పాత్రికేయ శిఖరం కులదీప్‌ నయ్యర్‌ | K Ramachandra Murthy About Kuldip Nayar | Sakshi
Sakshi News home page

పాత్రికేయ శిఖరం కులదీప్‌ నయ్యర్‌

Published Fri, Aug 24 2018 1:06 AM | Last Updated on Fri, Aug 24 2018 1:06 AM

K Ramachandra Murthy About Kuldip Nayar - Sakshi

‘తన ఆత్మను తనదిగా చెప్పుకోగలిగినవాడే  (One who can call his soul his own)సిసలైన జర్న లిస్టు’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఎం చలపతిరావు అన్న మాట గురువారం తెల్లవారుజామున కన్ను మూసిన జర్నలిస్టు దిగ్గజం కులదీప్‌ నయ్యర్‌కు నూటికి నూరు పాళ్ళూ వర్తిస్తుంది. కులదీప్‌ నయ్యర్‌ బహుముఖీనుడు. ఉర్దూ, ఇంగ్లిష్‌ భాషలలో చేయి తిరిగిన పత్రికారచయిత. సంపాదకుడు. కాలమిస్టు. రాజ్యసభ సభ్యుడు. జనతా ప్రభుత్వ హయాంలో లండన్‌లో భారత హైకమిషనర్‌గా పని చేసిన దౌత్య వేత్త. శాంతికాముకుడు. నికార్సయిన లౌకికవాది. నిజాయితీకీ, నిర్భీతికీ మారు పేరు. సరిగ్గా 45 సంవ త్సరాల కిందట నేను జర్నలిజం విద్యార్థిగా ఉండగా తోటి విద్యార్థులతోపాటు ఢిల్లీ, ముంబయ్, పుణే నగ రాలు సందర్శించినప్పుడు చాలామంది జర్నలిస్టు ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించింది. వారిలో ముఖ్యులు కుష్వంత్‌సింగ్, కులదీప్‌ నయ్యర్, రూసీ కరంజియా (బ్లిట్జ్‌). అప్పుడు కుల దీప్‌ నయ్యర్‌ ‘స్టేట్స్‌మన్‌’కి ఢిల్లీలో రెసిడెంట్‌ ఎడి టర్‌గా ఉండే వారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో ఆయనను కలుసుకున్నాను. మాట్లాడాను. హైదరా బాద్‌కి చాలా సార్లు వచ్చారు. ఎప్పుడు కలుసుకున్నా జాతీయ రాజకీయ చిత్రంపై భాష్యం చెబుతూ ఒక కొత్త కోణం ఆవిష్కరించేవారు. సకారాత్మకంగా ఆలో చించడం, తప్పు చేస్తే నిక్కచ్చిగా విమర్శించేవారు. 


కులదీప్‌ నయ్యర్‌కూ,  కుష్వంత్‌సింగ్‌కూ చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ పాకిస్తాన్‌లో పుట్టారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. కుష్వంత్‌ సింగ్‌ లాహోర్‌లో కులదీప్‌ నయ్యర్‌కి కొంతకాలం గురువుగా ఉన్నారు. దేశ విభజన తర్వాత రక్తపుటేరులు పారుతున్న బాటలో భారత్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక పుస్తకం రాశారు. తర్వాత పాకి స్తాన్‌ నుంచి ఇండి యాకు తాము చేసిన ప్రయాణాన్ని ఇద్దరూ గ్రంథస్థం చేశారు. తన అనుభవాలను కుష్వంత్‌సింగ్‌ ‘ట్రైన్‌ టు పాకిస్తాన్‌’లో రాస్తే, కులదీప్‌ తన ఆత్మకథ ‘బియాండ్‌ ద లైన్స్‌’లో వివరిం చారు. కులదీప్‌ ‘ఇండి యన్‌ ఎక్స్‌ప్రెస్‌’కు సంపాదకుడిగా పనిచేస్తే కుష్వంత్‌ ‘హిందుస్తాన్‌ టైమ్స్‌’కి సంపాదకత్వం వహించారు. ఇద్దరూ విలువల విషయంలో రాజీపడేవారు కాదు. ఎవరినైనా తెగడాలంటే సంకోచించేవారు కాదు. ఇద్దరి కాలమ్స్‌కీ గొప్ప పాఠకాదరణ ఉండేది. కులదీప్‌ ‘బిట్వీన్‌ ద లైన్స్‌’కీ, కుష్వంత్‌ ‘విత్‌ మేలిస్‌ టువర్డ్స్‌ ఒన్‌ అండ్‌ ఆల్‌’కీ చాలా దేశాలలో పాఠకులు ఉండే వారు. కుష్వంత్‌ 99వ ఏట  కన్ను మూస్తే, కులదీప్‌ 95వ ఏట తనువు చాలించారు. ఇద్దరూ ఊపిరి ఉన్నంత వరకూ కలం దించలేదు. 
 ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడు రాజకీయ నేతలతో పాటు కులదీప్‌ నయ్యర్‌ను కూడా ‘మీసా’ (మెయిన్టెనెన్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ద జడ్జి మెంట్‌’ పేరుతో పుస్తకం రాశారు.

తలుపు తాళం చెవి పెట్టే రంధ్రంలో నుంచి చూస్తూ (కీహోల్‌ జర్నలిజం) లోపటి విషయాలను వర్ణించినట్టు నాటకీయంగా రాసేవారు. కుట్ర సిద్ధాంతం ప్రతిపాదించేవారు. బాబరీ మసీదు విధ్వంసం విషయంలో పీవీ నర సింహారావుపైన కూడా మధులిమాయే చెప్పారంటూ అసత్యాలు రాశారు. వాటిని వాస్తవాలు అని విశ్వ సించే రాసి ఉంటారని అనుకోవాలి. 1977 ఎన్నికల అనంతరం జనతా పార్టీ అధికారంలోకి రాగానే  కుల దీప్‌ నయ్యర్‌ను బ్రిటన్‌కు హైకమిషనర్‌గా పంపిం చారు. 1971లో భారత్, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగిన సమయంలో యుద్ధవార్తలు రాశారు. అంతకు ముందు దేశీయాంగమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌కూ, ప్రధాని లాల్‌బహద్దూర్‌ శాస్త్రికీ ప్రెస్‌ సెక్ర టరీగా ఉండేవారు. తాష్కెంట్‌లో లాల్‌బహద్దూర్‌ శాస్త్రి ఆకస్మిక మరణ వార్తను ప్రపంచానికి తెలి యజేసిన మొదటి వ్యక్తి నయ్యర్‌. యుఎన్‌ఐలో కొంతకాలం పని చేశారు. అనేక గ్రంథాలు రచిం చారు. భారత్, పాకిస్తాన్‌ మధ్య స్నేహ సంబంధాలు నెలకొనాలని తపనపడేవారు. పౌర హక్కుల ఉద్య మాలను సమర్థించేవారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రెస్‌ సెన్సార్షిప్‌ను వ్యతిరేకించినట్టే వర్తమానంలో పత్రికలూ, టీవీ చానళ్ళూ ప్రభుత్వాలకు సాగిలపడ టాన్నీ అంతే తీవ్రంగా అధిక్షేపించారు. మీడియా స్వయంగా హిందూభావజాలాన్ని (సాఫ్ట్‌హిందుత్వ) ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి రాజ్యాంగేతర చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉండదంటూ కరకు గానే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా అంకితమైన జర్నలిస్టు, గ్రంథకర్త, పోరాట యోధుడు కులదీప్‌ నయ్యర్‌. పాతతరం పాత్రికేయ శిఖరాలలో అగ్రగణ్యుడు కులదీప్‌ నయ్యర్‌. ఆయన మరణం పత్రికా లోకానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ తీరని లోటు. ఆయనకు ఇదే శ్రద్ధాంజలి.
కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement