని మోదీ తీవ్ర మనస్తాపం వెలిబుచ్చు తూ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు సందేశం పంపించారు. పార్లమెంటు సైతం సంతాప తీర్మానం చేసింది. నేలకూలిన కుసుమాలు పాకిస్తాన్లో పూసినవైనా మనం కన్నీరు మున్నీరైపోయాం. కానీ నాలుగు సంవత్సరాల కిందట కశ్మీర్లో వందమం దికి పైగా ముక్కుపచ్చలారని యువకులు పారామిలిటరీ దళాల, సాయుధ పోలీ సుల తూటాలకు బలైతే మనం అయ్యోపాపం అన్న పాపాన పోలేదు. పెషావర్‌లో హంతకులు మతోన్మాదులు, మతిచలించిన మతవాదులు. కశ్మీర్లో పిల్లల్ని పిట్టల్లా కాల్చివేసినవారు పారామిలటరీ సిబ్బంది. 2010లో పారామిలటరీ దళాలు పేల్చిన బాష్పవాయుగోళం తునక ఒకటి తగిలి తుఫాయిల్ మట్టూ అనే బాలుడి తల పగిలి మరణించాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన యువకులు చేతులలో రాళ్ళు పట్టుకొని వీధులలోకి వచ్చారు. మరతుపాకులు ధరించిన పారామిలటరీ దళాలను ధిక్కరించి నినాదాలు చేస్తూ ప్రదర్శనలు చేశారు. వారిని అణచివేసేందుకు చంపడమే ధ్యేయంగా సాయుధ పోలీసులు కాల్పులు జరిపారు. ఆ నిరసన ప్రదర్శనలలో 120 మందికిపైగా మరణించారు. వీరిలో అత్యధికులు విద్యార్థులు. మొన్నటి పెషావర్ నరమేధం జరిగినరోజునే అక్కడికి నవాజ్ షరీఫ్ చేరుకున్నారు. చనిపోయిన పిల్లలు నా పిల్లలే అంటూ కంటతడిపెట్టారు. కశ్మీర్లో పిల్లల హత్యాకాండ జరిగిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీనగర్ వెళ్ళలేదు సరికదా వందమంది పిల్లలు దారు ణంగా చనిపోయినందుకు సంతాపం ప్రకటించ లేదు. అప్పటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా బాధితులకు ఓదార్పు కలిగించే విధంగా మాట్లాడలేదు. పార్ల మెంటులో ప్రతిపక్షాలు సైతం ఈ అమానుషకాండను తగువిధంగా చర్చనీయాంశం చేయలేదు. పారామిలటరీ తూటాలకు నేలకొరిగిన పన్నెండు, పదమూడేళ్ళ బాలుర అంత్యక్రియల సందర్భంగా శవయాత్రలు చేస్తూ గుండెలు బాదుకుంటూ తల్లిదండ్రులు విలపించిన దృశ్యాలను మన టీవీ చానళ్ళు చూపించనే లేదు. దేశం లోని ముస్లిం మతసంస్థలూ, రాజకీయపార్టీలూ ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వాస్తవానికి సుప్రీంకోర్టు కశ్మీర్లో యువకుల కాల్చివేతను సుమోటోగా పరిగణించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి విచారణ జరపవచ్చు. ఆ పనీ జరగలేదు. భారత సమాజం యావత్తూ పట్టించుకోలేదు. నిర్లిప్తం గానే మిగిలిపోయింది. ధర్మాగ్రహాన్ని కాదనలేం కశ్మీర్లో యువకుల హత్యాకాండ జరిగిన తర్వాత కొంతకాలానికి నేను లోయకు వెళ్ళాను. రెండు వారాలు పర్యటించి సామాన్య ప్రజలనూ, విశ్వవిద్యాయం ఆచా ర్యులనూ, పౌరహక్కుల కార్యకర్తలనూ, హురియత్ నాయకులనూ కలుసుకొని ఇంటర్వ్యూలు చేశాను. కశ్మీర్‌లోయ విషాదంతో, ఆగ్రహంతో, అశాంతితో దహిం చుకొని పోతున్న రోజులవి. గృహనిర్బంధంలో ఉన్న హురియత్ నేత సయ్యద్ అలీ షా గిలానీతో మాట్లాడాను. ఆయన తక్షణం కశ్మీర్‌ని పాకిస్తాన్లో విలీనం చేయాలని వాదించే వ్యక్తి. ‘నేను ఇంతకాలం చెబుతున్నది నిజమే కదా’ అన్న భావన ఆయన ముఖంలో కనిపించింది. భారత్ హంతకదేశం అంటూ కుండబద్దలు కొట్టారు. ఆ సందర్భంలో గిలానీ బంద్ పిలుపు ఇస్తే కశ్మీర్‌లోయలో గాలికూడా స్తంభించేది. మొన్న మోదీని కలిసి భాజపాతో పొత్తు పెట్టుకున్న సజ్జాద్ లోన్ ఇంట్లో ఒక పూట గడిపాను. ప్రొఫెసర్ అబ్దుల్ గనీ లోన్ కుమారుడు. గనీలోన్ ఒక బహిరంగసభలో మాట్లాడుతూ ఉండగా పాకిస్తాన్ నుంచి వచ్చిన మిలిటెంట్లు కాల్చిచంపారు. కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నాయకుడు అమానుల్లాఖాన్ కుమార్తె ఆస్మాను సజ్జాద్ పెళ్ళి చేసు కున్నాడు. ఆమె పాకిస్తాన్ పౌరురాలు. మొన్న భర్త తరఫున ఎన్నికల ప్రచారం చేసింది. విద్యాధికుడైన సజ్జాద్కు కశ్మీర్‌ను ఎట్లాగైనా రావణకాష్టం కాకుండా కాపా డాలనే తాపత్రయం ఉంది. జమ్మూ-కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (జేపీసీ) అధినాయకు డాయన. ‘ప్రధాని, ముఖ్యమంత్రి శ్రీనగర్‌లో సభ పెట్టి కశ్మీర్ సమాజానికి క్షమాపణ చెప్పినట్లయితే భారతదేశంతో స్నేహంగా (భాగంగా అని అప్పుడు అనలేదు. ఇప్పుడు అంటారేమో) ఉండటానికి ఆలోచించే అవకాశం ఉండేది’ అన్నారు సజ్జాద్. ఎన్నికలు ఎన్నయినా జరగవచ్చు. నూటి కి నూరు శాతం పోలింగ్ జరగవచ్చు. అంతమాత్రాన కశ్మీర్ ప్రజలు భారత్‌లో కొనసాగడానికి సంతోషంగా ఒప్పుకున్నట్టు అర్థం కాదు. 2008 నాటి ఎన్నికలకు రెండు మాసాల ముందే 70 మంది కశ్మీరీలు పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పుడు పీడీపీ నాయకుడు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రి. అంతమంది పౌరులు మరణించడం పట్ల ఆయన ఖేదం వెలిబుచ్చలేదు. అప్పటి ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉంది. ప్రజా స్వామ్యం వేళ్ళూనుకుంటోందనీ, కశ్మీరీ ప్రజలు ప్రధాన స్రవంతిలోకి వస్తున్నారనీ మనవాళ్ళు ఆనందం వెలిబుచ్చారు. రెండేళ్ళు తిరగకుండానే అశాంతి ప్రబలింది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా వారు భారతదేశ సార్వభౌమత్వాన్ని ఆమోదిస్తున్నట్టు అర్థం చేసుకుంటే పొరబాటు. మరి ఎన్నికలను ఎందుకు బహిష్కరించడంలేదు? ఈ ప్రశ్నకు ప్రముఖ నవలా రచయిత మీర్జా వహీద్ చెప్పే సమాధానం ఇది: ‘ఎన్నికలలో పాల్గొని ఎవరినో ఒకరిని గెలిపిస్తే వారు తమ ఇళ్ళకు విద్యుచ్ఛక్తి సరఫరా ఏర్పాటు చేసి చలికాలంలో శరీరాలు గడ్డకట్టకుండా కాపాడతారేమోనని, జైల్లో సంవత్సరాల తరబడి నిష్కార ణంగా మగ్గుతున్న సమీప బంధువులను విడిపించడంలో సహకరిస్తారేమోననీ, పట్టభద్రులైనా పనిలేకుండా తిరుగుతున్న యువతీ యువకులకు ఉద్యోగాలు వస్తాయేమోననే ఆశతో ఓటు చేస్తున్నారు’. ఎన్నికలే వివాదాన్ని పరిష్కరించగలిగితే 1957 నుంచి జరిగిన ఎన్నికల ఫలితంగా ఈ వివాదం పది సార్లు పరిష్కృతం అయ్యేది అంటాడు మీర్జా వహీద్. ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఎన్నికల ఫలితంగా నెలకొన్న పరిస్థితులను ఎట్లా వినియోగించుకోవాలి? శ్రీనగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. ఇది మరికొంతకాలం కొనసాగవచ్చు. అసలే కశ్మీర్. అందులోనూ చలికాలం. కదలిక కష్టం. పార్టీల బలాబలాల ప్రాతిపదికగా లెక్కలు వేస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పీడీపీకీ, భాజపాకీ అవకాశం ఉంది. రెండు పార్టీలలో దేనికైనా మద్దతు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పి ఒమర్ అబ్దుల్లా లండన్ వెళ్ళిపోయారు. షరతులు లేకుండా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పీడీపీకి కాంగ్రెస్ పార్టీ గులాంనబీ ఆజాద్ ద్వారా వర్తమానం పంపింది. ఈ రెండు పార్టీలూ 2008లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. పీడీపీ కాంగ్రెస్ ఊసు ఎత్తడానికి కూడా సిద్ధంగా లేదు. భాజపా ప్రధాన కార్యదర్శి, కశ్మీర్ ఎన్నికలలో కీలక పాత్ర పోషించిన రాంమాధవ్‌తో పీడీపీ నాయకులు చర్చలు కొనసాగిస్తున్నారు. కేంద్రంతో సయోధ్య అనివార్యం కశ్మీర్లో ప్రధానంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ కేంద్రంలో అధికారం చలా యిస్తున్న పార్టీతోనే సంబంధాలు పెట్టుకోవాలని కోరుకుంటాయి. కేంద్ర నిధులపైన ఆధారపడిన రాష్ట్రం కావడం ఇందుకు కారణం. భాజపా అభీష్టానికి భిన్నంగా వెడితే కష్టాలు తప్పవనే అవగాహన ఒమర్‌కూ, ఆయన తండ్రి ఫారుఖ్కూ, ముఫ్తీ మెహబూబాకూ, ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌కు దండిగా ఉంది. పీడీపీ ఒక వేళ స్వతంత్రంగా వ్యవహరించి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్‌ల మద్దతు తీసు కుంటే అసెంబ్లీలో సంఖ్యాబలం ఉంటుంది కానీ ఢిల్లీ నుంచి నిధులు అందడం అనుమానం. భాజపా నాయకత్వానికి ఉన్న స్వేచ్ఛ పీడీపీకి లేదు. పీడీపీ, భాజపాలు ముఫ్తీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయ వచ్చు. ఇందులో సజ్జాద్ లోన్‌నూ చేర్చుకోవచ్చు. భాజపా శాసనసభా పక్షం నాయ కుడుగా ప్రస్తుతం ప్రధాని కార్యాలయంలో సహాయమంత్రి జితేందర్ సింగ్ అయినా, నిర్మల్ సింగ్ అయినా ఎన్నికై ఉపముఖ్యమంత్రి పదవి స్వీకరించవచ్చు. దీనివల్ల ఢిల్లీకీ, శ్రీనగర్‌కూ అనుబంధం ఉంటుంది. ఇంతకంటే ఉత్తమం, కశ్మీర్లో సుస్థిర శాంతి స్థాపనకు అవకాశం కల్పించే ప్రత్యామ్నాయం భాజపా నాయకత్వం లో పీడీపీతో కలసిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ప్రధాని మోదీ నాయ కత్వంలో నేరుగా పని చేయడానికి అనువుగా భాజపా ముఖ్యమంత్రి శ్రీనగర్‌లో ఉంటే కశ్మీర్ సమస్యను అన్ని కోణాల నుంచీ అధ్యయనం చేయడానికీ, పరిష్కారం కోసం వ్యూహాన్ని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి మునుపెన్నడూ లేదు. పండిట్ నెహ్రూ షేక్ అబ్దుల్లా స్నేహంపైన ఆధారపడే వారు. ఇందిరాగాంధీ షేక్‌ను జైలు నుంచి విడుదల చేయించినా ఆ కుటుంబంతో సఖ్యత కుదుర్చుకోలేకపోయారు. రాజీవ్‌గాంధీకీ అంతటి వ్యవధి లేకపోయింది. పైగా ఫారుఖ్‌ను దించి ఆయన బావ షాను గద్దెనె క్కించి భంగపడ్డారు. పీవీ కశ్మీర్ వివా దాన్ని క్షణ్ణంగా అర్థం చేసుకున్నప్పటికీ ఎన్నికలను సవ్యంగా జరిపించి ప్రజాస్వా మిక వాతావరణాన్ని పునరుద్ధరించలేకపోయారు. వాజపేయి చొరవ ప్రదర్శించి లాహోర్ వెళ్ళడం, షరీఫ్‌తో, ముషార్రఫ్‌తో చర్చలు జరపడమేకాక వేర్పాటు వాదు లతో సమాలోచనలను అనుమతించారు. మళ్ళీ ఆ అవకాశం మోదీకి దక్కింది. కశ్మీరీల హృదయాలను గెలవడమే మార్గం కశ్మీర్లో సుస్థిర శాంతి అంటే ఏమిటి? అది ఎట్లా సాధ్యం? కశ్మీర్ లోయ ప్రజలు కోరుకుంటున్నట్టు వారికి స్వాతంత్య్రం ప్రసాదించడం ఉత్తమమైన మార్గం అని ప్రపంచంలోని ప్రజాస్వామ్యవాదులంతా భావిస్తున్నారు. అప్పుడు కశ్మీర్ లోయకు మాత్రమే స్వాతంత్య్రం ఇచ్చి జమ్మూ, లద్దాఖ్ డివిజన్లను భారత్‌లో సంపూ ర్ణంగా, బేషరతుగా విలీనం చేసుకోవాలి. ఈ పరిష్కారానికి భారత ప్రభుత్వం కానీ, రాజకీయవ్యవస్థ కానీ, సమాజం కానీ అంగీకరించే వాతావరణం లేదు. జమ్మూ- కశ్మీర్ ప్రజలు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి కశ్మీర్ ప్రజల హృదయాలను గెలుచుకొని వారి ఆమోదంతో వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం ఒక్కటే మార్గం. కశ్మీర్ విషయంలో ఇంతకాలం అన్ని పార్టీల కంటే భిన్నంగా వాదిస్తున్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఒక్కటే సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అమలు చేయగలదు. 370వ రాజ్యాంగ అధికరణ గురించి కానీ, ఉమ్మడి పౌరసత్వం గురించి కానీ, ప్రత్యేక ప్రతిపత్తి గురించి కానీ అభ్యంతరాలు చెబుతూ, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీనీ, ఇతర పార్టీలనూ కుహనా లౌకికవాదులుగా ముద్రవేసి నిందలు వేస్తూ వచ్చిన భాజపా కశ్మీరీల మనసు గెలుచుకోవడానికి ఏమి చేసినా కుహనా లౌకికపార్టీలు అభ్యంతరం చెప్పవు. కశ్మీరీ సమాజంతో సమాలోచనలు జరిపి వారికి ఏ విధమైన సంబంధం భారతదేశంతో కావాలో తెలుసుకొని గూడుకట్టుకున్న భారత వ్యతిరేక భావాన్ని దూరం చేయగలిగితే అది చరిత్రాత్మకం అవుతుంది. పక్కన పాకిస్తాన్ కనీవినీ ఎరుగని సక్షోభంలో ఉన్నది కనుక కశ్మీరీలు కూడా తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌తో భావోద్వేగంగా కూడా విలీనం కావ డానికి సిద్ధపడవచ్చు. ముఖ్యంగా కశ్మీర్లో కొత్తతరం ఉచితాలను ఆశించడంలేదు. ఆత్మగౌరవంతో జీవించాలనీ, ఇతర రాష్ట్రాలలోని పౌరులకు ఉన్నట్టే తమకు కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ అమలు జరగాలనీ కోరుకుంటున్నారు. భాజపా నాయకత్వాన శ్రీనగర్‌లో ప్రభుత్వం ఏర్పడితే అందులో పీడీపీ భాగస్వామి అయితే కశ్మీర్, జమ్మూ మధ్య అంతరం తగ్గుతుంది. జార్ఖండ్‌లో గిరిజనేతరుడైన రఘువర్ దాస్‌ను ముఖ్యమంత్రిగా నియమించినట్టు జమ్మూ-కశ్మీర్లో ముస్లిమేతరుడిని ముఖ్యమంత్రిగా నియమించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉండవచ్చు. కానీ సామరస్యవాద ముస్లిం నాయకుడిని గుర్తించి పగ్గాలు అప్పగించి ఆయన వెనుక భాజపా నాయకత్వం ఉంటే కశ్మీరీల హృదయాలను జయించడం తేలిక. ఇందుకు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సంపూర్ణ సహకారం అవసరం. ఇది ఊహాజనితంగానో, ఆశావాదంగానో, ఆదర్శవాదంగానో కనిపించవచ్చును కానీ కశ్మీర్లో శాంతి నెలకొ నాలంటే ఇది ఒక్కటే మార్గం. భాజపా హయాంలో, ముఖ్యంగా మోదీ నాయకత్వం లోనే ఇది సాధ్యం. అన్ని అవకాశాలనూ వినియోగించుకొని ఇంత దూరం వచ్చిన మోదీ అసెంబ్లీ ఎన్నికలు ప్రసాదించిన రాజకీయ సమీకరణాలను తనకు అనుకూ లంగా ఏ విధంగా మలచుకుంటారన్నది అత్యంత ఉత్కంఠ కలిగించే అంశం. కొత్త సంవత్సరంలో వినూత్న రాజకీయాల కోసం ఆశావహంగా ఎదురుచూడవచ్చా? murthykondubhatla@gmail.com -
ప్రత్యామ్నాయ విధానాలే ప్రతిపక్షానికి ఊపిరి
త్రికాలమ్: ఈతరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృదయాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. ‘ఒక మిత్రుడు వస్తున్నాడు.’ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ డే సందర్భంగా మన అతిథిగా ఢిల్లీకి రాబోతున్నాడని ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో రాసుకుంటే ప్రపంచానికి తెలిసింది. అంతవరకూ అమెరికా దౌత్యాధికారులకు కానీ భారత ఉన్నతాధికారులకు కానీ తెలియదు. భారత గణతంత్ర దినోత్సవం సంద ర్భంగా విదేశీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యే ఆనవాయితీ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచీ ఉంది. అమెరికా అధ్యక్షుడు రావడం మాత్రం ఇదే ప్రథమం. దేశంలో మారుతున్న రాజకీయ సంస్కృతికీ, ప్రపంచంలో పెరుగుతున్న భారత దేశ పేరుప్రఖ్యాతులకీ ఈ ఉదంతం అద్దంపడుతోంది. ఒబామా వంటి అగ్రదేశా ధినేత ఢిల్లీకి రావడానికి అంగీకరిస్తే ఆ వార్త వెల్లడించడానికి పెద్ద హంగామా జరుగుతుంది. ఏ రకమైన ఆర్భాటం లేకుండా కేవలం ట్విట్టర్లో ప్రకటించడం ద్వారా ఇంత ప్రధానమైన వార్తను వెల్లడించడం మోదీ ప్రవేశపెట్టిన కొత్త సంస్కృతి. మోదీ ఆహ్వానాన్ని ఆమోదించడమే కాదు, చట్టబద్ధత లేకుండా అమెరికాలో నివసిస్తున్న నాలుగున్నర లక్షలమంది భారతీయుల ఉనికికి చట్టబద్ధత కల్పిస్తూ, వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి ఒబామా చూపిన ప్రత్యేక శ్రద్ధ రెండు దేశాల మధ్య ప్రత్యేక బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇంటగెలిచిన మోదీ రచ్చ గెలవడం ప్రపంచ దేశాలలో భారత్‌కు ప్రత్యేకస్థాయిని సమకూర్చుతోంది. మోదీ ఇంటాబయటా సాధిస్తున్న విజయాల వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. కొత్త పరిణామాల వెల్లువ మునుపెన్నడూ ఊహించని పరిణామాలు ఇప్పుడు దేశంలో, దేశం వెలుపలా జరుగుతున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ ముఖ్యమైన పాత్రధారిగా అవతరించడం, అక్కడ అన్ని రాజకీయ పార్టీలూ భాజపాని ప్రధాన ప్రత్యర్థిగా పరిగణించి విమర్శనాస్త్రాలు సంధించడం కొత్త పరిణామం. ఇంతకాలం వింటే విడ్డూరంగా. అతిశయోక్తిగా అనిపించే వాదనలూ, ప్రతిపాదనలూ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో శుక్రవారం ప్రారంభమైన మూడురోజుల ప్రపంచ హిందూ మహాసభ (వరల్డ్ హిందూ కాంగ్రెస్)కు 50 దేశాల నుంచి విదేశీ భారతీయులు వచ్చారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే బృహత్తరమైన భూమికను భారతీయులు పోషించవలసిన సమయం ఆసన్నమైనదని దలైలామా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఇతర వక్తలు ప్రకటించారు. ‘మనవాళ్లు ఈ విషయం రెండువేల సంవత్సరాల క్రితమే చెప్పారు’ అంటూ శ్రీలంక నుంచి వచ్చిన అతిథి అన్నప్పుడు చాలామంది సంతోషంగా చప్పట్లు కొట్టారు. కానీ ఆర్థికాంశాలపైనా, మీడియా పైనా, వ్యవస్థల నిర్మాణంపైనా, ఇతర అంశాలపైనా జరిగిన చర్చలలో ఛాందసం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎట్లా ప్రగతిపథంలో దూసుకుపోవాలన్న ఆరాటం ఉంది. దాదాపు 15 వందల మంది సభ్యులలో కాషాయాంబరాలలో కనిపించినవారు పాతికమందికి మించి లేరు. సభికులందరూ తమతమ రంగాలలో విజయాలు సాధించిన లబ్దప్రతిష్టులు. ఈ సభలో చోదకశక్తి రుషీకేశ్ ఆశ్రమానికి చెందిన విజ్ఞానానందస్వామి. ఖరగ్‌పూర్ ఐఐటీలో పట్టభద్రు డైన తర్వాత పదేళ్లపాటు గురుముఖంగా సంస్కృతం అభ్యసించి, సన్యాసం స్వీకరిం చి రెండు పర్యాయాలు కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ పాదయాత్ర చేసిన వ్యక్తి. వివేకానందుడు ఎక్కడ వదిలిపెట్టాడో విజ్ఞానానందుడు అక్కడ అందుకున్నాడు. ఆధ్యాత్మిక, ఆర్థిక, వాణిజ్య, వైజ్ఞానిక, శాస్త్ర, సాంకేతికరంగాలలో భారత బావుటా ఎగరవేయాలంటూ ప్రబోధించే ఆధునిక స్వామి. హరియాణాలో అరెస్టయిన రాం పాల్ వంటి దొంగస్వామి కాదు. ప్రపంచ హిందూ మహాసభ వెనుకా, మోదీ అమె రికా, ఆస్ట్రేలియా పర్యటనలలో దిగ్విజయంగా జరిగిన ఎన్ఆర్ఐ సభల వెనుకా ఎంతో ప్రయాస ఉంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కృషి ఉంది. లక్షలాదిమందితో వ్యక్తి గత సంబంధాలు పెట్టుకొని వాటిని రాపాడి కాపాడుకున్న నెట్వర్కింగ్ వ్యవస్థ ఉంది. హిందూ సమాజంలో, హిందువుల ఆలోచనా సరళిలో సంభవిస్తున్న పెను మార్పులకు సంకేతం. ఆధునిక భావజాలానికి ఆహ్వానం ఇటువంటి దశలో కొత్త, పాత ఆలోచనల మధ్య ఘర్షణ అనివార్యం. ఈ సంఘర్షణ ప్రభావం భాజపాలో సార్వత్రిక ఎన్నికల ముందు, ఆ తర్వాతా వచ్చిన పరిణా మాలలో చూడవచ్చు. పోటీకి తట్టుకోలేక పక్కకు తప్పుకున్న పెద్దతరం నాయ కులూ, కొత్త నాయకత్వాన్ని ఆమోదించి దారికొచ్చిన పాతకాపులూ ఉన్నారు. మొన్న టిదాకా హిందూమత సంరక్షకుడిగా తనను తాను భావించుకొని ప్రత్యర్థులపైన గర్జించి, లంఘించిన సింఘాల్ వంటి అద్వానీతరం నాయకులు మోదీ ఆధునిక పోక డలను అభినందిస్తున్నారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత ఎనిమిది వం దల సంవత్సరాలకు దేశంలో సిసలైన హిందువులు ప్రభుత్వంలోకి వచ్చారని సింఘాల్ ప్రపంచ హిందూమహాసభలో అన్నాడు. వాజపేయి నాయకత్వంలోని మొదటి ఎన్డీఏ సర్కార్ సంకీర్ణ ప్రభుత్వం కనుక, మనుగడకోసం రాజీలు అనివా ర్యం కనుక దాన్ని హిందువుల పాలనగా లెక్కవేయలేదు. పృథ్వీరాజ్ తర్వాత మోదీనే. మోహన్ భాగవత్ సైతం ఆధునిక భావజాలానికీ, సృజనాత్మకతకూ పెద్ద పీట వేస్తున్నారు. సామాజిక సమరసతకూ, ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన, అణచివేతకు గురైన దళితులనూ, ఆదివాసీలనూ ప్రధాన స్రవంతిలోకి తీసుకొని రావాలన్న సంక ల్పం ఉన్నది. వివేకానంద, గోల్వాల్కర్, అంబేద్కర్ల భావజాలాలను కలబోసి తర తరాలుగా లొంగని సామాజిక సమస్యలకు సామరస్యవంతమైన పరిష్కారం కను గొనాలన్న ప్రయత్నం చేస్తున్నారు. నవతరం ఆకాంక్షలు ఎలాంటివి? ఈ రోజున దేశ జనాభాలో 60 శాతానికి పైగా 35 సంవత్సరాలలోపు వయస్సు వారు. ఇందిర ఆత్యయిక పరిస్థితి తర్వాత పుట్టిన తరం. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన తర్వాత కళ్లు తెరిచిన తరం. ఒకటి లేదా రెండు ఎన్నిక లలోనే ఓటు హక్కు వినియోగించుకున్న తరం. ఐటీ రంగంలో విప్లవ ఫలితాలను సంపూర్ణంగా వంటబట్టించుకున్న తరం. వీరు అన్ని కులాలలో, అన్ని ప్రాంతాలలో, అన్ని తరగతులలో ఉన్నారు. వీరికి ఆర్థికం అత్యంత ప్రధానం. సామాజికానికి ద్వితీ య స్థానం. మోదీ స్వాతంత్య్రానంతరం పుట్టిన తొలి ప్రధాని. యువతరం ఆశలూ, ఆకాంక్షలూ, ప్రాథమ్యాలూ తెలిసిన తెలివైన రాజకీయ నాయకుడు. ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా రాజకీయావతారం ప్రారంభించి భారత ప్రధాని వరకూ సాగించిన ప్రస్థానంలో తనను తాను మార్చుకోవడం, పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడం, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాధించడానికి సాహసోపేతంగా ప్రణాళికలు రచించడం, శక్తివంచన లేకుండా అమలు చేయడం కనిపిస్తుంది. ఆయన ఎదిగిన క్రమంలో అవధులు మీరిన ఆత్మవిశ్వాసం నియంతను తలపించే సంద ర్భాలు లేకపోలేదు. సరికొత్త ధోరణులకు చొరవ చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అవినీతి మకిలం అంటని ప్రభుత్వం ఉన్నదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఒకరిద్దరు మంత్రులు తప్పుడు పనులు చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే కనిపెట్టే కనికట్టు మోదీ దగ్గర ఉంది. కేంద్రమం త్రులకు స్వేచ్ఛ లేదనీ, ఐఏఎస్ అధికారులే చక్రం తిప్పుతున్నారనీ, ప్రధాని కార్యా లయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా అదుపాజ్ఞలలో సమస్త యంత్రాంగం నడుస్తున్నదనే మాట ప్రభుత్వ వర్గాలలో బలంగా వినిపిస్తున్నది. మంత్రులనూ, అధికారులనూ కట్టడి చేసే పని మిశ్రాకి అప్పగించి మోదీ జాతీయ, అంతర్జాతీయ రంగాలలో కొత్త చొరవల గురించీ, సరికొత్త ధోరణుల గురించీ ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి కాకుండానే అంతర్జాతీయంగా తనకూ, తన దేశానికీ ఒకస్థాయిని సంపాదించడంలో సఫలీకృతుడైనట్టు చెప్పవచ్చు. జాతీ య రంగంలో లెసైన్స్, పర్మిట్ రాజ్ నడ్డిని పీవీ-మన్మోహన్సింగ్ ద్వయం విరిచేసిన తర్వాత ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంతో ఉత్పాదకరంగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న పట్టుదల పెరిగింది మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే. ఓటర్లకు వరాలు లేకుం డా, ఉచితాలు ఇవ్వచూపకుండా ఎన్నికలలో ఘనవిజయం సాధించవచ్చునని నిరూపించిన ఘనత కూడా మోదీదే. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం తీసుకువచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు డిపాజిట్ చేస్తానంటూ ఎన్నికల ప్రచా రంలో మోదీ చేసిన వాగ్దానం అతిశయోక్తికి పరాకాష్ఠ అయినప్పటికీ అన్నీ ఉచితంగా ఇస్తానంటూ వాగ్దానం చేయకుండానే భాజపాకి చరిత్రలో మొదటిసారి లోక్‌సభలో 280 పైచిలుకు స్థానాలు సంపాదించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా సంక్షేమ వాగ్దానాలు లేకుండానే మూడో సారి గెలిచింది. వాగ్దానాల వెల్లువ ప్రవహిం పజేసిన కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, హరియాణాలలో మట్టికరిచింది. ఈ తరం పౌరులు ఉచితాలు ఆశించడం లేదు. అవినీతికి ఆస్కారం లేని బాధ్యతాయుతమైన పరిపాలన కోరుకుంటున్నారు. చట్టపాలన కావాలంటున్నారు. ఈతరం హృద యాన్ని మోదీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టు కనిపిస్తున్నారు కనుకనే మోదీ మార్కు రాజకీయాన్ని యువతీ యువకులు స్వాగతిస్తున్నారు. వాస్తవాల జోలికెళ్లని కాంగ్రెస్ తన విజయాన్ని మోదీ సరిగానే అర్థం చేసుకున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా విఫలమైనట్టున్నది. సార్వత్రిక ఎన్నిక లలో ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కశ్మీర్లో భాజపా పూర్తి స్థాయిలో యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా ప్రచారం చేస్తోంది. శుక్రవారంనాడు సోనియాగాంధీ కశ్మీర్ సందర్శించారు. ఆ పార్టీకి ఈ ఎన్నికలలో గెలవాలనే కోరిక కూడా ఉన్నట్టు కనిపించదు. నిజానికి ఆ పార్టీ నాయ కత్వం ఆత్మపరిశీలన చేసుకుంటున్నది. దాదాపు రెండు మాసాలుగా రాహుల్ ఆధ్వ ర్యంలోనే సమీక్షా సమావేశాలు నిత్యం జరుగుతున్నాయి. రాబోయే ఏఐసీసీ సమా వేశంలో రాహుల్‌గాంధీని పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడుగా నియమించాలని సోనియా సంకల్పించారు. ప్రియాంకకు సహాయక పాత్రే కానీ ప్రధాన పాత్ర ఉండదు. సంక్షేమ పథకాలను రద్దు చేయడం ద్వారా పేదలకు మోదీ దూరం అవుతారనీ, హిందూత్వ విధానాలకు ప్రాధాన్యం ఇచ్చి ముస్లింల ఆగ్రహానికి గురవుతారనీ, కార్మిక చట్టాలను సరళతరం చేయడం ద్వారా కార్మికులకు కోపం తెప్పిస్తారనీ కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా పేదలూ, ముస్లింలూ, దళితులూ తిరిగి తమ పార్టీ పరిష్వంగంలోకి వస్తారని ఆశిస్తున్నారు. అంతేకానీ సంపద సృష్టించడం ఎట్లానో, కొత్త తరం కోరుకుంటున్న సుపరిపాలన అందించడం ఎట్లానో, అవినీతి మరక లేని వారికి పార్టీలో స్థానం కల్పించడం ఎట్లానో ఆలోచించడం లేదు. అన్ని రాష్ట్రాలలో అవినీతిపరులుగా, అసమర్థులుగా పేరుమోసిన నాయకులే పార్టీని నడిపిస్తున్నారు. నలభై ఏళ్లలోపు యువకులు పార్టీలో కనిపించరు. వామపక్షాలలో కూడా అంతర్వీక్షణం మొదలైంది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పది వామపక్షాల నాయకులూ కూర్చొని వామపక్ష సానుభూతిపరుల, మేధావుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భాజపాను ఓడించి అధికారంలోకి రావా లంటే కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలనూ, సరికొత్త అభివృద్ధి వ్యూహాలనూ ప్రతిపాదించాలి. ఆ పని చేయకుండా పాతపాటే పాడుతూ కూర్చుంటే నవతరానికి అర్థం కాకుండా వ్యర్థమై బుట్టదాఖలైపోతారు. - కె. రామచంద్రమూర్తి