నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు.
చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు. ‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు.
పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు. పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని, చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు. ‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం, ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు.
అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ. మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు.
నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని, చంద్రబాబు అనుకూల, ప్రతికూల జర్నలిస్టులు, రచయితలు రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు. తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది. కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి.
నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది. ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్‌లో మరోమారు జరగనుంది.
తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ: ‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’.
భండారు శ్రీనివాస్ రావు, సీనియర్ జర్నలిస్ట్
(చదవండి: రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు)
Comments
Please login to add a commentAdd a comment