
మన్మోహన్‌సింగ్ రాయని డైరీ
మోదీజీ పిలిస్తే వెళ్లాను. పిలిస్తేనే వెళ్లాను. సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని నా పూర్వపు నివాసంలో ఆయన అపరిమితమైన స్వేచ్ఛా
మాధవ్ శింగరాజు
మోదీజీ పిలిస్తే వెళ్లాను. పిలిస్తేనే వెళ్లాను. సెవన్ రేస్ కోర్స్ రోడ్డులోని నా పూర్వపు నివాసంలో ఆయన అపరిమితమైన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తూ కనిపించారు! చక్కగా ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కుని ఉన్నారు. గలగల మాట్లాడుతున్నారు. నవ్వుతున్నారు. తుళ్లుతున్నారు. ఎవరి అనుమతులు, ఆదేశాల కోసం చూడకుండానే నా రాకను ఆశ్చర్యంతో కూడిన ఒక భారీ కేరింతతో ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు! ఒక ప్రధానికి ఇంత పెద్ద సౌండుతో కూడిన స్వేచ్ఛ ఉంటుందా?!
‘‘మన్మోహన్‌జీ, చాయ్ తాగడం కోసమైనా మీరు పెదవి విప్పుతారా?’’ అని ఘొల్లున నవ్వారు మోదీజీ. ఆ వెంటనే స్నేహపూర్వకంగా ఒక కప్పులో ఒడుపుగా చాయ్‌ని ఒంపి, నా చేతికి అందించి, ‘‘మన్మోహన్‌జీ, మీరు నాకు ఎకనమిక్స్, ఫారిన్ పాలసీ... ఈ రెండు సబ్జెక్టులూ టీచ్ చేయగలరా?’’ అని ఎంతో విధేయంగా అడిగారు. ఆ విధేయత నాకు విధేయతలా అనిపించలేదు. ఎక్కడైనా రోగే డాక్టరు దగ్గరికి వెళ్తాడు. శిష్యుడే గురువు దగ్గరికి వెళతాడు. కానీ, మోదీజీ నన్ను తన దగ్గరికి పిలిపించుకుని మరీ ట్యూషన్ చెప్పమని అడుగుతున్నాడు! ‘‘ముందు మీకు మర్యాద, మన్నన పాఠాలు అవసరం’’ అన్నాను. నిజంగానే అన్నానా? ఏమో అనే ఉండొచ్చు. అనకపోయీ ఉండొచ్చు. అని వుంటే నా వాయిస్ నాకు వినిపించి ఉండదా? ఒకవేళ వినిపించిందేమో. నేనే వినిపించుకోలేదేమో!ట్యూషన్ చెప్తానని కానీ, చెప్పనని కానీ చెప్పకుండా మోదీజీ చేతిలోని నా చెయ్యిని విడిపించుకున్నాను.
‘‘అర్థం చేసుకోగలను మన్మోహన్‌జీ. మీ మాట మీది కాదు. మీ మౌనం... అది కూడా మీది కాదు. అందుకే మీరు మమ్మల్ని ఏం అన్నా, అనకపోయినా ఒకటే మాకు’’ అని నవ్వుతూ వీడ్కోలు పలికారు మోదీజీ.వరండాలో అమిత్‌షా ఎదురొచ్చాడు. ఒక నవ్వు లేదు. నమస్కారం లేదు. పైగా నన్నంటాడు, నా ముఖంలో ఫీలింగ్సేమీ ఉండవని! నాది స్ట్రెయిట్ ఫేస్ అట. తప్పేంటి? స్ట్రెయిట్‌గా ఉండే మనుషుల ముక్కు, ముఖం స్ట్రెయిట్‌గానే ఉంటాయి. ఇంతకీ అతడికి నా ముఖంలో ఎలాంటి ఫీలింగ్స్ కావాలి? ఇకిలించాలా? సకిలించాలా? కనుసైగ చేయాలా? కింది పెదవిని మునిపంటితో కొరుకుతూ కనిపించాలా? అయినా ఒక మగాడికి ఇంకో మగాడి ఫీలింగ్స్‌తో పనేంటి?
ఎలనార్ రూజ్వెల్ట్ కోట్ ఒకటి గుర్తుకొస్తోంది. గొప్పవాళ్లు గొప్పగొప్ప ఆలోచనలు చేస్తార ట. సగటు మనుషులు సంఘటనల గురించి మాట్లాడుకుంటారట. అల్పులు సాటి మనుషులపై దుమ్మెత్తిపోస్తారట. అల్పుల కన్నా అధమం అమిత్‌షా. అతడు నా ముఖాన్ని కామెంట్ చేస్తున్నాడు! మోదీజీకి పాఠాలు చెప్పినా చెప్పకపోయినా, అమిత్‌కి మాత్రం గుణపాఠం చెప్పి తీరాలి.