ప్రధాని మోదీతో చర్చిస్తున్న పళనిస్వామి, పన్నీర్‌సెల్వం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారం కోల్పొయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. జయ మరణం తరువాత పార్టీకి ‘పెద్ద’దిక్కుగా మారిన ప్రధాని నరేంద్రమోదీతో ఆ పార్టీ రథసారధులు అనేక సమస్యలపై మొరపెట్టుకున్నారు. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు, మాజీ మంత్రుల ఇళ్లపై ఏసీబీ దాడులు, ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి సవాలుగా మారాయి.
ఈ సవాళ్లను ఎదుర్కొవడంపై సీనియర్ నేతల మధ్య సయోధ్య కరువైంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్‌సెల్వం, ఉప సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి ఆదివారం ఉదయం, రాత్రి వేర్వేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకే వారిద్దరూ ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. పన్నీర్‌సెల్వం కుమారుడు, తేనీ లోక్‌సభ సభ్యుడు రవీంద్రనాథ్‌కు కేంద్రం కేటాయించిన వసతి గృహంలో సోమవారం ఉదయం జరిగిన గృహప్రవేశ కార్యక్రమానికి ఓపీఎస్, ఈపీఎస్ సహా పలువురు మాజీ మంత్రులు హాజరయ్యారు.
అక్కడి నుంచి ఒకే కారులో ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని ఇంటికి చేరుకున్నారు. తమిళనాడులో మారిన రాజకీయ పరిణామాలు, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పనితీరు, కేంద్ర క్యాబినెట్‌లో అన్నాడీఎంకేకు చోటు, స్థానిక సంస్థల ఎన్నికలు, అన్నాడీఎంకే మాజీ మంత్రుల ఇళ్లలో ఎసీబీ తనిఖీలు, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి వ్యవహారం తదితర అంశాలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. తమిళనాడులో మూడు రాజ్యసభ స్థానాలు త్వరలో ఖాళీకానున్నాయి. తమిళనాడు నుంచి కేంద్రమంత్రిగా మారిన ఎల్ మురుగన్ ఆరునెలల్లోగా ఎంపీగా ఎన్నికకావడం అవశ్యంగా మారింది. ఇందుకు సంబంధించి సైతం ప్రధాని, ఓపీఎస్, ఈపీఎస్ మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు.
చిన్నమ్మ గురించే చర్చ
2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 66 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. రాజకీయాలకు స్వస్థి పలికినట్లు ఎన్నికల ముందు ప్రకటించిన శశికళ మళ్లీ అన్నాడీఎంకేను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదపుతున్నారు. ప్రధానిని కలిసిన సమయంలో అన్నిటి కంటే శశికళ సాగిస్తున్న తెరవెనుక రాజకీయాలపైనే ప్రధానంగా చర్చకు వచ్చిందని తెలుస్తోంది. శశికళ సహకారం లేకుండానే 66 స్థానాల్లో గెలుపొందిన అన్నాడీఎంకేను తన చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను ఎడపాడి పళనిస్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లోనూ శశికళ పార్టీలోకి మళ్లీరాకుండా చేయాలని సీనియర్ నేతలతో ఎడపాడి చెబుతూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పన్నీర్‌సెల్వం వైఖరి భిన్నంగా ఉంది. శశికళను అన్నాడీఎంకేలోకి ఆహ్వానిస్తే ఆమెకున్న 5శాతం ఓటు బ్యాంకుతో పార్టీని బలోపేతం చేయవచ్చని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని ఓపీఎస్ వాదిస్తున్నారు. శశికళ గురించి ఏకాభిప్రాయం కుదరకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా, ఓపీఎస్, ఈపీఎస్ ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు.
కావేరీ నదీజలాలకు అడ్డుగా మేఘదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న ఆనకట్ట, నీట్ ప్రవేశ పరీక్ష రద్దు, కేంద్రం నుంచి వ్యాక్సిన్ సరఫరాలో నెలకొన్న ఇబ్బందులు, మధురైలో ఎయిమ్స్ స్థాపనపై ఏర్పడిన జాప్యం తదితర అంశాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. ఓపీఎస్, ఈపీఎస్‌లు సోమవారం ఉదయం 11 గంటల నుంచి సుమారు గంటపాటు మోదీతో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కూడా కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment