ముగ్గురూ ముగ్గురే | Ramachandra murthy write artocal on three governments | Sakshi
Sakshi News home page

ముగ్గురూ ముగ్గురే

Published Sun, Jun 11 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

ముగ్గురూ ముగ్గురే

ముగ్గురూ ముగ్గురే

మూడేళ్ళుగా మూడు ప్రభుత్వాలు మూడు ముఖ్యమైన రంగాలలో వ్యవహరిస్తున్న తీరులో సామీప్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది.

మూడేళ్ళుగా మూడు ప్రభుత్వాలు మూడు ముఖ్యమైన రంగాలలో వ్యవహరిస్తున్న తీరులో సామీప్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నది. సైద్ధాంతిక నేపథ్యం, వ్యక్తిగత వ్యవహార శైలి వేరైనా, ప్రజాస్వామ్య స్ఫూర్తిలోనూ, ప్రతిపక్షాల పట్ల వైఖరిలోనూ, వ్యవసాయ సంక్షోభం విషయంలోనూ ఢిల్లీలో నరేంద్రమోదీ, హైదరాబాద్‌లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌), అమరావతిలో నారా చంద్రబాబునాయుడు స్వల్ప వ్యత్యాసాలతో దాదాపు ఒకే విధంగా వ్యవహరిం చడం ఆశ్చర్యం.

నాటకీయతకు కొదవ లేదు. ఆత్మస్తుతికీ, పరనిందకీ అంతే లేదు. వాస్తవాలు తెలుసుకోవడానికి నిరాకరిస్తూ తమది అద్భుతమైన పాలన అనీ, తామే నంబర్‌ వన్‌ అనీ చాటుకుంటున్నారు. మరో పార్శ్వం ఉందనే స్పృహ లేదు. అప్రియం ఆలకించే సహనం లేదు. ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి అంచనాలు వారివి. ఎవరి దారులు వారివి. కేంద్రంలో ఎన్‌డీఏ, హైదరా బాద్‌లో టీఆర్‌ఎస్, అమరావతిలో టీడీపీ–బీజేపీ కూటమి ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే పని ఒక్కటీ చేయలేదు. నీరుగార్చే పనులు మాత్రం అనేకం చేశారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తి
పాలకుల ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిశీలిద్దాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రాముఖ్యం తెలియనివారు వీరిలో ఎవ్వరూ లేరు. కానీ చట్టాన్ని తుంగలో తొక్కడానికి ఎవ్వరూ సంకోచించడం లేదు. రాజీవ్‌ హయాంలో తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం వాజపేయి నేతృత్వంలో మరోసారి సవ రించిన అనంతరం కూడా ఫిరాయింపులను నిరోధించలేకపోయింది. ఆంధ్ర ప్రదేశ్‌లో, తెలంగాణలో యధేచ్ఛగా పార్టీ ఫిరాయింపులు జరిగాయి. పార్టీకి ద్రోహం చేసినవారిని మంత్రి పదవులతో సత్కరించారు. వారిని బర్తరఫ్‌ చేయాలంటూ వచ్చిన విజ్ఞప్తులనూ, దరఖాస్తులనూ పట్టించుకోలేదు.  రెండు తెలుగు రాష్ట్రాలలోని శాసనసభాపతులే కాదు లోక్‌సభ స్పీకర్‌ సైతం సాచివేత ధోరణి ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం తెలంగాణలో పార్టీ ఫిరాయించిన తమ శాసనసభ్యులపైన చర్య తీసుకోవాలంటూ మహజర్లు సమర్పించడం విడ్డూరం. ఇంతకంటే హాస్యాస్పదమైన సన్నివేశం ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ కనిపించదు.  

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వడం సంస్కారం. ప్రతిపక్షాలు లేకుండా కేవలం స్వపక్షమే సర్వత్రా ఉండాలని పాలకులు అను కోవడం అప్రజాస్వామికం, నిరంకుశత్వం. ఏలినవారి ఆలోచనలూ, ఉద్ఘాట నలూ, సర్వేలూ, ఎత్తుగడలూ అన్నీ ప్రతిపక్షం పట్ల తూష్ణీభావంతోనే. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అన్నది నరేంద్రమోదీ నినాదం అయితే, ప్రతిపక్ష రహిత రాజకీయ వ్యవస్థను రూపొందించే లక్ష్యం తెలుగు ముఖ్యమంత్రులది. అఖిలపక్ష సమావేశాలూ, సమాలోచనలూ మూడేళ్ళలో ఎన్నడైనా జరిగాయా?

పోలీసు కాల్పులు జరిగినప్పుడు మృతుల కుటుంబాలను పలకరించేందుకు ప్రతిపక్ష నాయకులు వెళ్ళడం రాజకీయం అంటూ తెగడుతున్నారు. ఇరిగేషన్‌ ప్రాజె క్టులకోసం భూసేకరణ చేస్తున్నప్పుడు నిర్వాసితుల మనోభావాలను తెలుసు కునే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ సినిమా ఫక్కీలో మధ్యప్రదేశ్‌ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌కి విమానంలో వెళ్ళి, రాష్ట్ర సరిహద్దు వరకూ బైక్‌ మీద ప్రయాణం చేసి, తర్వాత నయాగాంకి నడిచి, అనంతరం రైలు పట్టాల పక్కనా, పొలాలలోనూ పరుగులు తీసి, తేనె టీగలు కుట్టినా భరించి రైతులను కలుసుకునేందుకు వెడుతుంటే మధ్యప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేసి రహస్య ప్రదేశానికి తరలించారు. ఇంత సీను అవ సరమా? మొరార్జీదేశాయ్‌ ప్రధానిగా ఉండగా బిహార్‌ బెల్చీలో దళితులపై దాడులు జరిగినప్పుడు ఇందిరాగాంధీ కొంత దూరం విమానంలో, మరికొంత దూరం కారులో ప్రయాణం చేసి చివరికి ఏనుగునెక్కి కుగ్రామం చేరుకున్న ఉదంతాన్ని రాహుల్‌ గుర్తు చేశారు. అప్పటి మర్యాదలు ఇప్పుడు లేవు. పోల వరం ప్రాజెక్టు దగ్గరికి ప్రతిపక్షాలవారు కానీ హక్కుల కార్యకర్తలు కానీ వెళ్ళ డానికి వీలు లేకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేసి చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. మల్లన్న సాగర్‌ సమీపానికి ప్రతిపక్ష నాయకులు కానీ, న్యాయవాదులు కానీ, హక్కుల కార్యకర్తలు కానీ వెళ్ళ కుండా కట్టడి చేస్తూ కేసీఆర్‌ బంగారు తెలంగాణకు తనదైన శైలిలో బాటలు వేస్తున్నారు.

రైతుల పట్ల నిర్లక్ష్యం
రైతుల విషయంలోనూ మూడు ప్రభుత్వాలదీ ఒకే పాట. జైజవాన్, జైకిసాన్‌ నినాదంతో ఎన్నికల ప్రచారం ఉద్వేగభరితంగా చేసి ముప్పయ్‌ ఏళ్ళలో మొదటి సారి ఒక పక్షానికి లోక్‌సభలో మెజారిటీ సాధించి చరిత్ర సృష్టించారు నరేం ద్రమోదీ.  రైతుల రుణ మాఫీ చేస్తానంటూ హామీ ఇవ్వటమే కాకుండా రుణాలు చెల్లించద్దంటూ ఎన్నికల ముందు పనిగట్టుకొని ప్రచారం చేసిన నాయకుడు చంద్రబాబు. అదే విధమైన హామీని ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచిన నేత కేసీఆర్‌. రైతులతోనూ, వ్యవసాయరంగ నిపుణులతోనూ చర్చించకుండా తమకు తోచిన విధంగా ఊహించుకొని పరిష్కారం లభించిందని సంతోషించి, పరి ష్కరించినట్టే భావించి తమను తాము అభినందించుకునే మనస్తత్వం పెరిగింది. ఈ సంవత్సరం పంట దండిగా పండినా దేశవ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో రగి లిపోతున్నారు. పల్లెలతో, వ్యవసాయంతో సంబంధం లేనివారు జాతీయ మీడి యాలో ఆధిపత్య స్థానాలలో ఉండటం, కేంద్ర మంత్రి మండలిలో సైతం వ్యవసాయం పట్ల అవగాహనలేనివారే అధిక సంఖ్యాకులు కావడంతో రైతుల పట్ల ఉపేక్ష పెరిగిన మాట వాస్తవం. వ్యవసాయ సంక్షోభం నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం పుట్టింది కాదు. కేసీఆర్‌ సైతం దీనికి కారకుడు కాదు.

దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయ నాయకుడుగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఈ పాపంలో పన్నెండేళ్ళ భాగం ఉన్నది. 1995 నుంచి 2015 వరకూ దేశంలో 3.18 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అంచనా. ఈ కాలంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ, బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ, యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకత్వంలోని ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి. ప్రభుత్వం ఏదైనా రైతుల బతుకులలో బడబాగ్ని మాత్రం చల్లారలేదు. పంట పుష్కలంగా పండినా రైతులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో వ్యవసాయరంగం అభివృద్ధి పది శాతానికి పైమాటే. అయినా ఆ  రాష్ట్రంలోని మంద్‌సౌర్‌లో రైతులు ఆందోళన చేపట్టారు. పోలీసుల కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. ఆగ్రహించిన రైతులు విధ్వంసం సృష్టించారు. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి. గుజరాత్, పంజాబ్‌లలో కూడా రైతులు కుత కుతలాడుతున్నారు. తమిళనాడు రైతులు ఇటీవలే జంతర్‌మంతర్‌లో నిరసన ప్రదర్శనలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా చర్యలు తీసు కోవడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి. మిర్చి ధర 2015లో క్వింటాల్‌ రూ. 11,000 అయితే ఈ సంవత్సరం రూ. 4000 కంటే తక్కువే. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ ప్రభుత్వ సేకరణ సంస్థలు కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్‌కు ఫలసాయం తెచ్చిన రైతులు దళారులు చెప్పిన ధరకే తెగనమ్మి ఇళ్ళకు వెళ్ళారు.

వ్యవసాయ సంక్షోభం
రైతులు ఉద్యమిస్తుంటే, పోలీసు కాల్పుల్లో చనిపోతుంటే రాహుల్‌గాంధీ, జేడీయూ నాయకుడు శరద్‌ యాదవ్‌ మృతుల కుటుంబ సభ్యులను పరా మర్శించే ప్రయత్నం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి ఏమి చేస్తున్నారు? బిహార్‌లో మోతిహర్‌లో బాబా రామ్‌దేవ్‌తో కలిసి యోగాభ్యాస ప్రదర్శనలు ఇస్తున్నారు. వ్యవసాయ సంక్షోభాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం ఎంత బాగా పట్టిం చుకున్నదో చెప్పడానికి ఈ వైఖరే నిదర్శనం. రైతులకు సానుభూతి ప్రదర్శించే నైతిక హక్కు కాంగ్రెస్‌ నాయకులకు ఉన్నదా? ఆ మాటకొస్తే దేశంలోని ఏ రాజ కీయ పక్షానికైనా ఉన్నదా? ఎందుకంటే, రైతు లోకానికి ద్రోహం చేయని పార్టీ లేదు, నాయకుడు లేడు. బీజేపీ ప్రవక్త సీవీఎల్‌ నరసింహారావు ఏదో చానల్‌లో ‘నేను రాహుల్‌గాంధీని తీవ్రంగా హెచ్చరిస్తున్నా. రైతులను ఎవరు రెచ్చగొట్టారో నిర్ధారించే విచారణ జరుగుతోంది. నిజం నిగ్గుతేలుతుంది’ అంటూ చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఒకరు మరొకరిని నిందించవలసిన పని లేదు. అందరూ అందరే. చిత్తశుద్ధి లేనివారే.

దేశ జనాభాలో 69 శాతం మంది గ్రామాలలో నివసిస్తున్నారు. పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతున్నప్పటికీ అత్యధికుల వేళ్ళు గ్రామాలలోనే ఉన్నాయి. రైతులలో 85 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు. రెండెకరాల కంటే తక్కువ కమతాలు ఉన్నవారే. పట్టా ఉన్న రైతులు పట్టణాలలో ఉంటే కౌలు చేసుకునే రైతు పొలంలో ఉంటాడు. పట్టా ఉన్న రైతుకే బ్యాంకు రుణాలు, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు లభిస్తాయి. కౌలు రైతుకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరే అప్పు చేయాలి. అప్పుల భారం పెరిగి, తిరిగి చెల్లించలేక. వడ్డీవ్యాపారులు ఇంటికి వచ్చి భార్యాపిల్లల ఎదుటా, ఇరుగుపొరుగు సాక్షిగా అవమానిస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అన్నదాతను ఆదుకోవాలనే చిత్తశుద్ధి పాలకులకు ఏ మాత్రం ఉన్నా ప్రొఫె సర్‌ స్వామినాథన్‌ నాయకత్వంలోని నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఫార్మర్స్‌ సమర్పించిన నివేదికలపైన పార్లమెంటులో చర్చ జరిపేవారు. వ్యవసాయం గిట్టు బాటు కావడానికి ఏయే చర్యలు తీసుకోవాలో నిర్ణయించేవారు. అమలు చేసే వారు. స్వామినాథన్‌ మొత్తం ఐదు విడతల రిపోర్టు సమర్పించారు– మొదటి నివేదిక 2004 డిసెంబర్‌లో, రెండో నివేదిక 2005 ఆగస్టులో, మూడోది అదే సంవత్సరం డిసెంబర్‌ మాసంలో, నాలుగోది 2006 ఏప్రిల్‌లో, చివరిది అదే సంవత్సరం అక్టోబర్‌లో. ఈ నివేదికలపైన పార్లమెంటు ఒక్క గంట కూడా చర్చించలేదు. వ్యవసాయ సంక్షోభంపైన చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, సంక్షోభానికి పరిష్కారం కనుగొనే వరకూ సమా వేశం ఎన్నాళ్ళు అయినా నిర్నిరోధంగా కొనసాగాలనీ నేను సందర్భం వచ్చి నప్పుడల్లా వాదిస్తూ వస్తున్నా.

రాష్ట్రాల శాసనసభలు సైతం ఇలాగే చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకున్నవారు లేరు. రైతులను ఓటు బ్యాంకుగా వాడు కోవడానికి మాత్రం అంతా సిద్ధం. వారు సంఘటితం కానంతవరకూ, మూడో కన్ను తెరవనంత వరకూ రాజకీయ నాయకుల ఆటలు సాగుతాయి. స్వామి నాథన్‌ నివేదికపైన చర్చ జరగకపోగా నివేదికలో చేసిన సూచనలకు బద్ధ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత చంద్రబాబుది. ఆయన రైతుల చేత వ్యాపారం చేయిస్తానంటూ ఒక కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టి అమరావతి కోసం భూసమీకరణ సందర్భంగా అమలు జరిపారు. వ్యవసాయ భూములను కార్పొరేట్‌ సంస్థలకు ఇవ్వరాదన్నది స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులలో ప్రధానమైనది. అమరావతి పేరు మీద వేల ఎకరాలు తీసుకున్నది కార్పొ రేట్‌ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకే. అప్పుడే వితరణ ప్రారంభమై పోయింది.
ముఖ్యమైన మూడు అంశాలలో మూడు ప్రభుత్వాల వైఖరి మూడేళ్ళుగా ఒకే విధంగా– ముగ్గురు అధినేతలూ ఒకే బడిలో చదివినట్టు– ఉండటం విశేషం. ఈ వైఖరి సంపూర్ణంగా మారిపోయి, పాలకులలో రైతుల పట్ల చిత్తశుద్ధితో కూడిన ఆదరణ పెరిగే వరకూ ఈ దేశానికి నిష్కృతి లేదు.
     

 

         - కె. రామచంద్రమూర్తి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement