
అశుద్ధభారత్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు
‘అన్‌సీన్’ పుస్తకం తెలుగు అనువాదం ‘అశుద్ధభారత్’ను శనివారం విడుదల చేశారు.
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త భాషా సింగ్ రచించిన ‘అన్‌సీన్’ పుస్తకం తెలుగు అనువాదం ‘అశుద్ధభారత్’ను రామన్ మెగసెసె అవార్డు గ్రహీతలు బెజవాడ విల్సన్, కృష్ణన్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి శనివారం లమాకానాలో ఆవిష్కరించారు. అన్‌సీన్ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సామాజిక కార్యకర్త, రచయిత సజయ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పుస్తకం చదువుతున్నంత సేపు కన్నీళ్ళాగలేదని కె.రామచంద్రమూర్తి అన్నారు.
పాకిస్తాన్‌పై యుద్ధంతో ఆనందడోలికల్లో ఉన్న పాలకులకు ఈ దుర్మార్గంలో మగ్గిపోతున్న మనుషుల గురించి పట్టదన్నారు. సఫాయికర్మచారీ ఆందోళన్ ద్వారా అమానవీయ వ్యవస్థనుంచి విముక్తిని కోరుకున్న ఎస్.ఆర్.శంకరన్ జాతి మొత్తాన్ని ఉత్తేజితం చేశారన్నారు. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ మాట్లాడుతూ శంకరన్, కన్నాభిరాన్, తారకం లాంటి ఎందరో మహానుభావులు మానవ మలమూత్రాలను ఎత్తివేసే అమానవీయ వ్యవస్థ నిర్మూలనను కలగన్నారన్నారు.
అయితే ఆ కల నెరవేరకుండానే వాళ్ళు మరణించారని అన్నారు. పాకీపని పచ్చి నిజం. కానీ ఈ వాస్తవాన్ని ఎవ్వరూ అంగీకరించడానికి సిద్ధంగా లేరని బెజవాడ విల్సన్ అన్నారు. ఎంతో అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న 2016లో కూడా ఇంకా గౌరవప్రదంగా జీవించే హక్కుకోసం పోరా>డుతున్న పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రామన్‌మెగసెసే అవార్డు గ్రహీత కృష్ణన్ మాట్లాడుతూ ఇది దుర్మార్గమనీ, నేరమనీ తెలిసి కూడా దీన్ని అంగీకరించకుండా అత్యంత సులభంగా తప్పుకుంటున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు.
చివరగా అన్‌సీన్ పుస్తక రచయిత భాషా సింగ్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్స్‌లో సంభవిస్తున్న మరణాలన్నీ హత్యలేనన్నారు. పాత్రికేయ వృత్తిలో భాగంగా మానవ మల మూత్రాలను చేతులతో ఎత్తిపోసే కథనాలను సేకరించే ప్రయాణంలో నా వ్యాసాలు పుస్తకంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు. పాకీ పనిచేసే స్త్రీల అంతరాంతరాళాల్లో ఉన్న వాస్తవిక కథనాలను గుదిగుచ్చి ఈ పుస్తకాన్ని రాయడంలో ఎస్‌ఆర్.శంకరన్ ప్రోత్సాహమే కీలకమన్నారు. మానవ మలమూత్రాలను చేతులతో ఎత్తివేసే అమానవీయపనిలో మూలుగుతోన్న లక్షలాది మంది మహిళలు అనుభవిస్తోన్న యథార్థగాథే అశుద్ధ భారత్ అని సజయ అన్నారు.