'ముఖ్యమంత్రులు ఇలాంటి పనిచేయొచ్చా?'
విజయవాడ: డబ్బుతో అధికారంలోకి రావడం.. అధికారంలోకి వచ్చాక డబ్బు సంపాదించుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. నాయకులు అధికారంలోకి వచ్చేందుకు అలివికాని హామీలు ఇస్తున్నారని చెప్పారు. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను విస్మరిస్తున్నారని ఆయన చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది.
ఈ సదస్సులో కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ రాజకీయం దళారీ వ్యవస్థగా మారడం ఆందోళనకరం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని సూచించారు. వెంకయ్యలాంటి వ్యక్తులు ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన రాజమండ్రి పరిసరాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.