గవర్నర్ రాక ఖాయం.. ఏం చేస్తారో ఉత్కంఠ!
చెన్నై: తమిళనాట అత్యంత నాటకీయ రాజకీయ పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఇన్‌చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపైనే ఉంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఇన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించిన గవర్నర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఆయన గురువారం చెన్నై రాబోతున్నారు.
ఒకవైపు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ పావులు కదుపుతుండగా.. మరోవైపు ఆమెపై తిరుగుబాటు ఎగురవేసిన పన్నీర్ సెల్వం కోరితే రాజీనామా వెనుకకు తీసుకుంటానని అంటున్నారు. మరోవైపు 130మందిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ-ఓపీఎస్ పోరు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది.
ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన శశికళను అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆదేశిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక ఓపీఎస్‌నే సీఎంగా కొంతకాలం కొనసాగమంటారా? అసలు గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సంక్షోభంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడంలేదనే విమర్శలూ లేకపోలేదు. తమిళతీరం రాజకీయ వేడితో అట్టుడుకుతుండగా.. ఆయన ఊటీ, ముంబై వెళ్లి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అసలు గవర్నర్ ఏం చేస్తారు? ఏదైనా రాజకీయ ఎత్తుగడ వేస్తారా? శశికళకు అవకాశం ఇస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది.