'ముద్ర' వదిలి వెళ్లిన ఏజీకే | k ramachandra murthy write on AG krishnamurthy | Sakshi
Sakshi News home page

'ముద్ర' వదిలి వెళ్లిన ఏజీకే

Published Sat, Feb 6 2016 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ఏజీకే 28-04-1942 - 05-02-2016

ఏజీకే 28-04-1942 - 05-02-2016

‘నిన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు ఆయన ఆస్పత్రిలో ఉన్నట్టు. సమాచారం అంది ఉంటే ముఖేశ్ అంబానీ వచ్చి ఉండేవాడు’ అన్నారు మిత్రులు ఎమెస్కో విజయ్‌కుమార్. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు హైదరాబాద్‌లోని ‘మహా ప్రస్థానం’లో ‘ముద్ర’ కృష్ణమూర్తికి అంత్య క్రియలు జరిగినప్పుడు ఇరవైమంది కూడా లేరు. ఆయనకు హైదరాబాద్‌లో పరిచ యాలు తక్కువే. 1968లో హైదరాబాద్ వదిలి అహమ్మదాబాద్ వెళ్ళి 2009లో తిరిగి వచ్చి స్థిరపడ్డారు.
 
ఆయనకు అహ మ్మదాబాద్‌తోనే అనుబంధం ఎక్కువ. ఏజీ కృష్ణమూర్తి (ఏజీకే) ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని అహమ్మదాబాద్‌లో ఆవిష్కరించినప్పుడు ఆ నగరంలో ఉన్న వివిధ కార్పొరేట్ సంస్థల అధిపతులే కాకుండా ముంబయ్ నగరం నుంచి సైతం అనేకమంది వచ్చారని ఆ పుస్తకం ప్రచురించిన విజయకుమార్ చెప్పారు. ఏజీకేకి కార్పొరేట్ ప్రపంచంలో అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
 
అడ్వర్టయిజింగ్ రంగంలో అనేకమంది ఏజీకెని ఆరాధిస్తారు. ఆయన దగ్గర తర్ఫీదు పొంది ఆ రంగంలో రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారం రోజుల కిందట అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన కారణంగా తన అనా రోగ్యం గురించి మిత్రులు ఎవ్వరికీ సమాచారం ఇచ్చే అవకాశం లేకపోయింది.
 
ఏజీ కృష్ణమూర్తి తెలుగుజాతి గర్వించదగిన అడ్వర్టయి జింగ్ దిగ్గజం. రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ ప్రోత్సాహంతో ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండేషన్‌ను  నెలకొల్పి ఆ సంస్థకు 23 సంవత్సరాలు సేవ చేశారు. ముద్ర పేరు ప్రతిష్ఠలు సంపాదించిన తర్వాత ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్ (మైకా)ను నెల కొల్పారు.
 
అహమ్మదాబాద్‌లో భారతీయ విద్యాభవన్ జర్న లిజం స్కూల్‌లో అడ్వర్టయిజ్‌మెంట్ పాఠాలు చెప్పేవారు. చివరికి 2002 ముఖేశ్ అంబానీ రిలయన్స్ మొబైల్స్ ప్రారం భించి ‘సారా దునియా ముట్ఠీమే’ అంటూ ప్రకటన విడుదల చేసినప్పుడు ఆయనకు సలహాదారుగా ఏజీకే ఉన్నారు.
 
గుంటూరు జిల్లా వినుకొండలో 1942 ఏప్రిల్ 29 న జన్మించిన కృష్ణమూర్తి బాల్యం తెనాలి, బాపట్లలో గడిచింది. చిన్నతనంలోనే బాపట్ల సబ్‌మెజిస్ట్రేట్ కోర్టులో స్టెనోగా ఉద్యోగం. అనంతరం గుంటూరులో జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర అదే స్టెనో పని. అనంతరం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో గుమాస్తాగిరీ. 1962లో మద్రాసు పోర్టు మ్యూజియంలో యూడీసీగా ఉద్యోగం. అయిదేళ్ళు మద్రాసులో పనిచేసిన తర్వాత హైదరాబాద్‌కు బదిలీ.
 
సంవత్సరం తిరగకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై కొట్టి అహమ్మదాబాద్ వెళ్ళి శిల్పి అడ్వర్టయింజింగ్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా చేరడం. ఆ సంస్థ శరాభాయ్‌లది. ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడు విక్రమ్ శరాభాయ్ వంశానికి చెందిన సంస్థ. క్యాలికో డెరైక్టర్ గీరాబెన్ శరాభాయ్‌తో కలసి పని చేయడం. 1967 ఫిబ్రవరి 10న రిలయన్స్‌లో చేరడం ఏజీకే జీవితాన్ని మేలిమలుపు తిప్పింది.
 
నరోడాలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాల యంలో అడ్వర్టయిజింగ్ డెరైక్టర్‌గా చేరిన ఏజీకే  అడ్వర్టయి జింగ్ రంగంలో శిఖర సదృశుడైన ఫ్రాంక్ సియాయిస్‌తో కలసి అద్భుతాలు చేశారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేసిన సిల్కు చీరలూ, ఇతర దుస్తులకూ విమల్ బ్రాండ్‌తో ప్రకటనలు తయారు చేయడంలో ఫ్రాంక్ అనేక విన్యాసాలు చేశాడు. ఆయన విమల్ కోసం తయారు చేసిన మొదటి అడ్వర్టయిజ్ మెంట్ ఇది : 'A woman expresses herself in many languages, Vimal is one of them'. దానికి ఏజీకే చేసిన తెలుగు అనువాదం ‘ఒక స్త్రీకి ఎన్నెన్నో మనోభావాలు. వాటిలో విమల్ ఒకటి.’ ఈ అడ్వర్టయిజ్‌మెంటు రకరకాల రూపాలు సంతరించుకొని అత్యధికంగా పత్రికలలో, రేడియోలలో వచ్చి విమల్ చీరలకు అసాధారణమైన ఆదరణ తెచ్చింది.

‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్‌రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగిం చడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే.
 
 ఏజీకే చిన్నతనంలోనే కథలు రాశారు. పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కథ. అదే శీర్షికతో ఏజీకే రాసిన కథ ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో అచ్చయింది. రేడియో ఉషశ్రీతో ఏజీకే  స్నేహం పెరిగిన తర్వాత ఈ కథను ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ‘ముద్ర ’ను వీడి హైదరాబాద్ వచ్చిన తరువాత ఏజీకే బ్రాండ్ కన్సెల్టెన్సీని ప్రారంభించారు.
 
అంతకంటే ముఖ్యంగా పుస్తకాలు రాయడం, కథలు రాయడం మొదలు పెట్టారు.  ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. సీనియర్ అంబానీ అంటే ఆయనకు ఆరాధనాభావం. ధీరూభాయ్ లాంటివారు పది మంది ఉంటే ఈ దేశం మరోవిధంగా ఉండేదని ఆయన విశ్వాసం.  ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు.
 
సరళమైన భాషలో హాయిగా చదివించే విధంగా రాయడం ఆయన ప్రత్యేకత. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. ఏజీకేకి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. చిరునవ్వు చెదరకుండా స్నేహితులతో అనుభవాలు పంచు కుంటూ చివరి రోజులు హైదరాబాద్‌లో గడిపిన ఏజీకే ఆశావాది. మన నిర్ణయాలే మంచికైనా, చెడుకైనా కారణం అన్నది ఆయన విశ్వాసం. ‘నేను మధ్యతరగతివాడిని. ఆ విలు వలనే నమ్ముకొని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమలతో అన్నీ సాధ్యాలనే నమ్మకం.
 
నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం’ అని ఏజీకే తన స్వభావం గురించి తాను రాసుకున్న మాటలు. వందశాతం తెలుగుతనం ఉట్టిపడే కృష్ణమూర్తి అహమ్మదాబాద్, ముంబయ్ వెళ్ళి విజయాలు సాధించిన అసాధారణ వ్యక్తి. ఎవరైనా ఏదైనా అసాధ్యం అంటే దాన్ని సాధ్యం చేసి చూపించాలనే పట్టుదలే తన శిఖరారోహణకు ప్రధాన కారణం అని ఆత్మకథలో ఏజీకే రాసుకున్నారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం.
 
జీవితంలో కష్టపడి క్రమశిక్షణతో నిజాయితీగా పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఆయన నమ్మారు. చేసి చూపించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాతనే నాకు ఏజీకేతో పరిచయం, దగ్గరగా చూసే అవకాశం కలిగింది.  అడ్వర్టయిజింగ్ ప్రపంచంలో సుప్రసిద్ధుడు,  సృజనశీలి, మృదుభాషి అయిన ఏజీకే లోటు తీరనిది.
 - కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement