సమర్థ దౌత్యమే సరైన ఆయుధం | K Ramachandra Murthy Article On Pulwama Terror Attack | Sakshi
Sakshi News home page

సమర్థ దౌత్యమే సరైన ఆయుధం

Published Sun, Feb 17 2019 1:18 AM | Last Updated on Sun, Feb 17 2019 1:18 AM

K Ramachandra Murthy Article On Pulwama Terror Attack - Sakshi

కశ్మీర్‌లోయలో పాకిస్తాన్‌ ఉగ్రపంజా విసిరి విశేషంగా ప్రాణనష్టం సంభవించిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది. ప్రదానమంత్రి ఆగ్రహం వెలిబుచ్చుతారు. పాకిస్తాన్‌కి తగినవిధంగా జవాబు చెబుతామంటూ తీవ్రంగా హెచ్చరిస్తారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరి చేయడానికి అవసరమైన సకల చర్యలూ తీసుకుంటామని హామీ ఇస్తారు. పాకిస్తాన్‌ను ఉగ్ర దేశంగా అభివర్ణిస్తారు. కొన్ని వారాలపాటు ప్రతీకార దాడుల గురించీ, ‘ముహ్‌ తోడ్‌ జవాబ్‌’ (మొహం పగిలే జవాబు) గురించీ ప్రధాని నరేంద్రమోదీ హెచ్చ రిస్తారు.  

టెలివి జన్‌ చానళ్ళు హడావిడి చేస్తాయి. వార్తాపత్రికలలో ప్రధాన శీర్షికలుగా వస్తాయి. 2008లో ముంబయ్‌పైన పాకిస్తాన్‌ ముష్కరులు దాడి చేసినప్పటి నుంచీ మొన్న పుల్వామాలో కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళాల (సీఆర్‌ పీఎఫ్‌)పైన దాడి వరకూ ఇదే వరుస. గురువారంనాడు అదిల్‌ మహమ్మద్‌ దార్‌ అనే కశ్మీరీ యువకుడు పేలుడు పదార్థాలను స్కార్పియో కారునిండా పెట్టుకొని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను తీసుకొని వెడుతున్న ట్రక్కుల శ్రేణిని ఢీకొట్టి పేలిపో యాడు. ఫలితంగా 40 మంది జవాన్లు మరణించారు. అనేకమంది గాయప డ్డారు. లోగడ ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. జమ్మూ–కశ్మీర్‌ అసెంబ్లీ భవనంపైన 2001లో పేలుడు పదార్థాలు కలిగిన ట్రక్కుతో దాడి జరిపిందీ, పఠాన్‌కోట, నాగ్రోతా, ఉడిలోని సైనిక స్థావరాలపైన దాడులు చేసిందీ కశ్మీర్‌కు చెందిన పౌరులు కాదు. వారు పాకిస్తానీయులు. 

అక్కడ ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులు. 2000 ఏప్రిల్‌లో కశ్మీర్‌లో తొలి మానవబాంబు పేలింది. బాదామీబాగ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపైన దాడి చేసి ఇద్దరు సైనికులను హత్యచేశారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తి కశ్మీర్‌కు చెందిన యువ కుడు. కశ్మీర్‌కు చెందిన యువకులను ఆకర్షించి పాక్‌ తీసుకువెళ్ళి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చి కశ్మీర్‌పైన ప్రయోగించడం పాకిస్తాన్‌ సైన్యం పోషి స్తున్న ఉగ్రవాదసంస్థల నిరంతర కార్యక్రమం. శనివారం దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ప్రభు త్వానికి అండగా నిలబడతామని ప్రకటించాయి. పుల్వామా దాడిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని సైతం అఖిలపక్ష సభ ఈ సందర్భంగా ఆమోదించింది. 

కశ్మీర్‌లో పాకిస్తాన్‌ చిచ్చు
కశ్మీర్‌లోయలో ఎప్పుడు  కావాలనుకుంటే అప్పుడు చిచ్చుపెట్టే శక్తి పాకిస్తాన్‌కు ఉన్నది. పాకిస్తాన్‌కు ఇండియా ఎటువంటి జవాబు ఇవ్వగలదు? 2016 సెప్టెం బర్‌లో ఉగ్రదాడులకు ప్రతీకారంగా సర్జికల్‌ స్ట్రయిక్‌ చేసినట్టు ప్రభుత్వం ప్రక టించింది. దేశంలోనూ, విదేశాలలోనూ సర్జికల్‌ స్ట్రయిక్‌ గురించి నరేంద్ర మోదీ పలు సందర్భాలలో చెప్పారు. అంతా బూటకమేనని పాకిస్తాన్‌ ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలనీ, ప్రతీకారం తీర్చుకోవాలనీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. సర్జికల్‌ స్ట్రయిక్‌ కంటే నేరుగా పాకిస్తాన్‌ భూభా గంలోకి యుద్ధవిమానాలు వెళ్ళి బాంబింగ్‌ జరిపితే పాకిస్తాన్‌ ఇకపైన జాగ్రత్తగా వ్యవహరిస్తుందని కొందరు సూచిస్తున్నారు. 

అయితే మన యుద్ధవిమానాలు పాకిస్తాన్‌ భూభాగంలోకి ప్రవేశిస్తే పాక్‌ సైనికులు చేతులు ముడుచుకొని  కూర్చుంటారా? వారికి మనకిలాగే రాడార్‌ వ్యవస్థ ఉండదా? అయినా సరే, ఆవేశం, ఆక్రోశం ఉన్న సమయంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నాయ కులు ఇటువంటి ప్రకటనలు సైతం చేస్తారు. ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కనుకనే అసాధారణ రీతిలో ప్రభుత్వ స్పందన ఉంటుంది. ఈ  కారణంగానే ప్రతిపక్షాలు సైతం ఇంటెలిజెన్స్‌ వైఫల్యాల గురించి ఏ మాత్రం మాట్లాడకుండా ఏకతాటిపై నిలబడి ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ఈ పరిస్థితిలో కశ్మీర్‌ను రావణ కాష్టంగా మార్చిన భారత ప్రభుత్వ విధానాలనూ, వైఫల్యాలనూ ప్రస్తా వించడం సముచితం కాదు. ఇది సంతాప సమయం. విశ్లేషణలకూ, విమర్శ లకూ తగిన సందర్భం కాదు.

సైనికంగా స్పందిస్తామంటూ, పాకిస్తాన్‌కి గుణపాఠం చెబుతామంటూ ప్రధాని గంభీరంగా ప్రకటిస్తుంటే ఆయన వైఖరిని ప్రశ్నించడం అవివేకం. అందుకే అఖిలపక్షం ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో నిర్ణయించే బాధ్యత పూర్తిగా సైన్యానికి వదిలినట్టు నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎప్పుడో ఏదో ప్రకటన వస్తుంది. ఇలా అధీనరేఖ దాటి కొందరు శత్రు సైనికులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకోవడం కొత్త కాదు. ప్రతీకారం చేసినట్టు పదేపదే చెప్పుకునే సంప్ర దాయానికి మోదీ శ్రీకారం చుట్టారు. కశ్మీర్‌పైన జరుగుతున్న దాడుల పట్ల కోపంతో కుతకుతలాడుతున్న దేశప్రజలను శాంతింపజేయడానికి ఉద్దేశించిన ప్రక్రియ ఇది. 

సర్జికల్‌ స్ట్రయిక్‌లు నిర్వహించామని ప్రకటించడమే కాకుండా వాటి తాలూకు దృశ్యాలను కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. ఎన్నికలు చాలా దూరంగా ఉన్న దశలోనే సర్జికల్‌ స్ట్రయిక్‌కు అత్యంత ప్రచారం ఇచ్చినవారు ఎన్నికలు సమీపించిన తరుణంలో చేయబోయే ప్రతీకారానికి ప్రచారం ఇవ్వకుండా ఉంటారా? ఏదో ఒక ప్రతీకార చర్య తీసుకున్నట్టూ, పాకిస్తాన్‌ మదం అణచినట్టూ త్వరలోనే ప్రభుత్వం ప్రక టిస్తుంది. ఏ విధంగా చూసినా ఇది అనివార్యం. కొన్ని మాసాల తర్వాత ప్రజలు ఈ అంశాన్ని మర చిపోతారు. ఇది తాత్కాలిక ఉపశమనమే కానీ కశ్మీర్‌ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదు. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తర్వాత ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఒక అంగుళమైనా వెనుకంజ వేశాయా? కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయా? 

ఉగ్రవాదంవైపు మొగ్గుతున్న యువత
ఉగ్రవాదుల దాడులు తగ్గినట్టు ప్రభుత్వం చెబుతున్నది. కానీ కొన్నేళ్ళుగా కశ్మీర్‌లో యువకులు తీవ్రవాదంవైపు మొగ్గుతున్నారు.  తుపాకీ నీడన పుట్టి పెరిగిన యువకులకు సైనికులతో కానీ ప్రభుత్వాధికారులతో కానీ చేదు అనుభవం ఎదురైతే వారు ఉగ్రవాద సంస్థలలో చేరిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్‌ వంటి అధునాతన సాంకేతికత ఉగ్రవాదం ప్రచారానికి కూడా దోహదం చేస్తోంది. ప్రపంచం పూర్తిగా తెలియని యువకులను ఆకర్షించడానికి రకరకాల వీడియోలు తయారు చేసి వదులుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు దార్‌ను చితకబాదడంతో అతడు ఉగ్రవాదాన్ని ఆశ్రయించాడంటూ దార్‌ తల్లి దండ్రులు చెప్పారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన జవాన్ల తల్లిదండుల వలెనే తాము కూడా కొడుకు చనిపోయాడని కుమిలిపోతున్నామని అన్నారు. 

ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా దార్‌ తల్లిదండ్రుల పుత్రశోకానికి  కారణాలు కనుగొని తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం కశ్మీర్‌లోయలో అస్థిరతకూ, అనిశ్చితికీ, శాంతభద్రతల వైఫల్యానికీ, పరిపాలన దెబ్బతినడానికీ దారితీసింది. ఇటువంటి అనిశ్చిత పరిస్థితులలోనే ఉగ్రవాదం పైచేయి సాధిస్తుంది. ఇటువంటి వాతా వరణమే 1989లోనూ, 2010లోనూ కశ్మీర్‌లోయలో ప్రబలింది. ఈ పరిస్థితిని ఎప్పటికైనా చక్కదిద్దుకోవలసిందే. కశ్మీరీల మద్దతునూ, విధేయతనూ భారత ప్రభుత్వం, ప్రజ సంపాదించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం ప్రథమ కర్తవ్యం. ముఖ్యమైన అంశం పాకిస్తాన్‌కు సంబంధించింది. ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలకు ఊతం లభించినంత కాలం కశ్మీర్‌లో శాంతిభద్రతలు రక్షించడం అసాధ్యం.

పాకిస్తాన్‌ను బలప్రయోగంతో లొంగదీసుకునేందుకు ప్రయత్నించడం వృధా ప్రయాస. అది కూడా అణుశక్తి కలిగిన రాజ్యం. పైగా పాకిస్తాన్‌కు కొండంత అండగా చైనా ఉన్నది. ఆత్మాహుతి దాడి తమ పనే అని చాటుకున్న జైషే మహమ్మద్‌ నాయకుడు మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న భారత ప్రతిపాదనకు చైనా పదేపదే మోకాలడ్డుతున్నది.  సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతిపట్ల సంతాపం తెలిపే ప్రకటనలో సైతం చైనా పాకి స్తాన్‌ ప్రస్తావన చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సానుభూతి ప్రకటిస్తూ మోదీకి సందేశం పంపించారు కానీ అమెరికా మరోవైపు పాకిస్తాన్‌కు గొప్ప ఉపకారం చేస్తున్నది.

వ్యూహాత్మకంగా బలమైన స్థితిలో పాకి స్తాన్‌ ఉండ బోతోంది. మరోవైపున అఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా సైనికులు పూర్తిగా నిష్క్రమించబోతున్నారు. ప్రపంచంలో ఎదురులేని శక్తిగా అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ క్రమంగా అమెరికా సైనికులను సంక్షుభిత ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. అఫ్ఘానిస్తాన్‌ నుంచి అమెరికా సైనికులు వైదొలగడం అంటే అఫ్ఘానిస్తాన్‌ భద్రతాదళాలపైన దాడులు చేస్తున్న తాలిబాన్‌కు అఫ్ఘానిస్తాన్‌ను అప్పగించడమే. పరోక్షంగా పాకిస్తాన్‌ చేతు లలో అఫ్ఘానిస్తాన్‌ను పెట్టడమే. దౌత్యరంగంలో పాకిస్తాన్‌ ప్రభుత్వాలు మన ప్రభుత్వాల కంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణ. 

అఫ్ఘానిస్తాన్‌ వ్యవహారంలో భారత్‌ ఒంటరి
అఫ్ఘానిస్తాన్‌ సమస్య పరిష్కారానికి మాస్కోలో రష్యా, చైనా, పాకిస్తాన్‌ ప్రతి నిధుల మధ్య చర్చలు జరిగాయి. ఇందులో భారత్‌ ప్రస్తావన కానీ ప్రమేయం కానీ లేదు. మన్మోహన్‌సింగ్‌. నరేంద్రమోదీ అఫ్ఘానిస్తాన్‌ను సందర్శించి, అఫ్ఘాన్‌ సైనికులకు ఇండియాలో శిక్షణ ఇచ్చి, ఆర్థిక సహాయం చేసి, కాబూల్‌లో పార్ల మెంటు భవన నిర్మాణంలో తోడ్పడినప్పటికీ అఫ్ఘాన్‌ సంక్షోభం పరిష్కరించ డంలో భారత్‌ ప్రమేయం ఉండాలని అమెరికా కానీ చైనా కానీ అఫ్ఘానిస్తాన్‌  కానీ భావించడం లేదు. అంతే కాదు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్‌ అనుకూల ప్రభు త్వమో, తాలిబాన్‌ నడిపించే ప్రభుత్వమో ఏర్పడితే ఇంతకాలం ఆఫ్ఘాన్‌ భద్రతా దళాలతో పోరాడిన తాలిబాన్‌ను పాకిస్తాన్‌ కశ్మీర్‌వైపు మళ్ళిస్తుంది. 1989లో అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ (సీఐఏ) సహకారంతో పాకి స్తాన్‌ ప్రోత్సాహంతో తాలిబాన్‌ అఫ్ఘానిస్తాన్‌పై పోరాటం చేసి ఆ దేశం నుంచి సోవియెట్‌ సైన్యాన్ని జయప్రదంగా పంపించివేసింది. అంతవరకూ సోవియెట్‌ సైన్యంతో పోరాడిన తాలిబాన్‌ను కశ్మీర్‌పైకి పంపించింది పాకిస్తాన్‌. దాని ఫలితంగా ఉగ్రవాదుల దాడులతో కశ్మీర్‌ కొన్ని సంవత్సరాలు అతలాకుతలమై
పోయింది.

ఇప్పుడు కూడా తాలిబాన్‌ను ప్రయోగిస్తే కశ్మీర్‌ మరోసారి అగ్ని గుండంగా మారిపోతుంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబాలు రెండు అఫ్ఘాన్‌ సంక్షోభం సృష్టించిన పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే. ఇటువంటి సంస్థల సహకారంతో కశ్మీర్‌లో చిచ్చుపెట్టడం ద్వారా ఇండియాను నిరంతరంగా వేధిస్తూ ఉండటం పాకిస్తాన్‌ విధానం. సైనిక చర్య తీసుకోవాలంటే ఇజ్రేల్‌ ఎంటెబేలో చేసిన సాహసం ఇండియా చేయాలి. ఇస్లామాబాద్‌ పరిసరాలలో తలదాచుకున్న లాడెన్‌ను ఒబామా పంపిన సైనికులు మట్టుబెట్టినట్టే సయీద్‌ హఫీజ్, అజహర్‌ మసూద్‌ తదితర ఉగ్రవాదులను హతమర్చాలి. 

అంతటి తెగింపు, సాహసం, శక్తి ఇండియాకు ఉన్నాయా? దూరపు లక్ష్యాలను పేల్చేందుకు స్నైపర్స్‌ ఉపయోగించే ఆధునిక ఆయుధాలు భారత సైనికుల చేతుల్లో లేవు. పాత తరం రష్యా ఆయుధాలు భారత సైనికుల దగ్గర ఉంటే కొత్తతరం చైనా ఆయుధాలు పాకిస్తాన్‌ స్నైపర్స్‌ చేతుల్లో ఉన్నాయి. చైనా ఆయుధాల శక్తి, విస్తృతి అధికం. ఇదీ మనం గుర్తించాల్సిన క్షేత్ర వాస్తవికత. పాకిస్తాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం అనూహ్యం. యుద్ధం ఆరంభించడం తేలికే. ముగించడం కష్టం. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ వంటివి నిష్ప్రయోజనం. యుద్ధ విమానాల ప్రయోగం సైతం అంతే. దేశవాసుల ఆగ్రహం తగ్గించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అఫ్ఘానిస్తాన్‌ నుంచి సోవియట్‌ యూనియన్‌ను తాలిబాన్‌  సహకారంతో పారదోలినా రష్యాతో పాకి స్తాన్‌ సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు.

న్యూయార్క్‌లో జంటశిఖరాలపైన దాడులు చేయించి విధ్వంసం సృష్టిం చిన బిన్‌లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చినా, అఫ్ఘానిస్తాన్‌లో అమెరికా సైనికులను పాకిస్తాన్‌ మద్దతు ఇస్తున్న తాలిబాన్‌ మట్టుపెడుతున్నా అమెరికాతో పాకిస్తాన్‌ సంబంధాలు బాగానే ఉన్నాయి. చైనా–పాకిస్తాన్‌ మైత్రి ప్రగాఢమైనది. పాకి స్తాన్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పోషిస్తున్నందుకు పాకిస్తాన్‌ మూల్యం చెల్లిస్తున్నది. దౌత్యరంగంలో మాత్రం వీగిపోకుండా నిలిచింది. ఎప్ప టికప్పుడు ఎత్తుగడలతో నెట్టుకొస్తున్నది. అటువంటి కపట రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్న పాకిస్తాన్‌ నిజస్వరూపాన్ని ప్రపంచానికి చాటవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశం ఉగ్ర వాదానికి స్థావరంగా ఉన్నదనే సందేశం ప్రపంచ దేశాలన్నిటికీ చేర్చాలి. ఆ దిశగా భారత విదేశాంగ యంత్రాంగం యావత్తూ కృషి చేయడానికి పుల్వామా దాడిని ఒక బలమైన సందర్భంగా వినియోగించుకోవాలి.

-కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement