అంతరాత్మనే ఆవిష్కరిస్తారా? | what facts are in kiran kumar reddy book | Sakshi
Sakshi News home page

అంతరాత్మనే ఆవిష్కరిస్తారా?

Published Wed, May 13 2015 1:04 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

అంతరాత్మనే ఆవిష్కరిస్తారా? - Sakshi

అంతరాత్మనే ఆవిష్కరిస్తారా?

కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్దతూ లేని తనను ఎందుకు అధిష్టానం ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసుకుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రియను సజావుగా పూర్తి చెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? రాష్ర్టంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటిచేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చినవారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. కానీ వైఎస్‌ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుంటారా?
 ‘నేను నా సమాధి నుంచి మాట్లాడుతున్నానన్న విషయం ఈ ఆత్మకథ రాస్తున్నప్పుడు తప్పనిసరిగా దష్టిలో ఉంచుకుంటాను. నిజంగానే నేను నా సమాధి నుంచే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ ఆత్మకథ పుస్తకంగా వెలు వడే నాటికి నేను జీవించి ఉండను. ఒక మంచి కారణంతోనే నేను సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడ్డాను. అప్పుడే స్వేచ్ఛగా మాట్లా డగలను. ఒక మనిషి తన వ్యక్తిగత విషయాలను గురించి రాయవలసి వచ్చి నప్పుడు అది చాలా అవసరం. తాను జీవించి ఉండగానే ఇతరులు ఈ ఆత్మ కథను చదువుతారని అనుకున్నప్పుడు దాపరికం లేకుండా రాయడానికి సంకోచిస్తాడు. దాపరికం లేకుండా చేయటానికి అతను చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి.
 ‘ఒక మానవ హదయం, మెదడూ సజించే దాపరికం లేని, స్వేచ్ఛా యుతమైన, వ్యక్తిగతమైన విషయం ప్రేమలేఖేనని నా అభిప్రాయం. తాను రాస్తున్నది ఇతరులు ఎవరూ చూడరన్న భావన కారణంగా తన భావప్రకట నలో అపరిమితమైన స్వేచ్ఛను ప్రేమలేఖ రాస్త్తున్నప్పుడు మాత్రమే అనుభ విస్తాడు. నేను చనిపోయేంత వరకూ ఈ ఆత్మకథ ఎవరి కంటా పడకుండా ఉంటుందని తెలిస్తే నా ఆత్మకథను కూడా ప్రేమలేఖ రాసినంత స్వేచ్ఛగా, దాపరికం లేకుండా రాయగలనని అనిపించింది. అందుకే సజీవుడిగా కంటే సమాధి నుంచి మాట్లాడటాన్నే ఇష్టపడతాను.’ అమెరికాకు చెందిన విఖ్యాత రచయిత మార్క్‌టై్వన్ మహాశయుడు తన ఆత్మకథకు రాసుకున్న పరిచయ వాక్యాలు ఇవి.
 ‘కొంత పొడవే అయినా ఆయన రాసుకున్న ఈ మాటలు ఇక్కడ తప్పని సరిగా ప్రస్తావించడం అవసరం, సందర్భం కూడా. సమకాలీన సమాజంలో వెలువడిన కొన్ని వందల, వేల ఆత్మకథలూ, స్వీయచరిత్రలూ మనం చదు వుతూ ఉంటాం. కారణం, అవి ఆసక్తికరమే కాక అనేక విషయాలు తెలుసు కునేందుకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులూ తమ అనుభ వాలను రాస్తూ ఉంటారు. అలాంటి స్వీయ అనుభవాలు జాతీయస్థాయిలో ఎక్కువ. అవి చాలా సందర్భాలలో తీవ్రమయిన సంచలనాలకూ, వివాదా లకూ దారి తీసి, బ్రహ్మాండంగా అమ్ముడుపోవడం కూడా తెలిసిందే. ప్రాంతీ యంగా కూడా మనం కొందరు రాజకీయ నాయకులు రాసిన అనుభవాలను చాలానే చదివాం. ఇప్పుడు ఆ కోవకే చెందిన ఇంకో రచన రాబోతున్నది. ఆత్మకథలు, స్వీయానుభవాలు రాసే వాళ్లకు నిజాయితీ; అలాగే జీవిత చరి త్రలు రాసే వాళ్లకు చరిత్ర పరిశోధనపై ఆసక్తి, శ్రద్ధ ఉండాలంటారు పెద్దలు.
 
ఏం చెప్పబోతున్నారు కిరణ్‌కుమార్?

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి అనా లనుకుంటా, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తన అనుభవాలను పుస్తకరూపంలో వెలువరిస్తున్నారంటూ రెండురోజుల క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో వార్త వచ్చింది. నాలుగు వందల పేజీల ఈ పుస్తకం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సంబంధించి బోలెడు వివరాలు వెల్లడించను న్నట్టు తెలిసింది. దీని కోసం ఆయన కొన్ని మాసాల పాటు అమెరికాలో కసరత్తు కూడా చేశారు. బహుశా నెలలో ఈ పుస్తకం మన చేతుల్లో ఉంటుంది.

 కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పుస్తకం రాస్త్తున్నారన్న విషయం మనకు ఆ ఆంగ్ల దినపత్రిక ద్వారా తెలియడానికి రెండురోజుల ముందే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల ఎదుట ఆత్మ విమర్శ చేసుకుం టూ జీవితంలో తాను చేసిన పెద్ద తప్పిదం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమం త్రిని చెయ్యడమే అన్నారట. రోశయ్యను తప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్య మంత్రిని చెయ్యాలన్న నిర్ణయం పూర్తిగా తనదేననీ, ఆ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఈ దుర్గతి పట్టిందనీ, మళ్లీ కాంగ్రెస్‌కు ఆ వైభవం ఎప్పుడొస్తుందో చెప్పలేననీ వాపోయారట కూడా.
 
చేతులు కాలాక...

 రెండురోజుల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ తరు వాత కొద్ది రోజుల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పర్యటించి నిర్వీర్యమై పోయిన కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి పోస్తారట. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టడానికి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడమేనని రాహుల్ గాంధీ వాపోతుంటే, కిరణ్ మాత్రం సోనియాగాంధీ , రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు వైగైరా వైగైరా నాయకులంతా ఇవాళ్టి పరి స్థితికి ఎట్లా కారకుల య్యారో, ఎవరెవరు ఏం చేశారో తన పుస్తకంతో బయట పెడతానని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజనలో కిరణ్‌కుమార్‌రెడ్డి సహా ఎవరి పాత్ర ఏమిటో ఇప్పుడు ఆయన పుస్తకం రాస్తే కానీ తెలియదా తెలుగు ప్రజలకి? ఇంతకు అమెరికాలో కూర్చుని కిరణ్ తయారు చేసుకున్న ఈ ఆత్మ చరిత్రాత్మక రచనలో బయట పెట్టబోయే సంచలనాలు ఏమై ఉం టాయి? ఆయన ఎంత నిజాయితీగా సంఘటనలను రికార్డు చెయ్యబోతు న్నారు? ఇలాంటి అంశాలు మనం పుస్తకం చదివితే కానీ తెలియవు. మార్క్‌టై్వన్ చెప్పినట్టు ఈ రచన సమాధిలో నుంచి రాసినంత నిజా యితీగా ఉండగలదా? తన భావప్రకటనలో అపరిమితమైన స్వేచ్ఛను అను భవిస్తూ రాసిన ప్రేమలేఖ లాగా ఉంటుందా? అటువంటి నిజాయితీ మన కాలపు రాజకీయ నాయకుల నుంచి ఆశించడం అత్యాశే. ఇంతకూ కిరణ్ కుమార్‌రెడ్డి రాస్తున్న పుస్తకంలో ఈ క్రింది విషయాలన్నీ ఉంటాయా?
 
ఈ విషయాలు చెప్పగలరా?

 సీనియర్ నాయకుడు కొణిజేటి రోశయ్యను చెప్పాపెట్టకుండా తొలగించి, అధిష్టానం కనీసం మంత్రిగా కూడా అనుభవం లేని, శాసనసభ్యులెవరి మద్ద తూ లేని తనను ఎందుకు ముఖ్యమంత్రిగా నియమించిందో కిరణ్ రాసు కుంటారా? రాష్ట్రాన్ని విభజిస్తున్నాం, మీరే ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రక్రి యను సజావుగా పూర్తిచెయ్యాలని సోనియాగాంధీ స్వయంగా చెప్పిన విష యాన్ని, కిరణ్ ఇప్పుడు కాదని రాయబోతున్నారా తన పుస్తకంలో? మూడు దశాబ్దాలకు పైబడి కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడిగా కొనసాగి, రాష్ర్టంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చి, ఒంటి చేత్తో రెండోసారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అలా కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టడానికి మార్గం సుగమం చేశారా యన.

కానీ వైఎస్‌ఆర్ అర్ధంతరంగా నిష్ర్కమించినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆయన వేసిన ముద్రను తుడిచిపెట్టే పని తనకే అప్పగించారని రాసుకుం టారా? వైఎస్‌ఆర్ కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టేం దుకు రాయలసీమ ప్రాంతానికే చెంది, వయసులో కొంత దగ్గరగా ఉన్న కారణంగానే తనను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని నిర్భయంగా రాసుకుంటారా? 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇందులో కొత్తగా కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ రాష్ర్ట విభజన విషయంలో అనుసరించిన ద్వంద్వవైఖరి కానీ, దాచిపెట్టిన విషయాలు కానీ ఏమీలేవు. మరి ఇంతకు మించి సంచలనమైన విషయాలు ఏం చెప్పబోతున్నారాయన?
 
చంద్రబాబు పాత్రను ఎలా చిత్రిస్తారు?

 చంద్రబాబు నాయుడు గురించి కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి తన పుస్తకంలో రాయబోతున్నారని తెలిసింది. రాష్ర్ట విభజన విషయంలో మొదటి నుంచి తెలుగుదేశం, చంద్రబాబునాయుడు అనుసరించిన వైఖరి ప్రపంచానికం తటికీ తెలిసిందే. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా, అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉండి చంద్రబాబు ఎలా కాపాడారో, దాని వెనక మత లబు ఏమిటో కొత్తగా రాస్తే చదవడానికి ఆసక్తికరంగా ఉంటుందేమో! ముఖ్య మంత్రి పదవిలో చివరి నిమిషం దాకా కొనసాగడమే లక్ష్యంగా తన సొంత పార్టీ నాయకులను కూడా అజ్ఞానాంధకారంలో ఉంచిన విషయం కూడా కిరణ్ రాసుకుంటారా? చివరికి పదవికి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకుని, ఎన్నికల అధికారి కార్యాలయం వరకూ ఊరేగింపుగా వెళ్లి ఆఖరి నిమిషంలో తను నామినేషన్ వెయ్యకుండా తమ్ముడితో వేయించడం వెనుక దాగిన గొప్ప వ్యూహం ఏమిటో కూడా వాస్తవికంగా పేర్కొంటారా?

ఆంధ్ర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చరమగీతం పాడించి, దిక్కులేకుండా వదిలేసి, భార తీయ జనతా పార్టీలో చేరిపోవాలనుకుని కూడా, అది ఎందుకు కుదరలేదో కారణాలు రాసుకుంటారా ఈ పుస్తకంలో? ముఖ్యమంత్రిగా చివరి రోజులలో క్యాంపు కార్యాలయంలోనే మీడియా మిత్రులను పిలిచి కిరణ్ నిర్వహించిన పత్రికా గోష్టి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఏదో సంచలనమైన వార్త చెబుతారని అంతా ఆశించారు. తీరా కూలిన బెర్లిన్ గోడ ముక్క ఒకటి చూపించి రాష్ర్టం కలిసే ఉంటుందని చెప్పబోయారాయన. ఆయన రాస్తున్న పుస్తకంలో విషయాలు కూడా అలాగే ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు.

- దేవులపల్లి అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement