'నయీం కేసులో పెద్దల పేర్లు బహిర్గతం చేయాలి'
నయీం కేసులో నేతలు, పోలీసు అధికారుల పేర్లు బహిర్గతం చేయాలని దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు.
-టీయూడబ్ల్యూజే సెక్రటరీ జనరల్ అమర్
వరంగల్ : గ్యాంగ్స్టర్ నయూం కేసులో కావాలని జర్నలిస్టుల పేర్లు బయటపెట్టిన సిట్ అధికారి నాగిరెడ్డి.. నయీంతో ములాఖత్ అయి కోట్లు గడించిన రాజకీయ నేతలు, పోలీసు అధికారుల పేర్లు బహిర్గతం చేయాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ డిమాండ్ చేశారు.
ఆదివారం వరంగల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ ప్రోగ్రామ్ కవరేజీకి వెళ్లిన విలేకరులకు రూ.300 విలువైన వాచ్ ఇస్తే నల్లగొండ జిల్లాలోని 67 మంది విలేకరుల పేర్లు బహిర్గతం చేసి ఎఫ్‌ఐఆర్‌లో పెడతారా ? అని అమర్ ప్రశ్నించారు. అధికారులు కావాలనే జర్నలిస్టులను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని, నల్లగొండ ఘటనే దీనికి నిదర్శనమన్నారు. పోరాటాల ద్వారానే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఇప్పుడున్న యూనియన్లు సర్కారీ సంఘాలని, జర్నలిస్టుల సమస్యల పట్ల ఎదుటి సంఘానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. మావోయిస్టు నేత జగన్ జర్నలిస్టుల సమస్యలపై లేఖ ద్వారా స్పందిస్తే కావాలనే ఐజేయూ నేతలు ప్రకటన ఇప్పించారానడం నీచ సంస్కృతికి నిదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ... జర్నలిస్టు జీవితం సమాజానికి అంకితమన్నారు. రాజకీయ నేతలు అధికారంలోకి రాక ముందు జర్నలిస్టులతో మిత్రులుగా ఉంటారని, అధికారంలోకి వచ్చాక శత్రువులుగా మారుతారని అన్నారు. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా కన్వీనర్ టి.శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నేతలు కరుణాకర్, డి.క్రిష్ణారెడ్డి, డి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.