దుఃఖ పడటానికి దేవుడు సమయం ఇవ్వలేదు. సైనికుడి భార్యకు దుఃఖమేమిటి అనుకున్నాడేమో! ప్రదీప్ కూడా అనేవాడు.. ‘సైనికుడి భార్యకు కన్నీళ్లేమిటి’ అని. కళ్లయినా తుడిచేవాడా! ‘తుడుచుకో’ అని నవ్వేసి రైలు ఎక్కేసేవాడు.
పిల్లల్ని తీసుకుని చీకట్లోనే అత్తగారి ఊరికి చేరుకున్నాను. దారి మధ్యలో.. ‘‘ఎ..క్క..డి..కీ..’’ అని అడిగింది సోనా వచ్చీరాని మాటల్తో. రెండేళ్లు దానికి. ‘‘నాన్న దగ్గరికి’’ అని చెప్పాను. మేము వచ్చేటప్పటికి ప్రదీప్ ఇంకా అమ్మగారింటికి ‘చేరుకోలేదు’.
‘‘నాన్నేరీ’’ అంటోంది సోనా నిద్రకు సోలుతూ. సుప్రియకు అర్థమైపోయింది. ‘‘రారు కదమ్మా నాన్న ఇక ఎప్పటికీ’’ అంది చెల్లికి వినిపించకుండా.
దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాను. పదేళ్ల పిల్ల సుప్రియ! కొన్ని గంటల క్రితం వరకూ తనూ రెండేళ్ల పిల్లలానే ఉండేది. నాన్న ఫోన్ చేస్తే.. ‘ఎప్పుడొస్తావ్ నాన్నా’ అని అడిగేది. ‘నాన్నా.. మనం కట్టుకుంటున్న ఇంట్లో చెల్లికి, నాకు కలిపి.. మా ఇద్దరికే ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది కదా’ అనేది.
‘ఉంటుంది తల్లీ. మరి నేను, అమ్మ.. ఎప్పుడైనా మీ గదిలోకి రావచ్చా’ అని అడిగేవాడు ప్రదీప్. ‘రావచ్చు నాన్నా. అయితే మా గదిలో ఉన్నప్పుడు కశ్మీర్ నుంచి ఫోన్ వస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యకూడదు. ఎప్పుడు నీకు ఫోన్ వచ్చినా, వెంటనే రమ్మనే కదా వస్తుంది’ అనేది.. మూతి అదోలా ముడిచి.
అమ్మవాళ్ల ఊళ్లో ఉన్నప్పుడు గురువారం తెల్లవారు జామున ప్రదీప్ నుంచి ఫోన్ వచ్చింది. చాలాసేపు మాట్లాడాడు. పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. పది నిముషాలు సోనా గురించే మాట్లాడాడు. ‘జమ్మూ నుంచి శ్రీనగర్ వెళుతున్నాం’ అన్నాడు. ‘ఇంత రాత్రేమిటి?’ అన్నాను. నవ్వాడు. ‘‘నాకొక్కడికే కాదు రాత్రి. ఇంకా రెండువేల ఐదొందల మందికి కూడా. డెబ్భై ఎనిమిది వాహనాల్లో వరుసగా వెళుతున్నాం. వాహనాలు నడిపించడం లేదు మమ్మల్ని. దేశ సమగ్రతను కాపాడవలసిన బాధ్యత నడిపిస్తోంది’’ అన్నాడు!
సుప్రియ గురించి, సోనా గురించి తప్ప ప్రదీప్ నాతో ఏం మాట్లాడినా సాటి జవానుతో మాట్లాడినట్లే ఉంటుంది.
‘‘సుప్రియ అడుగుతోంది.. ‘నాన్న మళ్లీ ఎప్పుడొస్తారని’. పని పూర్తవగానే వచ్చేస్తారని చెప్పాను’’ అన్నాను. నవ్వాడు.
‘‘సుప్రియ అడుగుతోంది. నేను అడగలేకపోతున్నాను’’ అన్నాను బెంగగా.
‘‘సైనికుడి భార్యవేనా నువ్వు?’’ అన్నాడు.
పెద్ద శబ్దం. నా చేతిలోని ఫోనే పేలిపోయినంతగా శబ్దం! ‘ప్రదీప్.. ప్రదీప్..’ ప్రదీప్ పలకట్లేదు. సుప్రియ లేచింది. ‘ఏంటమ్మా..’ అని.
మళ్లీ ఫోన్!! ‘‘ప్రదీప్’’ అన్నాను. నిశ్శబ్దం!
‘‘ప్రదీప్ భార్యేనా మీరు?’’ కంట్రోల్ రూమ్ నుంచి! నాకేదో అర్థమౌతోంది.
ప్రదీప్ భార్యనని చెప్పుకోవాలంటే ఏడ్వకూడదు. ‘ఊ’ అన్నాను.
పిల్లల్ని దగ్గరికి లాక్కున్నాను.
ఊరింకా మేల్కోలేదు. బరసిరోహీ నుంచి సుఖ్‌సేన్‌పూర్ వచ్చేశాం. పిల్లలిద్దరూ.. నాన్న రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అమరవీరుడైన ఒక జవాన్ రావడం కోసం సుఖ్‌సేన్‌పూర్ ఎదురు చూస్తోంది.
సుప్రియ నా చెయ్యి పట్టుకుని మెల్లిగా ‘‘అమ్మా..’’ అని పిలిచింది.
‘‘నాన్న.. అక్కడ చెయ్యవలసిన పని పూర్తయి ఉండదు కదమ్మా..’’ అంది. నాన్నపై ఉన్న ప్రేమంతా కన్నీళ్లుగా కరిగి, దాని చెంపల్ని తడిపేస్తోంది. తన కళ్లు కదా తుడుచుకుని చెప్పాల్సింది.. నా కళ్లు తుడుస్తూ చెప్పింది..
‘‘నాన్న మిగిల్చిపోయిన పని నేను పూర్తి చేస్తానమ్మా..’’ అని చెప్పింది!
ఒడిలోకి తీసుకున్నాను.
సైనికుడి కూతురు అది.
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment