‘జెన్ బౌద్ధం’ పుస్తకావిష్కరణలో రామచంద్రమూర్తి, శ్రీరమణ, అప్పాజోస్యుల, ఆలపాటి, రెంటాల తదితరులు
తెనాలి: జ్ఞానపీఠ అవార్డులు స్వీకరించిన ముగ్గురు తెలుగు ప్రముఖులు ఆధునిక సాహిత్యంలో శిఖర సమానులని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. గడిచిన అయిదారు దశాబ్దాల్లో తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం కేవలం ముగ్గురినే వరించడం ఆశ్చర్యకరమన్నారు. తెలుగు సాహితీ ప్రముఖుల రచనలు ఇతర భాషల్లోకి అనువదించి, ఆ రచనలకు విస్తృత ప్రచారం కల్పించి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు విశ్వనాథ–సినారె–భరద్వాజ సాహితీ వాహిని పేరిట శనివారం సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. రాజకీయంగా చొరవ, ప్రోత్సాహం ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటే గానీ సాహిత్యంలో అవార్డులు రావని అభిప్రాయపడ్డారు. బెజవాడ గోపాలరెడ్డి సహకారంతో విశ్వనాథ సత్యనారాయణకు, పీవీ నరసింహారావు ప్రోత్సాహంతో సి.నారాయణరెడ్డికి, చిన్ననాటి తమిళ స్నేహితుడు పట్టుబట్టడం వల్లే రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ వచ్చిందని చెప్పుకుంటారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సాహితీవేత్త ఆరుద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోనే ఆగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
విశ్వనాథ వంటి కవిలేరు..
‘విశ్వనాథ సాహిత్య ప్రాభవం’పై ప్రముఖ సాహితీవేత్త మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, అజోవిభోకందాళం ఫౌండేషన్ (అమెరికా) వ్యవస్థాపకుడు డాక్టర్ అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడారు. రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ ఆనాడే సమకాలీయతను చొప్పించారని చెప్పారు. వెయ్యేళ్ల తెలుగు కవిత్వంలో విశ్వనాథ వంటి కవి లేరని అభిప్రాయపడ్డారు. ‘డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్య వైభవం’పై సాహితీ ప్రముఖులు పత్తిపాక మోహన్, ఎన్‌ఆర్ తపస్వి ప్రసంగించారు.
తెలుగు సాహిత్యాన్ని సినారె సుసంపన్నం చేశారని అన్నారు. ‘భరద్వాజ సాహిత్య మార్దవం’పై ప్రముఖ రచయితలు జీఎస్ నాగేశ్వరరావు, రెంటాల జయదేవ మాట్లాడారు. భరద్వాజ రచనల్లో ‘జీవన సమరం’ గొప్పదన్నారు. మానవతావాదిగా కొనసాగిన రచయితగా భరద్వాజ చిరస్మరణీయుడన్నారు. అనంతరం సంజీవదేవ్ రచించిన ‘జన్ బౌద్ధం’, ఎన్‌ఆర్ తపస్వి ఇంగ్లిష్ అనువాదంతో సహా ద్విభాషా పుస్తకాన్ని రచయిత పన్నాల సుబ్రహ్మణ్యభట్టు ఆవిష్కరించారు. మరో రచయిత శ్రీరమణకు ఆ పుస్తకాన్ని అంకితమిచ్చారు. సదస్సులో సాహితీవేత్త వెనిగళ్ల వెంకటరత్నం, మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనీకుమార్ అతిథులుగా పాల్గొన్నారు. చిలువూరు సురేష్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment