Kuldip Nayar
-
నిబద్ధ జర్నలిజానికి నిరుపమాన నిదర్శనం
కులదీప్‌కు సంబంధించినంతవరకు అన్నిటికన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయకుడు మహ్మదలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నాతోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమానంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలితంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండియాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనించారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని, ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపంచానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. కులదీప్ నయ్యర్ నాకంటే 20 ఏళ్లు పెద్ద. కాని, 1975 శీతాకాలంలో న్యూఢిల్లీలోని త్రివేణీ కళా సంఘంలో జరిగిన మధ్యాహ్న భోజన సమావేశంలో తొలిసారి మేం కలుసుకున్నప్పటి నుంచీ మంచి స్నేహితుల మయ్యాం. లండన్‌లోని ద సండే టైమ్స్‌లో వేసవి స్కాలర్‌గా పనిచేసి అప్పుడే దేశ రాజధానికి తిరిగొచ్చాను. నయ్యర్ వల్ల నేను ఎలా ఇబ్బందిపడ్డానో చెప్పడానికే అక్కడకు ఆయ నను ఆహ్వానించాను. ఓ శుక్రవారం మధ్యాహ్నం ద సండే టైమ్స్ సాహిత్య విభాగం ఎడిటర్ త్వరలో ప్రచురించే కుల దీప్ పుస్తకం పేజీల ప్రూఫుల కట్ట పట్టుకుని నా డెస్క్ దగ్గరకు వచ్చారు. ఇండియాలో ఎమర్జెన్సీ కారణంగా ఆ సమయంలోనే నయ్యర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఆంగ్ల వారపత్రిక ఎడిటర్‌గా పనిచేస్తున్న ప్రఖ్యాత జర్నలిస్ట్ హెరాల్డ్ ఈవాన్స్ కులదీప్ అరెస్టుపై వార్తా కథనం రాయాలని నన్ను కోరారు. నేను ఆ ప్రూఫులు చదివి 300 పదాల వార్త రాశాను. పొగరుబోతు ప్రధానోపాధ్యాయురాలు తన క్లాసు లోని విద్యార్థు లను ఎలా బెదరగొడతారో ఇందిరాగాంధీ కూడా కేబినెట్ సమావేశాల్లో తన మంత్రులను అలాగే చూస్తారని నయ్యర్ చెప్పిన విషయం కూడా రాశాను. ఈ వార్త ఇందిరకు నచ్చలేదు. లండన్ నుంచి ఢిల్లీలో దిగగానే ఎయిర్ పోర్ట్‌లో పోలీసులు మూడు గంటల పాటు నా బ్యాగులన్నీ క్షుణ్నంగా తనిఖీచేశారు. వాటిలో అభ్యంతరకరమైనదేదీ దొరకకపోవడంతో నన్ను బయటకు వెళ్లనిచ్చారు. నేను ఈ సంగతి వివ రించాక, నేనూ, కులదీప్ పగలబడి నవ్వుకున్నాం. ‘‘ఇందిరను మీరెప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా?’’ అని ఆయనను అడిగాను. ‘నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు, ఇంటర్వ్యూ ఇవ్వాలని అడగలేదు’ అని ఆయన జవాబిచ్చారు. ఎందుకని అడగలేదని ప్రశ్నిం చగా, ‘నన్ను చూడడానికి ఆమె ఎన్నటికీ అంగీకరించ రని అనుకున్నా’అని ఆయన తెలిపారు. అప్పటి నుంచీ ఆయన, నేనూ అప్పుడప్పుడూ కలుస్తుండే వాళ్లం. ఏడాది క్రితం చివరిసారిగా బంగ్లా దేశ్ హైకమిషన్‌లో కల్సుకున్నాం. బంగ్లా ప్రధాని షేక్ హసీనాకు స్వాగతం పలుకుతూ హైకమిషనర్ సయ్యద్ మువజ్జమ్ అలీ ఇచ్చిన విందులో ఇద్దరం పాల్గొన్నాం. అప్పుడు కులదీప్ చేతికర్రతో, ఓ మనిషి సాయంతో అక్కడికి వచ్చారు. కార్యక్రమం చివర్లో బయల్దేరే ముందు ‘‘నేను మరో పుస్తకం రాస్తు న్నాను, తెలుసా?’’ అన్నారు కులదీప్. దాదాపు 80కి పైగా పత్రికలకు వేలాది వ్యాసాలతోపాటు ఆయన 15 గ్రంథాలు రాశారు. ఈ పుస్తకాలన్నీ పాఠ కాదరణ పొందాయి. మరో ప్రసిద్ధ జర్నలిస్టు కుష్వంత్ సింగ్‌తో కలిసి ఓ పుస్తకం రాశారు. లాహోర్ లా కాలే జీలో కులదీప్‌కు కుష్వంత్ పాఠాలు చెప్పారు. 1979 డిసెంబర్లో లోక్‌సభ ఎన్నికల ప్రచా రంలో ఇందిరాగాంధీతోపాటు ఓ ఫోకర్ ఫ్రెండ్షిప్ విమానంలో నేను కూడా వెళ్లాను. ఆమె దేశ వ్యాప్తంగా అనేక బహిరంగ సభల్లో ప్రసంగించడం దగ్గర నుంచి గమనించాను. అప్పుడు నేను పనిచేస్తున్న ఆంగ్ల పక్ష పత్రిక ఇండియా టుడేలో మూడు పేజీల వ్యాసం రాశాను. ఇందిర ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ప్రధాని అవుతారని ఈ వ్యాసంలో చెప్పాను. ఓ దౌత్య విందులో అదే వారం కులదీప్‌ను కలిశాను. తల అడ్డంగా ఊపుతూ ‘ఎంత పని చేశావు? నీకు రాజ కీయాల గురించి ఏమీ తెలియదు. నువ్వేమో ఇందిర మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పావు. ఈ విషయం ఇక మర్చిపో. అది ఎన్నటికీ జరగదు. పాత్రికేయునిగా నీ జీవితం నాశనం చేసుకున్నావు’ అని ఆయన అన్నారు. తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమిద్దరం మారిషస్ రాజధాని సెయింట్ లూయిస్ వెళ్లాం. కులదీప్ వచ్చారని తెలుసుకున్న ఆ దేశ గవ ర్నర్ జనరల్ సర్ శివసాగర్ రాంగులాం హిందూ మహాసముద్రానికి ఎదురుగా నిర్మించిన తన భారీ నివాస భవనానికి టీ పార్టీకి రావాలని మమ్మల్నిద్దరినీ ఆహ్వానించారు. అక్కడి నుంచి మేం మా హోటల్‌కు కాస్త ఆలస్యంగా చేరుకున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి సహాయకుడు ‘మీకు ఆడవాళ్ల తోడు కావాలా?’ అని భయం భయంగా అడిగాడు. ‘పులి తాను తినే జంతువులను తానే వేటాడి పట్టుకుంటుంది’ అని కులదీప్ చమత్కరించారు. కులదీప్ న్యాయశాస్త్రం చదివి లాయర్ కావడా నికి తగిన శిక్షణపొందారు. ఓ లాహోర్ కాలేజీలో జర్నలిజం డిప్లొమా కోర్సులో చేరారుగాని అందులో ఆయన తప్పారు. ఐఏఎస్‌లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఢిల్లీ వచ్చాక కులదీప్ మొదట చేసిన జర్నలిస్టు ఉద్యోగం అంజామ్ అనే ఓ ఉర్దూ దినపత్రికలోనే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఉర్దూ దినపత్రిక విలేకరిగా ఆయన పాత్రికేయ జీవితం మొదలైంది. అయిష్టంగానే పాత్రికేయ వృత్తిలోకి కుల దీప్ ప్రవేశించారు. అయితే, చెప్పుకోదగ్గ ప్రావీ ణ్యంతో ఆయన జీవితాంతం జర్నలిస్టుగానే బతి కారు. మంచి రిపోర్టర్‌గా ఆయన ఎన్నో సంచలన వార్తలను మొదటిసారి రాసి దేశవ్యాప్తంగా కీర్తినార్జిం చారు. ఇక్కడ అలాంటి సంచనల వార్తల జాబితా ఇవ్వడానికి వీలులేనన్ని ఎక్కువ ఆయన రాశారు.అయితే, కులదీప్‌కు సంబంధించి వీటన్నిటి కన్నా ముఖ్య విషయం ఒకటుంది. చాలా మందికి ఇప్పటికీ ఇది తెలియదు. మానవ చరిత్రలోనే అత్యంత పాశవిక సందర్భంగా భావించే దేశ విభజన రోజులవి. మతం ప్రాతిపదికగా జరిగిన ఈ విభజన సందర్భంగా 1947 ఆగస్ట్–సెప్టెంబర్ మాసాల్లో ఇండియా, పాకిస్తాన్లో జరిగిన మత ఘర్షణల్లో రక్తం ఏరులై పారింది. ఆ సమయంలో పాకిస్తాన్ నాయ కుడు మహ్మ దలీ జిన్నా లాహోర్ పర్యటనకు వచ్చారు. జిన్నా తోపాటు ఓ మంత్రి, ఒక జర్నలిస్టు కూడా విమా నంలో లాహోర్ చేరుకున్నారు. మత ఘర్షణల ఫలి తంగా లక్షలాది మంది జనం పాకిస్తాన్ లోకి రావడం, అంతే సంఖ్యలో దేశం నుంచి ఇండి యాకు పారిపోవడం స్వయంగా జిన్నా గమనిం చారు. ఈ దారుణ దృశ్యాలను కళ్లారా చూసిన జిన్నా బాధతో నుదిటిపై చేయి వేసుకుని ‘‘నేనెంత పని చేశాను?’’ అని నిరాశతో అన్నారు. జిన్నా అన్న మాటలు ప్రపం చానికి వెల్లడించింది కులదీప్ నయ్యర్. జిన్నాతో పాటు లాహోర్ వచ్చిన పాక్ జర్న లిస్టు మరణించాక కొన్నేళ్లకు ఆయన భార్య చెప్పగా కులదీప్‌కు ఈ విషయం తెలిసింది. ఎస్ వెంకటనారాయణ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
కుల్దీప్ కన్నుమూత
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన కలం మూగబోయింది. పత్రికా స్వేచ్ఛకోసం అహర్నిశలు శ్రమించడంతోపాటు మానవహక్కులకోసం పోరాడిన గొంతుక ఇక సెలవంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుల్దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న నయ్యర్‌ను ఐదురోజుల క్రితం ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛపై ఎడతెగని పోరాటం చేసిన వ్యక్తిగా నయ్యర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పే విషయంలోనూ తనవంతు ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌లోని సియాల్కోట్లో 1923లో జన్మించిన నయ్యర్.. ఉర్దూ పత్రికతో జర్నలిజం వృత్తిని ప్రారంభించారు. తర్వాత పలు ఇంగ్లిష్ పత్రికలకు ఎడిటర్‌గా సేవలందించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఎడిటర్స్ గిల్డ్, రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు. నిర్భయంగా భావాల వ్యక్తీకరణ కుల్దీప్ నయ్యర్ జర్నలిస్టుగానే ఎక్కువగా పరిచితులైనా మానవహక్కుల న్యాయవాదిగా, బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా, రచయితగా సేవలందించారు. ఎమర్జెన్సీకాలంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించినందుకు అరెస్టై జైలుకు వెళ్లారు. ‘ఎమర్జెన్సీ సందర్భంగా కుల్దీప్‡ ప్రజాస్వామ్య చాంపియన్‌గా నిలిచారు. పాఠకులకు ఆయన మృతి తీరనిలోటు’ అని రాష్ట్రపతి కోవింద్ సంతాపసందేశంలో పేర్కొన్నారు. ‘మా కాలంలో కుల్దీప్ ఓ గొప్ప రచయిత, మేధావి. నిర్భీతితో తన అభిప్రాయాలను వెల్లడించడంలో దిట్ట. దశాబ్దాలుగా తన కలంతో ఎందరో పాఠకులను చైతన్యవంతులను చేశారు. ఎమర్జెన్సీలో పట్టుదలగా వ్యవహరించిన తీరు, భవ్యభారతం కోసం ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని దేశం ఎన్నటికీ మరవదు.’ అని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. జర్నలిస్టులకు ప్రేరణ నయ్యర్ న్యూస్ స్కూప్స్ యువ జర్నలిస్టులకు ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. విశ్వసనీయతను కాపాడుకుంటూ వేగంగా, చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు అవసరమైన వార్తలందించే విషయంలో నయ్యర్ స్ఫూర్తిదాయకంగా ఉండిపోతారని సంతాప సందేశంలో పేర్కొంది. ‘రిపోర్టర్ల ఎడిటర్’గా నయ్యర్‌ను కీర్తించింది. ఎడిటర్స్ గిల్డ్‌కు కుల్దీప్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మానవహక్కులు, మీడియా స్వేచ్ఛను కాపాడటంలో నయ్యర్ పాత్ర మరువలేనిదని ‘ద వీక్’ మ్యాగజీన్ ఎడిటర్ సచ్చిదానంత మూర్తి గుర్తుచేసుకున్నారు. 1980ల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరువునష్టం దావా బిల్లును నయ్యర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘బిట్వీన్ ద లైన్స్’ పేరుతో నయ్యర్ తన భావాలను ధైర్యంగా వ్యక్తపరిచిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు నయ్యర్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. ‘వివిధ హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. జర్నలిస్టుగా, దౌత్యవేత్తగా, పార్లమెంటేరియన్‌గా, రచయితగా దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలను చేరుకున్నారు’ అని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘పాత్రికేయ రంగంలో ఓ శకం ముగిసింది. నయ్యర్ ప్రజాస్వామ్యానికి అసలు సిసలు సైనికుడు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ కూడా నయ్యర్ మృతిపట్ల సంతాపం తెలిపారు. అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతోపాటు రాజకీయ, మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టుకు కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ తదితరులు పాల్గొన్నారు. జగమెరిగిన జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్! నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితం బహుముఖ ప్రజ్ఞాశాలి న్యూఢిల్లీ: 1923 ఆగస్టు 14న నాటి బ్రిటిష్ హయాంలోని పంజాబ్ సియాల్కోట్లో (ప్రస్తుత పాక్‌లో) జన్మించిన నయ్యర్ చిన్నతనమంతా అక్కడే గడిచింది. లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాక, లాహోర్‌లోనే న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన మారణహోమానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. 1952లో అమెరికా ఇలినాయిస్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం కోర్సు పూర్తిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉర్దూ పత్రిక ‘అంజామ్’లో పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఇంగ్లిషు జర్నలిజంలోకి ప్రవేశించారు. దేశంలోని వివిధ మీడియాసంస్థలు, ఏజెన్సీలకు సేవలందించారు. లండన్‌కు చెందిన ‘ద టైమ్స్’ ప్రతినిధిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయరంగంలో సాగిన పయనంలో ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద స్టేట్స్‌మన్’ తదితర పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించారు. భారత్–పాక్ స్నేహబంధం కోసం.. 1990లో వీపీసింగ్ ప్రభుత్వం ఆయన్ను ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత–పాకిస్తాన్ల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడేందుకు, రెండుదేశాల మధ్య మానవహక్కులు, శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో రామ్‌నాథ్ గోయంకా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ‘వితవుట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రీ టోల్డ్, స్కూప్: ఇన్సైడ్ స్టోరీస్ ఫ్రం పార్టిషన్ టు ద ప్రెజెంట్’, ‘డిస్టెంట్ నైబర్స్: ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్’ వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉందో ‘వితవుట్ ఫియర్’ పుస్తకంలో వివరించారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్గురుల స్వాతంత్య్ర పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హన్స్‌రాజ్ వోహ్రా భగత్‌సింగ్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడన్నది వివరించారు. నయ్యర్ చివరి వ్యాసంలో.. చనిపోయేందుకు కొద్ది గంటలముందు కూడా మోదీ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లోక్మత్ టైమ్స్‌కు నయ్యర్ ఓ వ్యాసం రాశారు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ భావాలను రుద్దకుండా అభివృద్ధి సుపరిపాలనపైనే దృష్టిపెట్టాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ అని.. దీనిపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఆర్టికల్‌ను గురువారం నాగ్‌పూర్ ఎడిషన్ లోక్మత్ టైమ్స్ ‘శరణార్థులా? ఓటుబ్యాంకా?’ శీర్షికతో ప్రచురించింది. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్యరాష్ట్రాల్లోని 25 ఎంపీ సీట్ల విషయంలో మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నయ్యర్ సూచించారు. వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ నయ్యర్ ఓ వ్యాసం రాశారు. దీన్ని పత్రికలకు పంపాల్సి ఉంది. ఇంతలోనే నయ్యర్ కన్నుమూశారు. వాజ్‌పేయి నయ్యర్ ఇద్దరూ 1920వ దశకంలోనే పుట్టారు. వారం రోజుల్లోనే కన్నుమూయటం యాదృచ్ఛికం. మృతిపై కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మాజీ ఎంపీ కుల్దీప్నయ్యర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సామాజిక, రాజకీ య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై కుల్దీప్ నయ్యర్ చేసిన అధ్యయనం, రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. మానవ హక్కులు, శాంతి ఉద్యమకారుడిగా కుల్దీప్నయ్యర్కు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు. కుల్దీప్ మృతికి జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై మంచి పట్టు, సరైన అవగాహన కలిగిన నయ్యర్ తన రచనల్లో వాటిని ప్రతిబింబింపజేసే వారని జగన్ కొనియాడారు. మానవహక్కుల కార్యకర్తగా ఆయన తన రచనలతో ఎంతో మంది యువకులను ప్రభావితం చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశం తరపున బ్రిటన్‌కు హైకమిషనర్ హోదాలో పనిచేసినప్పటికీ నయ్యర్ క్షేత్ర స్థాయి వాస్తవాలకు దగ్గరగా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు. -
పాత్రికేయ శిఖరం కులదీప్ నయ్యర్
‘తన ఆత్మను తనదిగా చెప్పుకోగలిగినవాడే (One who can call his soul his own)సిసలైన జర్న లిస్టు’ అని ప్రఖ్యాత సంపాదకుడు ఎం చలపతిరావు అన్న మాట గురువారం తెల్లవారుజామున కన్ను మూసిన జర్నలిస్టు దిగ్గజం కులదీప్ నయ్యర్‌కు నూటికి నూరు పాళ్ళూ వర్తిస్తుంది. కులదీప్ నయ్యర్ బహుముఖీనుడు. ఉర్దూ, ఇంగ్లిష్ భాషలలో చేయి తిరిగిన పత్రికారచయిత. సంపాదకుడు. కాలమిస్టు. రాజ్యసభ సభ్యుడు. జనతా ప్రభుత్వ హయాంలో లండన్‌లో భారత హైకమిషనర్‌గా పని చేసిన దౌత్య వేత్త. శాంతికాముకుడు. నికార్సయిన లౌకికవాది. నిజాయితీకీ, నిర్భీతికీ మారు పేరు. సరిగ్గా 45 సంవ త్సరాల కిందట నేను జర్నలిజం విద్యార్థిగా ఉండగా తోటి విద్యార్థులతోపాటు ఢిల్లీ, ముంబయ్, పుణే నగ రాలు సందర్శించినప్పుడు చాలామంది జర్నలిస్టు ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించింది. వారిలో ముఖ్యులు కుష్వంత్‌సింగ్, కులదీప్ నయ్యర్, రూసీ కరంజియా (బ్లిట్జ్). అప్పుడు కుల దీప్ నయ్యర్ ‘స్టేట్స్‌మన్’కి ఢిల్లీలో రెసిడెంట్ ఎడి టర్గా ఉండే వారు. ఆ తర్వాత అనేక సందర్భాలలో ఆయనను కలుసుకున్నాను. మాట్లాడాను. హైదరా బాద్‌కి చాలా సార్లు వచ్చారు. ఎప్పుడు కలుసుకున్నా జాతీయ రాజకీయ చిత్రంపై భాష్యం చెబుతూ ఒక కొత్త కోణం ఆవిష్కరించేవారు. సకారాత్మకంగా ఆలో చించడం, తప్పు చేస్తే నిక్కచ్చిగా విమర్శించేవారు. కులదీప్ నయ్యర్కూ, కుష్వంత్సింగ్కూ చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ పాకిస్తాన్లో పుట్టారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులు. కుష్వంత్ సింగ్ లాహోర్‌లో కులదీప్ నయ్యర్కి కొంతకాలం గురువుగా ఉన్నారు. దేశ విభజన తర్వాత రక్తపుటేరులు పారుతున్న బాటలో భారత్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక పుస్తకం రాశారు. తర్వాత పాకి స్తాన్ నుంచి ఇండి యాకు తాము చేసిన ప్రయాణాన్ని ఇద్దరూ గ్రంథస్థం చేశారు. తన అనుభవాలను కుష్వంత్‌సింగ్ ‘ట్రైన్ టు పాకిస్తాన్’లో రాస్తే, కులదీప్ తన ఆత్మకథ ‘బియాండ్ ద లైన్స్’లో వివరిం చారు. కులదీప్ ‘ఇండి యన్ ఎక్స్‌ప్రెస్’కు సంపాదకుడిగా పనిచేస్తే కుష్వంత్ ‘హిందుస్తాన్ టైమ్స్’కి సంపాదకత్వం వహించారు. ఇద్దరూ విలువల విషయంలో రాజీపడేవారు కాదు. ఎవరినైనా తెగడాలంటే సంకోచించేవారు కాదు. ఇద్దరి కాలమ్స్‌కీ గొప్ప పాఠకాదరణ ఉండేది. కులదీప్ ‘బిట్వీన్ ద లైన్స్’కీ, కుష్వంత్ ‘విత్ మేలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్’కీ చాలా దేశాలలో పాఠకులు ఉండే వారు. కుష్వంత్ 99వ ఏట కన్ను మూస్తే, కులదీప్ 95వ ఏట తనువు చాలించారు. ఇద్దరూ ఊపిరి ఉన్నంత వరకూ కలం దించలేదు. ఇందిరాగాంధీ 1975లో దేశంలో ఆత్యయిక పరిస్థితి విధించినప్పుడు రాజకీయ నేతలతో పాటు కులదీప్ నయ్యర్‌ను కూడా ‘మీసా’ (మెయిన్టెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) కింద జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ద జడ్జి మెంట్’ పేరుతో పుస్తకం రాశారు. తలుపు తాళం చెవి పెట్టే రంధ్రంలో నుంచి చూస్తూ (కీహోల్ జర్నలిజం) లోపటి విషయాలను వర్ణించినట్టు నాటకీయంగా రాసేవారు. కుట్ర సిద్ధాంతం ప్రతిపాదించేవారు. బాబరీ మసీదు విధ్వంసం విషయంలో పీవీ నర సింహారావుపైన కూడా మధులిమాయే చెప్పారంటూ అసత్యాలు రాశారు. వాటిని వాస్తవాలు అని విశ్వ సించే రాసి ఉంటారని అనుకోవాలి. 1977 ఎన్నికల అనంతరం జనతా పార్టీ అధికారంలోకి రాగానే కుల దీప్ నయ్యర్‌ను బ్రిటన్‌కు హైకమిషనర్‌గా పంపిం చారు. 1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో యుద్ధవార్తలు రాశారు. అంతకు ముందు దేశీయాంగమంత్రి గోవింద్ వల్లభ్ పంత్‌కూ, ప్రధాని లాల్బహద్దూర్ శాస్త్రికీ ప్రెస్ సెక్ర టరీగా ఉండేవారు. తాష్కెంట్లో లాల్బహద్దూర్ శాస్త్రి ఆకస్మిక మరణ వార్తను ప్రపంచానికి తెలి యజేసిన మొదటి వ్యక్తి నయ్యర్. యుఎన్‌ఐలో కొంతకాలం పని చేశారు. అనేక గ్రంథాలు రచిం చారు. భారత్, పాకిస్తాన్ మధ్య స్నేహ సంబంధాలు నెలకొనాలని తపనపడేవారు. పౌర హక్కుల ఉద్య మాలను సమర్థించేవారు. ఆత్యయిక పరిస్థితిలో ప్రెస్ సెన్సార్షిప్ను వ్యతిరేకించినట్టే వర్తమానంలో పత్రికలూ, టీవీ చానళ్ళూ ప్రభుత్వాలకు సాగిలపడ టాన్నీ అంతే తీవ్రంగా అధిక్షేపించారు. మీడియా స్వయంగా హిందూభావజాలాన్ని (సాఫ్ట్హిందుత్వ) ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి రాజ్యాంగేతర చర్యలు తీసుకోవలసిన అగత్యం ఉండదంటూ కరకు గానే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా అంకితమైన జర్నలిస్టు, గ్రంథకర్త, పోరాట యోధుడు కులదీప్ నయ్యర్. పాతతరం పాత్రికేయ శిఖరాలలో అగ్రగణ్యుడు కులదీప్ నయ్యర్. ఆయన మరణం పత్రికా లోకానికీ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ తీరని లోటు. ఆయనకు ఇదే శ్రద్ధాంజలి. కె. రామచంద్రమూర్తి -
ప్రముఖ జర్నలిస్ట్ కుల్దీప్ నయ్యర్ కన్నుమూత
న్యూఢిల్లీ : ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్టు కుల్దీప్ నయ్యర్(95) ఇక లేరు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు. 1923 ఆగష్టు 14న జన్మించిన ఆయన ఉర్ధూ పత్రిక అంజమ్‌లో జర్నలిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. 'బిట్వీన్ ది లైన్స్' పేరుతో ప్రచురితమైన కాలమ్ దాదాపు 80 పత్రికల్లో ప్రచురితమయ్యింది. జర్నలిస్ట్‌గానే కాకుండా మానవ హక్కుల ఉద్యమకారుడిగా కుల్దీప్ అనేక పోరాటాలు చేశారు. 1990లో బ్రిటన్‌లో భారత రాయబారిగా సేవలందించారు. 1997లో రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు. రచయితగా 15కు పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన పుస్తకాల్లో బియాండ్ ది లైన్స్, డిస్టెంట్ నైబర్స్ : ఎ టేల్ ఆఫ్ ది సబ్ కాంటినెంట్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ అండ్ అదర్స్, ఎమర్జెన్సీ రీ టోల్డ్ లు ఉన్నాయి. లోథిలో గురువారం మధ్యాహ్నం కుల్దీప్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుల్దీప్ నయ్యర్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు సీనియర్ జర్నలిస్టులు సంతాపం తెలిపారు.