కల్వకుంట్ల చంద్రశేఖరరావు
తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలని ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఉత్సాహంగా ఉన్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నది. రెండు రోజులు పార్టీ సహచరులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపి ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనీ, ఇతర మంత్రులనూ కలుసుకొని చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ కే ంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అశోక్ లావాస్‌నూ, అటార్నీ జనరల్ కె కె వేణు గోపాల్‌నూ కలుసుకొని ముందస్తు సంగతులు మాట్లాడారు. ఏ రాష్ట్ర ప్రభు త్వమైనా గడువు కంటే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరిపించాలని నిర్ణయించు కొని అసెంబ్లీని రద్దు చేయాలని సిఫార్సు చేయవచ్చు. గవర్నర్ ఆమోదించి అసెంబ్లీని రద్దు చేసిన రోజు నుంచి ఆరు మాసాల లోగా ఎన్నికలు విధిగా నిర్వహించాలి. అసెంబ్లీ రద్దు ప్రక్రియ ప్రధానమంత్రి కూడా ఆమోదిస్తే సులువుగా జరుగుతుంది. అందుకే రెండు మాసాలలో మూడోసారి మోదీని కేసీఆర్ కలుసుకున్నారు.
ప్రజల మనసుల్లో ఏమున్నదో తెలియదు కానీ పైకి మాత్రం వాతావరణం టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా కనిపిస్తున్నది. ప్రతిపక్షాల ప్రాబల్యం అనూహ్యంగా పెరిగిపోతున్న దాఖలా ఏమీ లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పొత్తు పెట్టుకున్నా ఓట్లు అటూఇటూ బదిలీ అవుతాయన్న నమ్మకం లేదు. నాలుగు న్నర దశాబ్దాలుగా కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటు చేస్తూ వచ్చిన టీడీపీ ఓటర్లు నాయకులు చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌కి అనుకూలంగా వేస్తారా? అదే విధంగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేయడం అలవాటైన కాంగ్రెస్ ఓటర్లు అకస్మాత్తుగా, అకారణంగా టీడీపీకి అనుకూలంగా మారిపోతారా? ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఒంటరిగా పోటీ చేస్తానంటున్నది. ఒక వేళ సీపీఐతో పాటు టీజేఎస్ కూడా కాంగ్రెస్–టీడీపీ కూటమిలో చేరి మహాకూటమి ఏర్పాటు చేసి పాలకపక్ష వ్యతిరేక ఓట్లు చీల కుండా నిరోధించగలిగితే టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు అను కున్నంత సులభం కాకపోవచ్చు. అంతమాత్రాన టీఆర్‌ఎస్ ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు ఎవ్వరూ బల్లగుద్ది చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్ని కలు గడువు ప్రకారం జరిగితే టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమిటో అర్థం కాదు. కేసీఆర్ ఎందుకు తొందర పడుతున్నారు?
సంక్షేమరాజ్యం
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు. 2019 జూన్ ఒకటో తేదీ వరకూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం, హక్కు ఆయనకు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ ప్రణాళికాబద్ధంగా అన్ని తరగతులవారినీ, అన్ని కులాలవారినీ, అన్ని మతాలవారినీ సుముఖం చేసుకోవడానికి తనకు తోచిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ఉన్నారు. గొర్రెలూ, చేపలూ పంపిణీ చేయడం, అన్ని కులాలవారికీ ‘ఆత్మగౌరవ భవనాలు’ కట్టించడం, ఎకరానికి ఒక పంటకు నాలుగు వేల చొప్పున రబీ, ఖరీఫ్‌లు కలిపి మొత్తం ఎనిమిది వేల రూపాయలు రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకంగా చెల్లించడం, ఉద్యోగుల జీతాలు పెంచడం, పురోహితులకు సైతం ప్రభుత్వ వేతనాలు ఇవ్వడం వంటి అనేక ఉపకారాలు చేశారు. శుక్రవారంనాడు మరెన్నో వాగ్దానాలు చేశారు.
ఈ వితరణ, వేగం, విన్యాసం చూస్తే ముందస్తు ఎన్నికల ఆకాంక్ష కేసీ ఆర్‌ని తరుముతున్నట్టు కనిపిస్తున్నది. కారణం ఏమిటో ఆయన వెల్లడించడం లేదు కనుక మనం ఊహించవలసిందే. అంతర్గత విభేదాలతో తీసుకుంటున్న ప్రతిపక్షం ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా లేదు కాబట్టి ముందుగానే ఎన్నికల భేరీ మోగిస్తే విజయలక్ష్మి టీఆర్‌ఎస్‌నే ఖాయంగా వరిస్తుందనే వాదన ఒకటి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు బస్సులో జనచైతన్య యాత్రలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హైదరాబాద్ సందర్శనతో పార్టీ శ్రేణులలో కొంత ఉత్సాహం కనిపించింది. కానీ ప్రతిజిల్లాలో ముఠాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంమీద కనీసం ఆరుగురు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమని గట్టిగా నమ్ముతున్నారు. వారిలో అయిదుగురు ఉత్తమ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పద వికి సరిపోరని విశ్వసిస్తున్నారు.
ఇంకా ఆరు మాసాల తర్వాతనైనా ఈ ముఠాల మధ్య వైరం సమసి, సఖ్యత ఏర్పడి, కాంగ్రెస్ నాయకులందరూ ఏకోన్ముఖులై ఎన్నికల సమరంలో ప్రత్యర్థులతో తలబడతారని అనుకోవడానికి వీలు లేదు. బీజేపీ అధిష్ఠానవర్గానికి ఎందుకో తెలంగాణపైన దృష్టి లేదు. అస్సాంలో చేసి నటువంటి ప్రయోగం తెలంగాణలో చేసే ఉద్దేశం లేదు. బీజేపీ టీఆర్‌ఎస్‌ని ప్రత్యర్థిగా పరిగణిస్తున్న దాఖలా లేదు. టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా సరే ఓడించాలన్న కసి బీజేపీ అధినాయకత్వంలో కనిపించడం లేదు. టీఆర్‌ఎస్ గెలిచే లోక్‌సభ సీట్లు తమ ఖాతాలోనే పడతాయనే భరోసా కావచ్చు. కనుక ప్రతిపక్షం బల హీనంగా ఉన్నప్పుడే దాడి చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ తొందరపడుతున్నా రన్నది ఒక వాదన కావచ్చు కానీ అదే ప్రధాన కారణం కాజాలదు. అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలు జరిపించి, గెలిచి, ముఖ్యమంత్రి పీఠం పైన వారసుడిని కూర్చోబెట్టి లోక్‌సభ ఎన్నికలలో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న సంకల్పం కేసీఆర్‌కు ఉన్నదనే వాదన రెండవది. మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ పట్ల సామసర్య వైఖరే కొనసాగిస్తున్నారు. ఇటీవల టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు లోక్‌సభలో ఎన్‌డీఏ సర్కార్‌పైన అవిశ్వాసతీర్మానం పెట్టినప్పుడు ఓటింగ్‌లో టీఆర్‌ఎస్ పాల్గొనకుండా తటస్థంగా ఉంది.
ప్రతిపక్ష ఫెడరల్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించాలన్న కోరిక ఉన్న నాయకుడు అధికారపక్షం పట్ల మెతక వైఖరి ప్రదర్శించడం విడ్డూరం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. కేంద్రంలో కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు టీఆర్‌ఎస్‌కు బీజేపీ మిత్రపక్షం. రాష్ట్రంలో మజ్లీస్ (ఏఐఎంఐఎం)తో స్నేహం, విద్యా సంస్థ లలో, ఉద్యోగాలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ అసెంబ్లీ తీర్మానం చేయడం, ముస్లిం బాలబాలికలకోసం సంక్షేమ పాఠశాలలు నెలకొ ల్పడం, సందర్భం వచ్చినప్పుడల్లా నిజం నవాబును స్తుతించడం వల్ల ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నామనే అభిప్రాయంలో కేసీఆర్ ఉండవచ్చు. తెలం గాణ రాష్ట్రంలో దాదాపు 35 శాసనసభ నియోజక వర్గాలను ముస్లిం ఓటర్లు విశే షంగా ప్రభావితం చేస్తారు. రాష్ట్రస్థాయిలో బీజేపీతో బహిరంగంగా స్నేహం చేస్తే ముస్లింలు దూరమయ్యే ప్రమాదం ఉంది.
రెండు మార్గాలు
అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగి, అనంతరం లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ట్లయితే బీజేపీకి జాతీయ స్థాయిలో బాసటగా నిలబడటం, ఢిల్లీలో మకాం పెట్టి మోదీ, అమిత్‌షాలతో కలసి సమాలోచనలు చేసి రణవ్యూహం రచించడం, దాన్ని అమలు చేయడం కేసీఆర్ ముందున్న ఒక మార్గం. మోదీ, షాలు మూడో వ్యక్తిని నమ్ముతారన్న నమ్మకం లేదు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ నిర్మాణం చేయాలని మొట్టమొదట అనుకున్న విధంగా ఢిల్లీలో ఉంటూ కొత్త ఫ్రంట్ భాగస్వాముల విజయానికి కృషి చేయడం మరో మార్గం. కాంగ్రెస్‌ని కలుపుకున్నా ఎన్‌డీఏను గద్దె దింపగలమా అనే సందేహం ప్రతిపక్షాలను పీడిస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ రహిత ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ స్వప్నం సాకారం ఎట్లా అవుతుంది? రెండో వాదన కూడా సమంజసంగా లేదు.రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడే ఎన్ని కలకు వెళ్ళడం సరైన నిర్ణయం అన్నది మూడో వాదన.
సకాలంలో వానలు దండిగా పడినాయి. ‘మిషన్ భగీరథ’ కింద తాగునీరు అందించే కార్యక్రమం దసరాకి ఆరంభం అవుతుంది. ‘రైతుబంధు’ పథకం సత్ఫలితాలు ఇస్తుందనే ఆశ ఉంది. ఈ పథకం కింద రూ. 12,000 కోట్లు ఖర్చు చేసి 56 లక్షల మంది రైతులకు లబ్ధి కలిగించాలని ప్రయత్నం. ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రెండో విడత చెల్లింపు నవంబర్‌లో జరుగుతుంది. రాష్ట్రంలో 45 రకాల సంక్షేమ పథకాలు సాలీనా రూ. 40,000 కోట్ల ఖర్చుతో అమలు జరుగుతు న్నాయి. రైతులూ, మధ్య తరగతి ప్రజలూ ఫిబ్రవరి వరకూ సంతోషంగా ఉంటా రని అంచనా. ఆ తర్వాత పంట చేతికి వచ్చి, గిట్టుబాటు ధర లభించకపోతే రైతుల సంతోషం ఆవిరై పోతుంది. ప్రభుత్వం పట్ల, అధికార పార్టీ పట్ల ఇప్పు డున్న సద్భావం ఫిబ్రవరి తర్వాత ఉండకపోవచ్చు. ఈ వాదనలో బలం ఉంది. వాస్తవికత ఉంది. నాలుగో కారణం ఎవరో బ్రాహ్మణోత్తముడు కేసీఆర్ జాతకం చూసి ఎన్నికలు డిసెంబర్‌లోపు జరిగితే విజయం తథ్యం అని చెప్పి ఉంటాడు.
కేసీఆర్ జాతకాలను ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముహూర్తాలు పాటిస్తారు. యజ్ఞయా గాదులు చేయిస్తారు. ఆయనకు నమ్మకం కుదిరితే బ్రహ్మరుద్రాదులు కూడా ఆయన మార్గాన్ని మార్చలేరు. ముందస్తు ప్రయత్నాలకు ఇదే ప్రాథమిక కారణ మైనా ఆశ్చర్యం లేదు. డిసెంబర్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరగాలంటే సెప్టెంబర్ 10 లోగా ప్రస్తుత అసెంబ్లీ రద్దు కావాలి. ఇవన్నీ సాఫీగా జరగాలంటే ప్రధాన మంత్రి ఆశీస్సులు కావాలి. శనివారం మధ్యాహ్నం నరేంద్రమోదీతో జరిగిన భేటీలో కేసీఆర్ ఈ విషయం ప్రధానంగా చర్చించి ఉంటారు. జోనల్ వ్యవస్థ, హైకోర్టు విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు వగైరా పెండింగ్ అంశాలపైన ప్రధానితో, కేంద్ర మంత్రులతో చర్చించడానికి ఢిల్లీ వెడుతున్నట్టు మాటవరుసకు చెప్పారు. శనివారం ఉదయం కేసీఆర్ ఢిల్లీలో పార్టీ నాయకులతో, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు. ప్రధానితో చర్చలో పెండింగ్ సమస్యలే ప్రధానాం శమైతే ఇంత హడావిడి ఉండదు.
ముందుస్తు ప్రమాదం
గడువుకంటే ముందుగా ఎన్నికలకు పోవాలన్న నిర్ణయం కేసీఆర్‌దే అయినా పార్టీ నాయకులతో సమాలోచనలు సుదీర్ఘంగా జరిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు సైతం ఒంటరిగానో, ఆంతరంగిక బృందంతో చర్చించో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆనక అవి పార్టీ సహచరులతో సుదీర్ఘ సమాలో చనలో, వాదోపవాదాల అనంతరం తీసుకున్న నిర్ణయాలుగా ప్రపంచానికి చాటేందుకు గంటల తరబడి సమావేశాలు నిర్వహిస్తారు. సహచరుల మనో గతంతో నిమిత్తం లేకుండా తాను ఇదివరకే తీసుకున్న నిర్ణయాలనే సమష్టి నిర్ణయాలుగా ప్రకటిస్తారు. మారు చెప్పేవారు ఉండరు. దాదాపు అదే వైఖరి కేసీఆర్‌ది కూడా.
కేసీఆర్ ఆలోచించినంత లోతుగా, పదునుగా ఆలోచించే వారూ, ఆయన కంటే ఎక్కువ సమయస్ఫూర్తి ఉన్నవారు పార్టీలో మరెవ్వరూ లేరు. కారణం ఏమైనా, గడువుకంటే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిపించేందుకు అవసరమైన సమస్త చర్యలూ సత్వరం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణ యాన్ని పార్టీ నాయకుల చేత చెప్పించేందుకు బుధవారంనాడు ప్రగతిభవన్‌లో గంటల తరబడి చర్చోపచర్చలకు అవకాశం ఇచ్చారు. ఆయన కూడా వారితో అన్ని గంటలూ కూర్చున్నారు. వాస్తవానికి పార్టీలో ఎవ్వరికీ ముందస్తు ఎన్నికలు ఇష్టం లేదు. మంత్రులు కొంచెం ధైర్యం చేసి ముందస్తు ముచ్చట మంచిగలేదని చెప్పారు. ఎంఎల్‌ఏలూ అంతే. ఆరు మాసాల అధికారం పోగొట్టుకోవడానికి ఎవరు మాత్రం సిద్ధపడతారు?
అసెంబ్లీ రద్దు జరిగితే మంత్రులు మాటమాత్రంగా పదవులలో ఉన్నప్పటికీ అధికారులు ఎవ్వరూ ఖాతరు చేయరు. ఆత్మప్రబోధం విని నిర్ణయాలు తీసుకునే నాయకులలో కేసీఆర్ ఒకరు. 2014లో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ఒంట రిగా ఎన్నికల బరిలో దిగాలన్న సాహసోపేతమైన నిర్ణయం కేసీఆర్‌దే. ముందస్తు ఎన్నికల కారణంగా కోట్ల విజయభాస్కరరెడ్డి 1983లో, ఎన్‌టి రామారావు 1989లో, చంద్రబాబు నాయుడు 2004లో దెబ్బతిని ఉండవచ్చు. అంత మాత్రాన కేసీఆర్ ఆ జాబితాలో చేరాలని లేదు. ఇతరులు విఫలమైన చోట కేసీఆర్ విజయం సాధించవచ్చు. ఎవరి జాతకం వారిది. చివరికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment