తమిళనాట తెలుగు నాటకం!
త్రికాలమ్
తమిళనాడులో సంచలనాత్మకమైన రాజకీయ పరిణామాలు గమనిస్తున్నవారికి సుమారు రెండు దశాబ్దాల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నాటకీయ మైన సన్నివేశాలు గుర్తురాక మానవు. క్యాంపు రాజకీయాలూ, బలప్రదర్శనలూ, గవర్నర్ల పాత్రలూ, పత్రికల ధోరణీ, కేంద్ర ప్రభుత్వాల వైఖరీ కళ్ళ ఎదుట సినిమా రీలులాగా కదులుతాయి. ముఖ్యంగా మా తరం జర్నలిస్టులకు అవి మరపురాని దృశ్యాలు.
శాసనసభ్యుల స్వేచ్ఛను హరిస్తూ వారిని హోటల్‌లోనో, మరోచోటో నిర్బం ధించడం దక్షిణాదిలో మొట్టమొదట జరిగింది హైదరాబాద్‌లోనే. 1984లో ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుపైన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు చేసినప్పుడు రామకృష్ణా స్టూడియోలో, కర్ణాటకలోని నందీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను బందీలుగా ఉంచి క్యాంపు రాజకీయం నడిపించిన చంద్ర బాబునాయుడే పదేళ్ళ తర్వాత అదే మంత్రాంగం చేశారు. వైస్రాయ్ హోటల్‌లో అదే రామారావుకు వ్యతిరేకంగా అదే పార్టీ శాసనసభ్యులను నిర్బంధించి క్యాంపు రాజకీయాలను పతాకస్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు తమిళనా డులో నడుస్తున్న చరిత్ర అటువంటిదే. జయలలితకు తోడూనీడలా ఉంటూ మూడు దశాబ్దాలుగా పోయెజ్ గార్డెన్‌లోని జయనివాసం ‘వేదనిలయం’లో జీవించిన శశికళా నటరాజన్ క్యాంపు రాజకీయం నడిపిస్తున్నారు. చెన్నై దగ్గర గోల్డెన్‌బే రిసార్ట్‌లో 110 మంది ఎంఎల్‌ఏలు ఆమె కట్టడిలో ఉన్నారు.
గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు పాత్ర కీలకం. ఏఐఏడీఎంకేతో స్నేహం ఎన్‌డీఏ సర్కార్‌కు ప్రధానం. ఆ పార్టీకి చెందిన 135 మంది ఎంఎల్‌ఏ లతో పాటు 49 మంది ఎంపీల (లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి) మద్దతు రాబోయే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో అత్యవసరం. ఏఐఏడీఎంకే శాస నసభాపక్షం నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ శశికళకు ముఖ్య మంత్రి పట్టం కట్టడానికి గవర్నర్ నిరాకరించడం ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘన. ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇచ్చిన రాజీనామాను ఆమోదించిన తర్వాత గవర్నర్‌కు శశికళ చేత ప్రమాణం చేయించడం ఒక్కటే మార్గం. తమిళ నాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి కొంత నష్టం కలిగించవచ్చు. అయినా తమిళనాడును శశికళకు అప్పగిం చరాదనే మోదీ సర్కార్ నిర్ణయించినట్టు కనిపిస్తోంది. ఎన్‌డీఏ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే గవర్నర్ సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ బదనాం అవుతున్నారు.
శశికళకు శాసనసభ్యులూ, పార్లమెంటు సభ్యుల మద్దతు ఉంటే పన్నీర్ సెల్వంకు కేంద్రం అండదండలు ఉన్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగు తున్నారు కనుక ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతిలోనే ఉంది. అందుకే జయ మృతిపై న్యాయవిచారణ జరిపిస్తాననీ, ఆమె నివాసాన్ని స్మారక కేంద్రంగా మార్చుతామనీ ప్రకటనలు చేయగలిగారు.
ఇద్దరిదీ ఒకే నామస్మరణ
పెన్నీర్‌సెల్వం టీ దుకాణం నడిపుతూ రాజకీయాలలోకి ప్రవేశించారు. శశికళ మైలాపూర్‌లో ‘వినోద్ వీడియో విజన్’ పేరుతో చిన్న స్థాయి వీడియో వ్యాపారం చేస్తూ, 1982లో జయలలిత రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కడలూరు బహిరంగసభలో ఆమె ప్రసంగాన్ని కలెక్టర్ చంద్రలేఖ ప్రోత్సాహంతో రికార్డు చేయించి ఆమెకు అందజేయడం ద్వారా జయ జీవితంలో ప్రవేశించారు. శశి కళతో పాటు ఆమె భర్త నటరాజన్ కూడా జయ నివాసంలో స్థిరపడ్డారు. పరి ధులు దాటి రాజకీయాలలో జోక్యం చేసుకోవడంతో నటరాజన్‌ను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. తనతోనే ఉంటానన్న శశికళను అనుమతించారు. 2011 ఎన్నికల సమయంలో ఏఐఏడీఎంకే అభ్యర్థుల పేర్లను రహస్యంగా చేరవేశారనే ఆరోపణ పైన శశికళను ఇంటి నుంచి బహిష్కరించమే కాకుండా ఆమెతో పాటు 12 మంది బంధువులకు పార్టీ నుంచి ఉద్వాసన చెప్పారు. అనంతరం క్షమాపణ చెప్ప డంతో తిరిగి తన తో ఉండేందుకు అనుమతించారు.
అపోలో ఆస్పత్రిలో ఉన్న 75 రోజులూ జయలలితను శశికళే కనిపెట్టుకొని ఉన్నారు. మరెవ్వరికీ ప్రమేయం కల్పించలేదు. జయ అంత్యక్రియలు సైతం ఆమే చేశారు. అందువల్ల జయకు సహజ వారసురాలినని ఆమె భావిస్తున్నారు. జయలాగానే ఆకుపచ్చరంగు చీర, జాకెట్ ధరించడం, ఆమెలాగానే నడవడం, కింద వేచి ఉన్న అభిమానులను పల కరిస్తూ భవనంపై నుంచి జయలాగానే నమస్కరించడం, చేయి ఊపడం నేర్చు కున్నారు. జయవలెనే పార్టీనీ, ప్రభుత్వాన్నీ నడపాలని నిర్ణయించుకున్నారు. శాసన సభ్యులు ఆమోదించారు కానీ ముఖ్యమంత్రి కావాలన్న శశికళ నిర్ణయాన్ని ఏడుకోట్లమంది తమిళ ప్రజలు హర్షించలేదు. కోటిమంది ఏఐఏడీఎంకేS కార్య కర్తలు సమర్థించలేదు. సినీప్రపంచం ఆహ్వానించలేదు.
ఈ ప్రతికూలతను సద్వి నియోగం చేసుకోవాలని పన్నీర్‌సెల్వం ప్రయత్ని స్తున్నారు. గవర్నర్ పరోక్ష సహ కారంతో మద్దతు కూడగట్టగలుగుతున్నారు. శశికళ, పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఒకే కులానికి (తేవర్) చెందినవారు. పేద ఇంట పుట్టిపెరిగినవారు. ఇద్దరూ అమ్మ నామస్మరణ చేస్తూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమిళ రాజకీయాన్ని రక్తికట్టిస్తు న్నారు. జయలలిత ఆలోచనలలో ఇద్దరికీ వేరు వేరు పాత్రలున్నాయి. రాజకీ యంగా తనకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడు, తన తరఫున తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపినవాడు పన్నీర్‌సెల్వం. 2006–2011లో ఏఐఏడీఎంకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయనే ఉన్నారు. 2001 లో మొదటిసారి శాసనసభకు ఎన్నికైనప్పటి నుంచీ జయ మరణించే వరకూ అదే విధేయత కొనసాగించారు. సమర్థుడైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకు న్నారు. ఇటీవల తుపాను చెలరేగినప్పుడూ, జల్లికట్టు ఉద్యమం ఎగిసినప్పుడూ సమర్థంగా పనిచేశారనే అందరూ మెచ్చుకున్నారు.
రాజకీయాలకు దూరంగా శశికళ
తాను ముఖ్యమంత్రిగా ఉండలేని సందర్భాలలో జయ తన ప్రతినిధిగా పన్నీర్‌నే వినియోగించారు కానీ శశికళ గురించి ఆలోచించలేదు. శశికళను చెల్లెలుగా పరి గణించినా, సహాయకురాలిగా భావించినా ఆమెను రాజకీయాలలోకి తేవాలని జయ ఎన్నడూ అనుకోలేదని జయ జీవిత చరిత్ర (అమ్మ: జయలలితాస్ జర్నీ ఫ్రం మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్) రాసిన వాసంతి అంటున్నారు. వాసంతి తమిళ ‘ఇండియా టుడే’ సంపాదకురాలుగా పనిచేసిన అనుభవజ్ఞురాలైన పత్రి కారచయిత. 1996లో జయ ముఖ్యమంత్రిగా ఉండగా శశికళ, మన్నార్‌గుడి మాఫియాగా పేరుమోసిన ఆమె కుటుంబసభ్యులూ చేసిన అవినీతి వల్లనే జయ అప్రతిష్ఠపాలైనారని ఆమె అభిమానులు వాదిస్తారు.
శశికళ మేనల్లుడు సుధాకరన్‌ను పెంపుడు కొడుకుగా భావించి అతని పెళ్ళిని అంగరంగ వైభవంగా చేసిన కారణంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ప్రొఫెసర్ సుబ్ర మణియన్‌స్వామి కేసు పెట్టారు. ఇరవై ఏళ్ళుగా వెంటాడుతున్న ఆ కేసు కార ణంగా జయ, శశికళ జైలుకు వెళ్ళవలసి వచ్చింది. కర్ణాటక హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఇద్దరూ విడుదలైనారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన తర్వాత వాదనలు పరిశీలించిన ధర్మాసనం ఎనిమిది మాసాల కిందట తీర్పును వాయిదా వేసింది. వారంలోగా తీర్పు వెలు వరిస్తా నంటూ సోమవారం అకస్మాత్తుగా ప్రకటించడం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లనేరదంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడం శశికళకు తగిలిన రెండు ఎదురుదెబ్బలు. గవర్నర్ విద్యాసాగర్ వైఖరి సరేసరి. ఈ కేసు కాకుండా మరి రెండు కేసులు కూడా శశికళపైన ఉన్నాయి. మలేసియా నుంచి విదేశీ మారకద్రవ్యం తెప్పించి నీలగిరిలో తేయాకు తోట కొన్నారనే ఆరోపణ పైన విచారణ జరుగుతోంది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో కేసు ఉంది.
ఈ కేసులలో నిర్దోషిగా ప్రకటించవలసిందిగా శశికళ పెట్టుకున్న అర్జీని మద్రాసు హైకోర్టు పక్షం రోజుల కిందటే తిరస్కరించింది. తనపై ఉన్న కేసుల కారణంగా ప్రమాణం చేయించడానికి గవర్నర్ సంకోచిస్తున్నారని అంటు న్నారు కనుక సెంగొట్టియన్ పేరు ప్రతిపాదించాలని శశికళ సంకల్పించినట్టు వార్తలు వచ్చాయి. లోక్‌సభ ఉపసభాపతి తంబిదొరై బీజేపీ తరఫున సెల్వంకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు శశికళకు తెలియదు. పన్నీర్‌సెల్వంకి ఇప్పటికే 35 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని అంటున్నారు. శాసన సభ్యులను క్యాంపు నుంచి విడుదల చేయగలిగితే పన్నీర్‌సెల్వం పంట పండుతుంది. రోజులు గడిచేకొద్దీ బలపరిచే శాసనసభ్యుల సంఖ్య పెరుగుతుంది. తమిళనాడు పరిణామాలకీ గతంలో జరిగిన క్యాంపు రాజకీయాలకీ తేడా ఏమిటి?
అప్పటికీ, ఇప్పటికీ వ్యత్యాసం ఏమిటి?
నాదెండ్ల భాస్కరరావుకు ముఖ్యమంత్రిగా నెలరోజులు గడువూ, ప్రభుత్వ హంగులూ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులలో అత్యధికులు ఎన్‌టీ ఆర్‌ని వదిలి రాలేదు. ఎన్‌టీఆర్‌పట్ల ప్రజలలో అభిమానం వెల్లువెత్తింది. పైగా చంద్రబాబునాయుడూ, వెంకయ్యనాయుడూ, వామపక్షాలూ కలసి నిర్మించిన ప్రజాఉద్యమం ఎన్‌టీఆర్‌ను పదవిలో పునఃప్రతిష్ఠించింది. నాటి ప్రధాని ఇంది రాగాంధీ దిద్దుబాటు చర్యలలో భాగంగా గవర్నర్ రాంలాల్ స్థానంలో శంకర దయాళ్‌శర్మను హైదరాబాద్‌కు పంపించారు. శర్మ ఎన్‌టీఆర్ చేత ప్రమాణస్వీ కారం చేయించారు. అనంతరం ఎన్‌టీఆర్ శాసనసభ రద్దు చేసి మధ్యంతర ఎన్ని కలలో ఘనవిజయం సాధించారు.
ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తర్వాత 1994లో అద్భుతమైన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఎన్‌టీఆర్‌పైన చంద్రబాబు తిరుగుబాటు చేశారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు చంద్రబాబుతో పూర్తిగా సహకరిం చారు. గవర్నర్ కృష్ణకాంత్ స్వయంగా ఆస్పత్రికి వెళ్ళి ఎన్‌టీఆర్ రాజీనామా స్వీకరించి చంద్రబాబు పని సులువు చేశారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకూ, బావమరిది హరికృష్ణకూ ఉపముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవులు ఇవ్వజూపినట్టే కృష్ణకాంత్‌ను రాష్ట్రపతి చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చా రని అప్పుడు చెప్పుకునేవారు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభా శంకర్ మిశ్రానూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్‌నీ చంద్రబాబు ఎట్లా ప్రసన్నం చేసుకున్నారో కథలు కథలుగా చెప్పుకునేవారు. స్పీకర్ యనమల రామకృష్ణుడు తనను పిలిచి పార్టీలోకి చేర్చుకొని టిక్కెట్టు ఇచ్చి ఎన్నికలలో గెలిపించిన ఎన్‌టీఆర్ పట్ల ఎంత నిర్దయగా, అప్రజాస్వామికంగా వ్యవహరిం చారో ప్రజలకు తెలుసు.
మొత్తం మీద నాదెండ్ల తిరుగుబాటు విఫలం కాగా చంద్రబాబు తిరుగుబాటు జయప్రదమై ఆయనను గద్దెనెక్కించింది. పదవి కోల్పోయిన తర్వాత ఆరు మాసాల లోగానే ఎన్‌టీఆర్ అవమాన భారంతో, గుండెపోటుతో కన్నుమూశారు. శాసనసభ రద్దు చేయాలన్న ఎన్‌టీఆర్ నిర్ణయం ఆత్మహత్యాసదృశమైనది. ఈ నిర్ణయాన్ని ఎన్‌టీఆర్ తలకు ఎక్కించింది కూడా చంద్రబాబునాయుడేనని అనుమానం. డబ్బు ఖర్చు చేసి ఎన్నికై సంవత్సరం గడవక మునుపే అసెంబ్లీ రద్దవుతే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలన్న ఆందోళ నతో శాసనసభ్యులలో అధిక సంఖ్యాకులు చంద్రబాబు శిబిరంలో చేరిపో యారు. లక్ష్మీపార్వతిని దుష్టశక్తిగా అభివర్ణిస్తూ ప్రచారం చేయడానికి పత్రికలు సంపూర్ణంగా సహకరించాయి. పత్రికలు చంద్రబాబు పక్షాన నిలబడ్డాయి.
వాస్త వాలు రాసే అవకాశం ఉన్న ‘ఉదయం’ 1995 మే 25న మూతపడింది. సరిగ్గా ఆ తర్వాత మూడు నెలలకే వెన్నుపోటు పర్వం నడిచింది. తక్కిన పత్రికలన్నీ (ఆంధ్రభూమి మినహా) చంద్రబాబుకే వత్తాసు పలికాయి. అసెంబ్లీ రద్దు వంటి పొరబాటు పన్నీర్‌సెల్వం చేయలేదు. ఆయనకు గవర్నర్ మద్దతు ఉంది. ప్రధాని ఆశీస్సులున్నాయి. స్పీకర్ ఆయనకే సుముఖంగా ఉన్నారు. శశికళకు శాసన సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ ఇతర అంశాలు అనుకూలించడం లేదు. ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సుప్రీంకోర్టు సానుకూలంగా లేదు. 1995 ఆగస్టులో చంద్రబాబుతో సహకరించిన హైకోర్టు, ఎన్నికల సంఘం వంటి సంస్థల అధిపతులు కానీ, ప్రధాని, గవర్నర్, స్పీకర్ కానీ ఇప్పుడు శశికళ పట్ల సుముఖంగా లేరు. అందుకే శశికళ ముఖ్యమంత్రి స్వప్నం సాకారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
- కె. రామచంద్రమూర్తి