AG Krishnamurthy
-
‘ముద్ర’ కృష్ణమూర్తి కన్నుమూత
♦ 1980లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం ♦ గుంటూరు జిల్లా వినుకొండలో జననం ♦ దేశవ్యాప్తంగా ప్రచారరంగంలో తనదైన ‘ముద్ర’ సాక్షి, హైదరాబాద్/వినుకొండ రూరల్: దేశంలోనే ప్రచారరంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ వ్యవస్థాపకుడు ఎ.జి.కృష్ణమూర్తి (73) శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా వినుకొండ. అచ్యుతుని భుజంగరావు, సీతారావమ్మ దంపతులకు 1942 ఏప్రిల్ 29న వినుకొండలో కృష్ణమూర్తి జన్మించారు. తండ్రి భుజంగరావు సొంతూరు గుంటూరు కాగా ఆరోగ్యశాఖలో విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పని చేశారు. పుట్టింది వినుకొండలోనే అయినా కృష్ణమూర్తి తెనాలి మారిసుపేట, బాపట్ల, అహ్మదాబాద్‌లలో ఎక్కువ కాలం ఉన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా తన జీవిత పయనాన్ని ప్రారంభించిన కృష్ణమూర్తి అడ్వర్టైజింగ్ రంగంలో దేశవ్యాప్త గుర్తింపు సాధించారు. 1968లో కాలికోమిల్స్లో కెరీర్‌ను ప్రారంభించిన ఆయన.. 1972లో శిల్పి అడ్వర్టయిసింగ్ ఏజెన్సీని నెలకొల్పారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్టైజింగ్ మేనేజర్‌గా చేరారు. 1982లో ‘ముద్ర’ కమ్యూనికేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. 1991లో ముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అహ్మదాబాద్‌ను స్థాపించారు. తర్వాత దేశవ్యాప్తంగా ప్రచార రంగంలో తమ సేవలను విస్తరించారు. పేద కుటుంబం కాకపోయినా, కష్టాల మద్య పెరిగామని, ధీరూభాయిని కలుసుకోవటం తన జీవితంలో పెనుమార్పులు తీసుకువచ్చినట్లు తన ఆత్మకథలో రాసుకున్నారు. కృష్ణమూర్తి, లీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు అనురాధా, సుధ, సుజాత, ఒక కుమారుడు కళ్యాణ్. దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్న కృష్ణమూర్తి కాలమిస్ట్‌గా, రచయితగా కూడా ప్రసిద్ధుడు. ఆంగ్లం, తెలుగులో పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. ఆయన పుస్తకాలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమయ్యాయి. చివరగా ఆయన హైదరబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. కృష్ణమూర్తి మృతిపై జగన్ సంతాపం వాణిజ్య ప్రకటనల రంగంలో తనదైన ముద్ర వేసిన ‘ముద్ర’ కృష్ణమూర్తి మరణం ఆ రంగానికి తీరని నష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ముద్ర ఆడ్వర్టయిజ్‌మెంట్ ఒక్కొక్క ఇటుక పేర్చుతూ సుమారు రూ.46,900 కోట్ల ప్రకటనల సామ్రాజ్యాన్ని సృష్టించారని పేర్కొన్నారు. కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభించి ఐదు అగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిపారన్నారు. ఆయన మరణం తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
'ముద్ర' వదిలి వెళ్లిన ఏజీకే
‘నిన్నటి వరకు ఎవ్వరికీ తెలియదు ఆయన ఆస్పత్రిలో ఉన్నట్టు. సమాచారం అంది ఉంటే ముఖేశ్ అంబానీ వచ్చి ఉండేవాడు’ అన్నారు మిత్రులు ఎమెస్కో విజయ్‌కుమార్. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నరకు హైదరాబాద్‌లోని ‘మహా ప్రస్థానం’లో ‘ముద్ర’ కృష్ణమూర్తికి అంత్య క్రియలు జరిగినప్పుడు ఇరవైమంది కూడా లేరు. ఆయనకు హైదరాబాద్‌లో పరిచ యాలు తక్కువే. 1968లో హైదరాబాద్ వదిలి అహమ్మదాబాద్ వెళ్ళి 2009లో తిరిగి వచ్చి స్థిరపడ్డారు. ఆయనకు అహ మ్మదాబాద్తోనే అనుబంధం ఎక్కువ. ఏజీ కృష్ణమూర్తి (ఏజీకే) ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని అహమ్మదాబాద్‌లో ఆవిష్కరించినప్పుడు ఆ నగరంలో ఉన్న వివిధ కార్పొరేట్ సంస్థల అధిపతులే కాకుండా ముంబయ్ నగరం నుంచి సైతం అనేకమంది వచ్చారని ఆ పుస్తకం ప్రచురించిన విజయకుమార్ చెప్పారు. ఏజీకేకి కార్పొరేట్ ప్రపంచంలో అంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అడ్వర్టయిజింగ్ రంగంలో అనేకమంది ఏజీకెని ఆరాధిస్తారు. ఆయన దగ్గర తర్ఫీదు పొంది ఆ రంగంలో రాణిస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారం రోజుల కిందట అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చేరిన కారణంగా తన అనా రోగ్యం గురించి మిత్రులు ఎవ్వరికీ సమాచారం ఇచ్చే అవకాశం లేకపోయింది. ఏజీ కృష్ణమూర్తి తెలుగుజాతి గర్వించదగిన అడ్వర్టయి జింగ్ దిగ్గజం. రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ ప్రోత్సాహంతో ముద్ర కమ్యూనికేషన్స్ ఫౌండేషన్‌ను నెలకొల్పి ఆ సంస్థకు 23 సంవత్సరాలు సేవ చేశారు. ముద్ర పేరు ప్రతిష్ఠలు సంపాదించిన తర్వాత ముద్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ అడ్వర్టయిజింగ్ (మైకా)ను నెల కొల్పారు. అహమ్మదాబాద్‌లో భారతీయ విద్యాభవన్ జర్న లిజం స్కూల్లో అడ్వర్టయిజ్మెంట్ పాఠాలు చెప్పేవారు. చివరికి 2002 ముఖేశ్ అంబానీ రిలయన్స్ మొబైల్స్ ప్రారం భించి ‘సారా దునియా ముట్ఠీమే’ అంటూ ప్రకటన విడుదల చేసినప్పుడు ఆయనకు సలహాదారుగా ఏజీకే ఉన్నారు. గుంటూరు జిల్లా వినుకొండలో 1942 ఏప్రిల్ 29 న జన్మించిన కృష్ణమూర్తి బాల్యం తెనాలి, బాపట్లలో గడిచింది. చిన్నతనంలోనే బాపట్ల సబ్‌మెజిస్ట్రేట్ కోర్టులో స్టెనోగా ఉద్యోగం. అనంతరం గుంటూరులో జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర అదే స్టెనో పని. అనంతరం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో గుమాస్తాగిరీ. 1962లో మద్రాసు పోర్టు మ్యూజియంలో యూడీసీగా ఉద్యోగం. అయిదేళ్ళు మద్రాసులో పనిచేసిన తర్వాత హైదరాబాద్‌కు బదిలీ. సంవత్సరం తిరగకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి గుడ్‌బై కొట్టి అహమ్మదాబాద్ వెళ్ళి శిల్పి అడ్వర్టయింజింగ్ సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా చేరడం. ఆ సంస్థ శరాభాయ్లది. ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్ర పరిశోధకుడు విక్రమ్ శరాభాయ్ వంశానికి చెందిన సంస్థ. క్యాలికో డెరైక్టర్ గీరాబెన్ శరాభాయ్‌తో కలసి పని చేయడం. 1967 ఫిబ్రవరి 10న రిలయన్స్‌లో చేరడం ఏజీకే జీవితాన్ని మేలిమలుపు తిప్పింది. నరోడాలోని రిలయన్స్ సంస్థ ప్రధాన కార్యాల యంలో అడ్వర్టయిజింగ్ డెరైక్టర్‌గా చేరిన ఏజీకే అడ్వర్టయి జింగ్ రంగంలో శిఖర సదృశుడైన ఫ్రాంక్ సియాయిస్‌తో కలసి అద్భుతాలు చేశారు. రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేసిన సిల్కు చీరలూ, ఇతర దుస్తులకూ విమల్ బ్రాండ్‌తో ప్రకటనలు తయారు చేయడంలో ఫ్రాంక్ అనేక విన్యాసాలు చేశాడు. ఆయన విమల్ కోసం తయారు చేసిన మొదటి అడ్వర్టయిజ్ మెంట్ ఇది : 'A woman expresses herself in many languages, Vimal is one of them'. దానికి ఏజీకే చేసిన తెలుగు అనువాదం ‘ఒక స్త్రీకి ఎన్నెన్నో మనోభావాలు. వాటిలో విమల్ ఒకటి.’ ఈ అడ్వర్టయిజ్మెంటు రకరకాల రూపాలు సంతరించుకొని అత్యధికంగా పత్రికలలో, రేడియోలలో వచ్చి విమల్ చీరలకు అసాధారణమైన ఆదరణ తెచ్చింది. ‘ఓన్లీ విమల్’ అన్నది అందరికీ, ఎప్పటికీ గుర్తు ఉండే సృజనాత్మక ప్రకటన. ఫ్రాంక్ సియాయిస్ సొంత ఏజెన్సీ పెట్టుకున్న తర్వాత, రిలయన్స్ ప్రత్యర్థులు ఆయన క్లయింట్లు అయిన కారణంగా రిలయన్స్ స్వయంగా ఒక అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నెలకొల్పాలనీ, దానికి ‘ముద్ర’ అని పేరు పెట్టాలనీ ఏజీకే చేసిన సూచనను ధీరూభాయ్ అంబానీ ఆమోదించారు. 1980లో ముద్ర వెలిసింది. ఒక వెలుగు వెలిగింది. కార్పొరేట్రంగంలో అడ్వర్టయింజింగ్ జీనియస్‌గా ఏజీకే గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా విమల్ షోలు నిర్వహించి విమల్ విజయ పరంపరను కొనసాగిం చడంలో ఏజీకేది అద్వితీయమైన పాత్ర. ‘ఐ లవ్ యూ రస్నా’ కూడా ఆయన సృష్టే. ఏజీకే చిన్నతనంలోనే కథలు రాశారు. పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ ప్రపంచ ప్రఖ్యాతి గడించిన కథ. అదే శీర్షికతో ఏజీకే రాసిన కథ ‘చిత్రగుప్త’ అనే పక్షపత్రికలో అచ్చయింది. రేడియో ఉషశ్రీతో ఏజీకే స్నేహం పెరిగిన తర్వాత ఈ కథను ఆకాశవాణిలో ప్రసారం చేశారు. ‘ముద్ర ’ను వీడి హైదరాబాద్ వచ్చిన తరువాత ఏజీకే బ్రాండ్ కన్సెల్టెన్సీని ప్రారంభించారు. అంతకంటే ముఖ్యంగా పుస్తకాలు రాయడం, కథలు రాయడం మొదలు పెట్టారు. ‘ధీరూభాయిజమ్’ అనే పేరుతో తెలుగులో, ఇంగ్లిష్‌లో పుస్తకం రాశారు. సీనియర్ అంబానీ అంటే ఆయనకు ఆరాధనాభావం. ధీరూభాయ్ లాంటివారు పది మంది ఉంటే ఈ దేశం మరోవిధంగా ఉండేదని ఆయన విశ్వాసం. ‘ఎదురీత’ పేరుతో మరో పుస్తకం రాశారు. వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ఆయన రచనలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. సరళమైన భాషలో హాయిగా చదివించే విధంగా రాయడం ఆయన ప్రత్యేకత. ‘ఇదండీ నా కథ’ అనేది ఏజీకే ఆత్మకథ. అదే ఆయన చివరి రచన. ఏజీకేకి భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. చిరునవ్వు చెదరకుండా స్నేహితులతో అనుభవాలు పంచు కుంటూ చివరి రోజులు హైదరాబాద్‌లో గడిపిన ఏజీకే ఆశావాది. మన నిర్ణయాలే మంచికైనా, చెడుకైనా కారణం అన్నది ఆయన విశ్వాసం. ‘నేను మధ్యతరగతివాడిని. ఆ విలు వలనే నమ్ముకొని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమలతో అన్నీ సాధ్యాలనే నమ్మకం. నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం’ అని ఏజీకే తన స్వభావం గురించి తాను రాసుకున్న మాటలు. వందశాతం తెలుగుతనం ఉట్టిపడే కృష్ణమూర్తి అహమ్మదాబాద్, ముంబయ్ వెళ్ళి విజయాలు సాధించిన అసాధారణ వ్యక్తి. ఎవరైనా ఏదైనా అసాధ్యం అంటే దాన్ని సాధ్యం చేసి చూపించాలనే పట్టుదలే తన శిఖరారోహణకు ప్రధాన కారణం అని ఆత్మకథలో ఏజీకే రాసుకున్నారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. జీవితంలో కష్టపడి క్రమశిక్షణతో నిజాయితీగా పని చేస్తే సాధించలేనిది ఏమీ లేదని ఆయన నమ్మారు. చేసి చూపించారు. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాతనే నాకు ఏజీకేతో పరిచయం, దగ్గరగా చూసే అవకాశం కలిగింది. అడ్వర్టయిజింగ్ ప్రపంచంలో సుప్రసిద్ధుడు, సృజనశీలి, మృదుభాషి అయిన ఏజీకే లోటు తీరనిది. - కె.రామచంద్రమూర్తి -
దేవుడా! ఈ దేశాన్ని బాగుచెయ్యి!!
అంతర్వీక్షణం! అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి... అంటే వెంటనే గుర్తొస్తారో లేదా కానీ, ‘ముద్రా’ కృష్ణమూర్తి అని కానీ, ఎ.జి కృష్ణమూర్తి అని కానీ చెబితే వెంటనే గుర్తొస్తారాయన. ‘ద స్కూల్ ఆఫ్ ఐడియాస్’ అనే ట్యాగ్‌లైన్‌తో మైకా (ఎమ్ఐసిఎ) సంస్థను స్థాపించి కమ్యూనికేషన్ మేనేజ్మెంట్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతోపాటు ఆయన అంతరంగాన్ని వీక్షించే ప్రయత్నం. మీ గురించి మీరు ఒక్కమాటలో... ‘కష్టే ఫలి’ అని నమ్మే వ్యక్తిని మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం? నచ్చే లక్షణం. గమ్యాన్ని సాధించాలనే తపన ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుదిరగను. నచ్చని లక్షణం - షార్ట్ టెంపర్మెంట్. అందరూ నాలాగా ఉండాలని కోరుకుంటాను. అలా జరగనప్పుడు కోపం వస్తుంది. ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది? నిజాయితీ కోసం చూస్తాను. మెప్పు కోసం చెబుతున్నారా, నిజాయితీతో మాట్లాడుతున్నారా అని చూస్తాను. ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు? నిరాడంబరంగా ఉండేవారిని, పాలిటిక్స్ ప్లే చేయని వాళ్లను, సున్నితంగా నిర్మొహమాటంగా మాట్లాడేవారిని. ఎక్కడ స్థిరపడాలనుకున్నారు?ఎక్కడ స్థిరపడ్డారు? (ప్రదేశం, రంగం) అహ్మదాబాద్‌లో స్థిరపడాలనుకున్నాను. మా అబ్బాయి కోరిక ప్రకారం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. నేను 18 ఏళ్లకే కథలు రాశాను. సృజనాత్మకత నా శక్తి, బలం అని తెలిసి యాడ్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు? నా భార్య లీల. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి? ధీరూభాయ్ అంబానీ మీ కెరీర్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన... విమల్ సూటింగ్స్ ప్రకటన విషయంలో ఫ్రాంక్సిమాయిస్ (ఆ ప్రకటన తయారు చేసింది ఆయన కంపెనీనే)అనే రచయిత ధీరూబాయ్ అంబానీతో ‘ఈ ప్రకటనలో బాడీ ఉంది కానీ, సోల్ లేద’న్నారు. నమ్మిన నిజాన్ని కచ్చితంగా చెప్పగలగడం చాలా అవసరం అని అప్పుడు తెలుసుకున్నాను. తొలి సంపాదన? 147 రూపాయల 50 పైసలు. గుంటూరులో భారతీయ పురాతత్వ శాఖలో ఉద్యోగానికి అందుకున్న జీతం. పెద్ద మొత్తం అందుకున్న సందర్భం... ముద్ర కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా మిమ్మల్ని అత్యంత బాధ పెట్టిన వ్యక్తి, బాధ పెట్టిన సంఘటన..? ఉన్నాడు ఒక సెక్రటరీ, తెలుగువాడే. గుజరాత్లో 15 ఏళ్లకు పైగా నా దగ్గర పనిచేశాడు. హఠాత్తుగా మా పిల్లలు, భార్య, అత్తగారి అకౌంట్స్ నుంచి ఫోర్జరీ సంతకాలతో డబ్బు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఇంట్లో ఒకడిగా కలిసి పోయిన వ్యక్తి ఇలా చేసినందుకు బాధ కలిగింది. నేర్చుకున్న పాఠం అప్పటినుంచి చెక్కుబుక్కు నా దగ్గరే పెట్టుకుంటున్నాను. భాగస్వామికి తగిన సమయం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారా ? అస్సలు లేదు. అదే పెద్ద న్యూనతాభావం ఇప్పటికీ ఉంది. మిమ్మల్ని మీరు సవరించుకున్న అంశం ఏదైనా ఉందా? నాకు చాలా కోపం ఉండేది. ఒక ఫ్రెండ్ ఒకసారి ‘నువ్వు కోపంలో ఏం మాట్లాడతావో నీకు తెలియడం లేదు. కోపం తగ్గించుకో’ అని చెప్పాడు. క్రమంగా యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకున్నాను. మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి ? పిల్లల ఆరోగ్యం గురించి ఎక్కువ ఆందోళన చెందేవాడిని. ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఆరోజును ఎలా గడుపుతారు? భార్య, పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు నా కుటుంబం మొత్తంతో సంతోషంగా గడపాలి. నా తర్వాత పిల్లల మధ్య పేచీలు రాకుండా రాతకోతల వంటి సర్దుబాట్లు చేసేయాలి. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు దారిద్య్రం, లంచగొండి తనం నుంచి ఈ దేశాన్ని బాగు చేయమని. - వాకా మంజులారెడ్డి -
అడ్వర్టైజింగ్ అంటే... అరేంజ్డ్ మ్యారేజే!!
ఈ దేశంలో ప్రత్యేకంగా విద్యాసంస్థలు లేని ఒకే ఒక రంగం అడ్వర్టైజింగ్... ఎందుకో తెలుసా... ప్రతి మనిషికీ బాగా తెలిసినది అదే. నామకరణంతోనే అడ్వర్టైజింగ్ మొదలవుతుంది. ఒక మనిషికి పేరు పెట్టడం అంటే... అది ఒక బ్రాండింగ్. ఆ లెక్కన చెప్పుకుంటే చేపకు ఈతలా... మనిషికి స్వతహాగా అబ్బే ఒక కళకు ఫినిషింగ్ స్కూల్ వంటిది ముద్రా ఇన్స్టిట్యూట్. ప్రకటనలకు సంబంధించి ఆసియాలో పుట్టిన మొట్టమొదటి అడ్వర్టైజింగ్ స్కూల్ అది. దాన్ని స్థాపించింది ఒక తెలుగు వాడు... సామాన్యమైన జీవితంతో మొదలుపెట్టి ప్రకటనల రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న ఏజీ కృష్ణమూర్తి. సింపుల్‌గా ఏజీకే. ఆయన అనుభవాలు వింటుంటే... టైమ్ మెషీన్లో మనం ముందుకు, వెనక్కు పోయినట్టు ఉంటుంది. ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో తొందరపడి కూసిన కోయిల కాదు... ఎర్లీ బర్డ్! ప్రకటనల రంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే... అన్ని రంగాలతో దానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆయన అనుభవాల్లో అనేక కొత్తకొత్త విషయాలుంటాయి. ఆయన ఉద్దేశంలో- అడ్వర్టైజింగ్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్డ్ మ్యారేజ్! పెళ్లి చేసేటపుడు ఇరు కుటుంబాలు తమ పిల్లల గురించి చెప్పుకుంటారు. అది అడ్వర్టైజింగ్ తప్ప మరేమీ కాదు. అబ్బాయి తరపు వారు పిల్లాడి లక్షణాలు, చదువు, ఆదాయ వ్యయాలు వంటివి చెప్పుకోవడం, అమ్మాయి తరపు వారు ఆమె గుణగణాలు, చదువు సంస్కారాల గురించి చెప్పుకోవడం అడ్వర్టైజింగే కదా. ఎప్పటికప్పుడు మనం సాధించిన అభివృద్ధిని చాటుకోవాలి. లేకపోతే చీకట్లో కన్నుకొట్టినట్టు ఉంటుంది. అది నీకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే, ఈ చెప్పుకోవడంలోనూ పద్ధతులు, పరిమితులు, ప్రమాణాలు ఉండాలి. తరాలు మారిన కొద్దీ ఆలోచనలు, ఆసక్తులు మారుతున్నపుడు చెప్పే విధానం కూడా మారాలి. అపుడే వినియోగదారుడికి కనెక్ట్ అవుతుంది. దేశంలో ఇపుడు అడ్వర్టైజింగ్ మార్కెట్ దాదాపు పాతికవేల కోట్ల వరకు ఉంది. ఇందులో ప్రకటనల రూపకల్పనలో వైఫల్యం వల్లనో, రాంగ్టైమింగ్ వల్లో, రిలవెన్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ప్రకటనలు లక్ష్యంగా పెట్టుకున్న వినియోగదారులను చేరుకోకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీలో అయ్యే ఖర్చులో 70-80 శాతం వ్యయం వల్ల ఆశించనంత ప్రయోజనం కలగట్లేదు. ప్రకటనలు సక్సెస్ అయితే బ్రాండ్ వాల్యూ వస్తుంది. లేకపోతే సవాలక్ష ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అందుకే అడ్వర్టైజింగ్ ఎంత అవసరమో అది అద్భుతంగా, కాలానుగుణంగా ఉండటమూ అంతే అవసరం అన్నది ఏజీకే మాట. దీని గురించి ఆయనను కదిపితే ఎన్నో విషయాలు... వాటిలో కొన్ని. మీ దృష్టిలో అడ్వర్టైజింగ్ అంటే ఓ వస్తువు ఉనికిని చాటడమేనా? ‘మీరు చెప్పింది ఎవరూ వినకపోయినా, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోయినా ఇక అదంతా వృథా’ అని ఓ ప్రముఖుడు చెప్పాడు. అంటే మీరు చెప్పడం ప్రధానం కాదు... ఎదుటి వాడు దానిని వినడం ప్రధానం. ఓ వస్తువు ఉనికిని ప్రభావవంతంగా చాటాలి. ఒక ఉత్పత్తి జనంలోకి కాదు, జనం ఆలోచనల్లోకి వెళ్లాలి. ప్రొడక్ట్ అవసరాన్ని తీరుస్తుంది, బ్రాండ్ అవసరాన్ని తీరుస్తూ మానసికోల్లాసాన్ని కూడా కలిగిస్తుంది? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్... అవసరానికి-కోరికకు (need-want) తేడాయే బ్రాండ్. కారు అవసరం అనుకుంటే... ఓ పేరున్న కారులో తిరగాలనుకోవడం కోరిక. ఇక బ్రాండింగ్ విషయానికొస్తే ఒళ్లు కప్పుకోవడానికి ఏదైనా గుడ్డ చాలు. అందులో మనకు ఆనందాన్నిచ్చేలా, మన అందాన్ని పెంచేలా, మనకు నచ్చేలా ఉందని వినియోగదారుడు ఫీలయ్యేలా చేసేదే బ్రాండ్. అందుకే సాల్ట్‌కు కూడా బ్రాండ్ అవసరమైంది. బ్రాండ్ ఒక ఫీల్, అది ఒక నమ్మకం. ప్రతి బ్రాండ్ తన బౌండరీ ఏంటో తెలుసుకుని ఆ పరిధుల్లో ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఎలా? ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ నచ్చవు. ఒక సబ్బుందనుకోండి. ఒకటే సబ్బును సంపన్నుడికి, పేదోడికి అమ్మాలనుకుంటే అది కుదురుతుందా? అవసరాలు, ప్రయారిటీలను బట్టి ఉత్పత్తి రావాలి. ఉత్తరాది వాడికి దక్షిణాది వాడికి, పట్టణం వాడికి-పల్లెటూరి వాడికి వినియోగదారీ తత్వంలో తేడా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. బ్రాండ్ తన పరిధి ఏంటో తెలుసుకోకుంటే విజయం స్థానంలో అపజయం నిలుస్తుంది. మీరు కొత్తగా రాసిన ‘అడ్వర్టైజింగ్ కథలు’ పుస్తకంలో ఒక బ్రాండ్ వ్యక్తిత్వం, పర్సనాలిటీ చాలాకాలం ఒకేలా ఉండాలి అన్నారు. పేరు, లోగోలు మారిన బ్రాండ్లు కూడా ఉన్నాయి కదా..? ఇంకో విషయం... నేటితరం ఎక్కువగా మార్పును ఆశిస్తుంది... మరి ఈ వైరుధ్యాన్ని ఎలా విశ్లేషిస్తారు. ? యూటీఐ- యాక్సిస్ బ్యాంకుగా మారడం, ఎయిర్టెల్ లోగో మారడం... ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నా ఉద్దేశం మార్పు అసలు వద్దని కాదు. తరచూ మారకూడదు. మీ పేరును ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది. కానీ పదేపదే మార్చుకుంటే ఎవరికైనా గుర్తుంటుందా చెప్పండి? కొన్ని ప్రత్యేక అవసరాల్లో మార్పు వస్తుంది. అయితే, ఆ మార్పు తర్వాత మళ్లీ మళ్లీ మార్పు రాకూడదు. కాన్స్టంట్గా ఉంటేనే అది జనం నోళ్లలో నానుతుంది. జనానికి గుర్తుండనిది బ్రాండే కాదు. కాలేదు కూడా! ఈ పుస్తకంలో మరో విచిత్రమైన పోలిక కనిపించింది. పిల్లలు, చెట్లు, బ్రాండ్లు... ఈ మూడింటిని ఒకే దృక్పథంతో చూడాలన్నారు. దీని అర్థమేంటి? పిల్లలయినా, చెట్లయినా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఒక బ్రాండు ఏర్పడాలన్నా, అది ఎప్పటికీ నిలవాలన్నా, మరింత వృద్ధి నమోదు చేయాలన్నా దాన్ని పిల్లలను చూసుకున్నంత శ్రద్ధగా, చెట్టును పెంచినంత జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే.. శ్రమ వృథా అవడం మినహా మరేమీ ఉండదు!