పోలీసు రాజ్యం | K.Ramachandra Murthy writes on TDP rolling | Sakshi
Sakshi News home page

పోలీసు రాజ్యం

Published Sun, Mar 5 2017 3:04 AM | Last Updated on Wed, Aug 15 2018 8:21 PM

పోలీసు రాజ్యం - Sakshi

పోలీసు రాజ్యం

త్రికాలమ్‌
అమరావతిలో శాసనసభ, శాసనమండలి భవన సముదాయాన్ని ప్రారంభించిన శుభసందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలి. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా చర్చిస్తారనీ, ప్రజాభ్యుదయానికి దోహదం చేసే చట్టాలను చేస్తారనీ, ఆ చట్టాలను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారనీ ఆశించాలి. అధికారపక్ష నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ప్రారంభోత్సవానికి హాజరైతే బాగుండేది. ఆహ్వానం పంపిం చామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్థికమంత్రి యనమల రామ కృష్ణుడు చెబితే ఎస్‌ఎంఎస్‌ సైతం తమకు రాలేదని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అన్నారు.

హైదరాబాద్‌ను వీడి వెడుతున్న సందర్భంగా కొన్నిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్‌ శాసనసభాపతి కోడెల శివప్రసాద్‌ కొందరు సీనియర్‌ పాత్రికేయులను కలుసుకున్నారు. కలుపుకొని వెళ్ళే వైఖరిని కొనసాగించి స్వయంగా ప్రతి పక్ష నాయకులకు ఫోన్‌ చేసి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే ఆయన ప్రతిష్ఠ పెరిగేది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తే నిర్మాణాత్మకమైన వాతావరణం ఏర్పడటానికి తోడ్పడేది. అటువంటి సద్భావన లేదనేది స్పష్టం. మొత్తం మీద ప్రారంభోత్సవం ఏకపక్షంగా జరిగింది. సభా కార్యక్ర మాలు కూడా ఏకపక్షంగా జరగబోవని కోరుకోవాలి. ప్రతిపక్ష నాయకుడిని స్వయంగా ఆహ్వానించకపోగా అదేరోజే ప్రతిపక్ష నాయకుడిని తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించడం పాలకుల అసహనానికి పరాకాష్ఠ. లోగడ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నాయకులు జలగం వెంగళరావు తీరును తప్పుపడుతూ మంత్రివర్గం తీర్మానించింది.

అప్రజాస్వామిక ధోరణి
ఇదే వైఖరి కొనసాగితే కొత్త శాసనసభా ప్రాంగణంలో సైతం నిరర్థకమైన, అప్రజాస్వామికమైన, అసహనంతో, తిట్ల దండకంతో కూడిన పాత వైఖరే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమాలోచన జరిపి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే విధంగా ఎటువంటి నిర్ణ యాలు తీసుకోవాలో, ఏయే చట్టాలు చేయాలో నిర్ణయించుకొని ప్రశాంత వాతా వరణంలో సభ జరిగే విధంగా వ్యవహరిస్తే ప్రజలు సంతోషిస్తారు. ఎవరు ఘాటుగా విమర్శిస్తారో, పరుష పదజాలం ప్రయోగిస్తారో, గొంతు చించుకుం టారో వారి వాదనలోనే పస ఉన్నదని భావిస్తే పొరపాటు. ఎవరు సమంజ సంగా, సహేతుకంగా, శాంతంగా మాట్లాడతారో వారినే ప్రజలు ఆదరిస్తారు. ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టి వారు వాకౌట్‌ చేసేవరకూ వెంటబడి ఆనక సభను ఏకపక్షంగా జరుపుకొని ఆత్మస్తుతికీ, పరనిందకూ గంటల సమయం వెచ్చిం చడం ఇంతకు ముందు జరిగిన సమావేశాలలో చూశాం. కొత్త ప్రాంగణంలోనైనా ఇందుకు భిన్నంగా సభాకార్యక్రమాలు జరిగితే సభాపతికి సభ్యులందరి మన్ననా దక్కుతుంది.

పార్లమెంటు తలుపులు మూసి విభజన చట్టం ఆమోదించినప్పుడే అవ మానం దిగమింగా. శపథం చేశా, చేసి చూపిస్తున్నానంటూ ముఖ్యమంత్రి చంద్ర   బాబు చెప్పుకున్నారు. రెండేళ్ళలోనే సచివాలయం, శాసనసభా ప్రాంగణం నిర్మించినందుకు తనను తాను అభినందించుకున్నారు. మంచిదే. కానీ పాస్టర్‌ పార్ట్నర్స్‌ అనే సంస్థ అమరావతి నిర్మాణానికి డిజైన్లు రూపొందిస్తోంది. ఇదంతా 2019 నాటికి పూర్తవుతుందని అంటున్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉండటానికి ఇంకా ఏడేళ్ళ సమయం ఉంది. 2019 వరకూ హైదరాబాద్‌లోనే చట్టసభల సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నిర్మాణ సంస్థలతో కొత్త రాజధానికి రూపకల్పన చేస్తున్నారు. అందులో శాసనసభా భవనానికీ చోటు కల్పించారు. ఈ లోగా తాత్కాలిక శాసనసభా భవన సముదాయం ఎందుకు? తాత్కాలిక సచివాలయం మాత్రం ఎందుకు? శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించుకుంటే వృథావ్యయం ఉండేది కాదు.

‘తాత్కా లిక దుబారా’ ఎందుకో చెప్పవలసింది ముఖ్యమంత్రి మాత్రమే. ఎందుకంటే ఆయన ఒక్కరి అభద్రతా భావం కారణంగానే హడావుడిగా అందరినీ అమ రావతికి తరలిస్తున్నారు. ప్రశ్నించే అలవాటు లేదు కనుక మంత్రివర్గ సహ చరులు అధినాయకుడి నిర్ణయాన్ని శిరసావహిస్తున్నారు. ఎన్నికలలో గెలిచారు కనుక అయిదేళ్ళ వరకూ ఏమి చేసినా ఎవ్వరూ ప్రశ్నించడానికి వీలులేదనే అప్రజాస్వామిక ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జవాబుదారీతనం కలికానికి కూడా లేదు.

మితిమీరిన అసహనం
స్వీయపక్షంలోనే కాదు ప్రతిపక్షంలోనూ ఎవ్వరు ప్రశ్నించినా ముఖ్యమంత్రి సహించే పరిస్థితి లేదు. పెనుగంచిప్రోలు దగ్గర బస్సు ప్రమాదం అనంతర పరి ణామాలలో ముఖ్యమంత్రి వైఖరి, మంత్రివర్గ తీర్మానం ఇందుకు నిదర్శనం. భువనేశ్వర్‌ నుంచి హైదరాబాద్‌ వెడుతున్న ‘దివాకర్‌ ట్రావెల్స్‌’ బస్సు కాలు వలో పడిపోతే పదిమంది ప్రయాణికులు మరణించారు. 32 మంది గాయప డ్డారు. ఈ వార్త విని ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కారులో అక్కడికి చేరుకునే వరకూ పాలకపక్షం ప్రతినిధులు ఎవ్వరూ రాలేదు. అక్కడికి గంటలోపు ప్రయాణ దూరంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ బాధితు లను పరామర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించే ప్రయత్నం చేయలేదు. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిపక్ష నాయకుడికి శవాలను చుట్టివేసి తరలిస్తున్న దృశ్యం కనిపించింది. ఆసుపత్రిలో నాలుగు శవాలు మూటలు కట్టి ఉన్నాయి. వాటిలో ఒక శవంపైన డ్రైవర్‌ ఆదినారాయణ పేరు రాసి ఉంది. డ్రైవర్‌ శవానికి పోస్ట్‌మార్టమ్‌ చేశారా అని డాక్టర్‌ని జగన్‌ మోహన్‌ రెడ్డి అడిగితే అతను తడబడుతూ చేయలేదని చెప్పాడు. స్పీడ్‌ నియంత్రణ వ్యవస్థ లేకుండా 130 కిలోమీటర్ల వేగంతో పోతున్న బస్సు పది అడుగులు పైకి లేచి రోడ్డు పక్కన కాలువలో పడిందంటే డ్రైవర్‌ తాగి ఉండాలని అనుకోవడం సహజం.

అది తెలుసుకోవాలంటే శవపరీక్ష ఒక్కటే మార్గం. పరీక్ష చేయకుండానే శవాన్ని పంపించివేయడానికి రంగం సిద్ధం చేశారు. రెండో డ్రైవర్‌ కనిపించకుండా పోయాడు. అతడిని పట్టుకొని విచారించినా వాస్తవాలు కొంత వరకూ తెలిసేవి. పోస్ట్‌మార్టం రెండు గంటలలో పూర్తి చేశామని మొదట చెప్పిన వైద్యులు తరచి డ్రైవర్‌ సంగతి అడిగితే శవపరీక్ష జరగలేదని చెప్పారు. డాక్టర్‌ దగ్గర ఉన్న కాగితాలు అడిగి ప్రతిపక్ష నాయకుడు తీసుకున్నారు. వెనకనే నిల బడిన జిల్లా కలెక్టర్‌ బాబు డాక్టర్‌ వైపు కోపంగా చూస్తూ కాగితాలు ఇవ్వవద్దనీ, వివరాలు చెప్పవద్దనీ కళ్ళతోనే వారిస్తున్నారు. వెనక్కి తిరిగి జిల్లా  కలెక్టర్‌తో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ బస్సు యజమానిని రక్షించేందుకు వాస్తవా లను మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారనీ, ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలుకు వెళ్ళవలసి వస్తుందనీ హెచ్చరించారు. ప్రమాదంలో మరణించినవారి పట్ల వ్యవహరిస్తున్న బాధ్యతారహితమైన తీరునూ, గాయపడినవారినీ చూసిన తర్వాత ఎవరికైనా వ్యవస్థ పట్ల ఆగ్రహం కలుగుతుంది.

అదే ధర్మాగ్రహాన్ని ప్రతి పక్ష నేత ప్రదర్శించడం అభ్యంతరకరమంటూ వాదించడం, మంత్రివర్గం పని కట్టుకొని టేపులన్నీ చూసి ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ తీర్మానించడం చూస్తుంటే ఎంత అల్పంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్నదో తెలుస్తున్నది. ప్రమాదంలో చనిపోయినవారికి సంతాపం తెలుపుతూ తీర్మానం చేయలేదు. బస్సు యాజ మాన్యంపైన కేసు పెట్టాలనీ, ప్రమాద కారణాలపైన దర్యాప్తు చేస్తామనీ తీర్మా నించలేదు. ఉత్తరోత్తరా బస్సు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలను గుర్తించాలని తీర్మానం చేయలేదు. రాజధాని నిర్మాణం కోసం సింగ పూర్‌ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల వివరాలు చర్చించలేదు. వివిధ ప్రాజె క్టుల వ్యయం అంచనాలను చిత్తం వచ్చినట్టు పెంచివేసిన సందర్భాలలోనూ ఇలాగే జరిగింది. ముఖ్యమైన అన్ని విషయాలలో ఏకపక్షంగానో, కొంతమంది ఆంతరంగికులతో చర్చించో నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి అప్రధా నమైన అంశంపైన మంత్రివర్గ సమావేశంలో సమయం వృథా చేయడం విశేషం.

మీడియా అడగవలసిన ప్రశ్నలే అవి
మీడియా ప్రతినిధులు అడగవలసిన ప్రశ్నలనే జగన్‌ మోహన్‌ రెడ్డి అడిగారు. మీడియా అడిగినా, ప్రతిపక్ష నాయకుడు అడిగినా సమాధానం చెప్పవలసిన బాధ్యత డాక్టర్‌కు ఉన్నది. కలెక్టర్‌కూ ఉన్నది. ముఖ్యమంత్రి బాటలోనే అధి కారులూ నడిచి అహంకారపూరితంగా, పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా, అమానవీయంగా వ్యవహరించడం దుర్మార్గం.

ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరించడం, ప్రశ్నించిన వారిని అణచి వేయడం దేశం అంతటా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు దాష్టీకం శ్రుతి మించుతోంది. నగరి శాసనసభ్యురాలు రోజా పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. మహిళా పార్లమెంటేరియన్ల సదస్సుకు ఆహ్వానం అందుకొని గన్నవరం విమానాశ్రయంలో దిగిన శాసనసభ్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించడం ఆత్యయిక పరిస్థితిని తల పించిన దురాగతం. శుక్రవారంనాడు ఆమె కోర్టుకు వెడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం అరాచకం. ప్రభు త్వాన్ని ప్రశ్నించే ధైర్యం, తెలివితేటలు ఉన్నాయి కనుక ఒక మహిళా శాసన సభ్యురాలిని ఒక సంవత్సరం పాటు శాసనసభ నుంచి బహిష్కరించడమే కాకుండా కక్షకట్టి వెంటబడి వేధించడం అమానవీయం. పోలీసులనూ,  కార్య కర్తలనూ ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని ప్రయత్నించడం కంటే అప్రజాస్వామ్యం ఏముంటుంది?

టీవీ చానళ్ళు వచ్చిన తర్వాత అన్న మాట అనలేదనీ, చేసిన పని చేయ లేదనీ బుకాయించడానికి ఆస్కారం లేదు. ప్రత్యేక హోదా కావాలంటూ గట్టిగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునూ, ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునూ చూపించే అవకాశం ఉంది. తాను ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఎంతమంది అధి కారులతో ఎంత అమర్యాదగా మాట్లాడారో, ఎవరి తాటవొలుస్తానన్నారో, ఎవరిని బదిలీ చేయిస్తానంటూ బెదిరించారో చూపించడానికి అనేక సంద ర్భాలూ, దృశ్యాలూ ఉన్నాయి. పార్టీ నాయకుల ఆదేశం పాటిస్తూ జెండాలు పట్టుకొని రోజాను నిందిస్తూ నినాదాలు చేసిన స్త్రీలు సైతం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు చెప్పుకోవడానికి సాటి మహిళ ప్రయత్నిస్తుంటే ఆమెకు అడ్డుతగలడం, వ్యతిరేకంగా కేకలు వేయడం ఎటువంటి సంస్కారమో వారు ఆలోచించుకోవాలి. ఐఏఎస్, ఐపీఎస్‌ అధికా రులకు నియమావళి ఉంటుంది. అంతకు మించిన ఆత్మసాక్షి ఉంటుంది. వాటికి అనుగుణంగానే వ్యవహరించాలి. వారు ప్రజాసేవకులు కానీ పాలకులకు బానిసలు కాదు.

మర్రి చెన్నారెడ్డితో విభేదాలు వచ్చి రాష్ట్రాంతరం వెళ్ళిపోయిన ఎస్‌ఆర్‌ శంకరన్‌ని నియమ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించడం లోనూ, ఆత్మాభిమానంతో నైతికంగా వ్యవహరించడంలోనూ, పేదప్రజలకు సేవ చేయడంలోనూ ఆదర్శంగా తీసుకోవాలి. అధికారులు సైతం పార్టీలకు విధే  యంగా ఉంటూ పార్టీల ప్రాతిపదికగా చీలిపోవడం తమిళనాడులో చూశాం. మొన్నటి వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు నియమావళికీ, నైతికతకూ ప్రాధాన్యం ఇస్తారనే మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నతా ధికారులను (కలెక్టర్‌ కావచ్చు, డీజీపీ కావచ్చు) ప్రతిపక్షంపైన  ప్రయోగించడం చూస్తుంటే తమిళనాడు తరహా వాతావరణం ఇక్కడ కూడా నెలకొనే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడు ప్రధానమైన అంగాలు–చట్ట సభలూ, ప్రభుత్వ యంత్రాంగం, న్యాయవ్యవస్థ. చట్టసభలు ప్రజల సమస్యల పైన చర్చ జరపకుండా ఆధిక్య ప్రదర్శనతో, ఎత్తుగడలతో నిరర్థకంగా సాగిపోతు న్నాయి. పాలకపక్షం ప్రయోజనాలు రక్షించే ధోరణిలో ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికారులూ ఉన్నారు. న్యాయవ్యవస్థలో జీవితకాలం గడిచినా తీర్పులు వెలువడవు. మీడియాకూ పరిమితులున్నాయి. ప్రజాస్వామ్య ప్రియులకు ఎటు చూసినా నిర్వేదమే కలుగుతోంది. ఈ పరిస్థితి మారాలి.


- కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement