మూడు దశాబ్దాలుగా నెత్తురోడని రోజంటూలేని జమ్మూ–కశ్మీర్‌లో గురువారం సీఆర్‌పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి దేశ ప్రజానీకాన్ని మాత్రమే కాదు... ప్రపంచాన్నే నిశ్చేష్టుల్ని చేసింది. జవాన్ల వాహనశ్రేణిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాది ఒకడు ఆత్మాహుతి దాడికి పూనుకొని 43 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనిది. భద్రతా బలగాలు ఒక దాడిలో ఇంతమంది సహచరులను కోల్పోవడం కశ్మీర్‌లో ఇదే తొలిసారి. ఈ ఆత్మాహుతి దాడి జరిగిన కాసేపటికే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ దానికి తామే కారణమని ప్రకటించడంతోపాటు ఆ ఉగ్రవాది పేరు ఆదిల్ అహమ్మద్ దార్ అని వెల్లడించింది. (ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ: ప్రధాని)
దాడికి ముందు ఉగ్రవాది ఆదిల్ మాట్లాడిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ‘కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధమ’ని గతంలో పాకిస్తాన్ పాలకులు చెప్పడాన్ని గుర్తుం చుకుంటే ఈ ఉగ్రవాద విషసర్పానికి అక్కడ ఏ స్థాయిలో అండదండలున్నాయో అర్ధమవుతుంది. అలాంటి మద్దతే లేకపోతే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన జైషే మొహమ్మద్ సంస్థపై పాకి స్తాన్ చర్యలకు ఉపక్రమించేది. 24 గంటలు గడిచినా ఆ విషయంలో మౌనంగానే ఉండిపోయింది. కనుకనే ప్రధాని నరేంద్రమోదీ పాకిస్తాన్‌ను తీవ్రంగా హెచ్చరించవలసి వచ్చింది. (ఉగ్ర మారణహోమం)
సైనికంగా తనకంటే అనేక రెట్లు శక్తిమంతమైన భారత్ వంటి పొరుగుదేశాన్ని ఇలాంటి ఉన్మాద దాడులతో పాదాక్రాంతం చేసుకోగలమని, కనీసం అస్థిరత్వంలోకి నెట్టగలమని పాకిస్తాన్ భ్రమిం చడం దాని తెలివితక్కువ నైజాన్ని, మూర్ఖత్వాన్ని బయటపెడుతోంది. గతంలో అది తన మను షుల్ని సమీకరించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి, దాడి చేయాల్సిన ప్రాంతాల వివరాలను అంద జేసి సరిహద్దులు దాటించేది. కానీ అక్కడ భద్రత పటిష్టపడటం వల్ల కావొచ్చు... అంతర్జాతీ యంగా చీవాట్లు పడుతుండటంవల్ల కావొచ్చు దానికి స్వస్తి పలికి కశ్మీరీ పౌరులపై దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. చదువుసంధ్యల్లేని యువతను ఎంచుకుని వారికి ఉగ్రవాదం నూరిపోసి, ఆయుధా లిచ్చి పంపి తన ప్రయోజనాన్ని నెరవేర్చుకునే పన్నాగానికి పూనుకుంది. తాజా ఉదంతానికి కారకు డైన ఆదిల్ నేపథ్యం ఈ సంగతిని వెల్లడిస్తోంది.
నిజానికి ఈ యువతలో ఎందరు ఇష్టప్రకారం ఆ ముఠాలోకి వెళ్తున్నారో చెప్పలేం. చావడానికి పోతూ ఉగ్రవాది ఆదిల్ ఇచ్చిన ‘సందేశం’ స్వచ్ఛం దంగా ఇచ్చిందో, చుట్టూ తుపాకులతో నిలబడి చెప్పించిందో ఎవరూ నిర్ధారించలేరు. ఇరాక్, సిరి యాల్లో ఉగ్రవాద సంస్థ ఐఎస్ నడిపిన శిబిరాల్లో ఆత్మాహుతి బాంబర్లుగా శిక్షణ పొంది మధ్యలోనే దొరికిపోయిన కొందరు పిల్లలు వెల్లడించిన కథనాలు గతంలో వెలువడ్డాయి. జైషే మొహమ్మద్ స్వతంత్ర ఉగ్రవాద సంస్థ కాదు. దానికి పాకిస్తాన్ సైన్యం కనుసన్నల్లో పనిచేసే గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో ఉన్న సాన్నిహిత్యంలో దాపరికమేమీ లేదు.
ఉగ్రవాదంపై పోరాటం బహుముఖంగా ఉండాలి. దాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడం కోసం నిరంతరాయంగా ప్రయత్నించడంతోపాటు చుట్టూ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో మనం విఫలమయ్యామని తాజా ఉదంతం తేట తెల్లం చేస్తోంది. ఫలితంగా ఆత్మాహుతి దాడుల సంస్కృతి కశ్మీర్ లోయకు సైతం జొప్పించడంలో జైషే సంస్థ విజయం సాధించినట్టు కనబడుతోంది. ఆత్మాహుతి దాడి 2000 సంవత్సరంలోనూ జరిగింది.
కానీ 29మంది ప్రాణాలు తీసిన ఆ ఉదంతంతో పోలిస్తే తాజా ఉదంతం తీవ్రత అన్ని విధాలా అధికం. అప్పట్లో ఉగ్రవాది ప్రభుత్వ వాహనాన్ని హైజాక్ చేసి ఆ పని చేశాడు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఒక పల్లెలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాది సిద్ధం చేసుకున్నాడు. జమ్మూ–కశ్మీర్ భద్రతా విషయాల్లో తలమునకలై ఉండే యంత్రాంగానికి సహ జంగానే ఇటీవల అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలేమిటో తెలియకపోవు. ఆ స్థాయిలోనే నిఘా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది కాలంగా ఆత్మాహుతి దాడులు జరగొచ్చునన్న సమాచారం ఇంటెలిజెన్స్ సంస్థలకు అందుతూనే ఉన్నదని ఆ వర్గాల కథనం. అటువంటప్పుడు అందుకనువైన విధానాలను రూపొందించుకోవడం భద్రతా బలగాల బాధ్యత.
జవాన్ల వాహనశ్రేణి వెళ్లే దారిలో ముందుగా ప్రత్యేక బృందం వెళ్లి ఆ మార్గం సురక్షితంగా ఉన్నదో లేదో మదింపు వేయడం రివాజు. అది సక్రమంగానే జరిగిందా? ఆత్మాహుతి దాడికి గురైన వాహనశ్రేణిలో 78 వాహనాలుంటే, అందులో 2,547మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. అసా« దారణమైన, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే భారీ కాన్వాయ్‌లు తరలిస్తారు. మామూలు పరిస్థితుల్లో వేయిమందికి మించని జవాన్లతో ఉండే వాహనశ్రేణిని అనుమతిస్తారని చెబుతారు. అలాంటి పద్ధతులను ఎందుకు పాటించలేదు? జమ్మూ నుంచి తెల్లారుజామున 3.30కు బయ ల్దేరిన జవాన్ల వాహనశ్రేణి గురించిన సమాచారం అక్కడికి 241 కిలోమీటర్ల దూరంలోని అవం తిపొరా పట్టణం సమీపంలో పొంచివున్న ఉగ్రవాదులకు ఎలా చేరింది? అలాగే అడుగడుగునా రాత్రింబగళ్లు తనిఖీలు సాగుతుండే రాష్ట్రంలో ఒక పల్లెకు 350 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) ఎలా చేరిందనుకోవాలి? వీటన్నిటిపైనా లోతైన సమీక్ష జరగాలి.
ఏళ్ల తరబడి అనుసరించే మూస విధానాలు కూడా లొసుగులకు తావిస్తాయి. ఆ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. పాక్‌పై తక్షణ చర్య అవసరమని కొందరంటున్నారు. కానీ ఆచితూచి అడుగేయడం శ్రేయస్కరం. ఇప్పటికే పాక్‌పై దౌత్యపరమైన దాడిని మన దేశం ప్రారంభించింది. దాన్ని పక డ్బందీగా కొనసాగించి, అంతర్జాతీయంగా పాక్‌ను ఏకాకి చేయడానికి గల అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలి. ఇప్పుడు సైతం జైషే చీఫ్ మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా గుర్తించ నిరా కరిస్తున్న చైనా నైతికతను కూడా ఎండగట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment