కుల్‌దీప్ (ఫైల్)
న్యూఢిల్లీ: దశాబ్దాలుగా తన రచనలతో ప్రజలను చైతన్యపరిచిన కలం మూగబోయింది. పత్రికా స్వేచ్ఛకోసం అహర్నిశలు శ్రమించడంతోపాటు మానవహక్కులకోసం పోరాడిన గొంతుక ఇక సెలవంటూ వెళ్లిపోయింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుల్‌దీప్ నయ్యర్ (95) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. న్యుమోనియాతో బాధపడుతున్న నయ్యర్‌ను ఐదురోజుల క్రితం ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులున్నారు. పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛపై ఎడతెగని పోరాటం చేసిన వ్యక్తిగా నయ్యర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పే విషయంలోనూ తనవంతు ప్రయత్నం చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో 1923లో జన్మించిన నయ్యర్.. ఉర్దూ పత్రికతో జర్నలిజం వృత్తిని ప్రారంభించారు. తర్వాత పలు ఇంగ్లిష్ పత్రికలకు ఎడిటర్‌గా సేవలందించారు. ఆయన మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, ఎడిటర్స్ గిల్డ్, రాజకీయ, జర్నలిస్టు ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
నిర్భయంగా భావాల వ్యక్తీకరణ
కుల్‌దీప్ నయ్యర్ జర్నలిస్టుగానే ఎక్కువగా పరిచితులైనా మానవహక్కుల న్యాయవాదిగా, బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా, రచయితగా సేవలందించారు. ఎమర్జెన్సీకాలంలో ఇందిరాగాంధీని వ్యతిరేకించినందుకు అరెస్టై జైలుకు వెళ్లారు. ‘ఎమర్జెన్సీ సందర్భంగా కుల్‌దీప్‡ ప్రజాస్వామ్య చాంపియన్‌గా నిలిచారు. పాఠకులకు ఆయన మృతి తీరనిలోటు’ అని రాష్ట్రపతి కోవింద్ సంతాపసందేశంలో పేర్కొన్నారు. ‘మా కాలంలో కుల్‌దీప్ ఓ గొప్ప రచయిత, మేధావి. నిర్భీతితో తన అభిప్రాయాలను వెల్లడించడంలో దిట్ట. దశాబ్దాలుగా తన కలంతో ఎందరో పాఠకులను చైతన్యవంతులను చేశారు. ఎమర్జెన్సీలో పట్టుదలగా వ్యవహరించిన తీరు, భవ్యభారతం కోసం ప్రజాసేవలో ఆయన చిత్తశుద్ధిని దేశం ఎన్నటికీ మరవదు.’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
జర్నలిస్టులకు ప్రేరణ
నయ్యర్ న్యూస్ స్కూప్స్ యువ జర్నలిస్టులకు ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాయని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. విశ్వసనీయతను కాపాడుకుంటూ వేగంగా, చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు అవసరమైన వార్తలందించే విషయంలో నయ్యర్ స్ఫూర్తిదాయకంగా ఉండిపోతారని సంతాప సందేశంలో పేర్కొంది. ‘రిపోర్టర్ల ఎడిటర్’గా నయ్యర్‌ను కీర్తించింది. ఎడిటర్స్ గిల్డ్‌కు కుల్‌దీప్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మానవహక్కులు, మీడియా స్వేచ్ఛను కాపాడటంలో నయ్యర్ పాత్ర మరువలేనిదని ‘ద వీక్’ మ్యాగజీన్ ఎడిటర్ సచ్చిదానంత మూర్తి గుర్తుచేసుకున్నారు. 1980ల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన పరువునష్టం దావా బిల్లును నయ్యర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
‘బిట్వీన్ ద లైన్స్’ పేరుతో నయ్యర్ తన భావాలను ధైర్యంగా వ్యక్తపరిచిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఎంలు నయ్యర్ మృతిపట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశాయి. ‘వివిధ హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. జర్నలిస్టుగా, దౌత్యవేత్తగా, పార్లమెంటేరియన్‌గా, రచయితగా దశాబ్దాల ప్రజాజీవితంలో ఎన్నో గొప్ప శిఖరాలను చేరుకున్నారు’ అని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘పాత్రికేయ రంగంలో ఓ శకం ముగిసింది. నయ్యర్ ప్రజాస్వామ్యానికి అసలు సిసలు సైనికుడు’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ అహ్మద్ చౌదరీ కూడా నయ్యర్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
అంత్యక్రియలకు ప్రముఖుల హాజరు
ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతోపాటు రాజకీయ, మీడియా ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టుకు కన్నీటి వీడ్కోలు పలికారు. మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్, స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్, ఫొటోగ్రాఫర్ రఘు రాయ్ తదితరులు పాల్గొన్నారు.
జగమెరిగిన జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్!
నాలుగు దశాబ్దాల పాత్రికేయ జీవితం
బహుముఖ ప్రజ్ఞాశాలి
న్యూఢిల్లీ: 1923 ఆగస్టు 14న నాటి బ్రిటిష్ హయాంలోని పంజాబ్ సియాల్‌కోట్‌లో (ప్రస్తుత పాక్‌లో) జన్మించిన నయ్యర్ చిన్నతనమంతా అక్కడే గడిచింది. లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తిచేశాక, లాహోర్‌లోనే న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన మారణహోమానికి ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. 1952లో అమెరికా ఇలినాయిస్ నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని మెడిల్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి జర్నలిజం కోర్సు పూర్తిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఉర్దూ పత్రిక ‘అంజామ్’లో పాత్రికేయ వృత్తిని మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత ఇంగ్లిషు జర్నలిజంలోకి ప్రవేశించారు. దేశంలోని వివిధ మీడియాసంస్థలు, ఏజెన్సీలకు సేవలందించారు. లండన్‌కు చెందిన ‘ద టైమ్స్’ ప్రతినిధిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయరంగంలో సాగిన పయనంలో ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ద స్టేట్స్‌మన్’ తదితర పత్రికలకు ఎడిటర్‌గా వ్యవహరించారు.
భారత్–పాక్ స్నేహబంధం కోసం..
1990లో వీపీసింగ్ ప్రభుత్వం ఆయన్ను ఇంగ్లండ్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. 1997లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత–పాకిస్తాన్‌ల మధ్య స్నేహసంబంధాలు ఏర్పడేందుకు, రెండుదేశాల మధ్య మానవహక్కులు, శాంతి నెలకొల్పేందుకు కృషి చేశారు. పాత్రికేయ రంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2015లో రామ్‌నాథ్ గోయంకా జీవనసాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.
‘వితవుట్ ఫియర్, బియాండ్ ద లైన్స్, బిట్వీన్ ద లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ రీ టోల్డ్, స్కూప్: ఇన్‌సైడ్ స్టోరీస్ ఫ్రం పార్టిషన్ టు ద ప్రెజెంట్’, ‘డిస్టెంట్ నైబర్స్: ఏ టేల్ ఆఫ్ సబ్ కాంటినెంట్’ వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. భారతీయ యువతపై భగత్ సింగ్ ప్రభావం ఎలా ఉందో ‘వితవుట్ ఫియర్’ పుస్తకంలో వివరించారు. భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల స్వాతంత్య్ర పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. హన్స్‌రాజ్ వోహ్రా భగత్‌సింగ్‌ను ఎందుకు వెన్నుపోటు పొడిచాడన్నది వివరించారు.
నయ్యర్ చివరి వ్యాసంలో..
చనిపోయేందుకు కొద్ది గంటలముందు కూడా మోదీ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లోక్‌మత్ టైమ్స్‌కు నయ్యర్ ఓ వ్యాసం రాశారు. కేంద్రం ఈశాన్య రాష్ట్రాల్లో హిందుత్వ భావాలను రుద్దకుండా అభివృద్ధి సుపరిపాలనపైనే దృష్టిపెట్టాలని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు అక్రమ వలసలు దేశ అంతర్గత భద్రతకు పెను సవాల్ అని.. దీనిపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఆర్టికల్‌ను గురువారం నాగ్‌పూర్ ఎడిషన్ లోక్‌మత్ టైమ్స్ ‘శరణార్థులా? ఓటుబ్యాంకా?’ శీర్షికతో ప్రచురించింది.
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్యరాష్ట్రాల్లోని 25 ఎంపీ సీట్ల విషయంలో మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలని నయ్యర్ సూచించారు. వాజ్‌పేయి మృతిచెందిన తర్వాత ఆయనకు నివాళులర్పిస్తూ నయ్యర్ ఓ వ్యాసం రాశారు. దీన్ని పత్రికలకు పంపాల్సి ఉంది. ఇంతలోనే నయ్యర్ కన్నుమూశారు. వాజ్‌పేయి నయ్యర్ ఇద్దరూ 1920వ దశకంలోనే పుట్టారు. వారం రోజుల్లోనే కన్నుమూయటం యాదృచ్ఛికం.
మృతిపై కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రచయిత, జర్నలిస్టు, మాజీ ఎంపీ కుల్‌దీప్‌నయ్యర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. సామాజిక, రాజకీ య, ఆర్థిక, దౌత్యపరమైన అంశాలపై కుల్‌దీప్ నయ్యర్ చేసిన అధ్యయనం, రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని వెల్లడించారు. మానవ హక్కులు, శాంతి ఉద్యమకారుడిగా కుల్‌దీప్‌నయ్యర్‌కు దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ గుర్తింపు ఉందని సీఎం పేర్కొన్నారు.
కుల్‌దీప్ మృతికి జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ జర్నలిస్టు కుల్‌దీప్ నయ్యర్ మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై మంచి పట్టు, సరైన అవగాహన కలిగిన నయ్యర్ తన రచనల్లో వాటిని ప్రతిబింబింపజేసే వారని జగన్ కొనియాడారు. మానవహక్కుల కార్యకర్తగా ఆయన తన రచనలతో ఎంతో మంది యువకులను ప్రభావితం చేశారని సంతాప సందేశంలో పేర్కొన్నారు. భారతదేశం తరపున బ్రిటన్‌కు హైకమిషనర్ హోదాలో పనిచేసినప్పటికీ నయ్యర్ క్షేత్ర స్థాయి వాస్తవాలకు దగ్గరగా ఉండేవారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment