సామరస్యమే సాధనం | amicableness is the only medium, writes k. ramachandra murthy | Sakshi
Sakshi News home page

సామరస్యమే సాధనం

Published Sun, Aug 16 2015 2:26 AM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM

సామరస్యమే సాధనం - Sakshi

సామరస్యమే సాధనం

త్రికాలమ్

 

-  కె.రామచంద్రమూర్తి
 
మహావక్తలుగా ప్రసిద్ధులైన రాజకీయనేతలు ఎందరో ఉన్నారు. కానీ జాతి నిర్మాతలుగా, ప్రాతఃస్మరణీయులుగా మిగిలినవారు కొందరే. మాటలు కడుపు నింపవు. చేతలు తోడుకాకపోతే మాటల విలువ శూన్యం. ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు మొదటిసారి ఎర్రకోట నుంచి ఇచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ సం దేశం దేశప్రజల గుండెల్లో ఆశ, విశ్వాసం నింపింది.

69వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా శనివారంనాటి మోదీ ప్రసంగం ప్రజల గుండెల్లో గుబులు నింపిం ది. 85 నిమిషాలు సాగిన ఎర్రకోట ఉపన్యాసం మోదీ పట్ల ఆరాధనాభావం ఉన్నవారికి సైతం ఆశాభంగం కలిగించింది. నిరుటి ఆత్మవిశ్వాసం, పదును, దూకుడు ఈ సంవత్సరం కనిపించలేదు. సంజాయిషీ చెబుతున్నట్టూ, దిద్దు బాటు చర్యల గురించి ఆలోచిస్తున్నట్టూ, అనుకున్నంత సాధించలేకపోయానని అంగీకరిస్తున్నట్టూ ప్రధాని ధ్వనించారు.

పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఎన్నో ఆశయాలూ, వ్యూహా లూ, లక్ష్యాలూ ఉంటాయి. పదవిలోకి వచ్చిన తర్వాత వాస్తవాలు క్రమంగా తెలిసివస్తాయి. పరిమితులు అర్థం అవుతాయి. పాలకుడు రాజనీతిజ్ఞుడు అయి తే తన పార్టీ లేదా ప్రభుత్వం ఏమేమి చేయడానికి ఏ విధంగా ప్రయత్నించిం దో, ఎంతవరకూ సఫలమైందో, ఎక్కడ విఫలమైందో ప్రజలకు పూసగుచ్చినట్టు ప్రోగ్రెస్ రిపోర్టు (ప్రగతి నివేదిక) సమర్పిస్తాడు. ఆ పని చేయకుండా మోదీ తన రెండో ఎర్రకోట ప్రసంగంలో ఒక శాఖ పేరు మార్పు ప్రకటించారు. మరో నినా దం (స్టార్ అప్ అండ్ స్టాండ్ అప్ ఇండియా) జనం మీదికి వదిలారు. తక్కింది చర్వితచర్వణమే.

విధానాలను నినాదాల రూపంలో ప్రచారం చేసే పద్ధతి చైనా పాలకులు చాలాకాలంగా పాటిస్తున్నారు. మన దేశంలోనూ నినాదాలతో కార్య క్రమాలను పిలుచుకునే ఆచారం ఉంది. నినాదాలు సృష్టించడంలో ప్రతిభ కలి గిన మోదీ నిరుడు స్వాతంత్య్ర సందేశంలో ముఖ్యంగా అయిదు రంగాలపై దృష్టి సారించారు. 1) ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేయడం. 2) జన్‌ధన్ యోజన ద్వారా ప్రజలకు నేరుగా సబ్సిడీలు ధనరూ పంలో బ్యాంకు ఖాతాలలో జమచేయడం. 3) దేశంలోనే ఉత్పత్తిని పెంచేందుకు మేక్ ఇన్ ఇండియా విధానం. 4) దేశంలోని అన్ని ప్రాంతాలనూ అనుసంధానం చేసే డిజిటల్ ఇండియా నినాదం. 5) స్వచ్ఛభారత్ అభియాన్. ఈ అయిదు కార్యక్రమాలలో జరిగిన ప్రగతిని ప్రధాని వివరించి ఉంటే సముచితంగా ఉండేది.

వాస్తవానికి జరిగింది తక్కువ. పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ కార్యక్రమాలలో చాలావరకూ గత ప్రభుత్వాల కార్యక్రమాల కొనసాగింపే. పేరుమార్చడం ప్రగతి కారకం అనుకుంటే విద్యామంత్రిత్వశాఖ పేరును రాజీవ్ గాంధీ మానవ వనరుల మంత్రిత్వ శాఖగా మార్చిన తర్వాత విద్యారంగంలో అద్భుతాలు జరిగి ఉండవలసింది. అటువంటివి ఏవీ జరగకపోగా విద్యారం గంలో ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఇదివరకు ఐఐటీలకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఉండేది. ఇప్పుడు ఐఐటీలలో ప్రమాణాలు పడిపోతున్నా యంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటివారు ఆవేదన వెలిబుచ్చుతు న్నారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ పేరును రైతు సంక్షేమ శాఖగా మార్చినంత మాత్రాన దేశంలో రైతు ఆత్మహత్యలు ఆగిపోవు. వ్యవసాయం గిట్టుబాటు వ్యాసంగం అయిపోదు.

ఆత్మరక్షణ ధోరణి
వ్యవసాయరంగం గురించీ, గ్రామీణప్రాంతాల అభివృద్ధి గురించీ ప్రధాని చాలాసేపు మాట్లాడారు. భూసేకరణ బిల్లు కారణంగా తాను రైతు వ్యతిరేకిననీ, గ్రామీణ ప్రాంతాల పట్ల తనకు శ్రద్ధాసక్తులు లేవనీ చెడ్డపేరు వచ్చినట్టు గ్రహిం చిన మోదీ మచ్చ చెరుపుకోవడానికి ప్రయత్నించినట్టు కనిపించారు. కానీ రైతుల ఆత్మహత్యలకు కారణాలు ఏమిటో, ఆత్మహత్యలు నివారించడానికి కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలో మోదీకి తెలిసినట్టు లేదు. అటువంటి అత్యంత ప్రధానమైన అంశంపైన పార్లమెంటులో చర్చ జరపాలన్న ఆలోచనా లేదు.

నీతి ఆయోగ్‌లో చేరిన ప్రముఖ మేధావులకూ ఈ అంశంపైన దృష్టి సారిం చే సమయం చిక్కినట్టు లేదు. ఇప్పటికీ సగానికి పైగా జనాభా ఆధారపడిన వ్యవసాయరంగంలో రైతు మనుగడపైన అధ్యయనం చేసి ఏదో ఒక విధానానికి రూపకల్పన చేయవలసిన అవసరాన్ని ప్రధాని గుర్తించకపోవడం ఆశ్చర్యం. ఆ పని చేయకుండా తాను వ్యవసాయదారులకు ప్రాధాన్యం ఇస్తున్నాననీ, గ్రామీ ణ వికాసానికి అగ్రతాంబూలం ఇస్తాననీ చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఉం డదు. పేదవారి కోసం బ్యాంకుల ద్వారాలు మొట్టమొదటిసారి తామే తెరిపిం చామంటూ మోదీ చెప్పుకోవడం స్వోత్కర్ష. ఇందిరాగాంధీ హాయాంలో జనా ర్దన్ పూజారి ఈ పని మీదే ఉన్నారని మోదీకి ఎవరు చెప్పాలి? వంద వాగ్దానాలు చేసిన నాయకులు ఎవ్వరూ చరిత్రపుటల్లో నిలబడలేదు. పంచశీల, గరీబీ హటావో వంటి కొన్ని మాత్రమే చరిత్రలో నిలుస్తాయి.

మోదీ ‘మన్ కీ బాత్’ అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ‘ఫైర్‌సైడ్ చాట్’ను పోలినదే. చరిత్రలో ఎఫ్‌డీఆర్ చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఒకే ఒక నినాదం-న్యూడీల్. అప్పుటి సామాజిక భద్రతా కార్యక్రమం చరిత్రాత్మ కమైనది. మోదీ అభిమానులు అటువంటి అద్భుతం ఆయన నుంచి ఆశించారు.

దౌత్యం నెరపే దూత ఎవరు?
మోదీకి ఆయన వ్యక్తిత్వమే బలం. అదే ఆయన బలహీనత. మోదీకి ఉన్నంత అతిశయం లేకపోవడం వల్లనే వాజపేయి, పీవీ నరసింహారావు వంటి ప్రధాను లు సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాలను పూర్తి పదవీకాలం నిర్వహించగలిగారు. పీవీ ప్రతిపక్ష నేత వాజపేయి ఐక్యరాజ్య సమితికి ప్రభుత్వ ప్రతినిధివర్గం నాయ కుడిగా పంపించారు. వాజపేయి అవసరమైతే ప్రతిపక్షంతో సంప్రతింపులు జరపగలిగేవారు. యూపీఏలో ప్రణబ్ ముఖర్జీ ప్రతిపక్ష బీజేపీతో సమాలోచ నలు జరిపేవారు.

మోదీ స్వయంగా సోనియాగాంధీతో మాట్లాడి నిరసన మాని సరసంగా వ్యవహరించమని ఒప్పించే వాతావరణం లేదు. అది అహంకారమో, మానసిక బలహీనతో తెలియదు. ఆర్థిక సంస్కరణలకు అత్యవసరమని యూపీఏ సైతం భావించిన గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ)కి పార్లమెం టు ఆమోదం కోసం సహకరించాలంటూ రాజ్యసభలో సంఖ్యాధిక్యం ఉన్న కాం గ్రెస్ పార్టీని అడిగే వెసులుబాటు లేకపోవడం మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద పరిమితి. మోదీ తరఫున దౌత్యం చేసే సహచరులు ఎవ్వరూ లేరు. వెంకయ్య నాయుడు లేదా అరుణ్‌జైట్లీ లేదా అమిత్ షా ఈ పాత్ర పోషించలేరు.

ఎన్నికల ప్రచారంలో ప్రదర్శించిన సంఘర్షణాత్మక వైఖరినే ప్రధాని హోదాలోనూ మోదీ కొనసాగించడం వల్ల ఎన్‌డీఏ సర్కార్‌కే కాదు దేశానికీ హానికరమే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నినాదాల, నిరసన వరదలో కొట్టుకొని పోవడం వల్ల అప్రతిష్ట ఎవరికి? కాంగ్రెస్‌కా, ఎన్‌డీఏకా? నష్టం ఎవరికి? సోనియాగాంధీకా, మోదీకా? ప్రధానిగా పగ్గాలు చేతబట్టిన వెంటనే పార్లమెంటులో ప్రవేశిస్తూ నేలను ముద్దాడిన మోదీ సభలో వేడిగా వాడిగా చర్చ జరుగుతుంటే, ప్రధాని సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష నాయకులు అడుగుతూ ఉంటే పార్లమెంటు భవనంలోనే ఉండి సభకు దూరంగా ఉండటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సర్వోన్నత చట్టసభపైన గౌరవం ఉన్నట్టా? ఇటువంటి సందర్భాలలో ఇతర ప్రధానులందరూ సభలో కూర్చొనేవారు.

రెండో స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో మోదీ రాజీలేని రాజకీయవాది గానే ప్రజలకు అర్థమైనారు కానీ దేశ ప్రగతిరథానికి సారథ్యం వహిస్తున్న రాజనీ తిజ్ఞుడిగా అర్థం కాలేదు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా, వ్యక్తిగత రాగద్వే షాలకు లోనుకాకుండా, దేశ రాజకీయాలకు కొత్త ఒరవడి దిద్దే వైతాళికుడిగా మోదీ చరిత్రలో స్థానం సంపాదించుకోవాలంటే 2014 సార్వత్రిక ఎన్నికలలో సాధించిన అపూర్వమైన ఘనవిజయం ఒక్కటే సరిపోదు. అన్ని రాజకీయ పక్షా లనూ, అన్ని వాదాలనూ, అన్ని మతాలనూ, అన్ని ప్రాంతాలనూ కలుపుకొని ప్రగతిబాటలో పురోగమించగలనని నిరూపించుకోవాలి. ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోవాలి.

పదిహేనవ పార్లమెంటులో బీజేపీ నాయకులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌లు సభాకార్యక్రమాలకు అంతరాయం కలిగించడం ముమ్మాటికీ తప్పేనని ఒప్పుకొని పార్టీ తరఫున దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ఉంటే, ఇకపైన సభలో నిర్మాణాత్మకమైన చర్చ జరగాలంటూ విజ్ఞప్తి చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీని అదుపు చేసే అవకాశం ఉండేది. బీజేపీ చేసిన తప్పు చేయకుండా వచ్చే శీతా కాలం సమావేశాలలోనైనా ప్రభుత్వంతో సహకరించాలంటూ కాంగ్రెస్ పార్టీకి సవినయంగా విజ్ఞప్తి చేసి ఉంటే ప్రధానిగా మోదీ వ్యక్తిత్వం మరింత ఔన్నత్యాన్ని సంతరించుకునేది.

బీజేపీని సార్వత్రిక ఎన్నికలలో తానే ఒంటి చేత్తో గెలిపించాననీ, ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని తానొక్కడే నడిపించగలననీ, దేశాన్నీ తాను ఒంటరిగా అభివృద్ధి చేయగలననీ మోదీ భావిస్తున్నారని ఆరోపించడం లేదు. కానీ ఆ విధంగా ప్రజలకు అర్థం అవుతున్నారనే విషయాన్ని మోదీ గ్రహించాలి. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్‌పార్టీ లేని భారతదేశం)ను సాధి స్తానంటూ ఎన్నికల ప్రచారంలో శక్తిమంతంగా ప్రచారం చేసిన మోదీ ‘కాంగ్రెస్ ముక్త్ రాజ్యసభ’ కోసం కనీసం 2018 వరకూ వేచి ఉండాలి. అప్పటికీ రాజ్య సభలో కాంగ్రెస్ పూర్తిగా లేకుండాపోదు కానీ ఎన్‌డీఏకి పూర్తి మెజారిటీ వస్తుం ది. కానీ అప్పటికి మోదీ ఐదేళ్ళ పదవీకాలం చరమాంకానికి చేరుకుంటుంది.

నువ్వంటే నువ్వు
క్షేత్రవాస్తవికతను విస్మరించి ఊహాలోకంలో విహరించడం ప్రధాని స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు తగదు. సుష్మాస్వరాజ్, వసుంధరారాజే, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల ప్రస్తావన లేకుండా, వారిపైన ఉన్న ఆరోపణల గురించి మాట్లా డకుండా ఉన్నంత మాత్రాన వివాదాలు సమసిపోవు. తన ప్రభుత్వంపైన అవి నీతి ఆరోపణ రాలేదంటూ గట్టిగా చెప్పినంత మాత్రాన ప్రజలు విశ్వసించరు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ అండర్సన్‌నూ, కత్రోకీని దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతించారని ఎదురుదాడి చేసినంత మాత్రాన సుస్మాస్వరాజ్‌పైన వచ్చిన ఆరోపణ వీగిపోదు.

బీజేపీ నాయకులపైన ఆరోపణలు వచ్చినప్పుడల్లా కాం గ్రెస్ నాయకుల సంగతి ఏమిటంటూ హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రినీ, గోవా కాంగ్రెస్ నాయకుడినీ తెరమీదికి తెస్తే సరిపోతుందా? వారిపైన వచ్చిన ఆరోపణలకూ వీరిపై వచ్చిన ఆరోపణలకూ చెల్లు అని ప్రజలు అనుకోవాలా? కాంగ్రెస్ భ్రష్టు పట్టిందనే కదా ప్రజలు బీజేపీకి పట్టం కట్టింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే దొందూ దొందేననీ, నైతికత విషయంలో కాంగ్రెస్‌కీ, బీజేపీకీ భేదం లేదనీ ప్రజలు తీర్మానించుకోరా?
 

ఎన్నికలలో వచ్చిన మెజారిటీలు ప్రభుత్వాల సుస్థిరతకు పూచీ ఇవ్వలేవు. 1984లో రాజీవ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీ అసా ధారణమైనది. కానీ అయిదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపో యింది. రాజధర్మాన్నే కాదు సామరస్యతనూ, పట్టువిడుపులనూ, కార్యద క్షతనూ వాజపేయి నుంచి నరేంద్రమోదీ నేర్చుకోవాలి. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయవచ్చును. కానీ ప్రజల అనుభవంలోకి వచ్చేది పాల కుల చేతలే. భారత్ వంటి సువిశాలమైన, వైవిధ్య భరితమైన, భిన్న ధోరణు లకు ఆలవాలమైన దేశాన్ని సజావుగా, సమర్థంగా పరిపాలించాలంటే మోదీకి ఛాతి కంటే విశాలమైన హృదయం ఉండాలి. ఈ వాస్తవాన్ని నరేంద్రమోదీ ఎంత త్వరగా గ్రహించి వైఖరి మార్చుకుంటే దేశానికి అంత మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement